పాఠశాల గడియారం మోగాల్సిన వేళ
ఆకాశం ఎందుకు అగ్నిగుండాల్ని కురిపించింది?
పుస్తకాల మధ్య కూర్చున్న పిల్లలు
ఏ యుద్ధానికి శత్రువులయ్యారు?
చిన్న చేతుల్లో పెన్సిల్ ఉండటం
ఎవరికి అంత ప్రమాదమైందీ?
మీ యుద్ధాలకు సరిహద్దులు ఉంటాయంటారు,
మ్యాప్‌ల మీద గీతలు గీస్తారు.
అయితే చెప్పండి
పిల్లల ఛాతీల మీద పడిన బాంబులు
ఏ సరిహద్దు దాటాయి?
ఏ గెలుపు కోసం ఈ చిన్న ప్రాణాలు చెల్లించాయి?
ఇప్పుడు ఆ నేల మీద
బ్యాగులు పడి ఉన్నాయి, పుస్తకాలు పడి ఉన్నాయి
కానీ వాటిని మోసే చేతులు లేవు
అమ్మల అరుపులు మాత్రమే ఉన్నాయి
మీ యుద్ధాల అసలు శబ్దం అదే కదా?
దేశాలు గెలిచామని గొప్పలు చెప్పుకోండి,
జెండాలు ఎగరేయండి, ప్రసంగాలు చేయండి.
కానీ చరిత్ర మాత్రం ఇలా రాస్తుంది
మీ విజయాల పునాది
పిల్లల సమాధుల మీదే కట్టబడింది.
యుద్ధం మొదలుపెట్టేది పెద్దలే,
కానీ దాని ఖరీదు పిల్లల ప్రాణాలే.
ఎందుకంటే రేపు నిలబడి
“ఇది ఎందుకు జరిగింది?” అని అడగడానికి
ఒక తరం లేకుండా పోతుంది కదా.
అందుకే పిల్లలు చనిపోయిన ప్రతి యుద్ధం
విజయం కాదు, మనిషితనం ఓడిపోయిన రోజు
Related