జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు.
హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావుతో ఒక సీనియర్ జైలు అధికారి ఇలా అంటాడు. ” రాజ్యాంగాన్ని పాటించని వాళ్ళ పట్ల మేము రూల్స్ పాటించాలా? నేను పాటించను.”
భారతదేశ జైళ్లలో చట్టబద్ధత ఎంత పతనమైందనే విషయాన్ని ఈ అధికారి మాటలు చెప్పకనే చెప్తున్నాయి.
2025 అక్టోబర్ 28న, 60 ఏళ్ల సంజయ్ దీపక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నిరసన ఏవో ప్రత్యేక హక్కుల కోసమో, సౌకర్యాల కోసమో కాదు. అవేవి గొంతెమ్మ కోర్కెలు కావు. అవి అతి సామాన్యమైనవి. పూర్తిగా చట్ట బద్దమైనవి. ప్రభుత్వమే స్వయంగా రూపొందించిన నియమాలను పాటించాలని ఆయన డిమాండ్. అంతే.
రోజుకు 22 గంటలు లాకప్ ?
తన జీవిత భాగస్వామితో ఫోన్‌లో మాట్లాడుతూ, సంజయ్ తాను ఎందుకు నిరాహార దీక్షకు పూనుకోవాల్సి వచ్చిందో చెప్పాడు:
“ఎనిమిది నెలలుగా నన్ను 22 గంటలు గదిలో లాక్ చేసి ఉంచుతున్నారు. అంతకుముందు 24 గంటలు ఉండేది. జైలు మాన్యువల్ ప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గదిని తెరిచి ఉంచాలి. నాకు మాన్యువల్ కాపీని కూడా ఇవ్వలేదు. నేను రాసిన లేఖలను పోస్ట్ చేయడం లేదు. నేను కోర్టులో ఉన్నప్పుడు నా సెల్ లోకి అధికారులు వచ్చారు. బూట్ల గుర్తులు చూశాను. నన్ను అబద్ధపు కేసుల్లో ఇరికించాలని వారు ప్లాన్ చేస్తుండవచ్చు. నా గదిని నా సమక్షంలోనే తనిఖీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.”
సంజయ్ సుమారు రెండేళ్లుగా పూర్తి ఏకాంతంలో జీవిస్తున్నారు. 60-అడుగుల పొడవు, 20-అడుగుల వెడల్పు గల బ్యారక్‌లో, మానవ సంబంధం లేని విధంగా ఏకాంతంగా సంజయ్‌ను నిర్బంధించారు. అతనికి తెలుగు, హిందీ మ్యాగజైన్‌లను ఇవ్వడానికి నిరాకరించారు. తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఎ.పి. జైలు మాన్యువల్-1979 వ్యక్తిగత కాపీని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తన కుటుంబానికి, కోర్టులకు రాసిన లేఖలను పోస్ట్ చేయలేదని సమాచారం. ఆయన న్యాయవాదిని కూడా కలవడానికి నిరాకరిస్తున్నారు.
ఈ నిరాకరణ కేవలం అమానుషత్వమే కాదు, చట్టవిరుద్ధం కూడా.
న్యాయవాదిని కలిసే సాధారణ హక్కు కోసం న్యాయ పోరాటం:
న్యాయవాదిని (ఈ రచయితను ) కలవకుండా సంజయ్ ను జైలు అధికారులు అడ్డుకున్నప్పుడు, ఆ న్యాయవాది తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ (W.P. నం. 30438 ఆఫ్ 2023) దాఖలు చేశాడు. 2023 నవంబర్ 28 నాటి హై కోర్టు, ఉత్తర్వులో అధికారులను ఈ విధంగా ఆదేశించింది:
“పిటిషనర్ సమర్పించిన 20.10.2023 నాటి దరఖాస్తును ప్రతివాది నెం.3 (చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్) పరిశీలించి, ప్రిజన్స్ చట్టం, 1894లోని సెక్షన్లు 40, 41, తెలంగాణ రాష్ట్ర జైలు నిబంధనలలోని రూల్ 506కి కట్టుబడి, ఒక వారంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది…”
అయితే, ఈ ఆదేశం కేవలం విధానపరమైనదే గానీ, దరఖాస్తుదారుడికి (లాయరుకు) చట్టపరమైన ప్రవేశం కల్పించాలనే హామీ ఇవ్వలేదు. దాంతో, ఈ తీర్పు ద్వారా ఎటువంటి ప్రత్యక్ష సహాయం అందలేదు. అమలు చేయాల్సిన చర్యలు నిర్ధారించబడలేదు.
ఈ ఉత్తర్వు తర్వాత, జైలు అధికారులు నన్ను లీగల్ ఇంటర్వ్యూలు కొద్దికాలం అనుమతించారు. అయితే కొన్ని నెలల తర్వాత, వారు మళ్లీ అడ్డుకోవడం ప్రారంభించారు. కోర్టు ఆదేశంలో ఉన్న అస్పష్టతను సాకుగా తీసుకుని, జైలు అధికారులు మళ్లీ గతంలో లాగే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేయడం ప్రారంభించారు.
చట్టాన్ని పాటించకుండా, న్యాయస్థాన జోక్యాన్ని గౌరవించకుండా, అధికారులు నిర్లక్ష్య వైఖరిని కొనసాగించారు. కోర్టులు కేవలం విధానపరమైన అనుసరణకు (చట్టపరంగా, విధానాల పరంగా నడుచుకోవాలి అని చెప్పడానికి) మాత్రమే పరిమితమవుతున్నాయని గ్రహించిన జైలు అధికారులు, ఖైదీల హక్కులను అణగదొక్కడంలో మరింత ఉత్సాహంగా సాహసిస్తున్నారు.
ఈ ఉల్లంఘన నిరాటంకంగా కొనసాగుతోంది. లీగల్ ఇంటర్వ్యూ కోసం సంజయ్‌ను కలవకుండా లాయర్ ను మళ్లీ అడ్డుకోవడంతో, ఆయన హైకోర్టులో W.P. నం. 579 ఆఫ్ 2025 ద్వారా మరొక పిటిషన్‌ను దాఖలు చేయవలసి వచ్చింది. అది ఇంకా పెండింగ్‌లో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21, 22; ప్రిజన్స్ చట్టం 1894లోని సెక్షన్ 40; తెలంగాణ రాష్ట్ర జైలు నిబంధనలలోని రూల్ 506(1) (2) లను ఉల్లంఘిస్తూ, న్యాయవాదుల కలవడాన్ని అడ్డుకోవడం చట్టవిరుద్ధం, నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధమని తెలియజేస్తూ, ఈ పిటిషన్ రిట్ ఆఫ్ మాండమస్ గా దీపక్ న్యాయవాది ఫైల్ చేశాడు.
పదేపదే ఈ తిరస్కరణ ఒక కఠోర సత్యాన్ని చెప్తోంది: “హై సెక్యూరిటీ ” రాజకీయ ఖైదీల విషయంలో, రాజ్యాంగం జైలు గేటు ముందే ఆగి పోతుంది.
చట్టబద్ధంగా వ్యవహరించాలని పిటిషన్:
2025 జనవరి 9. సంజయ్ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఎ కోర్టుకు ఒక వివరమైన పిటిషన్‌ను ఇచ్చాడు. అండర్ ట్రయల్స్‌కు “అనవసరమైన నియంత్రణ”, “అధిక ఏకాంత నిర్బంధం” ను నిషేధించే ఎ.పి. జైలు నిబంధనలలోని రూల్ 738 ను ఆయన ఉదహరించాడు.
ఖైదీలు భావించినట్లుగా, ఏకాంత నిర్బంధం అంటే అత్యంత మానసిక వేదన కు గురిచేయడమే.. చట్టవిరుద్ధమైన ఏకాంత నిర్బంధంపై ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో ఒకటి జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ ఇచ్చిన సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (1978) కేసు. ఆ తీర్పులో ఆయన ఇలా చెప్పారు…
“ఏకాంత నిర్బంధం – ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలకు, చట్ట సంస్కరణకారులకు ఎంతో అసహ్యంగా అనిపిస్తోంది. అందుకే చట్ట సంఘం (Law Commission) తన 42వ నివేదికలో (పేజీ 78) ఇలా సిఫారసు చేసింది — ఏకాంత నిర్బంధం అనే శిక్ష ఆధునిక ఆలోచనలకు విరుద్ధంగా ఉంది; కాబట్టి దానిని శిక్షగా భారతీయ శిక్షాస్మృతిలో (Penal Code) కొనసాగించకూడదు.
అదే సమయంలో, జైలు నియమాలను కాపాడటానికి అవసరమైతే మాత్రమే ఏకాంత నిర్బంధాన్ని ఉపయోగించవచ్చు, కానీ Section 30(2) ప్రకారం ఇది జైలు క్రమశిక్షణ ఉల్లంఘనకు శిక్షగా విధించబడదని కూడా స్పష్టంగా పేర్కొంది.”
సంజయ్ డిమాండ్లు చాలా సామాన్యమైనవి; అవన్నీ పూర్తిగా చట్ట పరిధిలోనే ఉన్నాయి:
– చట్టవిరుద్ధమైన ఏకాంత నిర్బంధాన్ని ఆపడం.
– స్వాధీనం చేసుకున్న అతని జైలు మాన్యువల్‌ను తిరిగి ఇవ్వడం.
– బయటి ఆసుపత్రిలో దంత చికిత్సకు అనుమతి ఇవ్వడం.
– వైద్య కారణాల వల్ల బూట్లు ధరించడానికి అనుమతి ఇవ్వడం.
– తన న్యాయవాదిని కలుసుకునే అవకాశాన్ని పునరుద్ధరించడం.
ఈ డిమాండ్లు అన్నీ ప్రిజన్స్ చట్టం-1894, తెలంగాణ జైలు నిబంధనలు అనుమతించేవే. ఇవేవీ తీవ్రమైనవి కావు. అయినా, వాటిని పరిష్కరించడానికి బదులు, జైలు అధికారులు ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
“అధిక భద్రతలో ఉంచాల్సిన తీవ్రవాది”గా తనపై ముద్ర వేశారు. “తోటి-ఖైదీలను బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని ” ఆరోపించారు; ఇంకా అతను “తప్పించుకోవడానికి జైలు గోడకు కన్నం చేసాడు” అని కూడా ఆరోపించారు. అయితే దీనిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు. విచారణా జరపలేదు. ఆధారాలు చూపారా? అదీ లేదు. కేవలం ఎప్పటికీ ‘ఏకాంత నిర్బంధం’ అమలు చేయడం కోసం ఒక సాకుగా ఈ ఆరోపణలను ఉపయోగించుకున్నారు.
కోర్టులు హక్కులను అంగీకరిస్తాయి కానీ న్యాయాన్ని నిరాకరిస్తాయి:
నెలల తరబడి విచారణల తర్వాత, స్పెషల్ ఎన్‌ఐఎ కోర్టు 2025 జూన్ 23న తన తుది ఉత్తర్వును జారీ చేసింది:
“ఈ కోర్టు (ఈ కేసులో) ముందుకు సాగడానికి ఎటువంటి ఆధారం లేదు… జైలు అధికారులు ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించి, జైలు నిబంధనలు, జైలు మాన్యువల్‌ను ఖచ్చితంగా పాటించాలి.”
ఇది న్యాయపరమైన బాధ్యత నుండి తప్పుకోవడానికి ఒక విశిష్ట ఉదాహరణ- చట్టవిరుద్ధతను ఒప్పుకున్నా, నివారణను నిరాకరించే ఒక ఉత్తర్వు.
చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకే తిరిగి ఆ బాధ్యతను అప్పగించడం వల్ల, న్యాయస్థానాల యొక్క పనిని పేరుకు న్యాయంగా చేసినట్లు ముగించడం.
న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని ప్రస్తావించడంలోనే పరిమితమై, దానిని అమలు చేయడంలో విఫలమయ్యే ఈ యాంత్రిక న్యాయ విధానం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశం. “వాస్తవంగా న్యాయం ఎలా జరగాలి, అని చెప్పాల్సిన స్థానంలో విధానపరంగా అనుసరించండి” (substantive justice replacing procedural compliance) అని చెప్పే ధోరణి తయారైంది.
దీని ఫలితం ఊహించొచ్చు: రాజ్యమే స్వయంగా రూపొందించిన చట్టాన్ని దానికి గుర్తు చేయడం కోసం ఖైదీలు నిరాహారదీక్ష చేయాల్సి రావడం.
జైలు మాన్యువల్ ఖైదీలకు ఎందుకు ఇవ్వరు?:
జైలు విధానాలు, న్యాయవాదుల ఇంటర్వ్యూలు, ఖైదీలతో సంప్రదించడానికి ఉన్న హక్కులపై స్పష్టతను కోరుతూ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు, జైళ్ల సూపరింటెండెంట్‌కు దీపక్ న్యాయవాది లేఖలు రాశాడు. ఆ లేఖలను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాడు. దేనికీ సమాధానం ఇవ్వలేదు.
ఈ మౌనం కేవలం పరిపాలనాయంత్రాంగ అసమర్థత కాదు. ఇది సంస్థాగత ధిక్కారం. మౌనం న్యాయాన్ని తొక్కి పట్టే ఒక ఆయుధం.
ఈ అస్పష్టతకు తోడు, సవరించిన తెలంగాణ జైలు మాన్యువల్ కూడా ఎక్కడా ప్రజలకు దొరకడం లేదు. గెజిట్ పబ్లికేషన్ విభాగం వద్ద కూడా సరైన కాపీ లేదు. కేవలం 1979 మాన్యువల్‌కు సంబంధించిన స్కాన్ చేసిన, చదవడానికి వీలులేని, పాత వెర్షన్ మాత్రమే తెలంగాణ జైలు శాఖ వెబ్‌సైట్‌లో ఉన్నది. కొత్త జైలు నిబంధనలు, న్యాయపరమైన ఆదేశాలను ఇందులో చేర్చలేదు.
ఖైదీల హక్కులను నిర్వచించే ప్రాథమిక చట్టపరమైన పత్రం జైలు మాన్యువల్. దానిని సమయానుకూలంగా సవరించి, ప్రచురించాలని కోరుతూ రిట్ పిటిషన్. నం. 3636/2025 ద్వారా హైకోర్టులో సవాలు చేసాం. ఆ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది.
జైలు వ్యవస్థ నిర్వహణను నియంత్రించే ప్రస్తుత చట్టాలను దాచిపెట్టినప్పుడు లేదా సవరించక ముందున్న పాత చట్టాలను మాత్రమే అవకాశవాద ధోరణిలో అందుబాటులో ఉంచినప్పుడు, జైలు అధికారులు ఇష్టారాజ్యంగా) వ్యవహరించడం సహజంగా మారుతుంది.
గతంలో వేదాలను శూద్రులు చదవ రాదని ఆంక్షలు ఉండేవి. జైలు మాన్యుయల్స్ ఖైదీలు చదవ కూడదని ప్రస్తుత పాలకులు అనుకుంటున్నారా?
ఇదంతా ఆర్వేల్లియన్ రాజ్యాన్ని గుర్తు చేయటం లేదూ?
చట్టమే శిక్షగా మారినప్పుడు:
భారతదేశంలోని జైళ్లలో “అధిక భద్రత” అనే పదం, వాస్తవానికి “హక్కులు శూన్యం” అనే దానికి పర్యాయపదంగా మారిపోయింది. సరి అయిన వెలుతురూ, చదువుకోడం, లాయర్లోతో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్, వైద్య సేవలు వంటి మౌలిక హక్కులను కూడా “భద్రత” అనే పేరుతో అతి సులభంగా నిలిపేస్తున్నారు.
– జైలు అధికారులకు, “భద్రత” అనే కారణం చట్టాన్ని నిలిపివేయడానికి ఒక నైతిక సమర్థనగా మారుతుంది.
– స్పష్టమైన న్యాయం అందించడానికి బదులుగా, కేవలం ప్రక్రియను ప్రస్తావించడమే న్యాయస్థానం పనిగా మారుతుంది.
– దీని వలన ఖైదీ ఉనికే శిక్షగా మారుతుంది.
సంజయ్‌కు నిరాకరించినవి ప్రత్యేక హక్కులు కావు. అవి రాజ్యాంగ హక్కులు: గౌరవంగా జీవించే హక్కు, కమ్యూనికేషన్ హక్కు, న్యాయవాదిని పొందే హక్కు.
ప్రతిఘటన – అర్థం:
సంజయ్ నిరాహారదీక్ష ధిక్కార చర్య కాదు; అది రాజ్యం తానే రూపొందించిన చట్టాన్ని అమలు చేయాలని చేసిన న్యాయబద్ధమైన డిమాండ్. చట్టబద్ధతను ఉల్లంఘించినప్పుడు, చట్టవ్యతిరేకతను ప్రతిఘటించడం ఒక కర్తవ్యం అనే భావన- భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రేరేపించిన అదే స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక నైతిక నిరసన చర్యగా ఇది నిలుస్తుంది.
ఒక ప్రజాస్వామ్యంలో, రాజ్యం నుండి బలహీనులను రక్షించడం రాజ్యాంగం ఉద్దేశ్యం. భారతదేశ జైళ్ల లోపల, ఆ వాగ్దానం తిరగబడింది: రాజ్యం జవాబుదారీతనం నుండి తప్పించు కుటోంది. జవాబుదారీతనం నుండి రక్షించబడుతోంది. ఖైదీలు తమకు ఇప్పటికే ఉన్న హక్కుల కోసం తాము ఆకలితో నిరసన తెలపవలసి వస్తోంది.
సంజయ్ నిరసన ఒక విస్తృతమైన కథను చెబుతోంది- అది వ్యవస్థల పతనానికి నిదర్శనం, అక్కడ చట్టబద్ధత అనే విలువ కేవలం సహనంతోనే బ్రతికి ఉంది.
ఇది ప్రజాస్వామ్యాన్ని కదిలించే ఒక నిజాన్ని వెలికితీస్తుంది- కోర్టులు చర్య తీసుకోవడం నిరాకరించినప్పుడు, నిరాహారదీక్ష (హంగర్ స్ట్రైక్) న్యాయం కోసం మిగిలిన చివరి భాషగా మారుతుంది.
– జైలు అధికారులు చట్టాన్ని అనుసరించి ఉంటే, నిరాహారదీక్ష అవసరం అయ్యేదే కాదు.
– కోర్టులు తామే ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి ఉంటే, ఒక సెల్ లోపల నుండి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉండేది కాదు. – చట్టబద్ధత భ్రమగా మారినప్పుడు, అధికారానికి సత్యాన్ని తెలియచేయడానికి మిగిలి ఉన్న ఒకే మార్గం ఆహారాన్ని నిరాకరించడం.




