When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition

A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs.

నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా ఉన్నాడు.

లా చదవడానికి రాజధానికి వచ్చిన ఇరవై నాలుగు ఏళ్ల అక్షయ్ ఈఆర్, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ (పరిశుబ్రమైన గాలికోసం సమన్వయ కమిటీ) పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శనలో చేరాడు. వారి డిమాండ్లు చాలా సరళమైనవి: పరిశుభ్రమైన గాలి; స్వచ్ఛమైన ఆకాశం. కేవలం 25 నిమిషాల తర్వాత, ఎక్కువగా విద్యార్థులు ఉన్న  నిరసనకారుల సమూహం సి-హెక్సాగాన్  సమీపంలోని బారికేడ్లను దాటి రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేసింది. ఇటీవల చనిపోయిన నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన కమాండర్ మడావి హిడ్మాను ప్రస్తావిస్తూ కొన్ని నినాదాలు చేశారని సమాచారం.

పోలీసులు తక్షణమే అణచివేతను ప్రారంభించారు.  అదుపులోకి తీసుకున్న వారిలో అక్షయ్ ఉన్నాడు.

కొద్ది క్షణాల్లోనే, ఒక కానిస్టేబుల్ అతని ఛాతీపై కూర్చుని, అతని తలను ఇబ్బందికరమైన కోణంలో పేవ్‌మెంట్ మీద లోకి నొక్కి ఉంచితే, మరో ఇద్దరు అతని చేతులు, కాళ్ళను లాగుతున్నారు.

ఒక పిటిఐ ఫోటో గ్రాఫర్ ఫోటో తీసిన ఆ దృశ్యాన్ని ఎన్‌డిటివి కొంచెం సేపు ప్రసారం చేస్తే అది ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్ర‌చార‌మైంది.

2020లో జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. శ్వాస ఆడడం లేదని అతను పదేపదే వేడుకుంటున్నప్పటికీ, ఒక పోలీసు అధికారి ఆ ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తి మెడపైన తొమ్మిది నిమిషాల కంటే ఎక్కువ సమయం మోకాలిని నొక్కిపట్టి ఉంచాడు. ఈ పోలికను విస్మరించడం కష్టం.

నేడు, అక్షయ్ మరో 23 మందితో కలిసి భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద మోపిన అభియోగాలతో జైలులో ఉన్నాడు. మావోయిస్టు అనుకూల నినాదాలు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, అధికారులపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

నిరసనకారులు పోలీసుల వివరణను సవాలు చేస్తున్నారు.

సౌత్ ఫస్ట్ అనే వెబ్ సైట్ తో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఢిల్లీ చీఫ్ సూరజ్ ఏలమోన్ ఎస్‌ఎఫ్‌ఐ తో సహా ఏ ప్రధాన విద్యార్థి సంస్థ కూడా ఈ నిరసనకు పిలుపునివ్వలేదని తెలిపారు. బదులుగా, ఈ పిలుపును ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్  ఇచ్చిందని, వర్గాల సమాచారం ప్రకారం ఇది అనేక విద్యార్థి సమూహాలను కలిగి ఉన్న ఒక కూటమి అని వివరించారు.

ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ జేఎస్ విష్ణు మాట్లాడుతూ, పరిశుభ్రమైన గాలిపై నిరసనలో పాల్గొనడానికి ప్రజలను ఆహ్వానిస్తూ కొన్ని రోజుల ముందు నగరమంతా పోస్టర్లు కనిపించాయని వివరించారు.

 “చాలా మంది విద్యార్థులు దీనిని ఒక సామాజిక అంశం కోసం నిలబడే అవకాశంగా చూశారు. కొన్ని సంస్థలు ఇందులో పాల్గొన్నాయి, కానీ చాలా మంది విద్యార్థులకు ఆ విషయం తెలియదు,” అని ఆయన అన్నారు.

భగత్ సింగ్ ఛాత్ర ఏక్తా మంచ్ (బిఎస్‌సిఇఎమ్), హిమ్‌ఖండ్‌ల సభ్యులు రాజకీయ నినాదాలు చేసిన తర్వాత, ఇతర సమూహాలు నిరసన నుండి దూరంగా జరిగినట్లు సమాచారం.

“ఏ విద్యార్థి కూడా పెప్పర్ స్ప్రే ఉపయోగించలేదు. ఒక చిన్న సమూహం నుండి కొందరు హిడ్మా గురించినినాదాలు చేశారు, అంత మాత్రాన మేమందరం ‘మావోయిస్టులం’ ఎలా అవుతాం?” అని నిరసనలో పాల్గొన్న మెహనాస్ అనే విద్యార్థిని సౌత్ ఫస్ట్‌తో అన్నారు.

నిరసన దేని గురించి అని అధికారులు అస్సలు అడగలేదని ఆమె అన్నారు. “ఢిల్లీలో మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం కాబట్టే మేము అక్కడకు వెళ్లాం. మాకు పరిశుభ్రమైన గాలి కావాలి. ఆ సమస్యను పరిష్కరించడానికి బదులు, వారు మా రాజకీయాన్ని ప్రశ్నించడానికి; మా మీద ముద్ర వేయడానికి తొందరపడ్డారు. ఇది రాజకీయ పార్టీ నిరసన కాదు,” అని తెలిపారు.

కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న అక్షయ్ కుటుంబ సభ్యులలో ఒకరు, అతనికి తీవ్రవాద భావజాలంతో సంబంధం ఉందనే వాదనలన్నింటినీ గట్టిగా తిరస్కరించారు.

“మేము ఎస్‌టి సముదాయానికి చెందిన వాళ్లం. అక్షయ్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతనే కుటుంబానికి ఉన్న ఏకైక నిజమైన ఆశ. అతను ఎప్పుడూ బలమైన విద్యాపర ప్రతిభ గల తెలివైన విద్యార్థి. అతని తండ్రి రోజువారీ కూలీ, అతని తల్లి గృహిణి. ఆ ఫోటో మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది,” అని ఆ బంధువు అన్నారు.

“ఆరోపణ ఏదైనప్పటికీ, ఒక విద్యార్థితో ఈ విధంగా వ్యవహరించాలా?”అని ప్రశ్నిస్తున్నారు.

అక్షయ్‌తో పాటు, మరొక మలయాళీ విద్యార్థి కూడా అదుపులో ఉన్నాడు, యుఎపిఎ అంటే చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం వంటి కఠినమైన చట్టాన్ని పోలీసులు ప్రయోగించవచ్చనేది పెద్ద ఆందోళనగా ఉంది. ఇది విద్యార్థులకు మరింత ఇబ్బందిని కలిగించవచ్చు అని విష్ణు ఆందోళన చెందుతున్నారు.

నక్సలైట్లతో సంబంధాలు ఉండ వచ్చేమోనని పోలీసుల పరిశోధన:

అక్షయ్ ఢిల్లీ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం ఎల్ఎల్బి విద్యార్థి; కేవలం మూడు నెలల క్రితమే బిఎస్‌సిఇఎమ్‌లో చేరాడని, ప్రస్తుతం విజయ్ నగర్‌లో మరో నలుగురు విద్యార్థులతో అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నాడు అని తెలిసింది.

నిరసనలో చేరమని అతను కొంతమంది స్నేహితులను ఆహ్వానించినప్పటికీ, పోలీసుల నుండి గట్టి అణచివేతకు భయపడి వారు నిరాకరించారని సమాచారం.

బిఎస్‌సిఇఎమ్ సానుభూతిపరుడు పునీత్ (పేరు మార్చబడింది) అక్షయ్‌కు ఎటువంటి మార్క్సిస్ట్ లేదా మావోయిస్ట్ సంస్థతో సంబంధం లేదని సౌత్ ఫస్ట్తో చెప్పాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ బ్యానర్ కింద నిరసనకారులు గుమిగూడారని, అనేక విద్యార్థి సమూహాలు, సాధారణ ప్రజలు కూడా ఇందులో చేరారని ఆయన వివరించారు. మాడ్వి హిడ్మాను ప్రస్తావిస్తూ చేసిన నినాదాలు ఆకస్మికంగా వచ్చాయని ఆయన అన్నారు.

“ఆ నినాదాలు ఎప్పుడూ ప్రణాళికలో భాగం కాదు. మేము వాటిని విన్నప్పుడు, మేము దూరంగా జరిగాము, కానీ కొద్దిసేపటికే పోలీసులు ప్రజలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు,” అని ఆయన అన్నారు.

అయితే ఢిల్లీ పోలీసుల ప్రకారం, నిరసనకారులు కేవలం నినాదాలు చేయడం కంటే చాలా ఎక్కువ చేశారు. అప్పటి నుండి రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి, ఒకటి కర్తవ్యపథ్ పోలీసు స్టేషన్‌లో, మరొకటి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో, మొత్తం 23 మంది నిరసనకారుల పేర్లను నమోదు చేసారు. అక్షయ్ పేరు ఈ రెండింటిలోనూ ఉంది.

కర్తవ్యపథ్ పోలీసు స్టేషన్‌లో దాఖలైన మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. నిరసనకారులు బారికేడ్లను దాటారని, పోలీసులుపైన పెప్పర్ స్ప్రే ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 79, 115(2), 132, 221, 223A, 61(2)$ కింద నమోదు చేసారు.

తోటి నిరసనకారులు ఈ వాదనలను ఖండించారు; అక్షయ్ పెప్పర్ స్ప్రే ఉపయోగించలేదని పేర్కొన్నారు.

పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో నమోదు చేసిన రెండవ ఎఫ్‌ఐఆర్, స్టేషన్ వెలుపల బైఠాయించిన సమయంలో నిరసనకారులు హింసాత్మకంగా మారారని, అధికారులను గాయపరిచారని ఆరోపించింది.

పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 223A, 132, 221, 121(1), 115(2), 126(2), 3(5) లను కూడా ఉపయోయోగించారు; నక్సల్ సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నామని కూడా కోర్టుకు తెలిపారు.

కేరళ సీపీఐ కమిటీ విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు ఇది ఒక దెబ్బ అని అభివర్ణించింది.

నిరసనకారుల పట్ల వ్యవహరించిన తీరుపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కేరళ చీఫ్ బినోయ్ విశ్వం తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

 “ఇది నిరాశ కలిగించే విషయం. విద్యార్థులు పరిశుభ్రమైన గాలిని కోరుతున్నారు, అయినప్పటికీ వారిని జైలులో పెట్టారు, విచారణ చేశారు, ఉగ్రవాదులుగా, అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేశారు. ఇది క్రూరమైనది; అసంబద్ధమైనది. ఈ ఆందోళనను కేవలం కొద్ది మంది విద్యార్థులు మాత్రమే లేవనెత్తలేదు, ఆరోగ్యాలు బాగులేని వారితో సహా ఢిల్లీలోని లక్షలాది మంది తమ ఆరోగ్యం, జీవితాల గురించి ఆందోళన చెందుతున్నారు,” అని ఆయన సౌత్ ఫస్ట్ పత్రికతో చెప్పారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని విశ్వం అన్నారు.

“ఈ విద్యార్థి చూపించిన ధైర్యం అభినందనీయం. వారు తమ ప్రాథమిక హక్కులను కోరడానికి వీధుల్లోకి వచ్చారు. ప్రాథమిక మానవ హక్కులను అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక విధి కావాలి. దీనికి బదులుగా, మోడీ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను సామాజిక వ్యతిరేకులుగా చూస్తోంది, వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తోంది, పార్లమెంటులో కూడా ఈ పదం వినిపిస్తోంది. నేను కూడా పార్లమెంటులో బీజేపీ సభ్యుల నుండి అటువంటి ముద్రను ఎదుర్కొన్నాను,” అని ఆయన అన్నారు.

“ఆదివాసుల ప్రాంతాలలో, ప్రజలు ‘జల్, జమీన్, జంగిల్’ అని నినాదాలు చేస్తారు, ఇవి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు. ఇలాంటి సంఘటనలు భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి.”

కేరళలో కూడా విద్యార్థులకు మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన చరిత్ర ఉంది. ముఖ్యంగా, నవంబర్ 2019 లో, అలాన్ షుహైబ్, థాహా ఫసల్ అనే ఇద్దరు విద్యార్థులను మావోయిస్ట్ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసారు. కేరళ పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇది వివాదానికి దారితీసింది.

“నాకు అలాన్, థాహాల కుటుంబాలు తెలుసు; కోర్టు తీర్పుల గురించి నాకు తెలుసు. మావో గురించి ఒక పుస్తకం ఉంచుకోవడం నేరం కాదు, అది వారి హక్కు. మా ఇంటిలో కూడా మావో పుస్తకం ఉంచుకునే హక్కు నాకు ఉంది,” అని విశ్వం అన్నారు.

న్యాయవాదుల ఆరోపణలు: ప్రక్రియలో లోపాలు, విద్యార్థులు బెయిల్ విచారణ కోసం ఎదురుచూపు

అరెస్టయిన విద్యార్థులలో ఒకరైన, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన, SFI తో సంబంధం ఉన్న బంకా ఆకాష్ తరపున వాదిస్తున్న అడ్వకేట్ సుభాష్ చంద్రన్, ఢిల్లీ పోలీసులపైన అనేక విధానపరమైన లోపాలను ఆరోపించారు.

ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 29, శనివారం నాడు జరగనుంది, ఆ రోజున బెయిల్ దరఖాస్తును పరిశీలిస్తారు. బెయిల్ పిటిషన్‌ను బుధవారం తీసుకోలేదు.

“అరెస్టు చేసిన సమయంలో మాకు ఎఫ్‌ఐఆర్ కాపీలు లేదా అరెస్ట్ మెమో అందించలేదు, న్యాయవాదులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. విద్యార్థులు వాయు కాలుష్యానికి నిరసన తెలపడానికి గుమిగూడారు, కానీ కొన్ని తీవ్రవాద సమూహాలు కూడా అక్కడే ఉన్నాయి; మావోయిస్ట్ అనుకూల నినాదాలు చేశారని సమాచారం,” అని చంద్రన్ సౌత్ ఫస్ట్ పత్రికతో చెప్పారు.

“నా క్లయింట్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాడు; ఇక్కడికి వచ్చి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అవుతోంది. అతనికి హిందీ సరిగ్గా తెలియదు, కాబట్టి నినాదాలు ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతను వాటిని ఎప్పుడూ ఇవ్వలేదు. వఫియా, జమీర్ ఫాయిస్ సహా ఇతర మలయాళీలను కూడా అదుపులోకి తీసుకొన్నారు.”

అక్షయ్‌తో పాటు అదుపులో ఉన్న ఇతరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు కూడా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీని అందించలేదని ధృవీకరించారు.

పెప్పర్ స్ప్రే ఉపయోగించారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్షయ్‌ను కోర్టులో హాజరుపరిచినప్పుడు అతని ముఖంపై గాయాలు స్పష్టంగా కనిపించాయి.

అయితే, భారతదేశ సార్వభౌమత్వం లేదా భద్రతను ప్రభావితం చేసే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణపై పోలీసులు ఇప్పుడు సెక్షన్ 197(d) ను కూడా జోడించారని మరొక న్యాయవాది చెప్పారు.

మావోయిస్ట్ అనుకూల సంబంధాల వాదనల నేపథ్యంలో, ఏదైనా నిధులు లేదా వ్యవస్థీకృత మద్దతు ఉందా అని తాము తనిఖీ చేయాలని పోలీసులు అంటున్నారు.

Published Nov 27, 2025

Akshay

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply