ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపమైన యుద్ధాలు లేదా సాయుధ పోరాటాలు,తిరుగుబాట్ల చరిత్రే. నేడు అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని సామ్రాజ్యవాదులే ప్రత్యక్షంగా చేస్తున్న యుద్ధాలు కాగా మరికొన్ని వీరి ప్రోత్సాహంతో జరుగుతున్నవి. సామ్రాజ్యవాదమంటేనే యుద్ధమన్న సూత్రీకరణ నిరంతరం రుజువవుతునే ఉంది. సర్వ వ్యాప్తమైన ఈ యుద్ధం మునుపెన్నడూ కంటే నేడు మన సమాజాన్ని పీడిస్తుండడం వల్ల ఈ యుద్ధం అంటే ఏమిటి? ఇది ఎందుకు? ఎప్పటి నుండి ఉనికిలో ఉంది? ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఉనికిలోకొచ్చింది? దీన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చుకోవచ్చా? యుద్ధాలకు ముగింపు పలకడానికి మార్గం మేమిటి? ముఖ్యంగా పాలకవర్గాలన్నీ మన దేశంలోని పీడితుల విముక్తే లక్ష్యంగా సాగుతున్న విప్లవోద్యమాన్ని చుట్టుముట్టి అణచివేయడానికి తమ వర్గ పాలనను నిలబెట్టుకోవడానికి హింస పైననే ఆధారపడుతున్నాయి. హింసా రూపమైన రాజ్యాంగ యంత్రంలోని ఎనిమిది లక్షల పారా మిలటరీ, మిలటరీ బలగాలను మోహరించి కగార్ పేరుతో ప్రజల పై యుద్ధం చేస్తున్న పాలకులే మరోవైపు తమ వర్గ పాలన రాజకీయ రూపమైన రాజ్యాంగ వాదాన్ని, చట్టబద్ధవాదాన్ని, బూర్జువా ప్రజాస్వామ్యవాదాన్ని విప్లవోద్యమానికి పోటీగా,ప్రత్యామ్నాయంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందుకని ఈ విషయం పై దృష్టి పెట్టాలి ‌మావో చెప్పినట్లు ‘యుద్ధం అంటే మానవుడిని మానవుడు హత్యచేసే బ్రహ్మ రాక్షసి యుద్ధం.వర్గాల మధ్య,జాతుల మధ్య,ప్రభుత్వాల మధ్య లేక రాజకీయ గ్రూపుల మధ్య వైరుధ్యాలు తీవ్రమై ఒక దశకు చేరుకున్నప్పుడు , ఆ వైరుధ్యాల పరిష్కారానికి వినియోగించే అత్యున్నత పోరాట రూపమే ఈ యుద్ధం.వ్యక్తిగత ఆస్తి, వర్గాలు ఏర్పడినప్పటి నుండి యుద్ధం అమలులో ఉంది’ అనే విషయాన్ని గ్రహిస్తాం. మార్క్స్-ఎంగెల్స్ లు సకల సామాజిక పరిస్థితులను హింసాత్మకంగా కూలదోయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ‘కమ్యూనిస్టులకు తమ అభిప్రాయాలనూ,లక్ష్యాలనూ దాచుకోవడం అంటే అసహ్యం. సమస్త వర్తమాన సాంఘిక పరిస్థితులను బలవంతంగా కూలదోయడం ద్వారానే తమ లక్ష్యాలు సిద్ధించగలవని వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తారు. కమ్యూనిస్టు విప్లవమంటే పాలకవర్గాలు గజగజ వణకనీ.కార్మికులు పోగొట్టుకునేది ఏమీ లేదు, తమ శృంఖలాలు తప్ప. వాళ్ళు పొందవలసింది ఎంతైనా ఉంది ‘అంటారు.

రివిజనిస్టులకు, పార్లమెంటరీ పంథా వాదులకు జవాబు చెప్పే సందర్భంలో లెనిన్ అంతర్యుద్ధం లేకుండా చరిత్రలోని గొప్ప విప్లవాలలో ఏ ఒక్కటీ జరుగలేదు, అంతర్యుద్ధం లేకుండానే పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిజానికి పరివర్తన జరుగుతుందని ఏ ఒక్క నిజమైన మార్క్సిస్టు భావించి ఉండలేదు.

లెనిన్ యుద్ధాలకు సంబంధించి ప్రధానమైన గతితార్కిక సూత్రం ఇది,’యుద్ధం అంటే వేరే పద్ధతుల్లో (హింసాత్మక పద్ధతుల్లో) రాజకీయాలను కొనసాగించడం తప్ప వేరేమీ కాదు. యుద్ధ చరిత్ర విషయంలో అతి గొప్ప రచయుతలలో ఒకరైన క్లాజ్ విట్జ్ – అతడి ఆలోచన హెగెల్ నుండి ప్రేరణ పొందింది. అతని సూత్రీకరణ, ప్రతి యుద్ధాన్ని నిర్ధిష్ట కాలంలో సంబంధిత శక్తుల-ఆ దేశాలలోని వివిధ వర్గాల- రాజకీయాల కొనసాగింపుగానే పరిగణించిన మార్క్స్,ఎంగెల్స్ ల వైఖరి కూడా ఎల్లప్పుడూ ఇదే.’అంటాడు.’మార్క్సిజం దృష్టి నుండి అంటే ఆధునిక శాస్త్రీయ సోషలిజం దృష్టి నుండి చూస్తూ యుద్ధాన్ని ఎలా అంచనా వేయాలి దాని పట్ల ఏ వైఖరి చేపట్టాలి అనే అంశం పైన సోషలిస్టులు సాగించే ఏ చర్యలోనైనాగానీ ప్రధానమైన అంశం ఇది.యుద్ధం ఎందుకోసం జరుగుతోంది. ఏ వర్గాలు యుద్ధాన్ని సాగిస్తున్నాయి, దానికి నాయకత్వం వహిస్తున్నాయి. మార్క్సిస్టులమైన మనం అన్ని యుద్ధాలను ఎలాంటి విచక్షణా లేకుండా వ్యతిరేకించే వారి కోవకు చెందం. మనం ఇలా అంటాం:మా లక్ష్యం సోషలిస్టు సామాజిక వ్యవస్థను సాధించడం, అది మానవాళి వర్గాలుగా చీలిపోయి ఉండడాన్ని అంతం చేయడం ద్వారా, ఒక మనిషి మరో మనిషినీ, ఒక జాతి మరో జాతినీ చేసే దోపిడీనంతటినీ అంతం చేయడం ద్వారా యుద్ధం జరగడానికి ఉన్న సంభావ్యతనే అనివార్యంగా అంతం చేస్తుంది. అయితే, సోషలిస్టు సామాజిక వ్యవస్థను గెలుచుకోవడం కోసం సాగించే యుద్ధంలో మనం, ప్రతి ప్రత్యేక దేశంలోనూ అంతర్గతంగా సాగే వర్గ పోరాటం, ఆ వర్గ పోరాటం చేతనే ప్రభావితమైన భిన్న దేశాల మధ్య సాగే యుద్ధాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందువలన మనం విప్లవ యుద్ధాల సంభావ్యతను, అంటే వర్గ పోరాటం నుండి తలేత్తే యుద్ధాల, ప్రత్యక్ష, తక్షణ విప్లవ ప్రాధాన్యత కలిగిన యుద్ధాల సంభావ్యతను నిరాకరించం’ అని అంటాడు.

లెనిన్,యుద్ధాలను న్యాయమైన యుద్ధాలు – అన్యాయమైన యుద్ధాలు అని రెండు రకాలుగా పేర్కోన్నాడు.

అందులో 1.న్యాయమైన (ధర్మ) యుద్ధాలు-దురాక్రమణకు గాక స్వాతంత్ర్య కోసం చేసే యుద్ధాలు. విదేశీ దురాక్రమణ నుండి, తమను బానిసలుగా చేసే ప్రయత్నాల నుండి సంరక్షించుకోవడానికి చేసే యుద్ధాలు. పెట్టుబడిదారీ బానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేసే యుద్ధాలు. సామ్రాజ్యవాద సంకెళ్ళ నుండి వలస దేశాలను, పరాధీన దేశాలను విముక్తి చేసే యుద్ధాలు.

2.అన్యాయమైన (అధర్మ యుద్ధాలు)-దురాక్రమణ యుద్ధాలు విదేశాలను, విదేశీయ జాతులను జయించి బానిసలుగా చేయడానికై ప్రారంభించిన యుద్ధాలు.

అన్యాయమైన యుద్ధాలకు వ్యతిరేకంగా పట్టుదలతో పోరాటాలను సాగించాలని తమ తమ సామ్రాజ్యవాద ప్రభుత్వాలను కూలదోయడానికి విప్లవం విజయవంతం అయ్యే వరకూ సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలని పిలుపునిచ్చాడు.

ఇదే విషయం పై స్టాలిన్ ‘అలాంటి విప్లవం బూర్జువా వర్గ పాలన కోసమై ఏర్పడిన బూర్జువా ప్రజాస్వామ్యపు చట్రంలో వలేనే శాంతియుతంగా సాధించబడగలదని భావించడమంటే అలాంటి మనిషి మతిపోగొట్టుకునైనా ఉండాలి, సాధారణ మానవ అవగాహనను కోల్పోయైనా ఉండాలి,లేదా బహిరంగంగానే కార్మికవర్గ విప్లవాన్ని త్యజించి ఉండాలి ‘ అంటాడు.

మనం యుద్ధాలకు సంబంధించిన పై సూత్రీకరణలోని వాస్తవాలను నేడు వివిధ దేశాల్లో మరియు మన దేశంలోనూ సాగుతున్న యుద్ధాల్లోనూ గమనించవచ్చు.పరిస్థితుల్లో వచ్చిన మార్పు వల్ల యుద్ధాలకు కాలం చెల్లిందని లేదా మన దేశంలో యుద్ధానికి కాలం చెల్లిందని చేసే వాఖ్యానాలకు బూర్జువా వర్గం తమ ప్రయోజనాల కోసం చేసే తప్పుడు వ్యాఖ్యానాలు తప్పని తనే నిరూపిస్తుంది.రష్యన్ సామ్రాజ్యవాదులు ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం,సామ్రాజ్యవాద అమెరికా,జియోనిస్టు ఇజ్రాయెల్ ను కలుపుకొని పశ్చిమాసియాలో సృష్టిస్తున్న విధ్వంసం,వాటికి మన పాలకుల మద్ధతు ఇటీవలి రుజువు.మావో యుద్ధ అధ్యయనానికి గతితార్కిక భౌతికవాద సూత్రాలను,ప్రత్యేకించి వైరుధ్యాలను అన్వయించాడు.యుద్ధానికి సంబంధించి ఆయా దేశాల స్వాభావిక లక్షణాలను పేర్కొన్నాడు.ఇవి విప్లవ యుద్ధం వ్యూహం – ఎత్తుగడలను నిర్ణయిస్తాయని పేర్కొన్నాడు.సామ్రాజ్యవాద యుగంలో వర్గపోరాట అనుభవం, కార్మికవర్గం-సాయుధ బూర్జువా, భూస్వామ్య వర్గాలను యుద్ధం/సాయుధ పోరాటం ద్వారానే ఓడించగలుగుతామని రుజువైంది.మావో, మనం యుద్ధాన్ని నిషేధించాలని కోరుతాం.మనకు యుద్ధం అవసరం లేదు.కానీ యుద్ధాన్ని యుద్ధం ద్వారానే తొలగించగలుగుతాం.కార్మికవర్గం నాయకత్వం వహించే విప్లవాలలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం, యుద్ధం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం అనేది విప్లవం యొక్క కేంద్ర కర్తవ్యం, అత్యున్నత రూపం.ఈ మార్క్సిస్టు – లెనినిస్ట్ సూత్రీకరణ అన్ని దేశాలకూ వర్తిస్తుందని అంటాడు.అందుకని మార్క్సిస్టు మహోపాధ్యాయుల బోధనల రీత్యా మన విప్లవ అనుభవాల ద్వారా మనకు బోధిపడేది ఏమిటంటే పాలకులు ప్రారంభించిన యుద్ధాన్ని అంతం చేయడమే ప్రజల యుద్ధం యొక్క లక్ష్యం.యుద్ధాన్ని యుద్ధంతో ఎదుర్కోవడం ఒక్కటే మార్గం.అంతేకాని నిజమైన ప్రజాస్వామ్యంగా చెలామణీ అవుతున్న బూర్జువా నియంతృత్వంతో జతకట్టడం కానేకాదు.

యుద్ధంలో ప్రజల పాత్ర

విప్లవ ప్రజా యుద్ధాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడే విజయం సాధించగలుగుతాయి. విప్లవ యుద్ధాలు మార్క్సిస్టు పంథా అయిన ప్రజాపంథా పునాది పై సాగుతాయి.యుద్ధంలో గెలుపుకు ఆయుధాలు ముఖ్యమైన పాత్ర వహించే మాట వాస్తవమే అయితే నిర్ణయాత్మక పాత్ర వహించలేవు.స్టాలిన్-బోల్షివిక్కులు గ్రీకు పౌరాణిక నాయకుడైన ఆంటియన్ ను గుర్తుకు తెస్తున్నారని చెబుతూ ఆంటియన్ వలెనే వారు తమని కని,పాలిచ్చి పెంచిన తల్లితో,ప్రజా బాహుళ్యంతో అనుబంధాన్ని కలిగి ఉన్నందు వల్లనే బలంగా ఉన్నారు.వారు తమ తల్లితో ప్రజలతో ఈ అనుబంధాన్ని కలిగి ఉన్నంత కాలమూ అజేయులుగా నిలిచిపోవడానికి పూర్తిగా అవకాశముంది.బోల్షివిక్ నాయకత్వం అజేయమైనది కావడంలోని కిటుకు ఇదే అని ‘అంటాడు.అంతేకాదు బోల్షివీకరణ అంటే తాత్విక, సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ,ఆచరణ పరమైన రంగాలలో నిరంతర పోరాటం, దిద్దుబాట్ల ద్వారా బలోపేతం కావాలి.సంఘటితం చెందాలి అంటాడు.

మావో ఈ దృక్పధాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు.ఈ పంధాను ఆయన తాత్విక స్థాయిలో జ్ఞాన సిద్ధాంతంగా,రాజకీయ,నిర్మాణ స్థాయిలలో ఏ విధంగా అది సరైన రాజకీయ పంధాయో, అత్యంత సరళమైన పద్ధతిలో బోధించాడు.ఆయన విశ్లేషణలో కార్యాచరణ అంతటిలోనూ ప్రజల నుండి ప్రజల వద్దకు అనే సూత్రం పై ఆధారపడి మాత్రమే సరైన నాయకత్వం అభివృద్ధి చెందుతుంది.

లెనిన్,’సోషలిస్టు చైతన్యం అనేది వర్గ పోరాటంలోంచి సద్యోజనితంగా (దానంతట అదే) పుట్టుకొచ్చినదేదో కాదు, శ్రామిక వర్గపు వర్గ పోరాటంలోకి బయటి నుండి ప్రవేశ పెట్టబడినదే.అందుకనే,తన స్థానాన్ని గురించిన చైతన్యంతోనూ,తన కర్తవ్యాన్ని గూర్చిన చైతన్యంతోనూ శ్రామిక వర్గపు మనస్సును నింపడమే (అక్షరాల శ్రామిక వర్గానికి నూరిపోయడమే) అని చెప్పి శ్రామిక వర్గానికి అగ్రగామి దళమైన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.ప్రజలకు చైతన్యం లేదనే సాకుతో శ్రామికవర్గపు అగ్రగామి దళంగా ఉండి నిర్వర్తించాల్సిన కర్తవ్యం వదిలిపెట్టి వెనుకబడ్డ దళంగా మారితే ఇలాంటి వారిని చరిత్ర చెత్త బుట్టలో విసిరి వేస్తుంది’అంటాడు. ‘నిజానికి ఈనాటి ఉద్యమ బలం జన సామాన్యపు ప్రధానంగా, పారిశ్రామిక వర్గపు చైతన్యంలో ఉంటుదన్న విషయాన్ని, దాని బలహీనత విప్లవ నాయకుల్లో చైతన్యమూ, చొరవా లోపించడంలో ఉంటుందన్న విషయాన్ని ఇంత వరకు ఎవ్వరూ శంకించి లేదనుకుంటాను ‘అని విశ్లేషిస్తారు.

 మన దేశ బ్రాహ్మణీయ భూస్వామ్య,గుత్త నిరంకుశ పెట్టుబడిదారీ శక్తులు సామ్రాజ్యవాదుల అండతో ఫాసిస్టు హిందూత్వ కార్పోరేట్ రాజ్యం నెలకొల్పడానికి పీడిత ప్రజల పై యుద్ధం చేస్తున్నాయి.వారి న్యాయమైన పోరాటాలను రక్తపుటేరుల్లో ముంచుతున్నాయు. చరిత్రలో వర్గ పోరాటాల వెనుకంజ స్థితిని ఉపయోగించుకొని వివిధ దేశాల్లో చేసినట్లుగా స్వార్ధపరులను,ఐడియలాజికల్ గా బలహీనులను చేరదీసి విప్లవోద్యమానికి ముగింపు పలకడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి.ఈ వాస్తవ స్థితిని అర్థం చేసుకుని సామ్రాజ్యవాద వ్యతిరేక,వర్గ పోరాటాల మరియు ప్రత్యేక ప్రజాస్వామిక ఉద్యమాలను పునర్నించడం ద్వారా తాత్కాలిక వెనుకంజను అధిగమించాలి. యుద్ధం వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ముడివడి లేదు.ముందే పేర్కోన్నట్లు దానికి ‌స్వంత ఆస్తితో ముడివడిన వర్గ పునాది ఉంది. యుద్ధానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను దాని స్వభావాన్ని, దానికీ ఇతర సమస్యలకున్న సంబంధాన్ని సమగ్రంగా తెలుసుకున్నపుడే యుద్ధ సూత్రాలు అర్ధం చేసుకోగలుగుతాము.యుద్ధంలో విజయాన్ని సాధించగలుగుతాం. యుద్ధాలకు శాశ్వత ముగింపు పలికే దిశ వైపు ముందడుగు వేయగలుగుతాము.

Leave a Reply