ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన  సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, భారత ఎన్నికల సంఘం తీరుతెన్నులు,  ఎన్డీఏ కూటమి ప్రభుత్వ  “ఓటు చోరీ”   పైన. రెండవది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ పైన జరుగుతున్న సైనిక,  భావజాల పరమైన దాడుల నేపథ్యంలో.  వారు సాయిధ పోరాట విరమణ చేసి ఎన్నికలలో పాల్గొనాలని.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందించి, ప్రకటించిన తీరు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలకు గురికాబడింది. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు జోక్యం వరకు వెళ్ళింది. అయినప్పటికీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ బద్ధంగా జరగలేదనే విమర్శతోనే బీహార్ కి 10వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రభుత్వం కొలువు తీరింది. మరోవైపు మావోయిస్టులు అంటున్నట్లుగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య డొల్లతనం ఈ సందర్భంగా తేట తెల్లం కావడం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. మావోయిస్టులు ఇచ్చే “ఎన్నికల బహిష్కరణ ” నినాదం స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త,  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఈ సందర్భంగా చేసిన విశ్లేషణ  ప్రాచుర్యం పొందింది.

1952 నుంచి ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న ఎన్నికల వ్యవస్థ గూర్చి ఒకసారి అవలోకనం చేసుకోవడం మంచిది.1952 లో మొట్ట మొదట భారత దేశంలో జరిగిన ఎన్నికలు భారత జాతీయ ఉద్యమ స్ఫూర్తితో జరిగాయి. అలా 35 సంవత్సరాలు కేంద్రం లోను, మెజారిటీ రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రంలో మొట్ట మొదట వామపక్ష కూటమి ప్రభుత్వం ఈ.ఎం.ఎస్. నంబూద్రి పాద్  నాయకత్వంలో ఏర్పడిన తర్వాత, నెహ్రూ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్- 356 ను ప్రయోగించి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ పరంపర 1975- జూన్ ఎమర్జెన్సీకి దారితీసి, కాంగ్రెస్ పార్టీ ఒక నియంతృత్వ పార్టీగా తయారు కావడం జరిగింది. న్యాయస్థానాల తీర్పులను కూడా లెక్క చేయని పరిస్థితి నుంచి, ప్రతిపక్ష పార్టీల ప్రజాస్వామిక నిరసనలను కూడా సహించక, ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ జైలు పాలు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అనంతరం 1977లో ఏర్పడిన కాంగ్రెసేతర జనతా పార్టీ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే అతుకుల బొంతలా కూలిపోవడం జరిగింది. మరలా 1980లో  ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, తదుపరి ఆమె హత్యానంతరం కూడా రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు మొదలగువారు ప్రధాన మంత్రులుగా వ్యవహ రించారు.పీవీ కాలం లోనే బాబ్రీ మసీదు వివాదం చెలరేగి 1992లో అద్వానీ రథయాత్రతో మతతత్వ రాజకీయాలు దేశంలో పెరిగి, ఆర్ఎస్ఎస్ భావజాల  భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో 2000 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలోనికి రావడం జరిగింది. అనంతరం జరిగిన ఎన్నికలలో మరలా మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి,పది సంవత్సరాలు అధికారంలో కొనసాగడం జరిగింది. 

 ఇప్పుడు 2014 నుంచి 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం కొనసాగిస్తున్నది. అయితే 2019 నుంచీ ఎన్నికల్లో ఈవీఎంల వాడకం పైన, ఎన్నికల సంఘం తీరుతెన్నుల పైన… ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించడం, అవి 2024 ఎన్నికలలోనూ, మొన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా “ఓటు చోరీ” ఆరోపణలతో ఎన్నికల వ్యవస్థ  దిగజారుడు తనాన్ని మరింతగా బట్ట బయలు చేయడం జరిగింది.

 ఇక ఎన్నికలలో పాల్గొంటున్న అభ్యర్థులు, వారి ఎంపిక గూర్చి పరిశీలిస్తే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్తోమతలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి సీట్లు కేటాయిస్తున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం  30 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఎన్నికలలో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు నోటు, మందు సారాయి ఎన్నికలలో ఏరులై పారుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ డి ఏ కూటమి ఎన్నికల సంఘాన్ని తమ గుప్పెటలో ఉంచుకొని, ఓటరు జాబితాలను తారుమారు చేసి గెలవటం జరుగుతున్నదని ప్రతిపక్ష పార్టీలే స్వయంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇంత అవినీతి, అక్రమాలకు పాల్పడి, విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేసిన పార్టీలు, వాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు నీతి మంతులుగా ఉంటారని ప్రజలు ఆశించడం నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని భావించడమే అవుతుంది. అయితే 1952 నుంచి ఇప్పటివరకు పార్లమెంటరీ రాజకీయ పక్షాలు ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని, ఎన్నికలే ప్రజాస్వామ్యం,  ప్రజాస్వామ్య మంటే ఎన్నికలని… చెబుతున్న కబుర్లన్నీ నీటి మీద రాతలనే ఇప్పుడు ప్రజలకి  బాగా అర్థం కావడం జరిగింది.

ఇదే సందర్భంగా మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట విరమణ చేసి, జనజీవన స్రవంతిలో కలిసి, ఎన్నికల ద్వారా రాజ్యాధికారం చేపట్టాలని కొంతమంది బుద్ధి జీవులు పిలుపునివ్వడం మన వ్యవస్థ మార్పుకి దోహద పడుతుందా? అనే చర్చ కూడా జరుగుతుంది. మరి పరకాల ప్రభాకర్ గారు అన్నట్లుగా “ఎన్నికల బహిష్కరణ” ద్వారా ఫలితం ఉంటుందా? దిగజారి పోతున్న ఎన్నికల వ్యవస్థకి చికిత్స విధానం ఏమిటన్న చర్చ కూడా జరుగుతున్నది. లేక 1975 ఎమర్జెన్సీ తర్వాత ఒక జయప్రకాష్ నారాయణ లాంటి నాయకుని నాయకత్వంలో మరో స్వాతంత్ర పోరాటం చేపట్టాలా?

చరిత్ర ఎప్పుడూ వెనుకకు వెళ్లి మొదలవ్వదు. అది సరికొత్తగా వర్తమానం నుండి భవిష్యత్తులోకి పయనిస్తుందికదా.

లేదా బిజెపి, కాంగ్రెస్ కూటములకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర మూడవ కూటమి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఏది ఏమైనా ఆర్ఎస్ఎస్ భావజాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విశాలమైన ఐక్య సంఘటన ఏర్పడి,  ప్రజాస్వామిక విలువల కోసం, స్వేచ్ఛాయుతంగా దేశంలో ఎన్నికలు జరగడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కృషి చేసినప్పుడు మాత్రమే దిగజారిపోతున్న ఎన్నికల వ్యవస్థను మరల నిలబెట్టగలమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ముందు ముందు ప్రజా స్పందన ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెబుతుందని ఆశిద్దాం.

జిల్లా కార్యవర్గ సభ్యుడు, ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.

Leave a Reply