(జులై 27న వైజాగ్లో కామ్రేడ్ చలసాని ప్రసాద్ పదో వర్థంతి సందర్భంగా జరిగిన ‘శాంతి చర్చలు -విప్లవ పంథా ‘ సదస్సుకు పంపిన సందేశం …)
ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఉంటూ సి. రాఘవా చారి నేను శ్రీశ్రీ కి కాపలాగా ఉన్నప్పుడు ఆయనను రైల్లో స్టాలిన్ ప్రజాశక్తి దగ్గరికి లాక్కపోయిన వాడు చలసాని. మా ఊళ్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇంకా కొత్త స్నేహితులను భరించలేను అంటున్న కాళోజీని కె.ఎస్,కృష్ణక్క కుటుంబాల్లో భాగం చేసింది ప్రసాదు. ఆయన తొలి ఉద్యోగాలు హైదరాబాదులో ఫిషరీస్ కాజీపేటలో రైల్వేస్. నీళ్ళల్లో చేపలా ఈదడం ఆయనకు తెలంగాణ సాయుధ పోరాట అమర కుటుంబమే నేర్పింది గాని విశాఖ సముద్రం ఆయనను శ్రీకాకుళం దాకా గజ ఈతగాణ్ణి చేసింది.ఆయన నడకలు ఉరుకుల పాదాలలో చక్రాలు ఉన్నాయా అన్నంతగా నక్సల్ బరీ సందేశాన్ని దండకారణ్యం దాకా మోసి అక్కడి వర్గ బంధుత్వంలో తన రక్త బంధాన్ని చూసుకుని సంతృప్తి చెందాడు.
విరసంలో చేరిన దిగంబరకవులు శ్రీశ్రీ ని విరసం లోకి “ప్రాడ్” చేశారని ప్రభుత్వం ఆరోపించింది కానీ ఆ పని చేసింది చలసాని ప్రసాద్, హరి పురుషోత్తం లని ఇదివరకు చాలాసార్లు చెప్పాను. అయితే ఆయన మాటల్లోనే చెప్పాలంటే విరసం సభ్యులు విరసం పని చేస్తారు కానీ, ‘అ’ సభ్యులతో. పని చేయించడం అనే అసాధ్యమైన కమిట్మెంట్ ను ఆయన జీవితమంతా ఆచరించిచూపాడు.
విరసం అరుణతార రెండూ ఆయన రెండు కళ్ళు. ఈ రెండింటిని నిలుపుకోవడానికి కాపాడుకోవడానికి ఆయన వెయ్ కాళ్ల జెర్రి వలె నలుదిక్కుల తిరిగాడు. ఆయన ఈ రెండింటికి తల్లి వంటి వాడు.
ఆయన దండకారణ్యాన్ని, జనతన రాజ్యాన్ని అక్కడ రూపొందుతున్న నూతన మానవీ మానవులను చూసి వచ్చి తెలుగు భాష గోండీ భాష నుంచి వచ్చిందని ఒక ఆదిమ సత్యాన్ని ఆధునిక ప్రపంచానికి తెలియచెప్పాడు సుబ్బారావు పాణిగ్రాహిని చెరబండరాజును కూడా చూడలేకపోయిన దండకారణ్య తరమంతా విరసం సాహిత్య సాంస్కృతిక సేనానిని చలసాని ప్రసాదులో చూసుకున్నారు. ఆయనతో ‘ఈ విప్లవాగ్నులు ఎచటి వని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి’ ,’ఎత్తినాం విరసం జెండా’ వంటి పాటలు పాడించుకున్నారు.
ప్రసాదు తండ్రి చనిపోయినప్పుడు తన ఊరికి వెళ్లి ఆయన అంత్యక్రియలు కాగానే తిరిగి వచ్చాడు. తల్లి చనిపోయి తిరిగి వస్తున్నప్పుడు వెంట వచ్చిన ఊరివాళ్లు కొందరు పదో రోజు మళ్ళీ వస్తారా అని అడిగారట. ఆయన ఆ షాక్ నుంచి తేరుకోలేదు ఎన్నిసార్లు చెప్పాడో.
ప్రజల విశ్వాసాలు కాదు మన విశ్వాసాల మీద ప్రజలకు విశ్వాసం పోవడం ప్రమాదం అన్నాడు.
లేదు ప్రసాద్.. విరసం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న వర్గ పోరాటాన్ని ఇవాళ కగార్ ఆక్రమణ యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ప్రజా యుద్ధానికి బాసటగా నడుస్తున్నది. సాయుధ విప్లవ శాంతి సాధన కోసం ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నిటిని కలుపుకవచ్చే పోరాటం లో పదేళ్లుగా నీ ఒరవడిని ఒద్దిక గా నేర్చుకుంటున్నది.
పుస్తకాలు మనుషులకు ప్రత్యామ్నాయా లవుతాయా అని అడిగావు. విశాఖ లైబ్రరీ లో నీ ప్రతి పుస్తకం పుటలోను జీవితమే పోరాటమైన మనుషులను అమరులను చూసుకుంటాం. అందులో నువ్వు సజీవంగా ఉంటావు.
ప్రేమతో నీ వరం.