ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే.

భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక క్షేత్రంలో ప్రజాయుద్ధ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడమే ఇప్పుడు విప్లవ రచయితల సంఘం తక్షణ, దీర్ఘకాలిక కర్తవ్యం

అధ్యక్షా, కామ్రేడ్స్

56వ ఏట తన ముప్పయ్యవ మహాసభలు నిర్వహించుకుంటున్న విరసం 56వసారి సాహిత్యం కళా, భావజాల రంగంలో తన వర్గ పోరాట కర్తవ్యాన్ని పునరుధ్ఘాటిస్తున్నది.

శత్రువ్యూహానికి ఈసారి అంతర్గత ప్రతీఘాతుక సాయుధ విద్రోహ నాయకత్వం క్రియాశీలంగా జతకట్టి తాత్కాలిక సంక్షోభాన్ని, ఇదివరకెన్నడూ లేనంత నష్టాన్ని, పూడ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రాణనష్టాన్ని నాయకత్వం నుంచి శ్రేణుల దాకా చేయగలిగింది.

అయినా నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల సెట్ బ్యాక్ నుంచి ఫినిక్స్ పక్షి వలె విప్లవ నిర్మాణాలు, పోరాటాలు ఐదు సంవత్సరాలలోపే రెక్కవిప్పి తెలుగు నేలంతా ఎగసినవి.

విరసం ఆవిర్భావం, మార్క్సియన్ సోషలిజం తన లక్ష్యంగా నక్సల్బరీ పంథాను, శ్రీకాకుళ పోరాటాన్ని తలకిందులైన భూమిని సరి చేసి చలనంలో పెట్టే పంథాగా విప్లవ పోరాటంగా ఎత్తిపట్టినవి. దేశంలోనే తొలి బహిరంగ నిర్మాణంగా గుణాత్మక పరిణతిగా 1974 నుంచి 2004 వరకు మార్క్సియన్ సోషలిజం మరేమీ కాదు ఈ కాలపు మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా మనం రాజీ పడకుండా రెండు పంథాల మధ్య పోరాటంగా నిర్వహించి, నిర్వచించి కూడ ఇరవయ్యేళ్లు గడచి పోయాయి. రివిజనిజంతో పాటు సోషల్ సామ్రాజ్యవాదం మీద భావజాలరంగంలో పోరాడితే మనకు చాల పేర్లు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్ళను. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, వీళ్ళు సాహిత్య నక్సలైట్లు, మొదట వీళ్ళ పని చూడండి అని ప్రభుత్వానికి చెప్పిననాటి నుంచి ఇవ్వాళ్టి వరకు మనం భావజాలరంగంలోని వర్గ పోరాటంలో ఎంత రాటుదేలామంటే ‘ఇపుడు కావాల్సింది అర్బన్ మావోయిస్టులే’ అని తేల్చి చెప్పాం. అట్లని శత్రువు శపించినట్లు, మిత్రులు శంకించినట్లు ఏకాకులం కాలేదు. సమాజం నుంచి వేటాడబడలేదు. ప్రజలు మనను అక్కున చేర్చుకున్నారు. సాయుధ పోరాట భావజాలాన్ని బాహాటంగా ప్రచారం చేస్తూనే బ్రాహ్మణీయ ఫాసిజానికి సామ్రాజ్యవాద కార్పొరేటీకరణలో, సైనికీకరణలో అది నిర్వహిస్తున్న దళారీ పాత్రకు వ్యతిరేకంగా పోరాడే అన్ని ప్రజాస్వామిక శక్తులను ఎంతో సృజనాత్మకంగా, ఎంతో విశాల దృక్పథంతో ఐక్యసంఘటనలోకి తెస్తున్నాం. ఈ రాజకీయ, సాంస్కృతిక, నైతికశక్తి మనకు నూతన ప్రజాస్వామిక విప్లవం పట్ల ఉన్న విశ్వాసం వల్ల, స్పష్టత వల్ల సాధ్యమవుతున్నది. ఇది మనకు అమరులు చూపిన బాట.

నలభై ఐదేళ్లు మనకు ఈ అమరుల బాటను అభివక్తగా వివరించిన పూర్వ మావోయిస్టు ‘కలం కి సిపాహి’ అనే మాట మావో వాడిందనుకొని ఎద్దేవా చేస్తున్నాడు. బుద్ధిజీవులు, కళాకారులు, సాహిత్య, సాంస్కృతిక కార్యకర్తల పాత్ర విప్లవంలో ఏమిటో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ మొదలు మావో యేనాన్ ప్రసంగం దాకా నేను ఆయనకు గుర్తు చేయనక్కరలేదు. ఫాసిజం కాలంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంను సాధించడానికే స్పెయిన్ అంతర్యుద్ధంలో రచయితలు, కళాకారులు, తత్వవేత్తలు, మేథావులు ఏ పాత్ర నిర్వహించి ఓడిపోయినా రెండవ ప్రపంచ యుద్ధం నాలుగు సంవత్సరాలు నిలవరించగలిగారు. ఈ అన్నిటికీ సాక్షీభూతంగా ఈ దేశంలో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాటిలేని ప్రజా రచయిత ప్రేమ్ చంద్ తనను తాను కలం కి సిపాహి అని చెప్పుకున్నాడు.

ఇవాళ అంతకన్నా గడ్డురోజుల్లో, సంక్షోభంలో ఉన్నాం. ఇది యూరపులో వచ్చి ప్రపంచమంతా ప్రభావం చూపిన ఫాసిజం వంటిది కాదు.

దీనికి వేల ఏళ్ళ బ్రాహ్మణీయ భావజాలంలో వేళ్ళు ఉన్నాయి. ఎక్కువ గతంలోకి వెళ్లకుండా చెప్పాలంటే వంద ఏళ్ళ ఆర్?ఎస్?ఎస్ ఆక్టోపస్ నిర్మాణమున్నది. అమృతోత్సవం చేసుకుంటున్న పార్లమెంటరీ ఎండమావి ఇది. ఈ ఎండమావిలో కులం విషవృక్షమై మతంగా జాతీయోన్మాద ఊడలమర్రిగా పాదుకోవాలనుకుంటున్నది. బ్రాహ్మణీయ కులమే మతంగా జాతిగా, దేశంగా ఎంత టుక్డే, టుక్డే రాజకీయాలు చేస్తున్నదో, ఎంత విషం చిమ్ముతున్నదో అన్నిటినీ ఎదుర్కొని సల్వాజుడుంలో అంతర్యుద్ధాన్ని మనపై రుద్దే కుట్రను బహిర్గతం చేసి ఓడించిన జనతన సర్కార్ గ్రీన్?హంట్ మొదలు కగార్ ఆక్రమణ యుద్ధం వరకు ఎదుర్కోగలిగిన ప్రజాయుద్ధం మన గడ్డ మీదనే మన ప్రజల మీద ఆక్రమణ యుధ్ధాన్ని నిలువరించగలిగింది. ఈ స్థితిని మనం ఊర్మిళ, చంద్రహాస్, రేణుక, వికల్ప్, కోసా, హిడ్మా, పాక హనుమంతు, శిఖరాయమానంగా బసవరాజు అమరత్వం దాకా చూశాం.

అంతర్గత సాయుధ విద్రోహం ఒక వేరుపురుగు వలె, చెదలు వలె అడవిని తొలుస్తున్నది. పోల్చుకోవడంలో అనుమానాలున్నా ఉదారత్వం వహించాం.

విరసం ఏర్పడీ, ఏర్పడగానే నిబద్ధత-నిమగ్నత కృత్రిమ విభజన అవగాహనా లోపంతో కూడిన మార్క్సిస్టేతర భావజాలాన్ని మార్క్సిస్టు వ్యతిరేక భావాలుగా ఖండించి సరిదిద్దుకోవడము, నాడు నాయకత్వాన్ని కాపాడుకొని ఎఐఎల్?ఆర్?సి నిర్మాణం దాకా, నిర్వహణ దాకా, ఆజీవాంతం మన శిబిరానికి నాయకత్వం ఇచ్చేంత దృఢంగా కాపాడుకున్నాం. విప్లవానికి ఒక సంవత్సరం సెలవు ఇవ్వాలన్న ప్రచార దశ, ఆచరణ దశలలో ఉన్న ‘రేపటి విప్లవం’ గందరగోళం నుంచి సంస్థను కాపాడుకున్నాం. అనంతపురం నుంచి మాకివలస దాకా ఎంఎల్?ఎం ప్రాపంచిక దృక్పథం విప్లవ రచయితకు గీటురాయిగా నిగ్గుదేల్చాం.

కార్మికవర్గ రచయితలే, కమ్యూనిస్టు రచయితలే కార్మికవర్గాన్ని మాత్రమే కాదు అన్నీ వర్గాలను విముక్తం చేసే వర్గపోరాటం చేయగలరు. భావజాలరంగంలో ఐక్యసంఘటన కట్టగలరు, ఫాసిజాన్ని మట్టికరిపించినట్లే బ్రాహ్మణీయ ఫాసిజాన్ని మట్టికరిపించగలరు. అది అగ్రగామి రచయితల సంఘంగా భావజాల రంగంలో వర్గపోరాటాన్ని మరింత దృఢంగా సాగించినపుడే సాధ్యం.

అమరవీరులకు జోహార్లు!

అమరుల ఆశయాన్ని కొనసాగిద్దాం

Leave a Reply