“ఏమైపోయావురా? నేన్నిన్ను పోల్చుకోలేకపోయాను తెలుసా?” నమ్మలేనట్టు యెగాదిగా చూస్తూ అడిగాడు బట్టతలమనిషి.
చింపిరిజుట్టూ గడ్డంతోవున్న మనిషి యేమీ మాట్లాడలేదు. పుసులు కట్టిన అతని లోతు కళ్ళలో తడి. బలహీనంగా వున్నాడు, మాసిన దుస్తుల్లో.
కాలాన్ని అందుకోవాలన్నట్టు రైలు దూసుకుపోతోంది.
ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. బహుశా వాళ్ళు వాళ్ళ బాల్యపు బావుల్లో పడి కొట్టుకుంటున్నట్టున్నారు. తగ్గిన స్లీపర్ కోచ్‌లవల్ల కాస్తంత రద్దీగానే వుంది బోగీ.
బట్టతలమనిషి తన వుద్యోగము గురించి చెప్పాడు. ఆతరువాత పిల్లల చదువుల గురించి అలాగే అనుకూలవతయిన భార్య గురించి చెప్పాడు.
అన్నిటికీ సమాధానంగా జీవంలేని నవ్వు ముఖంతో చూశాడు చింపిరిజుట్టు గడ్డంమనిషి.
“అది అట… యిదట అని ‘అట’ భోగాట్టాలే విన్నాన్రా, నీ గురించి…” అని బట్టతలమనిషి అంటున్నప్పుడు చింపిరిజుట్టు గడ్డం గోక్కుంది. “ఏదయినా నీ నోటితో వింటే కదా?, యెముక లేని నాలుక నిన్ను పిచ్చోడ్ని చేసి యేదయినా మాట్లాడుతుంది…” బహుశా లోకం గురించి అన్నట్టున్నాడు బట్టతలమనిషి.
చింపిరిజుట్టు గడ్డంమనిషి బిత్తర చూపులతో చుట్టూ చూశాడు. అంతా యెవరి బాదరబందీల్లో వాళ్ళు వున్నట్టున్నారు. ‘అలా వుండరే, తోటివాడి జీవితంలోకి తొంగి చూడకపోతే గడవదే? వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుంటే యెలా?’ పిచ్చి ప్రేలాపనగా తనలో తనే అనుకున్నాడు. “ఏదో చిన్ననాటి మిత్రుడవని అడిగాను, చెప్పాలని లేకపోతే వద్దులే” అని బట్టతలమనిషి అంటూనే, “మన క్లాస్ మీట్స్ నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు కదా?” అన్నాడు.
‘ఏమీ చెప్పకపోతే తనగురించి అనుకున్నవన్నీ నిజం అనుకుంటారేమో’ అనుకున్నాడు చింపిరిజుట్టు మనిషి. ‘అనుకుంటే అనుకోనీ’ అని కూడా అనుకున్నాడు. ఆపై ‘తన చిన్ననాటి మిత్రుడు అడిగితే కూడా దాచుకోవలసింది యేముంది?, లోకం యెరిగిందే కదా’ అని సరిపెట్టుకున్నాక నోరు విప్పాడు.
“ఏముంది? అందరి పెళ్ళిళ్ళలాగే మా పెళ్ళీ అయ్యింది. అంటే, దగ్గరి సంబంధం యేమీ కాదు. మా లెక్కల గురువుగారు ఆయన ఆడిట్ పనులమీద నన్ను తీసుకెళ్ళి ఆ అకౌంట్స్ యేవో చూసి తిరిగి వచ్చేస్తుంటే, ఆయనంటే గౌరవముండే వొక పెద్దమనిషి దార్లోకాసి పిలిచి సన్మానం చేశాడు. అప్పుడే ఆ పెద్దమనిషి కూతురికి యేవో పెళ్ళిచూపులు జరిగాయి. వాళ్ళెవరూ ఆవిడకు నచ్చలేదు, కర్మకొద్దీ నేను నచ్చాను…” చింపిరిజుట్టు చిందరవందరగా చెపుతుంటే, “స్వయంవరమన్నమాట” నవ్వాడు బట్టతలమనిషి.
బోగీలో వారి చుట్టూవున్న జనం ఆ కథకు శ్రోతలయ్యారు. అది తెలీని చింపిరిజుట్టు మనిషి తన కథని చెప్పుకుపోతున్నాడు.
“నాకా వుద్యోగం లేదు, మా నాన్న వయసుకు మించిన ముసలితనంవల్ల అనారోగ్యంవల్ల చేస్తున్న వ్యాపారం వదిలేద్దామని అనుకున్నాడు. పెద్దకొడుకుగా ఆయన వ్యాపారానికి వారసుడు నేనే అని డిక్లర్ చేసేశాడు. అప్పుడొచ్చింది మా పిన్ని. ‘నువ్వు ప్రాణాపాయంలో వున్నప్పుడు నా కిడ్నీ యిచ్చి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డి ఆపదనుంచి ఆదుకున్నాను. నువ్వేదడిగినా యిస్తానని వొట్టేసావు, మర్చిపోయావా?, నా కొడుక్కి నీ పొజిషన్ యివ్వు’ అని మా నాన్న పీకలమీద కూర్చుంది. మా నాన్న హేండ్సప్ అన్నట్టు చేతులెత్తేశాడు…” చెపుతున్న కథ పూర్తికాలేదు. “కైకలా తయారయిందన్నమాట, మీ పిన్ని” లీనమవుతూ అన్నాడు బట్టతలమనిషి.
“ఏముంది?, నా బతుకు అడవే…” చింపిరిజుట్టు మనిషి చెప్పకముందే “అవును, అదేదో ఫారెస్ట్ యేరియాలో బ్రాంచ్ పెట్టారని అక్కడే నువ్వు మీ ఆవిడతో వున్నావని…” తనకు తెలిసిన కథని జోడించాడు బట్టతలమనిషి. “పద్నాలుగేళ్ళు వున్నాను, అక్కడ ఆఖర్లో చాలా గొడవలు పడి…” గతించిన రోజులు తలచుకుంటూ జ్ఞాపకాల భారంతో యేమో తలకిందికి దించి చెపుతుంటే, “మీ ఆవిడ కనపడకుండా పోయిందని…” బట్టతలమనిషి నెమ్మదిగా గొంతుతగ్గించి అన్నాడు.
“కనిపెట్టి తెచ్చుకున్నాడు, పెద్ద యుద్ధమే చేసి…” మంత్రం జపిస్తూ వేళ్ళతో రుద్రాక్షలు తిప్పుతూ తలకూడా తిప్పకుండా అంది కిటికీపక్క వొంటి సీట్లో కూర్చున్న ముసలామె. ఆమె దిద్దిన మటమే కాదు, నుదిటన దిద్దిన నిలువు బొట్టూ చాలామందిని భక్తిపూర్వకంగా ఆకర్షించేలా వుంది.
ప్రయాణీకులైన శ్రోతలు ముఖాల్లో రంగులు మారాయి. అంతా వొకర్ని వొకరు చూసుకొని, యేదో లోకంలోవున్న ఆ యిద్దరి మిత్రులవంక తలలు తిప్పి చూశారు.
మిత్రుని మౌనం చూసి “మరి పిల్లలు?” అడిగాడు బట్టతల మనిషి.
“ఇద్దరు” వింటున్న ప్రయాణీకుడెవడో అన్నాడు. “నీకెలా తెలుసు?” అన్నాడు పక్కవాడు. “సినిమాలో సీన్ బై సీన్ చెపుతుంటే, ఆ మాత్రం నెక్స్ట్ సీన్ తెలీదా?” అన్నాడు ఆ పక్కనున్నవాడు. “ఏ సినిమా?” అంది వాళ్ళావిడ. ‘అదీ తెలీదా?’ అన్నట్టు అసహనంగా చూశాడా మొగుడు.
పిల్లలు గుర్తుకొచ్చిన దుఃఖంలో వున్నాడేమో చింపిరిజుట్టు మనిషి కళ్ళు తుడుచుకున్నాడు తప్పితే యేమీ మాటలాడలేదు.
“ఆ తర్వాత?” అన్నాడు బట్టతలమనిషి, యెవర్నీ పట్టించుకోకుండా.
“వాళ్ళావిడని పుట్టింట్లో వదిలేశాడు, ఆవిడ నీళ్లోసుకుంది. ఇద్దరు ట్విన్స్ పుట్టారు” మరో ప్రయాణీకుడు తన కళ్ళతో చూసినట్టే చెపుతున్నాడు.
‘నా కథ మీకెలా తెలుసు?’ అన్నట్టు విస్తుపోతూ చూశాడు చింపిరిజుట్టు గడ్డంమనిషి. తనకు యేమీ అర్థం కావడం లేదన్నట్టు ముఖం పెట్టాడు బట్టతలమనిషి.
“వాళ్ళ పేర్లు… కుశలవలు” యింకో ప్రయాణీకురాలు చెప్పింది, తనే పేర్లు పెట్టినట్టు.
బట్టతలమనిషి నివ్వెరపోయి చూశాడు, ‘ఆట పట్టించడం లేదు గదా?’ అనుకున్నాడు. తరువాత యేదో కనెక్ట్ అయినట్టే కళ్ళు పెద్దగా చేసి చూస్తూ తలాడించాడు. అంతా తమనే చూస్తున్నారన్న విషయం చింపిరిజుట్టు గడ్డంమనిషి గమనించలేదు.
“నిజంగా నువ్వు రాముడివిరా…” కళ్ళు చెమరుస్తూవుండగ అన్నాడు బట్టతల మనిషి.
“కలియుగ రాముడు!” అన్నారెవరో.
అంతే, గబుక్కున “రామ రామ…” అని చింపిరిజుట్టు గడ్డంమనిషి కాళ్ళు మొక్కారు మరెవరో.
మిత్రులిద్దరూ అయోమయంలో వుండగా చింపిరిజుట్టు గడ్డంమనిషి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారెవరో. అంతే, అమ్మలక్కలు ఆ కాళ్ళకు పసుపు పూశారు.
చింపిరిజుట్టు గడ్డంమనిషి వెర్రిబాగులవాడిలా చూస్తున్నాడు. బట్టతలమనిషికి జుట్టు లేకపోయింది పీక్కోవడానికి.
“డౌట్లేదు, వీడిచేత రామావతారం యెత్తిస్తారు. లేదంటే ఎట్ లీస్ట్ స్వామీజీ అయినా అయిపోతాడు” అని వూహించాడు బట్టతలమనిషి. కాని వూహకు విరుద్ధంగా జరిగింది.
“ఏమో? పూర్వజన్మ స్మృతులు వుంటాయని అంటారు…” అని వొకరు అంటే, “అంటే పోయిన జన్మలో రాముడే యిప్పుడిలా పుట్టాడని అంటారా?” అని మరొకరు.
“బొంగేం కాదూ?, వీడు రామాయణాన్ని వెక్కిరిస్తున్నాడు…” అన్నాడు మరొకడు, కోపంగా చూస్తూ. “వీడికీ రాముడికీ పోలికేమిటి?” అన్నాడెవడో వంత పలుకుతూ. “అయితే, బుర్ర రామ కీర్తన పాడించండి” టెంకిజెల్ల కొట్టాడు మరెవడో.
టపటపమని తల వెనుక భాగంమీద నాలుగు తగిలాయి.
బట్టతలమనిషి ప్రమాదాన్ని వూహించినట్టున్నాడు. “ఏమ్మాట్లాడుతున్నావురా” అని, గుమికూడిన వాళ్ళతో “బుర్ర చెడిపోయింది, తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు” అని నెమ్మదిగా వెనక్కి జరిగి కూర్చున్న చోటులోంచి లేచి నిలబడి జనంలో కలిసిపోయాడు. తను కూడా వొక దెబ్బ వేశాడు. వేశాక, తను సేఫ్ అనుకున్నాడు.
“దేవుడయినా మనిషి అవతారం యెత్తాక దెబ్బలు తినాల్సిందే” గొణుగుతూ ఆ హింస చూడలేనట్టు కళ్ళు మూసుకుంటూ అందో ఆవిడ.
ఇంతలో రైలు బోగీలోకి పోలీసులు వచ్చారు.
దెబ్బలుతిన్న చింపిరిజుట్టు గడ్డంమనిషిని ఆగిన స్టేషన్లో దించేశారు. అడిగితే, పిచ్చోడని చెప్పారు.
“నేనొక్కణ్ణేనా?” అడిగాడు చింపిరిజుట్టు గడ్డంమనిషి, వారి వెంట కుంటుతూ నడుస్తూ.
ఎప్పటిలాగే రైళ్లో వున్నోళ్ళు ముందుకు… రైళ్లో లేనోళ్ళు వెనక్కి… పోతూ రైలు!!




