అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ

ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..

                యుద్దమంటే సాధించడం కాదు

                కోల్పోవడం మాత్రమే

                చరిత్ర చెప్పని నిజమేమంటే

                యుద్దం రెండు దేశాల మధ్య కాదు

                అదెప్పుడూ

                మన మనుష్యుల మధ్యే..అంటూ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాష్టీకంపై రాశారు. అసలు ఇవాల్టికీ ఈ యుద్దం ఆగలేదు. ఏదో కవిత్వస్తూనే అమాయక పాలస్తీనా ప్రజల ప్రాణాలను తీస్తున్నది. అడపా దడపా ఏదో వొక నెపంతో దాడులు చేస్తూనే వుంది. యుద్దం ఆగిందన్నది భ్రాంతి మాత్రమే. ఈ కవిత మిరప మహేష్‌ రాసిన పడమటీది నాటకం కవిత్వంలోనిది. ఈ కవిత్వంలోని కవితలన్నీ ధిక్కార స్వరాలే. కవిత్వం చదువుతున్నంతసేపూ అక్షరాలకు శిల్పపరిమళాలద్దిన అనుభూతి కలుగుతుంది. కవిత్వపు బహుముఖఫలకాలను ఈ కవిత్వం చిత్రిస్తుంది. ఈ కవిత్వంలో ప్రారంభ కవిత అన్నింటికంటే ముందుగా అనే శీర్షికతో రాశారు. ఈ కవితలో గాఢత చదవండిలా..

మీకే కాదు ఈ మట్టికి కూడా/మేమంటే ఎరుసే/విత్తనాలు నాటేసుకున్నంత సులువుగా/మా దేహాలను మింగేస్తది/అడపా దడపా తలెత్తి చిగురిస్తే/మా కంఠాలను నలిపేసే/నెత్తుటి రథయాత్రకు తోవనిస్తది/విరిసే పూలకే కాదు/పుట్టే నలుసుకి కూడా/వర్ణాలంటకట్టటం ఈ మట్టికలవాటే/ఇక మా కన్నీటి గునపాలతో/ఆ మట్టి గుండెల్లోనే పాతాళం దాకా సమాధులు తవ్వి/అన్నింటికంటే ముందుగా కులం కళేబరాల్ని పాతెయ్యాలి/పుణ్య దేశపు నేల సరిపోతుందో లేదో మరి!

జీవితంలో ఎదుర్కొంటున్న వివక్ష, అణగారిన వర్గాల సమూహాలు అధిపత్య కులాల నుండి ఎదుర్కొనే అవమానాలు కవిని  ఇలా శిల్పించాయనవచ్చు. పై కవితలోని అభివ్యక్తి, వాస్తవిక వస్తువు, వైవిధ్యమైన శిల్పం ఈ కవితను గుండెల్లో నిలుపుతుంది. ఈ మనువాద సమాజంలో దళితులకు అవమానాలు, అవహేళనలు కొత్తేమీ కాదు. ఏడున్నర దశాబ్దాలు పూర్తైన భారతదేశంలో వివక్ష అంతమయ్యందా? అని ప్రశ్నిస్తే వివక్ష తన రూపాన్ని మార్చుకుందంతే. సాహిత్యమివాళ   ఉద్భవించడం వల్ల బాధల్ని తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఆదిమసాహిత్యమంతా లయాత్మకభాషలోనే సాగింది. దాని తొలిరూపం పాట. ఇప్పుడు పాటైనా, మాటైనా అది సామాన్య ప్రజల ఆవేధనల్లోంచి పుడుతున్నది. ఈ కవి తన కవిత్వం నిండా ఇలాంటి బాథల్ని గాథల్ని మనముందు పరిచారు. వైవిధ్యశిల్పానికి ప్రతిబింబంగా నిలిచే కవిత్వమిది.!

గాలి లాక్కెళ్లిపోతున్నట్టు వాన చినుకులను సంద్రాలు మింగేస్తున్నట్టు ప్రాణాలన్నీ శూన్యంలోకి నిశ్శబ్దంగా రాలిపోతున్నాయి

కన్నీళ్ళై ప్రవహించటం మరచిన తడిలేని పొడికళ్ళే అందుకు సాక్ష్యం

నేల నుద్రుటిన ఇంకిపోయిన రక్తపుబొట్లు ఏళ్లతరబడి మట్టిని చిత్తడి చేసిన చెమటబొట్లు ఒక్కరివేనంటే బహుశా..! ఈ మట్టి నమ్మదేమో..!?/చీకటి రంగును చెరిపేసివేకువ తివాచీ ముందు రెప్పలు తెరుచుకునే కళ్ళన్నీ బ్రతుకంతా పరచుకున్న బాధ్యతల ముళ్లబాటనే చూస్తాయి/నాలుగు మెతుకుచిగుళ్లను కడుపారా కతికేందుకు గొడ్డుచాకిరీ చేస్తున్న గడ్డురోజుల్లో ఎన్నెన్ని ఆశలను గుండె లోలోతుల నుండి రోజుల తరబడి చేదుతున్నా../వెలివేయబడ్డ దేశపు ప్రశ్నార్థకాన్ని../చీకటిదీపాన్ని ఆర్పేసి వేకువచీర కట్టే అమ్మ రోజూ తూరుపు పువ్వుకి పురిటి బొడ్డు కోసేది నెత్తిన తట్ట చేతికొడవలితో పొలం వైపు ఆమె ప్రవహిస్తుంటే..

ఈ కవిత్వంలో వస్తువును శిల్పం డామినేట్‌ చేయగలిగింది. పై కవితా వాక్యాలు వివిధ కవితల్లోని శిల్పకళాఖండాలు. ఇవాళ తెలుగు కవిత్వంలో అనుభవిక కవిత్వం విరివిగా వస్తున్నది. ఎలా రాయగలుగుతారు అని యోచించినపుడు కవి సామాజిక నేపథ్యమే కవికి కలాన్నందించి సాహిత్యఉద్యమం చేయమంటుంది. ఈ కవిని అంచనా వేసే క్రమంలో ఈ కవి కవిత్వాన్ని చదువుతున్నంతసేపూ ఈ కవిని ఏ ఒక్క సిద్దాంతంతో అపాదించి చూడలేం. ఈ కవిత్వంలో ఉన్న కవి దృక్ఫథాన్ని, కవి వైఖరిని ఈ కవి సమసమాజ నిర్మాణంలో భాగం కావాలనుకుంటున్నారు. ఈ నిర్మాణానికి పనిముట్లను ఈ కవిత్వంలో సిద్దం చేసుకున్నాడనిపించింది. ఈ పుస్తకంలో డోర్‌ డెలివరి అనే కవితలో హత్యాసంస్కృతికి వ్యతిరేకంగా రాశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు 2022లో మే 19న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్‌ డెలివరీ చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు.  కేసును విచారించాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఎమ్మెల్సీ వేసిన పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో డ్రైవర్‌ హత్య కేసుపై సిట్‌ విచారణకు ఉన్నత న్యాయస్థానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లైంది. ఈ ఘటనను మహేష్‌ ఇలా రాస్తారు..

కాళ్ళూచేతులు విరిచేసి

మరో దళిత హత్యను

మీ అకౌంట్‌ లో దర్జాగా

జమచేసుకుని

శవాన్ని వెదుక్కునే

వేదన లేకుండా

డోర్‌ డెలివరీ చేసిన

నీ మంచి మనస్సుకు

మా జాతి యావత్తూ గులామయ్యింది….ఉద్రేకం తెలుగు కవి జాతీయ లక్షణం అంటాడు శ్రీశ్రీ..ఇలా రాకపోతే కవికి అర్థం లేదు. ఇన్ని దురాగతాలు జరుగుతున్నా చూస్తూ ఏ కవి ఉండలేడు. ఉండకూడదు కూడా..అక్కడే మామూలు కవికీ ప్రగతిశీలకవికి ప్రధానమైన తేడా ఉంది. ప్రగతిశీలకవి జీవితాన్ని అన్ని దృక్కోణాలనుంచీ పరిశీలిస్తాడు. సాహిత్యాన్ని, సకల కళలనీ, అన్నితరహాల రాజకీయాల్నీ జీవితంలో ఒక భాగంగానే పరిగణిస్తాడు. ఇలా పరిగణించడంలో తాను ఇదివరకు అలవాటుపడిన ఎన్నో ‘అపనమ్మకాలను బుద్ధిపూర్వకంగా పరిత్యజిస్తాడు. అన్ని సమస్యలను సశాస్త్రీయమైన సహేతుకమైన పద్ధతులతో పరిశీలిస్తాడు. ఇలా పరిశీలించి, సరిjైున అవగాహనకి వచ్చి, సుసాధ్యమైన సుసాధ్య పరిష్కారమార్గాలను ప్రవచించడానికి ఇతనికి కొన్ని మైక్రోస్కోపులూ, టెలిస్కోపులూ, స్టెతస్కోపులూ లభించాయి. వీటన్నిటికి పర్యాయపదమై నమాట ఒకే ఒకటుంది. అదే మార్క్సిజం. అదే విప్లవనౌకను విజయగమ్యానికి నడిపించే ధ్రువతార! అని ఎప్పుడో చదువకున్నమాట గుర్తొస్తుంది. మార్క్సిజం అనే ఈ సిద్ధాంత దర్శనానికి ప్రగతిశీలకవులు నిబద్ధులై ఉన్నారు. వీరు కవితలు కట్టినా, కథలు చెప్పినా, నాటకాలు రాసినా, సినీమాలుతీసినా, పత్రికలు వెలువరించినా ఈ మార్క్సిస్టు నిబద్ధత ఒకటే వీళ్ళని ప్రభావితంచేసి ప్రచోదిస్తుంది. మార్క్సిస్టు అవగాహన వీళ్లకు జీవితాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతోంది. అందుకే వీళ్ళ రచనలు అందర్నీ, ముఖ్యంగా భవిష్యత్తుకి వారసులైనా యువతరాన్ని అంత తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. విప్లవ రచనావ్యాసంగం ప్రధానంగా యువకుల ఉద్యమం. ఈ ఉద్యమకారులు వయస్సులోకన్నా మనస్సులో యువకులు. ఈ యువమనస్సులను స్పందింపజేస్తూ విప్లవరచన సాగిపోతోంది. అని శ్రీశ్రీ చెప్పిన మాటల్ని విస్మరించలేం. దీన్ని మార్క్సిస్ట్‌ విమర్శకులు డా.బి.సూర్యసాగర్‌ ఇలా అంటారు. సాహిత్యం రాజకీయాలకు దూరంగా వుండాలనే దివాలాకోరు నినాదం ఒకటుంది. ఉన్నత స్వభావంగల కళలకు రాజకీయ స్పర్శ సోకగూడదని, రాజకీయ స్పర్శ కళను కళంకితం చేస్తుందని వాదిస్తారు. ఇది వట్టి బూటకం. రాజకీయాలకు దూరంగా ఉన్న రచన ఏదీ వుండదు. జీవితాన్ని వాస్తవికంగా చిత్రించడంలో రాజకీయాలు తప్పనిసరిగా చోటుచేసుకుంటాయి. జీవితం, రాజకీయాలు వేరువేరుగా లేవు. జీవితంలోనూ మానవ చేతనలోనూ రాజకీయాలు అంతర్భాగంగా వున్నాయి. బూర్జువా విప్లవాలు, సామ్యవాద విప్లవాలతో, జాతీయ విముక్తి పోరాటాలతో ప్రజల, కళాకారుల చేతనలో రాజకీయ చైతన్యం పరివ్యాప్తమైంది. ‘‘విప్లవాన్ని ఆలకించండి’ అని అలెక్జాండర్‌ బ్లాక్‌, ‘‘ఇది నా విప్లవం’’ అని మయకోవస్కీ, 1917 రష్యన్‌ విప్లవాన్ని స్వంతం చేసుకున్నారు. ప్రజాతంత్ర వ్యవస్థకు గురజాడ, సామ్యవాద విప్లవానికి శ్రీశ్రీ ఆహ్వనం పలికారు. అయితే కళ నినాదప్రాయం కావడాన్ని, కళలోకి రాజకీయాల్ని కృత్రిమంగా చొప్పించడాన్ని మార్క్సిస్టు లెనినిస్టు సౌందర్యశాస్త్రం తిరస్కరిస్తుంది. సాహిత్యం రాజకీయ సిద్ధాంతం కాదు. రాజకీయాలకు అనుషంగికమూ కాదు. భావ చిత్రాలద్వారా జీవితంలో సహజభాగంగా రాజకీయాలు వెల్లడికావాలి. సాహిత్యంలో వాస్తవికత యొక్క సత్యప్రతిఫలన, జీవిత గాఢవిశ్లేషణ, సమకాలీన సాంఘిక ఆర్థిక రాజకీయధోరణుల పట్ల శాస్త్రీయమైన అవగాహనతో జీవిత చిత్రణ జరిగినప్పుడు ఆ సాహిత్యకృషికి రాజకీయ ప్రాధాన్యత సిద్ధిస్తుంది. మాక్సీంగోర్కీ కవులు ఎవరి పక్షాన ఉండాలో నిర్ణయించుకోమంటారు. అంతేకాక..In its basis art is the struggle for or against. There is not such nor can there be any indifferent art because man is not a camera, he doesn’t fix reality but either affirms or changes or destroys it”అంటారు. అందుకే ఈ కవి ప్రగతిశీలకవి. ఈ కవిత్వంలో శీర్షికతో వచ్చిన పడమటీది నాటకం కవితను చూద్దాం..

మబ్బులన్నీ ముఖానికి రంగులేసుకుని ఆకాశ వేదికపై నాటకమేదో వేస్తున్నాయి/ఉద్యమ నాటకమనుకుంటా పగలంతా సాగిన నాటకంలో ఎన్ని మలుపులో మరెన్ని పోరాటాలో అన్నీ బతుకు కోసమే/హీరో మన సూరీడే క్లైమాక్స్లో చనిపోయాక/ వేదికంతా రక్తసిక్తం /మబ్బులన్నీ ఆ నెత్తురుతోనే ముఖాల రంగులు కడిగేసుకుని /సంతాపంగా చీకటిగుడ్డ కప్పేశాక /పొద్దున చూసిన నాటకాన్ని చుట్టూ చేరి ఊకొడుతున్నపిల్ల నక్షత్రాలకి కథలా చెప్తుంది చందమామ/నాకు కూడా చూసిన నాటకం కంటే వింటున్న కథే బాగా నచ్చింది/ అలా వింటూ వింటూ చుక్కలతో పాటూ నేనూ నిద్రపోయాను/నా పక్కన మాత్రం రాత్రంతా కళ్ళు తెరుచుకుని ఆలోచిస్తూనే ఉంది జీవితం /రేపటి నాటకంలోనైనా హీరో గెలుస్తాడో లేదోనని..

కవికి భాషే పరికరం. ఆ భాష, ఆ కవిత్వ వస్తువు, గొప్ప వాక్యనిర్మాణంతో ఈ కవి కవిత్వం శిల్పనైపుణ్యాన్ని వెల్లడిస్తుంది. అలా రాయకపోతే పాఠకుడికి దూరమైపోతాడన్న సత్యాన్ని ఈ కవి గుర్తించాడు. ఈ కవిత్వం చదువదగ్గది. చదివే పాఠకుడికి కావలసినవన్నీ ఈ పడమటీది నాటకం కవిత్వంలో తీసుకోవచ్చు. కవిత్వంలో మనం చెబుకుంటున్న నిర్మాణ రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే ఈ కవిత్వం సంపూర్ణం.

Leave a Reply