జగదీష్ హంస్దాకు తను పెరిగిన గ్రామం గురించి అస్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
“అప్పట్లో అక్కడ మేము ఆదివాసీలం, మా పొలాలు, అడవులు, వన్యప్రాణులు తప్ప ఇంకేమీ ఉండేవి కావు,” అని ఇప్పుడు డెబ్బై ఏళ్ల చివరలో ఉన్న హంస్దా చెప్పారు. అప్పటి బీహార్‌లో ఉన్న ఆ ఝింజిర్‌గుట్టు గ్రామం, ఇప్పుడు జార్ఖండ్ పరిధిలోకి వస్తుంది. “మాతో పాటు కొంతమంది మూలవాసీ సముదాయాల వారు కూడా నివసించేవారు,” అని హంస్దా జోడించారు, ఆ ప్రాంతానికి చెందిన తక్కువ కులాలకు చెందిన సముదాయాలను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు.
1950ల చివరలో బీహార్ ప్రభుత్వం చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి అక్కడి నివాసితులను ఖాళీ చేయించడంతో హంస్దా చిన్ననాటి గ్రామం ఈరోజు ఉనికిలో లేదు. ప్రస్తుతం జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో ఉన్న ఈ పవర్ స్టేషన్, చంద్రపురలో 1,800 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, అందులో సుమారు 1,200 ఎకరాలను స్థానికుల నుండి సేకరించారు.
డిసెంబర్ 13 సాయంత్రం, నేను చంద్రపుర పట్టణంలోని ఒక టీ దుకాణం దగ్గర జగదీష్‌ను, అతని స్నేహితులను కలిసాను. మేము టీ తాగుతున్నప్పుడు మా చుట్టూ పల్చని పొగమంచు అలుముకుంది. వెనక ఉన్న చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన ఎరుపు-తెలుపు రంగు చిమ్నీ మాపైన నీడలా కనిపిస్తోంది; చీకటిలో అది అప్పుడప్పుడు ఎర్రటి కాంతిని వెదజల్లుతోంది.
“మేము 1959లో నిరాశ్రయులమయ్యాము,” అని హంస్దా చెప్పారు. ” భయపడిపోయిన గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడం నాకు గుర్తుంది.”
“సర్కార్ వస్తోంది”) అని గ్రామస్థులు చెప్పుకునేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. “చివరికి ప్లాంట్ వచ్చినప్పుడు, మేమంతా అటూ ఇటూ చెల్లాచెదురైపోయాము,” అని ఆయన అన్నారు.
నేడు, హంస్దా తన అసలు ఇంటి పేరుతోనే ఉన్న ఒక అనధికారిక నివాస ప్రాంతంలో ఉంటున్నారు; ఇక్కడ ఇతర నిర్వాసిత కుటుంబాలు కూడా పునరావాసం పొందాయి. కానీ ఆయన జ్ఞాపకాల్లో ఉన్న పచ్చని పొలాల మధ్య ఉన్న అందమైన గ్రామంలా కాకుండా, ప్రస్తుత ఝింజిర్‌గుట్టు బొగ్గు బూడిద (ఫ్లై యాష్)తో నిండిన తాత్కాలిక ఇళ్లతో కూడిన ఒక చిన్న సెటిల్‌మెంట్‌గా మారింది.
హంస్దా వంటి గాథలు బొకారో అంతటా సాధారణం. చంద్రపుర ప్లాంట్ నిర్మాణం 1959లో ప్రారంభమైంది. 1964 నాటికి దానిలోని రెండు యూనిట్లు పని చేయడం ప్రారంభించాయి. స్వతంత్ర భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ప్రధాన బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లలో ఇది ఒకటి. దీనిని 1948లో భారత ప్రభుత్వం స్థాపించిన బహుళార్థసాధక నదీ లోయ ప్రాజెక్ట్ అయిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) నిర్మించింది.
థర్మల్ పవర్ స్టేషన్ చిమ్నీ
ప్రస్తుతం, దాని 2024-25 వార్షిక నివేదిక ప్రకారం, ఈ కార్పొరేషన్‌కు మొత్తం ఆరు థర్మల్ ప్లాంట్లు, మూడు హైడల్ స్టేషన్లు, బహుళ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి మొత్తం 6,715 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఎనిమిది రాష్ట్రాలకు విద్యుత్తును అందిస్తుంది. అదే సంవత్సరంలో, ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని గృహ, పారిశ్రామిక వినియోగదారులకు రోజుకు 844.56 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా సరఫరా చేసింది.
సామాజిక శాస్త్రవేత్త టి.ఎన్. భల్లా 1969లో ప్రచురించిన తన పరిశోధనలో, ఈ కార్పొరేషన్ 1894 భూసేకరణ చట్టం కింద ప్రజలకు పునరావాసం కల్పించిందని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం, ప్రాజెక్ట్ కోసం భూమిని ఇచ్చిన వారు నగదు పరిహారం లేదా మరొక భూమిని ఎంచుకోవచ్చు; ఒకవేళ వారు ఇల్లు కోల్పోతే, దానికి బదులుగా కొత్త ఇల్లు పొందే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా, కంపెనీ నిర్వాసితులకు కేవలం బంజరు భూములను లేదా వారి గ్రామాలకు దూరంగా ఉన్న భూములను మాత్రమే ఇవ్వగలిగింది. భూసేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడటానికి, భూమికి బదులుగా నగదు పరిహారం ఎంచుకోవాలని కంపెనీ ప్రజలను ప్రోత్సహించిందని భల్లా గమనించారు.
చంద్రపురలోని ఏ నిర్వాసిత కుటుంబమూ కూడా “భూమికి బదులు భూమి లేదా ఇంటికి బదులు ఇల్లు” అడగలేదని, అందుకే వారందరికీ నగదు రూపంలో పరిహారం చెల్లించామని చెప్పడంలో 1966లో ప్రచురితమైన కంపెనీ నివేదికలో ఇది ప్రతిబింబిస్తుంది.
అయితే, హంస్దా, చంద్రపురలోని ఇతరులు చెప్పినదాన్నిబట్టి చూస్తే ఈ ప్రక్రియ ఎంతమాత్రం న్యాయంగా జరగలేదని సూచిస్తున్నాయి.
నిర్వాసితులైన ఆదివాసీల నుండి ముందస్తు సమాచారంతో కూడిన సమ్మతి (ఇన్‌ఫార్మ్డ్ కన్సెంట్) తీసుకోలేదని హంస్దా అన్నారు. అంటే, వారికి వివిధ ఎంపికలను పరిశీలించి, వాటిలోని నష్టాలను బేరీజు వేసుకునే అవకాశం ఇవ్వలేదని అర్థం. “మా పూర్వీకులు పేదవారు, నిరక్షరాస్యులు; ఏం జరగబోతోందో దాని పరిణామాలను డివిసి అధికారులు వారికి వివరించలేదు” అని హంస్దా చెప్పారు. “వారికి కేవలం కొంత నగదు ఇచ్చారు, అది కూడా చాలా తక్కువ మొత్తం. వేరే చోట భూమి కొనడానికి అది సరిపోలేదు.”
చాలా సందర్భాల్లో, డబ్బును కంపెనీ నుండి ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసారు కానీ, అక్కడి నుండి నిర్వాసితులకు అందలేదని ఆయన అన్నారు. “డబ్బు ఖజానాలోనే ఉందని, భవిష్యత్తులో ఆ డబ్బును పొందేందుకు ప్రయత్నించాలని మా తాత మాకు చెప్పారు,” అని ఆయన అన్నారు. “కానీ ఆ డబ్బును ఎలా పొందాలో మా తల్లిదండ్రులకు తెలియదు, అలా కాలం గడిచిపోయింది.”
1960లలో ఏర్పాటు చేసిన మొదటి సెట్ థర్మల్ పవర్ యూనిట్లు 2017 నాటికి మూతపడ్డాయి. 2025 ఫిబ్రవరిలో, చంద్రపురలో కోల్ ఇండియాతో కలిసి 1600 మెగావాట్ల కొత్త సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను (సిటిపిఎస్) ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. “మూడవ సెట్ పవర్ ప్లాంట్లు నిర్మించబోతున్నారు,” అని సామాజిక కార్యకర్త అర్షాల్ మరాండి అన్నారు, ఈయన తాతమ్మలు 1960లలో ప్లాంట్ కోసం నిర్వాసితులయ్యారు. “కానీ సిటిపిఎస్ కోసం మొదటగా నిరాశ్రయులైన మేము (ఆదివాసీలం), మాకు రావలసిన హక్కులను ఇంకా పొందలేదు.”
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1948లో స్థాపితమైన ఒక ప్రభుత్వ సంస్థ. దీనిని ఏర్పాటు చేయడంలో భారతీయ నాయకులు అమెరికాలోని టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ (టివిఎ) నుండి స్ఫూర్తి పొందారు. టెన్నెస్సీ నదీ లోయలో వరదలను తగ్గించడం, దేశానికి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఆ సంస్థ లక్ష్యం.
ఈ కంపెనీ నిర్మించిన ఆనకట్టలు, ప్లాంట్లు స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో కొన్ని. జవహర్‌లాల్ నెహ్రూ వీటిని “ఆధునిక భారతదేశ దేవాలయాలు” అని పిలిచారు; ఇవి స్వాతంత్ర్యం తర్వాత దేశాభివృద్ధికి అత్యంత అవసరమని ఆయన భావించారు. ఇటువంటి ప్రాజెక్టులు “దేశాన్ని ముందుకు నడిపించడానికి”, అలాగే “దేశాన్ని బలోపేతం చేయడానికి”, “ప్రజల పేదరికాన్ని తొలగించడానికి” సహాయపడతాయని ఆయన చెప్పారు.
దామోదర్ నదిపై వరదలను నియంత్రించడంతో పాటు, దేశానికి విద్యుత్తును అందించడం, దామోదర్ వ్యాలీ ప్రాంతంలో సాగునీటిని సరఫరా చేయడం ఈ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాలను దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చట్టం-1948లో పొందుపరిచారు. ఈ చట్టం “దామోదర్ వ్యాలీ మరియు దాని కార్యకలాపాల ప్రాంతంలో ప్రజారోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక, సాధారణ శ్రేయస్సును పెంపొందించడం”; “అడవుల పెంపకం; భూసార క్షీణతను నియంత్రించడం” వంటి ఇతర ఉద్దేశాలను కూడా పేర్కొంది.
బొకారోలో బొగ్గును తీసుకెళ్తున్న గూద్సు రైలు
ప్రాజెక్ట్ ప్రారంభంలోనే, దీని వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ఆదివాసీ సముదాయాలకు ఈ ప్రాజెక్ట్ ప్రయోజనం చేకూర్చడం అత్యవసరమని సముదాయ నాయకులు వాదించారు.
1948 ఫిబ్రవరి 14న రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఈ చట్టం గురించి చర్చ జరిగింది. నిర్వాసితులయ్యే ఆదివాసీల తరపున మాట్లాడుతూ, జైపాల్ సింగ్ ముండా ఈ కార్పొరేషన్ ప్రాజెక్టులు “భారీ, సాహసోపేతమైనవి” అని, అలాగే “భారతదేశం అంతటా భవిష్యత్తులో చేపట్టే నదీ ప్రాజెక్టులకు ఇవి ఒక నమూనాగా” నిలుస్తాయని పేర్కొన్నారు. అయితే, నిర్వాసితులైన ఆదివాసీలకు కేవలం భూమి, ఇళ్లు మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువే దక్కాలని ఆయన వాదించారు. “మేము వారికి మెరుగైన ఇళ్లను ఇవ్వబోతున్నామని చెప్పడంలో అర్థం లేదు,” అని ఆయన అన్నారు.
“మీరు వారికి వారి ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారా? అనేది నిజంగా ముఖ్యమైన విషయం. భారతదేశ జాతీయ జీవితంలో గౌరవప్రదమైన స్థానం కలిగిన దేశభక్తులుగా, వారు తమ వంతు సహకారాన్ని అందించేలా ఒక జీవన విధానాన్ని వారికి కల్పిస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.
దశాబ్దాల తర్వాత, క్షేత్రస్థాయిలో ‘స్క్రోల్’ తో మాట్లాడిన మెజారిటీ ప్రజలు తమను ఈ ప్రాజెక్ట్ నుండి వెలివేసారని, పైగా దాని ద్వారా అణచివేతకు గురయ్యామని పేర్కొన్నారు. నిజానికి, ఈ కార్పొరేషన్ తన పనితీరు ప్రారంభించిన తొలి రోజుల్లోనే తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంది. ఉద్యోగాల కోసం, రోడ్లు, నీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాల కోసం గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు అనేకసార్లు నిరసనలు చేపట్టారని హంస్దా వివరించారు.
1970ల మధ్యకాలంలో, ఈ ఒత్తిడికి స్పందిస్తూ కంపెనీ ఒక “నిర్వాసితుల జాబితా”ను రూపొందించింది. రెండు ఆనకట్టలు, రెండు పవర్ స్టేషన్ల నిర్మాణం కారణంగా నిర్వాసితులైన 701 మందితో ఈ జాబితాను తయారు చేశారు; వీరికి కంపెనీలో ఉద్యోగం పొందే అర్హత ఉంటుంది. కానీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 1990ల మధ్యకాలం వరకు ఆ జాబితాలోని కేవలం 64 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.
దీనికి సమాంతరంగా, 1992లో చంద్రపుర థర్మల్ పవర్ స్టేషన్‌తో సహా కార్పొరేషన్‌కు చెందిన వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన 91 మంది వ్యక్తుల బృందం (వీరిలో 87 మంది అసలు జాబితాలో లేరు) తమకు కంపెనీలో ఉద్యోగాలు కావాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. కోల్‌కతా హైకోర్టు నిర్వాసితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది, అయితే కంపెనీ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
1992లో సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ, పిటిషనర్లందరికీ ఉద్యోగాలు కల్పించాలని కంపెనీని ఆదేశించింది.
నిర్వాసితుల నిరసన ప్రదర్శన పోస్టర్
2011 డిసెంబర్‌లో, ఈ విషయానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల గురించి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అప్పటి విద్యుత్ శాఖ సహాయ మంత్రి కె.సి. వేణుగోపాల్ స్పందిస్తూ… మొదట ఉద్యోగాలు పొందిన 64 మంది కాకుండా, 1992 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కంపెనీ మరో 129 మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. అంతేకాకుండా, జాబితాలోని మరో 44 మంది “ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని”, 458 మంది అభ్యర్థులకు ఉద్యోగానికి బదులుగా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ అధికారిక గణాంకాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సామాజిక కార్యకర్తలు వాదించారు. “నిర్వాసితులై ఎటువంటి పరిహారం లేదా ఉద్యోగాలు పొందని వారు ఇంకా చాలా మంది ఉన్నారు,” అని సామాజిక కార్యకర్త నారాయణ మరాండి అన్నారు. “కానీ కోర్టుల్లో తమ కేసును పోరాడేంత స్తోమత ఆ పేదలకు లేదు.”
స్థానిక వర్గాల పట్ల తన బాధ్యతలను నెరవేర్చలేదనే విమర్శలపైన ప్రతిస్పందన కోరుతూ ‘స్క్రోల్’ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌కు ఈమెయిల్ పంపింది. కంపెనీ స్పందిస్తే ఈ కథనం అప్‌డేట్ చేస్తాం.
నేడు, చంద్రపుర ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఆదివాసీలు తమ పూర్వీకులు నిర్వాసితులైన దశాబ్దాల తర్వాత కూడా అస్థిరమైన జీవితాన్ని గడుపుతున్నారు. చంద్రపుర పట్టణం, పవర్ స్టేషన్ శివార్లలో సుమారు ఏడు ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి.
అర్షాల్‌తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే—భూర్సాబాద్, నీర్ పిప్రాడి, రాజబేరా, బురుదిహ్ అనే నాలుగు గ్రామాల నివాసితులు తమ అసలు నివాసాల నుండి నిర్వాసితులయ్యారు, కానీ వారిలో చాలా మందికి తమ గ్రామాల పక్కనే భూమి ఉండటంతో అక్కడ తిరిగి స్థిరపడగలిగారు.
కానీ నేను టిఎస్‌సి బస్తీ, జర్నాడిహ్, ఝంజిర్‌గుట్టు గ్రామాలకు చెందిన నాయకులను, ఇతరులను కలిసినప్పుడు, వారు ప్లాంట్ తమ ఇళ్లను తీసుకున్న సమయంలో తమకు సమీపంలో ఎటువంటి భూమి లేదని, అందుకే పూర్తిగా కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తాము పునరావాసం పొందిన భూమి తమదేనని తెలిపే ఎటువంటి ప్రభుత్వ పత్రాలు అక్కడి నివాసితుల దగ్గర లేవు.
ప్లాంట్ సిబ్బంది కోసం కేటాయించిన అధికారిక గృహాలను కార్పొరేషన్ అధికారులకు లంచాలు ఇచ్చి ఉద్యోగులు కాని వారు కూడా సర్వసాధారణంగా వాడుకుంటున్నారని, అయినప్పటికీ తాము మాత్రం ఇప్పటికీ అనిశ్చితిలోనే బతుకుతున్నామని స్థానికులు పేర్కొన్నారు.
చంద్రపుర ప్లాంట్ చుట్టూ ‘డివిసి కాలనీ’ ఉంది. ఇది వివిధ శ్రేణులకు చెందిన సిబ్బంది కోసం నిర్మించిన గృహాల సముదాయం. 1960లలో నిర్మించిన ఈ క్వార్టర్లలో చాలా వరకు దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు (చేరుకున్నాయి. వాటిలో నివసించడం సురక్షితం కాదని నోటీసులు కూడా అంటించారు. అయినప్పటికీ, ఉద్యోగులు వాటిలోనే నివసిస్తున్నారు.
శిధిలావస్థలో ఉన్న డివిసి స్టాఫ్ క్వార్టర్లు
మరికొన్ని సందర్భాల్లో, ఉద్యోగులు లేదా వారి కుటుంబాలు కార్పొరేషన్ నుండి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా క్వార్టర్లను ఖాళీ చేయలేదు.
“మా నాన్న ఐదేళ్ల క్రితం చనిపోయారు, కానీ ఇక్కడి నుండి బొకారోకు ప్రయాణించడం సౌకర్యంగా ఉండటంతో మేము ఇక్కడే నివసిస్తున్నాము,” అని అటువంటి శిథిలమైన క్వార్టర్‌లో ఉంటున్న జేవియర్ హెరంజ్ చెప్పారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, “ఇక్కడకు వచ్చి చేరిన ఇతరులు ప్లాంట్ చుట్టుపక్కల దుకాణాలు నడుపుతున్నారు, రిక్షాలు తొక్కుతున్నారు లేదా ఇతర పనులు చేసుకుంటున్నారు.”
అధికారిక గృహాల వినియోగానికి సంబంధించిన ఈ ఆరోపణలపై ‘స్క్రోల్’ అడిగిన వివరణకు కంపెనీ స్పందించలేదు.
అటువంటి అనేక కుటుంబాలు ఈ అధికారిక క్వార్టర్లలో నివాసం పొందగలిగినప్పటికీ, “నిర్వాసితులైన ఆదివాసీలకు మాత్రం అక్కడ చోటు దక్కడం గగనమైపోయింది” అని అర్షల్ పేర్కొన్నారు. ఆయన వివరించినట్లుగా, మెజారిటీ ఆదివాసీ గ్రామాలు ఈ క్వార్టర్లకు ఆనుకుని ఉన్న అంచు భూముల్లోనే ఉన్నాయి.
పరిపాలనా యంత్రాంగ పదవుల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రముఖులకు కూడా సురక్షితమైన నివాసం ఇంకా అందనంత దూరంలోనే ఉంది.
థర్మల్ పవర్ స్టేషన్‌కు దక్షిణంగా కొన్ని మీటర్ల దూరంలో, ఒక వెడల్పాటి రహదారి చిన్న కొండపైకి వెళ్తుంది. దానికి ఎడమ వైపున కంపెనీకి చెందిన పరిపాలనా యంత్రాంగ సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి—అవి పసుపు రంగులో, మెరుగైన స్థితిలో, వరుసగా ఉన్న చెట్లతో శుభ్రంగా కనిపిస్తాయి.
కుడి వైపున వాలుగా ఉన్న భూమిలో కొన్ని మట్టి ఇళ్లు, మరికొన్ని కాంక్రీట్ ఇళ్లతో కూడిన ఒక పెద్ద అనధికారిక నివాస ప్రాంతమైన జర్నాడిహ్ ఉంది.. ఈ రెండు ప్రాంతాలు రంగమతి సౌత్ పంచాయితీ పరిధిలోకి వస్తాయి. డిసెంబర్ 12న, నేను ఆ పంచాయితీ ముఖియా (సర్పంచ్) అయిన సామాజిక కార్యకర్త నారాయణ మరాండిని కలవడానికి ఆ రహదారిపై వెళ్లాను. ఆయన ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఒక టీ దుకాణం వద్ద ఆగాను.
“ఈ పంచాయితీ ముఖియా ఆదివాసీ కాబట్టి ఆయన మరికొంత దూరంలో కుడివైపున ఉన్న బస్తీలో నివసిస్తారు,” అని ఒక వ్యక్తి నాకు చెప్పారు. నేను నారాయణ ఇంటికి చేరుకున్నప్పుడు, ఆయన తన ఇంటికి కొన్ని మరమ్మతులు చేయిస్తూ కనిపించారు—ఆ భూమిపై ఆయనకు ఉన్న హక్కులు ఇంకా అస్థిరంగానే ఉన్న నేపథ్యంలో, ఇల్లు బాగుచేయించుకోవాలనే ఆయన నిర్ణయం కొంత పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది.
జార్‌నాడీ గ్రామంలో ఆదివాసుల ఇళ్లకు పట్టాలు లేవు
సమస్య కేవలం భూమి యాజమాన్యానికి సంబంధించినది మాత్రమే కాదు – ఇటీవలి సంవత్సరాలలో, ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయపడే ప్రభుత్వ పథకాల కింద తమకు రావలసిన ప్రయోజనాలను పొందడానికి కూడా గ్రామస్థులు తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది.
1980ల వరకు, జర్నాడిహ్ నివాసితులు ఇళ్ల నిర్మాణానికి గ్రాంట్లు అందించే ‘ఇందిరా ఆవాస్ యోజన’ వినియోగించుకోగలిగారని నారాయణ పేర్కొన్నారు. అయితే, ఇటీవలే 2020లో, రాష్ట్ర ప్రభుత్వ ‘అబువా ఆవాస్ యోజన’ కింద ఇళ్లు నిర్మించుకోవడానికి నిధుల కోసం పలువురు గ్రామస్థులు దరఖాస్తు చేసుకొంటే, వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ పథకాన్ని పొందాలంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుండి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (అభ్యంతరం లేదు – ఎన్ఓసి) సమర్పించాలని వారిని కోరారు. “డివిసి నుండి ఎన్ఓసి పొందడం అసాధ్యం. మేము అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాము, కానీ వారికి మా కోసం సమయం లేదు” అని నారాయణ అన్నారు.
అన్ని రకాల పత్రాలను సేకరించడంలో ఎదురవుతున్న ఈ ఇబ్బందులు మెజారిటీ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
“మేము ఎన్ఓసిలు పొందలేకపోతున్నామనే వాస్తవం మాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది – మా పూర్వీకులు థర్మల్ ప్లాంట్ కోసం భూమిని ఇచ్చినప్పటికీ, ఈ రోజు మేము నివసిస్తున్న భూమి మాది కాదు,” అని జర్నాడిహ్ నివాసి రమేష్ సోరెన్ అన్నారు. “మమ్మల్ని ఇక్కడి నుండి ఎప్పుడైనా ఖాళీ చేయించవచ్చు.”
ఝింజిర్‌గుట్టు గ్రామానికి చెందిన గ్రామస్థులు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వారి గ్రామం 1959లో పూర్తిగా నిర్వాసితమైంది; ప్రస్తుతం వారు నివసిస్తున్న సెటిల్‌మెంట్ ప్రభుత్వ భూమిపైన ఉంది; దీనికి సంబంధించి గ్రామస్థుల వద్ద ఎటువంటి పత్రాలు లేవు. “ఒకవేళ మా పూర్వీకులకు వేరే భూమిని కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బు ఇచ్చి ఉంటే, వారు స్థిరపడటానికి ఈ భూమిని కొనుగోలు చేసేవారు కదా?” అని అక్కడి నివాసి సంజయ్ హెంబ్రోమ్ ప్రశ్నించారు.
గ్రామస్తులెవరిదగ్గరా ఇంటిపత్రాలు లేవని సంజయ్ హేంబ్రామ్ అన్నారు
ఆదివాసీ గ్రామాల నివాసితులు నీరు, విద్యుత్తు వంటి కనీస పౌర సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. “విద్యుత్తు, నీటిని కూడా దొంగిలించాల్సిన పరిస్థితి ఉంది,” అని సామాజిక కార్యకర్త శశికాంత్ హెంబ్రోమ్ అన్నారు.
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 1980ల నుండి “సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని” నిర్వహిస్తున్నప్పటికీ, ఇది తర్వాత దాని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కార్యక్రమాలతో కలిసిపోయినప్పటికీ పరిస్థితి ఇలాగే ఉంది.
చంద్రపుర ప్లాంట్ చుట్టూ ఉన్న ఆదివాసీ గ్రామాలతో సహా 52 గ్రామాలలో తాము పని చేస్తున్నట్లు తన 2021-22 కార్పొరేట్ సామాజిక బాధ్యత నివేదికలో కంపెనీ పేర్కొంది. “డివిసి ప్రధాన ప్రాజెక్టులకు 10 కిలోమీటర్ల పరిధిలో నివసించే సముదాయాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం”; ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమైన వారి “జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేయడం” తమ లక్ష్యాలని కంపెనీ తెలిపింది.
కానీ వారి ప్రయత్నాలు అసంబద్ధంగానూ, అస్థిరంగానూ ఉన్నాయని నివాసితులు చెప్పారు. కొన్ని గ్రామాలలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం, స్కూల్ బ్యాగులు, క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం వంటి కొన్ని చర్యలను కార్పొరేషన్ చేపట్టిందని శశికాంత్ గమనించారు. ” సిఎస్‌ఆర్ ప్రచారం కోసం” ఈ పనులను గొప్పగా ప్రదర్శిస్తున్నారని, కానీ “మాకు కనీస సదుపాయాలను కల్పించడానికి మాత్రం ఆ డబ్బును ఖర్చు చేయరు” అని ఆయన అన్నారు.
1980లలో కంపెనీ తన సామాజిక బాధ్యత కార్యక్రమం కింద దత్తత తీసుకున్న భూర్సాబాద్ నివాసితులు కూడా ఈ కార్యక్రమం వల్ల తమకు కలిగిన ప్రయోజనాలు తక్కువేనని చెప్పారు. “మాకు దాని వల్ల దక్కిందల్లా ఒక బోర్డు మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు” అని అర్షల్ అన్నారు. “అప్పట్లో వారు ఒక పక్కా (సిమెంటు) రోడ్డు వేశారని విన్నాను, కానీ గత నలభై ఏళ్లలో దానికి ఎప్పుడూ మరమ్మతులు చేయలేదు. ఇక్కడి రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, ఎన్నో ఏళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నేను నా డిగ్రీ కోసం రాంచీకి వెళ్ళినప్పుడు మాత్రమే కొత్త పక్కా రోడ్డును చూడగలిగాను.”
గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా చేసిన ఆందోళనల తర్వాత, సుమారు ఐదేళ్ల క్రితం కార్పొరేషన్ కొన్ని పబ్లిక్ టాప్‌లను (నల్లాలు) ఏర్పాటు చేసిందని అర్షల్ గుర్తు చేసుకున్నారు. అయితే నీరు ప్రతిరోజూ కొన్ని గంటలు మాత్రమే, అది కూడా చాలా సన్నగా వస్తుందని ఆయన అన్నారు. దీనివల్ల చాలా మంది బావులు వాడుతున్నారు లేదా చేతి పంపుల కోసం గ్రామం వెలుపలికి వెళ్తున్నారు. “కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి, వాటికి క్రమం తప్పకుండా విద్యుత్తు, నీటి సరఫరా అందుతుంది. కానీ ఆ సదుపాయాన్ని మాకు మాత్రం పొడిగించలేదు” అని ఆయన అన్నారు.
జర్నాడిహ్‌లో, కార్పొరేషన్ కొన్ని ఏళ్ల క్రితం సెటిల్‌మెంట్‌లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసిందని, కానీ తర్వాత విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని రమేష్ సోరెన్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి, గ్రామస్థులు సమీపంలోని పవర్ లైన్ల నుండి విద్యుత్తును దొంగిలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బురుదిహ్ నివాసి శశికాంత్ మాట్లాడుతూ… కార్పొరేషన్ తన సిఎస్‌ఆర్ కార్యకలాపాలలో భాగంగా కొన్ని ఏళ్ల క్రితం ట్యూబ్‌వెల్‌తో కూడిన నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. కానీ కొన్ని ఏళ్లలోనే ఆ ట్యూబ్‌వెల్ పనిచేయడం ఆగిపోయింది; ఆ తర్వాత గ్రామస్థులు తమ దారి తాము చూసుకోవాల్సి వచ్చింది. “మా వాళ్లలో చాలా మంది ప్రతిరోజూ జెర్రీ క్యాన్లు పట్టుకుని నీటి కోసం పబ్లిక్ హ్యాండ్ పంప్‌ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది” అని ఆయన అన్నారు.
నిర్వాసితుల పునర్వసతి ప్రాంతం – కానీ కనీస సౌకర్యాలు లేవు
చంద్రపుర కోసం కార్పొరేషన్‌కు చెందిన సిఎస్‌ఆర్ వింగ్‌తో కలిసి పనిచేసే స్థానిక కమిటీలో అర్షల్ ఇటీవల చేరారు. “ఆ టీమ్‌లో ఉన్న మొదటి స్థానిక ఆదివాసీని నేనే,” అని ఆయన చెప్పారు. “ఇన్నేళ్లలో, ఆ బోర్డులో ఒక్క ఆదివాసీ కూడా లేరు. మరి మా అవసరాలకు ప్రాతినిధ్యం వహించింది ఎవరు?”
ఈ ప్రాంతంలోని ఆదివాసీ సముదాయాలు తమ ప్రాథమిక హక్కులు మరియు అర్హతల కోసం పోరాడుతున్నప్పటికీ, అత్యున్నత స్థాయిలలో మాత్రం—బొగ్గు ఆధారిత ఇంధనంపై ఆధారపడటాన్ని వీడి, ఈ రంగంపై ఆధారపడిన వారికి ఒక “న్యాయబద్ధమైన పరివర్తన” కల్పించే దిశగా సాగడం ఎంతవరకు సాధ్యమో అంచనా వేసే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని సంజయ్ హెంబ్రోమ్ పేర్కొన్నారు.
2022లో, జార్ఖండ్ ప్రభుత్వం స్థానిక వర్గాలకు బొగ్గుపై ఉన్న ఆధారితాన్ని అంచనా వేయడానికి, దానిని తగ్గించి, రాష్ట్రాన్ని మరింత స్థిరమైన ఇంధనాల వైపు మళ్లించే ప్రణాళికను రూపొందించడానికి ఒక ‘జస్ట్ ట్రాన్సిషన్’ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2024లో, ఢిల్లీలోని సెంటర్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీకి చెందిన పరిశోధకుల బృందం చంద్రపురలో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. స్థానిక సంఘాలకు బొగ్గుపైన; అలాగే జీవనోపాధి వనరుగా ఆ ప్లాంట్‌పై ఉన్న ఆధారితాన్ని తగ్గించే వ్యూహాలను అంచనా వేయడం ఈ అధ్యయనం లక్ష్యం. ఈ అధ్యయనాన్ని ఇంకా ప్రచురించలేదు.
క్షేత్రస్థాయిలో, దశాబ్దాల పోరాటమూ, లేమి ఉన్నప్పటికీ, చంద్రపురలోని చాలా మంది ఆదివాసీలు రాబోయే థర్మల్ ప్లాంట్‌ను స్వాగతించారు. “ఇక్కడ ఒక సామెత ఉంది – ప్లాంట్ ఉన్నంత కాలం, ప్రజలు బతుకుతారు,” అని జర్నాడిహ్ నివాసి సంజయ్ ముర్ము అన్నారు.
సంజయ్ ముర్ము కుటుంబం
పరిశోధకులు గమనించినట్లుగా, చాలా మంది ఆదివాసీలు బొగ్గు ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ సరిగ్గా భాగం కాలేదు – బదులుగా వారు దాని అంచులలోనే ఉండిపోయారు. “మేము సందర్శించిన అన్ని ఆదివాసీ గ్రామాలలో, ప్లాంట్ ఏర్పాటు సమయంలో మొదటి తరం నిర్వాసితులకు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చారని, కానీ వారిని ఎప్పుడూ ప్లాంట్‌లో సరైన సిబ్బందిగా లేదా ఉద్యోగులుగా గుర్తించలేదని మేము కనుగొన్నాము,” అని పరిశోధకురాలు దీప్‌మాలా పటేల్ చెప్పారు.
నిజానికి, ఆ ప్రాంతంలోని ఆదివాసీల జీవనోపాధి ఇంకా ఆ ప్లాంట్‌తోనే ముడిపడి ఉందని, అయితే అది కేవలం దాని అంచులలో (అల్పస్థాయిలో) మాత్రమే ఉందని ‘స్క్రోల్’ (Scroll) తో మాట్లాడిన వారు వివరించారు. చాలా మంది ఆదివాసీలు చిన్న చిన్న బంకులు నడుపుతున్నారని, రిక్షాలు తొక్కుతున్నారని లేదా బొగ్గు లోడ్ చేయడం, బొగ్గు బూడిదను (ఫ్లై యాష్) శుభ్రం చేసే కార్మికులుగా పనిచేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. మరికొందరు రైల్వే ట్రాక్‌ల దగ్గర పడిపోయిన బొగ్గును ఏరుకుని లేదా దొంగిలించి అమ్ముకుంటున్నారని పరిశోధకులు తెలిపారు.
“మా భూమిని అంతా ప్లాంట్ తీసేసుకుంది, ఆ నిర్వాసత్వం వల్ల ఆదివాసీ రైతులు కూలీలుగా మారిపోయారు,” అని జర్నాడిహ్ నివాసి రమేష్ సోరెన్ అన్నారు.
ప్లాంట్‌కు ఆనుకుని ఉన్న నీర్ పిప్రాడి అనే గ్రామంలో, గ్రామస్తులకు సాగు చేయడానికి ఇంకా కొంత భూమి ఉంది, కానీ ప్లాంట్ నుండి వచ్చే బొగ్గు బూడిద తరచుగా వారి పంటలపై పేరుకుపోతోంది. “మేము కొంత ధాన్యాన్ని, కూరగాయలను పండిస్తాము,” అని నివాసి అనూప్ ముర్ము చెప్పారు. “అవి మా తిండికి సరిపోతాయి కానీ మార్కెట్‌లో అమ్ముకోవడానికి పనికిరావు.”
చంద్రపురలో బొగ్గు బూడిదతో నిండిన రోడ్డు
తమకు రావలసిన హక్కుల కోసం ప్రయత్నించినప్పుడు, కార్పొరేషన్ అధికారులు తమపై ఆదివాసీ వ్యతిరేక వివక్ష చూపుతున్నారని కూడా ఆదివాసీ గ్రామాల నివాసితులు తెలిపారు. “డివిసి మమ్మల్ని సరిగ్గా చూడదు. మేము ఆదివాసీలమని వారికి తెలిస్తే, మాతో చులకనగా మాట్లాడుతారు; మా డిమాండ్లను పట్టించుకోరు,” అని సంజయ్ హెంబ్రోమ్ అన్నారు. “ఇన్నేళ్లలో ప్రభావితమైన స్థానికులకు ఉద్యోగాలు రాలేదు కానీ బయటి వ్యక్తులు వచ్చి ఉద్యోగాలు పొందుతున్నారు.”
స్థానికుల నుండి ప్రతిఘటనను అడ్డుకోవడానికి కంపెనీలు తరచుగా ఈ ఎత్తుగడను అనుసరిస్తాయని పరిశోధకులు గమనించారు. “కంపెనీలు బయటి వ్యక్తులను తమ ప్లాంట్ల దగ్గర స్థిరపడేలా చేస్తాయి, కానీ స్థానికులకు అధికారం ఇవ్వవు. ఎందుకంటే స్థానికులు ఏకమై తమకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తారని వారు భయపడతారు,” అని పటేల్ చెప్పారు.
చంద్రపురలోని పవిత్ర వనాలు, నీటి వనరులు వంటి ఆదివాసీ సామాజిక-సాంస్కృతిక గుర్తులను కూడా ఈ విద్యుత్ కేంద్రం తుడిచిపెట్టిందని గ్రామస్తులు గుర్తించారు. అయినప్పటికీ, కార్పొరేషన్ వారికి సేవ చేసేటప్పుడు ఆదివాసీ సంస్కృతిని ఉపయోగించిందని వారు చెప్పారు. “ప్లాంట్ లోపల మీరు ఆదివాసీల చిత్రాలు, ఆదివాసీ కళా రూపాలు కనిపిస్తాయి. ఆదివాసీలను డివిసి కార్యక్రమాలకు నృత్యం చేయడానికి కూడా పిలుస్తారు” అని శశికాంత్ అన్నారు. “కానీ ప్లాంట్ కోసం నిరాశ్రయులైన, ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీల పరిస్థితిని మెరుగుపరచడానికి ఎవరూ ప్రయత్నించరు.”
2026 ఫిబ్రవరి 25
https://scroll.in/article/1090290





జార్‌నాడీ గ్రామంలో ఆదివాసుల ఇళ్లకు పట్టాలు లేవు

గ్రామస్తులెవరిదగ్గరా ఇంటిపత్రాలు లేవని సంజయ్ హేంబ్రామ్ అన్నారు


నిర్వాసితుల పునర్వసతి ప్రాంతం – కానీ కనీస సౌకర్యాలు లేవు

సంజయ్ ముర్ము కుటుంబం




