జైలు కథల అనూరాధగా తెలుగు పాఠకులకు పరిచయమైన బి. అనూరాధ సాహిత్య ప్రస్థానం ఈ సంకలనంలో చూడవచ్చు. హజారీబాగ్ జైలు కథలు తెలుగు కథా సాహిత్యానికి అరుదైన చేర్పు. విప్లవ కథా స్రవంతికి కూడా ఇది సరికొత్త విస్తరణ. మన సాహిత్యంలో ఖైదు కవిత్వం వచ్చినంతగా కథలు రాలేదు. ఎక్కువ మందికి తెలియని ఆ ప్రపంచపు లోతులను ఈ కథలు చూపించాయి. సమాజంలోని సమస్త ఆధిపత్యాలు, వాటిని వ్యవస్థాబద్ధం చేసే రాజ్యం ఆ ఇరుకైన, ఎత్తైన గోడల మధ్య చిక్కగా అల్లుకొని ఉంటాయి. అందులోనే మనుషులుంటారు, మానవీయ స్పందనలు, భావోద్వేగాలు ఉంటాయని పితస్వామ్య వ్యవస్థా పీడితులైన స్త్రీల కోణం నుండి ఆ కథలు మనకు పరిచయం చేసాయి. వారిని స్పశించి, హదయ స్పందనలను గ్రహించి వారి ద్వారా భారతీయ సమాజపు తీరు తెన్నులను మనం ఊహించని కోణం నుండి ఆవిష్కరించిన అనూరాధ ఇప్పుడు పెద్ద జైలు నుండి మరిన్ని కథనాలను మనకు వినిపిస్తున్నారు. అవును, పెద్ద జైలంటే ఈ సమాజమే.
ఈ పెద్దజైలులో కళ్లుతెరిచిన అనూరాధ మొదట ‘కులం’ అనే బంధవ్యవస్థలో తానున్నానని గ్రహించింది. ఆ గ్రహింపు నుండే ఈ కథలు మొదలవుతాయి. నిజానికి రచయిత కథా ప్రస్థానం కూడా ఇక్కడి నుండే మొదలైంది. కుల వ్యవస్థలో మనుషులు కుక్క కంటే హీనమవుతారని తెలియడం ఊహ తెలుస్తున్నప్పుడు మింగిన చేదు అనుభవం. బాల్యం అమూల్యమే, అపురూపమే. కానీ అందరి బాల్యం ఒకటి కాదు. దళిత పిల్లలు ఎన్ని ప్రతికూలతల మధ్య, ఎన్ని చేదు అనుభవాల మధ్య, ఎంత కాఠన్యం కింద నలిగిపోవాల్సి వస్తుందో ఆధిపత్య కులాల పిల్లలకు తెలీదు. పిల్లల కథల్లో, పాఠ్యపుస్తకాల్లో ఇవి ఉండవు. కలిమి లేముల గురించి చెప్తారోమో గాని మన సమాజాన్ని వేల ఏళ్లుగా సంకుచితంగా, అమానవీయంగా ఉంచుతూ ఎదగనివ్వకుండా చేసే కులం అనే వాస్తవాన్ని గురించి చెప్పరు. అది ఎవరి అనుభవాలలో వాళ్లు తెలుసుకోవాల్సిందే. ఆ అనుభవాలు కొంత మందిని ఆత్మన్యూనతకు గురిచేస్తాయి. కొంత మందిని ఆధిపత్యభావానికి గురిచేస్తాయి. ఒక కథలో నాలుగో తరగతి పిల్లవాడు “మేం బ్రాహ్మలం”.. “మీరేముట్లూ” అని అడగడం ఆశ్చర్యం కలిగించదు కానీ కులం అనే భావన ఊహ తెలినప్పటి నుండే ఏర్పడి ఎలా గడ్డకడుతూ వస్తుందో కదా అని ఆలోచింపజేస్తుంది. మన విద్యావ్యవస్థ వ్యక్తుల్ని రూపొందించడంలో మొదటి నుండీ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇటీవలి కాలంలో అది అంతకంతకూ ప్రగతి నిరోధకంగా తయారవుతున్నది. సుమారు నలభై ఏళ్ల క్రితం నాటి రచయిత అనుభవంతో ఇప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే మరింత నిరాశాజనకంగా ఉంటుంది. దళితులకు విద్యను అందించడంలో గణనీయమైన పాత్ర పోషించిన మిషనరీస్ స్కూల్లో కూడా వివక్ష లేకుండా పోలేదు. మధ్యతరగతి విద్యావంతుల కుటుంబం నుండి వచ్చిన రచయిత కూడా దానిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇది మరొక పెయిన్‌ఫుల్ అనుభవం. అలా నాలుగవ తరగతిలోనే అర్థమవుతుంది, అందరి బాల్యం ఒకటి కాదని. అదే సమయంలో తన కష్టాలు, పేద దళిత పిల్లలకున్న కష్టాలు ఒకటి కావు అని కూడా గ్రహించగలిగింది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కునే ఈసడింపులు, అవమానాలే ఇక్కడి థర్డ్ క్లాస్ బోర్డింగ్ విద్యార్థులు ఎదుర్కుంటారు. వాళ్లంతా పేద దళిత పిల్లలే అని చెప్పనవసరం లేదు. ఫస్ట్ క్లాస్ బోర్డింగ్‌లో అగ్రకులాల, సంపన్నుల పిల్లలు ఉంటారు. ఈ విధంగా విద్యసంస్థలన్నీ అసమానతల్ని కొనసాగిస్తూ, అసమాన విద్య అందిస్తూ అందరినీ ఒకే నిర్దాక్షిణ్య పోటీ ప్రపంచంలోకి దించుతాయి. అందుకే చదువులో ప్రతిభ కనపరిచే వాతావరణం అందరికీ ఉండదు అని తన స్కూలు అనుభవాల నుండి గ్రహించింది. తనకు ఏకకాలంలో కులం-వర్గం అనుభవంలోకి వచ్చింది కూడా ఇక్కడే. ఇన్ని సవాళ్లను అధిగమించి, ఉద్యోగం సంపాదిస్తే మరొక రూపంలో మళ్లీ వివక్ష ఎదురవుతుంది.
దళితుల్లో రెండు మూడు తరాలు విద్యావంతులై మధ్యతరగతి వర్గంలోకి వచ్చాక మునుపటిలా కాక వివక్ష చాలా నాజూకుగా ప్రదర్శితమవుతోంది. అది పీడిత కులాల వారి ఉన్నతిని ఓర్వలేనితనంగా బయటపడుతూ ఉంటుంది. బహుషా ఇలా బైట పెట్టుకునేవారే ఈ రోజుల్లో ఇంకా కులం ఎక్కడిది అంటూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఉన్నట్లు లేదని, తమ ఆధిపత్యం తగ్గుతూ వస్తున్నదనే భావన కావచ్చు. ఉద్యోగంలో చేరిన కొత్తలో అటువంటి ఒక క్యారెక్టర్ రచయితకు తారసపడుతుంది. ఈ అనుభవం కలగడం రచయితకు మరొక దశ. నేనీ కథలను పరిచయం చేస్తున్నప్పుడే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు దాడి జరగడం, హర్యానాలో ఒక దళిత ఐపియస్ ఆఫీసర్ ఆత్మహత్య కేసు సంచలన మలుపులు తిరగడం కాకతాళీయం కాదనుకుంటాను. సామాజిక అంతరాల వ్యవస్థలో వైరుధ్యాలు అంతకంతకూ హింసాత్మకం అవుతున్నాయి. దళిత చైతన్యం మార్పును డిమాండ్ చేస్తున్నది. డెబ్భై అయిదేళ్ల రాజ్యాంగంలో అపరిష్కతంగా ఉన్న సమస్య విస్ఫోటనంగా మారే స్థితి వస్తున్నది.
ఒక దళిత స్త్రీగా ఈ పోటీ ప్రపంచంలో బతకడానికి అమ్మ చెప్పినట్లు ‘జ్ఞానమే శక్తి’ అని నమ్మి తన వత్తిలో నైపుణ్యం, పట్టు సాధించి కెరీర్‌లో నిలదొక్కుకోవడంతో సరిపెట్టుకొని ఉంటే అది పూర్తిగా వేరే కథ అయ్యేది. అనూరాధ జ్ఞానం, శక్తి అక్కడి నుండి సామాజిక ఆచరణలోకి విస్తరించాయి. ఈ క్రమంలో ఎన్నో ప్రశ్నలు, ఎంతో అన్వేషణ. వ్యవస్థను మరింత సునిశితంగా అర్థం చేసుకోగలిగలిగే అవకాశం కలిగింది. స్త్రీల వ్యక్తిత్వాలను ఎదగనివ్వకుండా చేసే పితృస్వామిక భావనలు, వాటి పరిధిలోనే ఆమె యోగ్యతలను లెక్కించే ప్రమాణాలు కనిపించని సంకెళ్లలో వారిని బందీలుగా ఉంచుతున్నాయి. అవి స్త్రీలు ఇష్టంగా తగిలించుకునే సంకెళ్లుగా మారిపోయాయి. ఈ సంకలనంలో రెండు కథలు అందం అనే భావన మీద ఉన్నాయి. ఈ రెండు కథలు సీక్వెల్‌గా ఉంటాయి. అదొక ప్రత్యేకత అయితే మొదటి కథ నుండి రెండో కథకు ఒక పురోగమనం కనిపిస్తుంది. అది అందం నుండి ఆత్మవిశ్వాసం వైపు పురోగమించే ఒక స్త్రీ ఇతివత్తం. అందం అంటే ఏమిటి, చర్మం రంగు అందాన్ని నిర్ణయిస్తుందా? తెల్లగా ఉండటం ఎందుకు గొప్ప? అందులోని ఆధిక్యత ఏమిటి? ఆధిపత్యం ఏమిటి? ఈ ప్రశ్నలతో పాటు ప్రేమ-ఆకర్షణ వంటి సహజ భావనలు సంకుచిత ఆధిపత్య భావాల నుండ బైటపడే ఆలోచనా క్రమం మొదలవుతుంది.
పాత కొత్తల మధ్య సంఘర్షణ నుండే ప్రగతిశీల మార్పువైపు సమాజం పురోగమిస్తుంది. సంఘటిత ఉద్యమాలు వ్యవస్థీకత భావజాలంతో చేసే పోరాటం దానికి చోదక శక్తిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో సామాజిక ఆచరణలో ఉండే వ్యక్తులు తప్పని సరిగా తమ మీద తాము పోరాడవలసి వస్తుంది. సమాజం నుండి కుటుంబం నుండి సంక్రమించిన వెనుకబడిన సంప్రదాయ భావాలు చాలా బలీయంగా ఉంటాయి. వాటి మీద నిత్యం పోరాడవలసి ఉంటుంది. నిరంతర సంఘర్షణే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది. ‘ఇంటిని రోజూ శుభ్రం చేయకపోతే దుమ్ము పేరుకుపోతుంది, అలాగే మనస్సులు కూడా దుమ్ము పేరుకుపోవచ్చు, వాటిని ఊడ్చి, కడగడం కూడా అవసరం’ అని మావో అన్నట్లు మనం ఏ తీరుగా ఆలోచిస్తున్నాము ఎటు అడుగులు వేస్తున్నాము అనే స్వీయ విమర్శతో మన ఆలోచనలు, ఆచరణ తుప్పుపట్టకుండా చూసుకోవాలి. అందుకనే ప్రగతిశీల రాజకీయ శిబిరంలోనూ పొడసూపే ఆధిపత్య వర్గ, కుల, పితృస్వామిక భావాల తుప్పు వదలగొట్టేవి కూడా ఈ కథల వరుసలో చాలా అవసరంగా చేర్చారు. ‘అవ్వునా? నువ్వు దళిత్‌వా?’ కథ ఈ క్రమంలోనిదే. స్త్రీలు, దళితులు అనగానే వాళ్లు ఫలానా తీరుగా ఉంటారు అనే స్టీరియోటైప్ ఆలోచనలు, అభిప్రాయాలు కూడా ఆధిపత్య భావాలే. నిన్ను చూస్తే దళిత అమ్మాయిలా అనిపించవే అంటున్నారంటే దళితులు ఎలా ఉండాలో ఒక ముతక రూపం వారి మనసులో ఉన్నట్లు. వేషభాషల గురించి చేసే ఈ వ్యాఖ్యానం ఎదుటివ్యక్తిని అవమానించేలా, గాయపరిచేలా ఉంటుందనే గ్రహింపు కూడా లేకపోవడం పట్ల న్యాయమైన ఆగ్రహం, సునిశిత విమర్శ దళితేతర కార్యకర్తలను అప్రమత్తం చేస్తుంది, తమలోకి తాము తరచి చూసుకునేలా చేస్తుంది. ఇదే టోన్‌లో డీక్లాసిఫై కావడం, డీకాస్టిఫై కావడం (పుట్టిన వర్గాన్ని, కులాన్ని వదులుకోవడం) అంటే కేవలం అలంకారిక ఆదర్శం కాదు అని చెప్పే కథ కూడా ఆలోచింపజేస్తుంది. ఒక వర్గంలో, కులంలో నిరాడంబరంగా ఉండటం కూడా ఒక ప్రివిలేజ్. మరి వదులుకోడానికి అలసలంటూ ఏమీ లేని వాళ్లకు నిరాడంబరత గురించి చెబితే ఎలా ఉంటుంది? తన కథల్లోనే వేరే సందర్భాల్లో చెప్పినట్టు ఉద్యమ ఆచరణ నుండి ‘కొత్త కిటికీ తెరుచుకోవడం’ ఎలా ఉంటుందో పాఠకులు అనుభూతి చెందుతారు.
అలా అనేక కిటికీలు తెరుచుకోవడం, కొత్త వెలుగులు ప్రసరించడం నక్సల్బరీ పోరాటాల ద్వారా ప్రయత్నపూర్వకంగా జరిగిన సృజనాత్మక ఆచరణ. వర్గపోరాటంలో భాగంగా దళిత ఆత్మగౌరవ పోరాటాన్ని విప్లవోద్యమం ఎలా నడిపిందో తెలుసుకోవాలంటే అది దళితవాడల్ని కేంద్రం చేసుకుని పనిచేసిన అనుభవాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిందే. తెలుగు సమాజాల్లో కన్నా కులవివక్ష భయంకరంగా ఉన్న బీహార్‌లో అదొక విలక్షణ సాంస్కతిక పోరాటం కూడా. సంస్కరణ ఉద్యమాలు కూడా ఎరగని ఆ సమాజంలో విప్లవోద్యమం ప్రవేశించి నూతన మానవ విలువలను పాదుగొల్పడానికి అది ఎంతగా మూలాల దాకా వెళ్లి పనిచేయాల్సి వచ్చిందో తెలుసుకుంటే విప్లవం మనకు కొత్తగా అర్థమవుతుంది. పదేళ్లు నిండని పసి పిల్లల మెదళ్లలో కూడా కులం ఇంకిపోయి ఉండడం, దాని విరిట్ రూపమూ, సూక్ష్మ రూపమూ చూసిన అనుభవాన్ని అనూరాధ తన తొలి కథల్లో మనకు పరిచయం చేశారు. అక్కడి నుండి ఆమె ఒక్కో అడుగూ కుల నిర్మూలన వైపుగా, సమస్త ఆధిపత్యాలను ధ్వంసం చేసే వైపుగా సాగింది. వ్యవస్థకు పుట్టిన వికృత శిశువులను చూపించడం తేలికే. నూతన మానవుల పుట్టుక ఎడతెగని ప్రయాస. వదిలించుకోవలసినవి చాలా ఉంటాయి. నేర్చుకోవలసినవి నిరంతరం ఉంటాయి. ఉదాహరణకు నిన్ను నేను ఏమని పిలవాలి? నువ్వు అనాలా, మీరు అనాలా, మిత్రమా అనాలా, కామ్రేడ్ అనాలా? ఊరికే పేరు పెట్టి పిలవాలా? ప్రతిదానికీ ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరు వెనకా ఒక భావన ఉంటుంది. ఆధిపత్యాలూ, వివక్షలూ ఉంటాయి. అవేవీ లేకుండా స్వచ్ఛమైన మానవత మాత్రమే ఉండాలంటే అది ఎక్కడి నుండి మొదలుపెట్టాలి. ఇట్లా కూర్చొని ఆలోచిస్తే సమాధానాలు దొరకవు. కామ్రేడ్ చారుమజుందార్ అనట్టు పనిచేస్తూనే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ మరింత మెరుగ్గా పనిచేయాలి. అటువంటి ప్రయోగాలు విప్లవ కథల్లో మనం చదువుకోవచ్చు. అనూరాధ రెండో దశ కథలు ఆ కోవలోకి వస్తాయి. అగ్రకుల సాయుధ ముఠాలతో నేరుగా తలపడిన విప్లవ పార్టీ కుల వివక్ష రూపుమాపి ప్రతి మనిషికీ ఒకే విలువ అనే భావనను తీసుకొచ్చే ప్రయత్నం, ఆ అనుభవాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఆదివాసీ సమాజంలో విప్లవోద్యమం తీసుకొచ్చిన ప్రగతిశీల మార్పులు మరెన్నో. అక్కడి స్త్రీ విముక్తి పోరాటాలు ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి చారిత్రిక నమూనా. ఉదాహరణకు అమ్మాయిని ఎత్తుకునిపోయి పెళ్లిచేసుకోవడం కొన్ని తరాలుగా ఉండిన ఆచారం. దాన్ని రద్దు చేస్తుంది విప్లవోద్యమం. సరిగ్గా దీనికి విరుద్ధంగా పాత సంప్రదాయాలను తిరిగి తోసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సంఘపరివారం. వర్గపోరాటంలో భాగంగా సాంస్కృతిక పోరాటం దానితో తలపడటం ఒక రోమాంచిక పోరాట కథ. ప్రస్తుతం కగార్ యుద్ధంలో రక్తమోడుతున్న ఈ సాంస్కృతికోద్యమ చరిత్రకు నలభై ఏళ్లు. బహుశా ఇటువంటి అనుభవాలు మరెన్నో కథలు కాగలిగేవి కానీ అనూరాధను జైలు ఆవరించేసింది. అయితే అది విప్లవ కథలకు వినూత్న కొనసాగింపు అయింది. అదే సృజనాత్మక ఆచరణ. చోటు మారింది.
జైలులో మినీ భారతదేశాన్ని చూశారు రచయిత. అక్కడి నుండి కథల్లో గొప్ప పరిణతి కనిపిస్తుంది. స్వీయ అనుభవాల దగ్గర మొదలై ఒక సంక్షుభిత కాలాన్ని సాంద్రమైన సామాజిక అనుభవాల నుండి పట్టుకోవడం రచయిత జైలులో సాధించారనిపిస్తుంది. నిజానికి జైలు వ్యక్తిని కుటుంబం నుండి, సమాజం నుండి, ఉత్పత్తి కార్యకలాపం నుండి వేరు చేస్తుంది. కానీ ఉద్యమకారులు తమ సామాజిక జీవితాన్ని జైలులో సరికొత్తగా మలచుకుంటారు. ఆ ఇరుకైన ప్రపంచంలో అన్నీ వ్యవస్థ కాఠిన్యం కింద నలిగిన జీవితాలే. ముట్టుకుంటే మరెక్కడా చూడని దట్టమైన మానవ భావోద్వేగాలు పెల్లుబుకుతాయి. ఈ సంకలనంలో ప్రత్యేకించి చెప్పుకోవలసిన కథలు ‘నేరం నాది కాదు’, ‘డిటెన్యూ’, ‘మర్యాదస్తులు’. జైలు అనే భౌగోళిక ఆవరణ నుండి భారత సమాజపు లోతులను పరిశీలించగలిగే గొప్ప కాల్పనిక ప్రయోగాలు. బహుషా అట్టడుగు మహిళల జీవితం నుండి ఒక మహిళ రాసిన ఇటువంటి జైలు కథలు భారతీయ సాహిత్యంలో మరేవీ ఉండకపోవచ్చు. వ్యవస్థ ఎంత అమానవీయంగా ఉంటుందో జైలు అంతకన్నా అమానవీయం. గర్భవతిగా ఉన్న జితిని జైలు ఆసుపత్రిలో ఆకలికి తట్టుకోలేక పారిపోతుంది (నేరం నాది కాదు). బైట సమాజంలో బతకలేని, జైల్లోనూ ఉండలేని దైన్యం జితినిది. ఏ నేరానికి ఎవరు కారణమో, ఎవరు శిక్ష అనుభవిస్తున్నారో ఏ న్యాయసూత్రాలూ చెప్పవు. అందుబట్టని హింసకు జితిని కడుపులోని బిడ్డ కూడా బాధితయే. అంతం లేని బందిఖానాలో ఊపిరిపోసుకునే బిడ్డలు పుట్టుకతోనే ఖైదీలు. దోపిడి పీడనలకు జైళ్లు ఒక ఎక్స్ టెన్షెన్. అవి దోపిడి దొరలకు అదనపు అంగాలు గానీ నేరస్తులను శిక్షించేవో, సంస్కరించేవో కాదు. మన ఎత్తైన న్యాయపీఠాలు ఎంత ఆలంకారికమైనవో, ఎంత డొల్లవో ‘డిటెన్యూ’ కథ శక్తివంతంగా ఆవిష్కరిస్తుంది.
‘మర్యాదస్తులు’ కథలో దొంగా పోలీస్ ఆట రసవత్తరంగా ఉంటుంది. నాకు రావిశాస్త్రి ‘మాయ’ కథ గుర్తొచ్చింది. అక్కడ ముత్తేలమ్మ, ఇక్కడ కాజల్ మనకు సూక్ష్మం విప్పి చెబుతారు. కాజల్ ఇంకాస్త ముందుకుపోయి మేం మాత్రమేనా దొంగలం అంటుంది. “నిజమే మేము చోరీ చేస్తాం, కానీ ఆ మాల్ మేం ఒక్కళ్లమే తింటున్నామా? ఇంత చేస్తే కడుపుకి ఇంత తినటం, పిల్లలకి పెట్టటమే కష్టం.. పోలీసులు, లాయర్లు.. తినడం ఇంతమంది తింటున్నారు. దొంగ అని మమ్మల్ని మాత్రమే అంటారు. మాకు యూనిఫాం లేదు కదా..”
కాబట్టి ఎవరు నేరస్తులు అంటే పైన చెప్పిన అట్టడుగు కులాల వర్గాల ప్రజలు. ప్రయత్నపూర్వకంగా ముస్లింలను నేరస్తులను చేసే కథ ‘బలి’ కూడా ఈ వరుసలో ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం ఒక సమూహం మొత్తం ఎలా లక్ష్యం అయిందో ఇప్పుడు నడుస్తున్న చరిత్రే. తక్కిన సమూహంలో అంధభక్తులుగా మిగిలిపోకుండా ఆలోచనాపరులు కావడం కూడా నేరమే. సామాజిక కార్యకర్తల మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల కేసులు, ఇళ్లలో సోదాలు, అరెస్టులు ఇటీవలి కాలంలో మామూలైపోయింది. ఒక భిన్నమైన ఆలోచన, ఒక రచన, ఒక అభిప్రాయం, ఒక భిన్నమైన జీవన శైలి -రాజ్యానికి ఇవన్నీ అనుమానించే విషయాలే అయిపోయాయి. తన అనుభవంలోకి వచ్చిన ఒక సోదా, దర్యాప్తు అధికారుల విసుగుపుట్టించే ప్రశ్నలు, వాటి వెనక అంతరార్థం ఏమిటి అనే విషయంలో కూడా ఒక కిటికీ తెరుచుకుంటుంది. ఒక ఆలోచనే రాజ్యానికి ప్రమాదకరంగా అనిపిస్తే అది నిస్సందేహంగా సరైన ఆలోచనే. పై చిక్కులన్నీ విప్పడానికి ఎంతోకొంత పనికొచ్చేదే. ఈ కథలన్నీ వాటిలో భాగమే.




