అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా!

రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి!

బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు.

ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట.

ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే ఏం గడువులు పెడుతున్నాడు. ఏ భాష మాట్లాడుతున్నాడు. ఏ ఫాసిస్ట్‌ మారణకాండ ఆచరిస్తున్నాడు. ఆదివాసులైన సరే, మూలవాసులైనా సరే, పసిపిల్లలైనా సరే, మహిళలు, ముసలివారైనా సరే, మావోయిస్టులు అయితే సరే సరి. మోషాల నోటి నుంచి వచ్చేది మత్యు భాష. బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ భాష. సామ్రాజ్యవాద దళారీ రక్త పిపాస. ఎవరికోసం కార్పొరేట్ల కోసం.

రాజ్యాంగంలో రాసుకున్న ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఆదివాసి ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌ అటవీ చట్టాలు, పేసాలు, గ్రామసభలు అన్నీ భ్రమలు.

శత్రువేమీ దాచుకోవడం లేదు. చరిత్ర విషాదంగానే పునరాచరణ చేసి చూపుతానంటున్నాడు. ఎల్లవేళల కోసం కాకపోవచ్చు. అంతిమయుద్ధం కాదు కూడ. కానీ ఏ అహమిక తో గతాన్ని అనుకరిస్తున్నాడు. ఏ సంకేతాలు పంపుతున్నాడు. ప్రజలు నిర్మించిన చరిత్రను ఎంత వక్రీకరణలతో ఆభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మన ముందు అల్లూరి సీతారామరాజు అమరత్వ దశ్యాన్ని మళ్ళీ ప్రదర్శించే దుస్సాహసం చేస్తున్నాడు.

నా కొరకు ప్రజల్ని, ముఖ్యంగా ఆదివాసీ ప్రజల్ని చంపకు, స్త్రీలను చెరచకు, పసి పిల్లలను ఉక్కుపాదాల కింద నలుపకు, నన్నేం చేసుకుంటావో చేసుకో అని ముఖాముఖి రమ్మని, తనతో చర్చించడానికి రమ్మని, దమ్ముంటే ప్రజలతో పాటు నేను ఎంచుకున్న మార్గాన్ని నాతో చర్చించు నేనే వస్తానన్న అల్లూరి సీతారామరాజును ఎంత దుర్మార్గంగా బ్రిటిషిండియా ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేసిందో అంతకన్నా దుర్మార్గంగా హిడ్మాను, ఆయన సహచరి రాజేను, సహ యోధులను ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఎన్‌కౌంటర్‌ చేశాయి.

ఎన్‌కౌంటర్ల చరిత్రలో అల్లూరి సీతారామరాజుది మొదటిది. హిడ్మాది మాత్రం కగార్‌ అంతిమయుద్ధమని సూరజ్‌ కుండ్‌ వ్యూహం విర్రవీగినా ఆఖరిది కాబోదు.

రాజ్యం పట్ల, ప్రభుత్వాల పట్ల తారతమ్యాలతో భ్రమల నుంచి ఇకనైనా కళ్ళు తెరవండి, మారిన పరిస్థితుల్లో  రాజ్యాంగ ప్రమాణంగా ఎన్నికల్లో కూడా పాల్గొని పోరాడుతామని తిరిగి వచ్చిన వాళ్లు, ఆహ్వానించిన వాళ్లు కళ్ళు తెరవండి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిడ్మాను, రాజేను, సహయోధులను కేంద్ర అర్ధ సైనిక బలగాలకు అప్పగిస్తే, ఎన్‌డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ భాగస్వామి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్ష కూడా తీర్చుకోవడానికి, ఛత్తీస్‌గఢ్‌-ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బసవరాజు, ఆయన 28 మంది సహచరులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లుగానే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో హిడ్మాను, రాజేను, సహయోధులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇదే అడవుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ గణేష్‌ (గాజర్ల రవి), విశాఖ అరుణలను పట్టుకొని ఎన్‌కౌంటర్‌ చేశారని మనం గుర్తు చేసుకోవాలి. సంక్షోభంలో ఉన్న, మరణశయ్యపై ఉన్న సామ్రాజ్యవాదం గాజాపై తన దళారీ ఇజ్రాయిల్‌ రెండు సంవత్సరాల ఆక్రమణ యుద్ధాన్ని ఆపక తప్పని స్థితిలో కూడా ఎన్ని నాటకాలు ఆడుతున్నాదో చూస్తున్నాం.

పార్లమెంటరీ ఎన్నికల భ్రమలు మధ్యతరగతిని కూడా మభ్యపుచ్చలేని స్థితిలో ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపిలు ఎంత మారణకాండను అమలు చేయగలవో దానికి మౌన ప్రేక్షకులు కాకండి అని హిడ్మా హెచ్చరిస్తున్నాడు.

మళ్లీ ఎన్నికల కలుగులోకి వెళ్ళకండి. చీమల్ని పాముల పుట్టలో శాంతియుతంగా దూరమని చెప్పకండి.

హిడ్మా నక్సల్బరీ తరం. నక్సల్బరీ ఉగ్గుపాలతో పెరిగిన వాడు. దండకారణ్య పర్స్‌పెక్టివ్‌తో తన బాల్యం, కౌమార, యవ్వనాల నుంచి నేటి దాకా సాయుధంగా నడచిన వాడు. జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌లతో పాటు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం రక్షణలో జనతన రాజ్యాన్ని కాపాడుకున్న శ్రేణులలో నాయకుడు. మూలవాసులకు శాస్త్రీయ సాయుధ మార్గం చూపి తోవల వదిలిపోయినవాడు కాదు. ఆ మార్గంలో అది ఎంత రక్తసిక్తమైనా అందులో నడిచిన వాడు. అందులో మునుసాగినవాడు. ప్రజా యుద్ధం తప్ప ప్రత్యామ్నాయం లేదు. సత్యం వాదాలతో తేలేదికాదు. ఆచరణలో ప్రకాశించేది. శత్రువు సాయుధుడైన హిడ్మేనే కాదు, నిరాయుధులైన అమాయకులను వదలడు. అహింసా వాదులను వదలడు. చర్చ హింసా హింసలది కాదు, న్యాయాన్యాయ్యాలది. కార్పొరేట్‌ల కోసం సైనికీకరణ కగార్‌ ఆక్రమణ యుద్ధంలోని ఆఖరి ఘట్టంలో తనకు ఆదివాసులపై ఎంత సంక్షేమ దష్టి ఉన్నదో ఎంత కపట వంచన పూర్వక ప్రేమ ఉన్నదో హిడ్మా, రాజే, సహ యోధుల ఎన్‌కౌంటర్‌లో బీభత్సంగా ప్రదర్శించింది.

హిడ్మా, రాజే, సహయోధుల అమరత్వం మనకు మార్గ నిర్దేశకత్వం చేస్తూ పిలుపునిస్తున్నది. అది అమరుడు చారు ముజుందార్‌, జవహర్‌, బసవరాజులు చూపిన మార్గం మాత్రమే కాదు అల్లూరి, కొమురం భీమ్‌, గూండాధర్‌లు చూపిన మార్గం.

నెహ్రు భ్రమలతో తెలంగాణ సాయుధ పోరాట మార్గాన్ని వీడిన నాయకత్వం కన్నా మోషాల వంచనతో సాయుధ పోరాట మార్గాన్ని వదిలిన నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అమరులు హిమాలయోన్నతులుగా ప్రజల హదయాల్లో నిలుస్తారు. పోరాట ప్రజలను నడిపిస్తారు.

Leave a Reply