ఈ నిషాద విషాద
కాలంలో
ఒంటరిగా మిగిలి
వున్నామన్న
ఊహ గుండెల్లో
మెలిపెడుతుంది
మాటాడుకోవడానికి
నీ పక్కన ఒక
మనిషి లేరన్నది
భయపెడుతుంది
కలిసి నడిచిన
పాదాలన్ని
దూరంగా జరిగి
దారిలో
నేనొక్కడినే
మిగిలి వున్న
ఊహ నిలువనీయదు
కలిసి సాధించిన
విజయాలు
మరల మరల
గుర్తుకు వచ్చి
భుజం తడుతూనే
వుంటాయి
కానీ ఇన్ని
మరణాలు
కళ్ళలో కదలాడి
నెత్తురు చిమ్ముతున్నాయి
ప్రతీ దేహంతో
వీడ్కోలు చెప్పే
జన సందోహం
నినదించిన
నినాదాలు
మరల ఆశను
కల్పిస్తున్నాయి
శిశిరం వెళ్లిన
మరుక్షణం చిగురించే
వసంత కాలమొకటి
హామీగా వస్తుంది
అయిన ఈ
కాలాన్ని జయించే
విస్పోటనమేదొ
మరల జరిగి
పిడికిళ్లు బిగిసే
సమయం
ఉదయించే
ఆ మేఘాల మాటున
దాగి వుంది చూడు.
