… కూడా లోకం ఉంటుంది. దాని చరిత్ర ఉంటుంది. దాన్ని నిర్మించుకుంటూ మోసుకపోతున్న మహా మానవాళి చిరస్థాయిగా ఉంటుంది. మనుషులంటే పోటెత్తే భావోద్వేగాలు కదా.. అవీ ఉంటాయి. మనుషులంటే తీవ్రమైన ధిక్కార ప్రతిఘటనలు కదా.. అవీ పదిలంగా ఉంటాయి. మనుషులంటే స్వేచ్ఛాగానాలూ, విముక్తి ఆకాంక్షలూ, సుందర లోకాల స్వప్న రాగాలూ. అవీ వినిపిస్తూనే ఉంటాయి. కన్నీరూ, కఠినమైన ఆచరణా కలిసి రూపొందిన ఒక నిర్మాణం విధ్వంసమైందేగాని, దాని రక్తమాంస సంలీన చైతన్యం తుడిచిపెట్టుకపోయేది కాదు. మార్చి 31 తర్వాత కూడా మానవ సృజన కలాపమైన విప్లవం తిరిగి ఏదో ఒక మారుమూల లేచి నిలబడుతుంది. మరింత నాణ్యంగా, గంభీరంగా, చారిత్రక ఆశారేఖలాగా, సుందర దరహాసంగా వెల్లివిరిస్తుంది. మార్చి 31 కేవలం శతృవు విజయోత్సవ వికృత కేళీ విలాసం మాత్రమే. దాన్ని వెనక్కి తోసేస్తూ చరిత్ర ముందుకే సాగుతుంది.
మార్చి 31 ఘోరమైన ప్రజా ఓటమి మాత్రమే. ఒకానొక ఓటమి మాత్రమే. శతృవుకు అదొక వేడుక. అది మనల్ని పరిహసించేదే. ఎందరెందరో అందులో భాగమవుతారు. వికటాట్టహాసంతో, విజయోల్లాసంతో, నంగినంగి మాటలతో, మేధావంతపు చిద్విలాసంతో, దొంగ కన్నీటితో..! చరిత్ర ఇట్లా తల్లకిందుల కూడా నడుస్తుంది. వక్రరేఖలో కూడా సాగిపోతుంది. అది చాలా లోతైనది. ఎత్తయినది. మానవులు నిర్మించేదే అయినా మానవుల చేతిలోనే లేనిది. శతృవు చేతిలోకి అమాంతం వెళ్లిపోయినట్లనిపిస్తుంది. నెర్రెలువారి కర్కశ శిలా సదృశమవుతుంది. తిరిగి మళ్లీ సువిశాల జన జీవన రంగాలను చేరుకొని సలలిత సారవంతమవుతుంది. అక్కడ ఆదివాసులు ఉంటారు. బడుగు రైతులు ఉంటారు. మామూలు మనుషులు కోటానుకోట్ల వైవిధ్యాలతో ఉంటారు. విడివిడిగా, ఉమ్మడిగా చలనంలోనే ఉంటారు. శరత్ వెన్నెలలాంటి చిరునవ్వులతో, చెమటకారి దేదీప్యమానమైన దేహాలతో, భూమి కంపించేలా బోరున విలపించే గొంతులతో మనుషులు ఉంటారు. దేశమని చెప్పగల వందల వేల పీడిత సమూహాలు ఉంటాయి. వాళ్లు దు:ఖితులూ, బాధితులూ, ఆగ్రహోదగ్ర మానవులూ, వెరసి వాళ్లంతా ఈ దేశ నిర్మాతలు, కార్మికులు. వాళ్లు మాత్రమే అన్ని ఆంక్షలను దాటి సజీవంగా ఉంటారు. అన్ని కాలఖండికలను దాటి మహా ప్రవాహంలా ఉంటారు. మార్చి 31 తర్వాత కూడా వాళ్లు ఉంటారు. ఈ సత్యమే వాళ్లను విప్లవం చేయమని నిరంతరం ఉద్బోధిస్తూ ఉంటుంది. విప్లవం తప్ప జీవితం లేదని ఆదేశిస్తూ ఉంటుంది. మార్చి 31 తర్వాత కూడా విప్లవ అవసరాన్ని ఈ దేశమంతా ఒకే ఒక్క తీవ్ర స్వరంతో ఆర్తిగీతాన్ని ఆలపిస్తూనే ఉంటుంది.
మార్చి 31 తర్వాత మావోయిస్టులు మాత్రమే ‘ఉండకపోవచ్చు’. ఆ పేరు ముందో వెనుకో విశేషణాలతో మాజీలో, విద్రోహ నాయకులో, వైఫల్య నాయకులో రోడ్డు మీద తారసపడతారు.
మావోయిస్టులు లేని దేశం కోసం అరవై ఏళ్లుగా పాలకుల కంటున్న కలలు ఎన్నెన్ని దారుల గుండా సాకారమయ్యాయో కదా. ఎంతెంత మంది చేతుల మీదుగా, వాదనల మీదుగా, సిద్ధాంత రాద్ధాంతాల మీదుగా, అచ్చంగా మన ప్రజాస్వామ్యం మీదుగా మావోయిస్టు రహిత భారత్ ఫలించనున్నది. ఈ ముగింపును అమిత్షా మార్చి 31న కోరుకున్నాడు. కానీ జిజ్ఞాసులూ, ప్రవచనకారులూ, హితైషులూ, జ్ఞానదాతలూ, మారుమనసు పొందినవారూ.. ముందు వెనుకల చురుకైన చూపులు ప్రసరించగలరు కాబట్టి వాళ్లు ఈ మార్చి 31 కాలచక్రంలో ఎన్నడో వచ్చి ఉండవలసిందని కోరుకున్నారు. ఒకరు పదేళ్ల కింద అంటే, కొందరు ఇరవై పాతికేళ్ల కింద అంటే, ఇంకొందరు ఆరంభానికి ముందే ఈ ముగింపు సన్నివేశం సాక్షాత్కరించవలసిందని కోరుకున్నారు.
ఆకాంక్షలదేముంది? ఎవరికైనా ఉంటాయి. రాజ్యం ఉన్నవారే నిజం చేసుకోగలరు. అమిత్షా అదే నిరూపించాడు. లక్షలాది కశ్మీరీల గోరీల నుంచి ఆర్టికల్ 370ని బైటికి లాగి తిరిగి హత్య చేసి భూస్థాపితం చేసిన రోజులాగా, అంతకంటే ఎక్కువ మంది ముస్లింల స్మశానాల మీద బాల రాముడు చిద్విలాసాలతో ఆవిర్భవించిన రోజులాగా.. ఈ మార్చి 31 కూడా చరిత్రలో నమోదవుతుంది.
అమిత్షా ఒక్కడే కాదు. ఆంబానీ ఆదానీలే కాదు. అమెరికా, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్సీ మాత్రమే కాదు, ఈ మార్చి 31 దిశగా ఎంతెంత మంది పరుగులు తీశారు? ఎన్నెన్ని దారులు తెరిచారు? కగార్ విజయోత్సవాలు ఎవరు నిర్వహించినా అందులో న్యాయంగా భాగం కావలసిన వాళ్లు ఎందరో? మార్చి 31 కోసం మాట సాయమో, చేత సాయమో, లోలోపలి సాయమో చేసిన వాళ్లు ఎందరో? తలుపు చాటుగానో, బహిరంగంగానో మార్చి 31ని స్వాగతించినవాళ్లు ఎందరో. అంతిమంగా ఇది విప్లవోద్యమ ఓటమే కావచ్చు. అదే బాధ్యతపడాలి. చుట్టూ అనుకూలంగా ఎందరో. ప్రతికూలంగా మరెందరో. అందరినీ గుర్తించాల్సిందే. అన్నిటినీ చూడాల్సిందే.
విచారం లేదు. ఫిర్యాదు అసలే లేదు. మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని చారిత్రక శక్తుల సంఘర్షణ ఇది. ఎవరెవరం ఎక్కడ నిలబడతామో తెలియదు. ఎందుకు కలహించుకుంటామో చప్పున తెలియదు. ఎవరమేం చేసిందీ ఇప్పుడు చెప్పుకోలేం. కానీ నిలబడ్డ చోటు నుంచే దృశ్యం కనిపిస్తుంది. నిలబడ్డ గీత మీది నుంచే మాట పుట్టుకొస్తుంది. ఏ నేలను ఎంచుకున్నావో దాన్నిబట్టే హృదయం స్పందిస్తుంది. ఏ ఆకాశాన్ని కలగన్నావో దాన్నిబట్టే తిరిగి నీ చోటు నిర్ణయమవుతుంది. నిలబడ్డ చోటు నుంచే ప్రయాణం.. అంతులేని మహా ప్రయాణం. ఇంతకూ దారి చెదిరిందా? నడక ఆగిందా? చరిత్రను మార్చాలని బయల్దేరిన చిన్నపాటి ఉద్యమం. దాని బలమల్లా దాని మార్గంలో ఉన్నది. దాని శాస్త్రీయతలో ఉన్నది. దాని రుజువులో ఉన్నది. కోట్ల మంది ఆ దారిలో నడవడంలోనే ఉన్నది. తద్వారా అదొక ఉదాహరణగా మారడంలోనే ఉన్నది. రక్తరంజితమైన సత్యంగా మారడంలోనే ఉన్నది. గెలుపు ఓటములదేముంది? ఇంత సువిశాలమైన చారిత్రక జగత్తులో ఎన్ని తిర్యగ్రేఖలో. పొసగని బలాబలాల పొందికలో ఎన్ని తడబాట్లో. తప్పులో, ఒప్పులో, ప్రయోగాలో, వైఫల్యాలో, త్యాగాలో, విద్రోహాలో..చరిత్ర ఖజానాలో అన్నీ పదిలం. అన్నిటినీ అంగీకరించాల్సిందే. కొత్త సంకేతాలను గ్రహించాల్సిందే.
సుమారు ఇరవై వేల మంది అమర మావోయిస్టుల తల్లిదండ్రులకూ, జీవన సహచరులకూ, బిడ్డలకూ తమ వాళ్లు చనిపోయిన రోజు కంటే మార్చి 31 ఒక్కటే గుర్తుండిపోతుంది. పదుల కేసుల దాడుల్లో, విచారణల్లో; జైలుకూ స్వేచ్ఛకూ మధ్య ఎప్పుడు ఆ వైపు ఒరిగిపోవలసి ఉంటుందో తెలియని సందిగ్థంలో కొట్టుకుంటున్న అర్బన్ మావోయిస్టులకు కూడా కోర్టు వాయిదాల తేదీలేవీ గుర్తుండవు ..మార్చి 31 తప్ప. వేలాదిగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు తమ జైలు జీవితకాలపు వయసు ఎంతో; ఏ తేదీన ఏ నెలన, ఏ సంవత్సరాన బందీఖానలోకి వెళ్లిందీ బొత్తిగా స్పురించకపోవచ్చు..మార్చి 31 తప్ప.
ఈ అరవై ఏళ్లలో ఎన్ని వైభవోజ్వల, విషాద ఉత్తేజాల, ఆశయ ప్రకటనల తేదీలో కదా. 1967 మే 25, 1969 ఏప్రిల్ 22, 2004 సెప్టెంబర్ 21.. ఆ మైలు రాళ్లను పెకలించుకుంటూ వంచనతో సెప్టెంబర్ 16 వచ్చింది. క్రూరంగా మార్చి 31 వచ్చింది. మరి ఆ తర్వాత ఏముంటుంది? ఇంకేమీ రాదా? ఇంకేమీ ఉండదా? ఓటమి మాత్రమే ఉంటుందా? ఇవ్వాల్టి ఓటమి మనదైనప్పుడు రేపటి విజయం కూడా మనది కావాల్సిందే. గెలుపు దారిని దిద్దుకోవలసిదే. ఈ కాలానికి తగినట్లు. ఎందుకు ఇలా కూలిపోయిందో తెలుసుకోవలసిందే. మహాద్భుత విజయాలకన్నా ఈ ఓటమి నేర్పే పాఠమే విలువైనది. ఇవాళ నిరాశ అనిపించవచ్చు. నిస్తేజం అనిపించవచ్చు. అంతా మూసుకపోయి ఉక్కబోతగా ఉండవచ్చు. సాహసం, తెగువ, సంసిద్ధతల వలె కత్తివాదర మీద సాగే స్వీయ విమర్శ, తప్పులకు పుటం పెట్టగల నిర్భీతి మన సొంతం.
ఇంతకూ.. ఆ చివరి మావోయిస్టు ఏమైనట్టు?
ఒక్కరినీ మిగల్చకుండా అందరినీ చంపేసే, లొంగదీసుకొనే నిర్మూలనా యుద్ధం కదా.. ఆ వ్యూహంలోని పొరలన్నీ మనం చూశామా? అంచెలన్నీ గ్రహించామా? ఇంత మూకుమ్మడి దండయాత్ర తర్వాత కూడా మిగిలి ఉండే ఆ చివరి మావోయిస్టు ఎవరో తెలుసుకున్నామా?
ఆ మానవి.. మానవుడు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటారు..
తెలుసుకొనే దారులేవీ ఇప్పటికిప్పుడు కనిపించకపోవచ్చు..
కానీ నీవు ఆదాటున ఉంటే, ఆదమరపున ఉంటే, ఆలోచనల్లో ఉంటే, క్షణకాలం కళ్లు మూస్తే వేలాది మంది అమరులు పలకరించిపోవచ్చు. మావోయిస్టు రహిత భారత్లో చట్ట విరుద్ధమైన స్వప్నాలే నీలో వెల్లివిరియవచ్చు. విషాదమో, విప్లవోత్తేజమో తెలియకపోవచ్చు. కుంగిపోతావో, ఉప్పొంగిపోతావో తెలియని సందిగ్థత నిన్ను వెంటాడవచ్చు. రేపు ఏమవుతుందో.. అనే ఆరాటంలో నీవు తడబడవచ్చు. కలలు కనేందుకు మనం మనంగా మిగిలి ఉంటామో లేదో అనే భయం కలగవచ్చు.
ఏమీ కాదు కామ్రేడ్. మార్చి 31 తర్వాత కూడా మనం ఉంటాం. ఇట్లే కాదు. ఇంకింత కష్టంగా. ఇంకింత దు:ఖంగా. ఇంకింత..ఇంకింత నిజంగా.





అవును మనం మిగిలే ఉంటాం ఆ చివరి మావోయిస్టు ఎత్తి పట్టిన ఎర్ర జెండా రెప రెపలలో గుండెలో సుడులు తిరిగే దుఖాన్ని ఉగ్గపట్టుకుని అమరుల స్మృతిలో మరల నడక మొదలు పెడదాం.. ♥️✊🏼🚩🚩💖🤝