Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు

డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు. మూడు రోజుల తర్వాత, వాట్టేవాగు దగ్గర ఉన్న సెక్యూరిటీ క్యాంపులో ఒక మంచంపైన చనిపోయి ఉండటాన్ని అతని బంధువు సుక్రామ్ మాడ్వీ గమనించాడు.
46 ఏళ్ల భీమా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే, భద్రతా బలగాలు కొట్టి చంపి ఉంటాయని అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లో ఉన్న రేఖపల్లి, వాట్టేవాగు గ్రామాల మధ్య సుమారు మూడు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు, ఉసూర్ ప్రాంతం ఎక్కువగా నిషేధిత మావోయిస్ట్ పార్టీ ప్రభావంలో ఉండేది. ఈ పార్టీ దశాబ్దాలుగా మధ్య, తూర్పు భారతదేశ అడవుల్లో తిరుగుబాటు సాగిస్తోంది. మావోయిస్టులు ఉసూర్ గ్రామాల్లో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు; వివిధ సంఘాలు, కమిటీల యంత్రాంగం ద్వారా జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రించేవారు.
అయితే, 2024 నుండి, సెక్యూరిటీ క్యాంపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ప్రభుత్వం తన ఉనికిని దూకుడుగా విస్తరించింది. వీటిలో ఎక్కువ భాగం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) కి చెందిన పారామిలటరీ దళాల పర్యవేక్షణలో ఉన్నాయి. బీజాపూర్‌లో ఒక భాగమైన దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 2025లో ఏర్పాటు చేసిన 52 కొత్త సెక్యూరిటీ క్యాంపులలో, 22 క్యాంపులను బీజాపూర్లోనే ఏర్పాటు చేసారు. వీటిలో ఏడు క్యాంపులు ఉసూర్ బ్లాక్‌లోనే ఉన్నాయి.
Figure 2 రేఖపల్లి, తుమీర్గూడ గ్రామస్తులు, మరికొందరు కొండపల్లి మార్కెట్ నుంచి తాల్పేరు వాగు మీదుగా తిరిగి వస్తున్నారు.

ప్రస్తుతం రేఖపల్లి గ్రామం రెండు క్యాంపుల మధ్య ఉంది. మొదట మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లిలో, తల్పేరు నదికి అవతల ఏర్పాటు చేశారు. ఒక నెల తర్వాత వాట్టేవాగులో మరో క్యాంపు ఏర్పాటయింది. స్థానిక నివాసితుల ప్రకారం, ఈ క్యాంపులో సిఆర్‌పిఎఫ్‌లోని ఉన్నతస్థాయి నక్సలైట్ వ్యతిరేక బలగాలైన కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) బలగాలు ఉన్నాయి.
సిఆర్పిఎఫ్ పరిభాషలో, ఈ రెండు శిబిరాలను “ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్” అని పిలుస్తారు – వీటిని “నిరంతర కార్యకలాపాల ద్వారా శత్రువుల ప్రధాన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలనే” ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.
ఈ క్యాంపుల ఏర్పాటు వల్ల మావోయిస్టులు వెనక్కి తగ్గక తప్పలేదని రేఖపల్లి, ఆ పరిసర గ్రామాల్లోని ప్రజాలు తెలిపారు. మావోయిస్టు సాయుధ కేడర్లు ఇప్పుడు ఈ ప్రాంతానికి రాకపోవడంతో, గ్రామ స్థాయి మావోయిస్టు సంస్థలు పనిచేయడం మానేశాయని, చాలా మంది దిగువ స్థాయి మావోయిస్టు కార్యకర్తలు పోలీసులకు లొంగిపోయారని స్థానికులు చెప్పారు.
ఒక యువకుడు చెప్పినట్లుగా, వాస్తవానికి ఇప్పుడు మొత్తం గ్రామాలన్నీ ఒక కొత్త రకమైన “కమాండ్” (నియంత్రణ) కిందికి వచ్చాయి. దీని ఫలితంగా, భద్రతా బలగాలు ఇప్పుడు ఈ ప్రాంతంలో తరచుగా గస్తీ నిర్వహిస్తున్నాయి. అటువంటి ఒక గస్తీ సమయంలోనే — ఇది మొదటిసారి కాదు — వాట్టేవాగు శిబిరానికి చెందిన సిఆర్పిఎఫ్ సిబ్బంది భీమాను తీసుకువెళ్లారు. రేఖపల్లి నివాసితులకు, అతని నిర్బంధమూ, మరణమూ ఈ ప్రాంతంలో వస్తున్న సమూల మార్పును స్పష్టం చేశాయి. ఈ మార్పు తమ జీవితాలను మునుపటి కంటే ఊహించని విధంగా అనిశ్చిత స్థితిలోకి నెట్టివేసిందని వారు అంటున్నారు.
Figure 3 కొన్ని గ్రామాలలో ప్రయాణిస్తున్నప్పుడు మావోయిస్టులు నిర్మించిన శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కనిపించాయి.

వివాదాస్పద మరణం
భీమా మరణించిన వారం తర్వాత, నేను రేఖపల్లికి వెళ్లాను. జిల్లా కేంద్రం నుండి ఆవాపల్లి పట్టణం మీదుగా, దట్టమైన టేకు అడవుల గుండా ప్రయాణిస్తూ, ఆరు చిన్న నీటి వాగులను దాటుతూ ఆ గ్రామానికి చేరుకోవడానికి నాకు నాలుగు గంటల బైక్ ప్రయాణం పట్టింది. తల్పేరు నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం చాలా పెద్దది. మూడు పల్లెలుగా విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 105 ఇళ్లు ఉన్నాయి.
తన తల్లి, భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఈ పల్లెలలో ఒకదానిలో భీమా నివసించేవాడు. పెద్ద ఖాళీ ప్రదేశంలో ఉన్న ఒక చిన్న రెండు గదుల ఇల్లు అది. రెండు ఎత్తైన తాటి చెట్లు గాలికి ఊగుతున్నాయి; ఆవరణలో కోళ్లు, పుంజులు, మేకలు తిరుగుతున్నాయి.
డిసెంబర్ 4 ఉదయం, భద్రతా బలగాలు భీమా కోసం వెతుకుతూ ఆ ఇంటికి వచ్చాయి. “వారు బూట్లతో ఇంట్లోకి వచ్చేసి, మా ధాన్యపు గాదెను తెరిచారు; ధాన్యాన్ని చిందరవందర చేశారు; మా ఇంటి సామాన్లను బయట పడేసారు” అని భీమా 75 ఏళ్ల తల్లి దేవే మాడ్వీ గుర్తు చేసుకున్నారు.
Figure 4 విషాదంలో దేవే మాడ్వి

ఆ సమయంలో భీమా ఇంట్లో లేడు. భీమా ఎక్కడ ఉన్నాడని అడుగుతూ భద్రతా బలగాలు తనను కొట్టాయని పొరుగింటి అతను మంగు మాడ్కం చెప్పాడు.
ఒక బుల్లెట్ షెల్ కనిపించిందని చెబుతూ, పక్కనే ఉన్న ఒక నీలిరంగు డ్రమ్మును తెరవమన్నారని మంగు చెప్పాడు. ఆ డ్రమ్ములో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని వారు అనుమానించారు.
వారు చెప్పినట్లుగా తాను చేయనన్నానని చెబుతూ “ఒకవేళ వారే స్వయంగా పేలుడు పదార్థాలు అక్కడ పెట్టి, నాపై తప్పుడు కేసు పెడితే పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించాడు. కొన్నేళ్ల క్రితం పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేస్తే ఒకటిన్నర సంవత్సరాలు జైలులో ఉండాల్సి వచ్చిందని, తాను ఇక మళ్లీ ఆ ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడానికి సిద్ధంగా లేనని తన ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు.
Figure 5 మంగు మాడ్కమ్

సుమారు గంట తర్వాత, వచ్చిన చుట్టాలను కలవడానికి వెళ్ళిన తన దాయాది సుక్రామ్ ఇంట్లో భీమా కనిపించాడు.
భద్రతా సిబ్బంది తనను, భీమాను, మరొక గ్రామస్థుడిని అడవిలోని వేర్వేరు ప్రాంతాలకు లాక్కెళ్లారని, తనను కొట్టి, మావోయిస్టులు తమ పేలుడు పదార్థాలను ఎక్కడ దాచారో చెప్పమని అడిగితే ఆ విషయం తనకు తెలియదని చెప్పానని మంగు వివరించాడు.
సుమారు రెండున్నర గంటల తర్వాత, ఒంటిపై గాయాలతో అతన్ని, మరొక వ్యక్తిని ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. కానీ భీమాను తీసుకువెళ్లారు. “మేము అతన్ని చివరిసారిగా చూడటం అదే,” అని భీమా భార్య పాండే మాడ్వీ దుఃఖస్వరంతో చెప్పింది.
భీమాను తీసుకువెళ్లకుండా ఆపడానికి సుక్రామ్ ప్రయత్నిస్తే, ఆ గస్తీ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధికారి సుక్రామ్ ఫోన్ తీసుకుని, దాని నుండి తన నంబర్‌కు డయల్ చేసి, తర్వాత తనతో మాట్లాడమని చెప్పాడు. సుక్రామ్ ఆ నంబర్‌ను తన ఫోన్లో “కోబ్రా సాహబ్” అని సేవ్ చేసుకున్నాడు.
తర్వాతి రెండు రోజుల పాటు భీమాను విడిచిపెట్టమని కోరుతూ ఆ కుటుంబం సదరు అధికారికి చాలాసార్లు ఫోన్ చేసింది. డిసెంబర్ 6న కొండపల్లి మార్కెట్‌కు రమ్మని ఆ అధికారి కుటుంబ సభ్యులకు చెప్పాడు, కానీ వారు అక్కడికి వెళ్లినప్పుడు ఎవరూ రాలేదు. మరుసటి రోజు అతనిని వాట్టేవాగు శిబిరానికి రమ్మని పిలిచారు. అక్కడ భీమా మృతదేహాన్ని అతను చూసాడు.
Figure 6 భీమా మాండవీ కుమార్తె సుశీల, పైప్, అతని భార్య పాండే, రమేష్, భీమా 18 ఏళ్ల కుమారుడు, భీమా తల్లి దేవే మాడ్వి

ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌కు రాసిన లేఖలో, భీమా భార్య తన భర్త మరణంపై “ఉన్నత స్థాయి న్యాయ విచారణ” జరపాలని కోరింది. భీమాను సిఆర్పిఎఫ్ సిబ్బంది కొట్టి చంపారని ఆమె అనుమానిస్తోంది.
దీనిపై స్పందన అడిగితే, వాట్టేవాగు క్యాంపుకు చెందిన సిఆర్పిఎఫ్ అధికారి తాను ఇప్పటికే మేజిస్ట్రేట్‌కు రాతపూర్వక ప్రకటన ఇచ్చానని చెప్పాడు. మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా తన పేరు వెల్లడించడానికి కూడా నిరాకరిస్తూ ఫోన్ కాల్ కట్ చేసాడు.
బీజాపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ ‘స్క్రోల్’ పత్రికతో మాట్లాడుతూ.. భీమా తన తువ్వాలుతో ఉరివేసుకుని మరణించాడని చెప్పాడు. మావోయిస్టులు తమ ఆయుధాలను ఎక్కడ దాచారో గుర్తించడంలో భీమా పోలీసులకు సహాయం చేశాడని, అందుకే మావోయిస్టులు ప్రతీకార చర్యకు పాల్పడతారనే భయంతో ఇలా చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేసాడు. భీమా మరణంపై మేజిస్ట్రేట్ విచారణ కొనసాగుతోందని ధృవీకరించాడు.
భీమా ఒక “దిగువ స్థాయి సంఘం సభ్యుడు” (గ్రామ స్థాయి మావోయిస్టు కమిటీ సభ్యుడు) అని, అతను గతంలోనే మనసు మార్చుకుని “అనేక విధాలుగా పోలీసులకు సహాయం చేశాడని” ఎస్పీ అన్నాడు.
సుక్రామ్ ఈ ఆరోపణను ఖండించాడు. “భీమా గ్రామంలోనే ఉండేవాడు; ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు.”
వరుస లొంగుబాట్లు
భీమా మరణించడానికి మూడు నెలల ముందు, రేఖపల్లిలో ఏడుగురు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. తాము మావోయిస్టులకు చురుగ్గా మద్దతు ఇచ్చే గ్రామ కమిటీ సభ్యులమని వారు అంగీకరించారు.
రేఖపల్లిలో జరిగిన బహిరంగ సభలో లొంగిపోవాలనే నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకొన్నారని గ్రామ పెద్ద ఉంగా సోడి తెలిపారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రేఖపల్లిలో మావోయిస్టుల కోసం వెతుకుతూ వచ్చే భద్రతా బలగాల వేధింపుల నుండి ఇతరులను రక్షించడానికి, పోలీసులకు లొంగిపోవడమే ఉత్తమమని గ్రామస్తులు భావించారు.
అయితే లొంగిపోయిన ఆ ఏడుగురు నిజంగా మావోయిస్టు కేడర్లేనా అని నేను ప్రశ్నించాను. “సాయుధ కేడర్లు గ్రామాల్లో నివసించరు” అని ఇప్పుడు ఉనికిలో లేని ఆ గ్రామ కమిటీ సభ్యుల్లో ఒకరైన సోడి బామి సమాధానమిచ్చారు. సాయుధ కేడర్లు గ్రామానికి వచ్చినప్పుడు, తాను, గ్రామ కమిటీలోని ఇతర సభ్యులు వారికి భోజనం ఏర్పాటు చేయడం, కాపలా కాయడం, సమావేశాలను నిర్వహించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చేవారమని ఆయన వివరించారు. కమిటీ సభ్యులు ఎప్పుడూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదని, తమ దిశానిర్దేశం కోసం సాయుధ కేడర్లు, నాయకులపైన ఆధారపడేవారమని ఆయన చెప్పారు. ఇప్పుడు సాయుధ కేడర్లు రేఖపల్లికి రాకపోవడంతో, గ్రామ వ్యవహారాల్లో కమిటీకి ఇక ఏ పాత్రా లేదని బామి జోడించాడు. తాము పోలీసులకు ఎలా లొంగిపోయామనేది కూడా బామి వివరించాడు.
Figure 7 భీమా బంధువు అయిన సుక్రమ్ మాడ్వితో గ్రామ పెద్ద ఉంగ సోడి, పటేల్పర, రేఖపల్లి వార్డు పంచ్ సుక్రమ్ సోడి.

పొరుగునే ఉన్న తెలంగాణలో లొంగిపోవడం సురక్షితమని భావించి, అక్టోబర్ 12న వారిలో నలుగురు భద్రాచలం వెళ్లారు. కానీ తెలంగాణ పోలీసులు వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారు. వారితోపాటు ఉన్న మిగిలిన ముగ్గురిని తెలంగాణకు చేరుకోకముందే అడ్డుకున్నారు.
మహిళా సభ్యురాలిని పామెడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు ధృవీకరణ పత్రంతో మరుసటి రోజు ఇంటికి పంపించివేసారు. కానీ ఆరుగురు పురుషులను వారం రోజుల పాటు విచారించారని, ఆ తర్వాత, వారిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి పంపి, అక్కడ ఒక నెల పాటు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి ఇంటికి పంపారని బామి చెప్పారు. వారికి శిక్షణా పత్రం (సర్టిఫికేట్) కానీ, లొంగుబాటు పత్రం కానీ ఇవ్వలేదని ఆయన తెలిపారు.
తిరిగి గ్రామానికి చేరుకున్నాక, పోలీసులతో తమకు ఉన్న ఇబ్బందులు ముగిసాయని, ఇకపై ప్రశాంతమైన జీవితం గడపవచ్చని వారు ఆశించారు. కానీ నవంబర్‌లో, భద్రతా బలగాలు గ్రామానికి వచ్చి లొంగిపోయిన వారి గురించి ఆరా తీసాయి. వారు భీమా మాడ్వీ గురించి కూడా అడిగారని మంగు మాడ్కం తెలిపాడు. ఆ సమయంలో భీమా అక్కడ లేడు – ఒక బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అతను వేరే గ్రామానికి వెళ్లాడు.
భద్రతా బలగాలకు భీమాపై ఎందుకు ఆసక్తి ఉందో తమకు ఏమాత్రం తెలియదని గ్రామస్థులు చెప్పారు. 2024 నవంబర్‌లో కూడా, భీమాతో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని నిర్బంధించి, వారం రోజుల పాటు విచారించి ఆపై విడిచిపెట్టారని రేఖపల్లి వాసులు గుర్తు చేసుకున్నారు.
Figure 8 లొంగిపోయినవారి ప్రమాణపత్రం

భద్రతా దళాలు తరచుగా రేఖపల్లిని ఎందుకు వెళ్తున్నాయనే విషయాన్ని వివరిస్తూ, సుమారు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల నీడలో ఉన్న గ్రామాల్లో తీవ్రమైన నిఘా అవసరమని బీజాపూర్ ఎస్పీ యాదవ్ చెప్పాడు. పోలీసు నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతాల్లోకి ఇంకా మావోయిస్టులు వస్తూండడం వల్ల, లొంగిపోయిన వారిపైన నిఘా ఉంచడం ముఖ్యమని అతను అన్నాడు.
అయితే ఇది లొంగిపోయిన వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయదా అని నేను యాదవ్‌ను ప్రశ్నించాను. 2025లో, బీజాపూర్‌లో కాంట్రాక్టర్లు, గ్రామస్థులతో సహా 27 మంది పౌరులను మావోయిస్టులు చంపారు, అలాగే 2024లో 33 మంది పౌరులను చంపారు. వీరిలో ఎంతమంది లొంగుబాటులతో సంబంధం ఉన్నవారు అనేది స్పష్టంగా తెలియలేదు.
లొంగిపోయిన వారు వెంటనే తమ గ్రామాలకు తిరిగి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దానికి బదులుగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని మావోయిస్టుల ప్రభావం నుండి విముక్తం చేసే వరకు సమీప పట్టణాల్లో పని వెతుక్కోవాలని వారికి సూచిస్తున్నామన్నారు. ఆ లక్ష్యం దిశగా ప్రభుత్వం స్థిరమైన పురోగతి సాధిస్తోందన్నారు. సుమారు 600 గ్రామాలున్న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా ఇప్పుడు 108 సెక్యూరిటీ క్యాంపులు ఉన్నాయి. “మేము ఇప్పటివరకు బీజాపూర్‌లోని 170 గ్రామాల్లోకి చొచ్చుకుపోగలిగాము, ఇది కొన్ని ఏళ్ల క్రితం ఊహించలేని విషయం,” అని యాదవ్ చెప్పారు.
— లొంగిపోయిన వారు తిరిగి ఇంటికి రావడం ప్రమాదకరం కాదా? ఇదే ప్రశ్నను రేఖపల్లి, సమీప గ్రామవాసుల ముందు ఉంచినప్పుడు దానికి వారి స్పందన స్పష్టంగా ఉంది: గ్రామస్థుల సమ్మతితో లొంగిపోయిన వారికి ఎటువంటి హాని జరగదు.
“ఎవరైతే రహస్యంగా లొంగిపోతారో, వారికి మాత్రమే ముప్పు ఉంటుంది,” అని రేఖపల్లి, మరో మూడు గ్రామాలను కలిపి ఉన్న నేల కాంకేర్ పంచాయతీ సర్పంచ్ నాగేష్ పున్నెం చెప్పారు.
అందుకు ఉదాహరణగా, నేల కాంకేర్‌లో ఇద్దరు వ్యక్తులను 2025 అక్టోబర్‌లో మావోయిస్టులు చంపేసారని; వారు రహస్యంగా లొంగిపోయారని; పోలీసు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని అనుమానించడం వల్లే ఆ హత్యలు జరిగాయని చెప్పారు.
గడచిన రెండేళ్లలో నేల కాంకేర్ పంచాయతీ నుండి మరో ముప్పై మూడు మంది గ్రామస్థుల సమ్మతితో పోలీసులకు లొంగిపోయారని, వారు మావోయిస్టు పార్టీ నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాధారణ జీవితం గడుపుతున్నారని పున్నెం తెలిపారు.
అయితే, లొంగిపోయిన వారిలో చాలా మంది తాము భద్రతా బలగాల నుండి వేధింపులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము లొంగిపోయిన చాలా కాలం తర్వాత కూడా, ప్రతి వారం పోలీసు స్టేషన్‌కు వచ్చి హాజరు వేసుకోవాలని పిలిపిస్తున్నారని వారు తెలిపారు. అలాగే భద్రతా బలగాలు క్రమానుగతంగా తమ గ్రామాలకు వచ్చి తమ గురించి ఆరా తీస్తూనే ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొట్టడమూ, ఆపై చికిత్స చేయించడమూ:
గస్తీ బలగాల రాకను గ్రామస్థులు ఎందుకు స్వాగతించడం లేదో స్థానికులు వివరించారు.
రేఖపల్లికి సమీపంలోని కోమట్‌పల్లి గ్రామంలో, డిసెంబర్ 4న భీమాను తీసుకువెళ్ళిన రోజున తాము ఎదుర్కొన్న అనుభవాలను గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వాట్టేవాగు శిబిరం నుండి భద్రతా సిబ్బంది తమ గ్రామానికి కూడా వచ్చారని కోమట్‌పల్లి నివాసి లక్ష్మణ్ మాడ్వీ తెలిపారు. పలువురు గ్రామస్థులను కొట్టారని, ఇద్దరు వ్యక్తులను తీసుకువెళ్లారని ఆయన ఆరోపించారు.
మరుసటి రోజు ఉదయం, ఆ ఇద్దరినీ విడిచిపెట్టమని కోరడానికి గ్రామస్థులు శిబిరానికి వెళ్లారు.. అంతకుముందు రోజు కొట్టినప్పుడు గాయపడిన వారిని చికిత్స కోసం కొండపల్లిలోని ఫీల్డ్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని క్యాంపు అధికారులు చెప్పారు. ఈ ఆసుపత్రి కొండపల్లిలోని సిఆర్పిఎఫ్ క్యాంపు లోపల ఉంది.
గాయపడిన వారిలో కొందరు నడవలేని స్థితిలో ఉండడం వల్ల, వారిని మంచాలపై పడుకోబెట్టి కొండపల్లికి మోసుకెళ్లాల్సి వచ్చిందని లక్ష్మణ్ మాడ్వీ చెప్పారు. అక్కడ వారికి ఇంజెక్షన్లు ఇచ్చారు, కానీ ఎటువంటి రాతపూర్వక వైద్య రికార్డులను వారికి ఇవ్వలేదు.
“మార్ కర్ ఇలాజ్ భీ కరాతే హై” (కొడతారు.. చికిత్స కూడా చేయిస్తారు) – అని గ్రామస్థులు నవ్వుతూ వ్యాఖ్యానించారు.
భద్రతా బలగాలు తమను కొట్టడం ఇదే మొదటిసారి కాదని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పంచాయతీ సభ్యుడు తెలిపారు.
అక్టోబర్‌లో, కోమట్‌పల్లి గ్రామస్థులు పంట కోతకు ముందు జరుపుకునే ‘నూక పండుమ్’ పండుగను జరుపుకుంటున్నప్పుడు, భద్రతా బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టాయని పలువురు గ్రామస్థులు తెలిపారు. ఆ సమయంలో పూజలు నిర్వహిస్తున్న గ్రామ ‘గాయతా’, ‘పూజారి’ (వైద్యుడు, పూజారి) తో సహా సుమారు 30 మంది పురుషులను కొట్టారని చెప్పారు.
ఈ ఆరోపణలపై స్పందన కోరేందుకు ‘స్క్రోల్’ పత్రిక వాట్టేవాగు శిబిరానికి చెందిన అధికారిని సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ ఆయన ఫోన్ కాల్ కట్ చేశారు.
కోమట్‌పల్లి నివాసితుల ప్రకారం, కేవలం నవంబర్ నెలలోనే భద్రతా సిబ్బంది తమ గ్రామంలో, అడవుల్లో, పొలాల్లో మూడుసార్లు గస్తీ నిర్వహించారు. ప్రతిసారీ ఎవరో ఒకరిని కొట్టారని వారు ఆరోపించారు. “మేము పారిపోము, కానీ వారు మమ్మల్ని ఆపి మావోయిస్టుల కదలికల గురించి ప్రశ్నిస్తారు. మాకు తెలియదని చెబితే, మమ్మల్ని కొడతారు,” అని ఆ పంచాయతీ సభ్యుడు చెప్పారు.
తరచుగా జరిగే సిఆర్పిఎఫ్ గస్తీ వల్ల తాము పొలాల్లో భయం లేకుండా పనిచేయడం కష్టమవుతోందని గ్రామవాసులు తెలిపారు. ఆదివాసీ రైతులు పంట కోతలు, ధాన్యం నూర్పిడి చేసే పని ఒత్తిడి ఉండే కాలంలో పనులకు ఇది ఆటంకం కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో, తునికాకు సేకరణ సమయంలో వారు ఆర్థికంగా దెబ్బతిన్నారు. బీడీలు చుట్టడానికి ఉపయోగించే తునికాకు సేకరణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలకు ప్రధాన ఆదాయ వనరు. 2025లో, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఈ వ్యాపారం నుండి నిషేధించింది. దానికి బదులుగా అటవీ శాఖ నేరుగా సేకరించేవారి నుండి తునికాకు కొనుగోలు చేసి, ఆ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. అయితే బీజాపూర్‌లోని ఉసూర్ బ్లాక్‌లో చాలా మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో, వారు ఈ వ్యాపారంలో పాల్గొనలేకపోయారు.
అనిశ్చిత భవిష్యత్తు:
సుమారు 35 కుటుంబాలు నివసించే తుమిర్గూడ, రేఖపల్లిలోని మూడు పల్లెలలో ఒకటి. తుమిర్గూడ నివాసి రమేష్ మాడ్వీ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ గ్రామం నుండి 14 మంది పురుషులు జైలులో ఉన్నారని, వారు మావోయిస్టులకు సంబంధించిన అనేక కేసులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ కేసులను ఎదుర్కోవడానికి అవసరమైన కోర్టు ఖర్చులను భరించలేక వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పారు.
భీమా మాడ్వీ ఇంట్లో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అతని ముగ్గురు కుమార్తెలు గ్రామంలోనే ఉంటారు; అతని కుమారుడు ఉసూర్ బ్లాక్ కేంద్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి మరణ వార్త విని అతను వెంటనే ఇంటికి చేరుకున్నాడు.
డిగ్రీ పూర్తి చేసిన భీమా బంధువు సుక్రామ్, తన మేనల్లుడి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. “అతను మళ్లీ తన చదువును కొనసాగిస్తాడనే అనుకుంటున్నాను” అని అన్నాడు.
2026 జనవరి 26
తెలుగు: పద్మ కొండిపర్తి




