ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

సమ్మె విజయవంతం కావడానికి కార్మిక వర్గం సమాయుత్తమాతుంది. పన్నెండు ఏళ్ల నరేంద్ర మోదీ  పాలనలో కార్మిక, కర్షక వర్గ  విధానాల పట్ల అనుసరి స్తున్న వైఖరి పట్ల అసంతృప్తి ఉంది.  ఇప్పటికే భారత దేశ రైతులు రోడ్లపై నిలబడి ఉన్నారు.వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాదని  చివరకు పోరాట రూపమే మిగిలిందనే నమ్మికతో వున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేలాది మంది రైతులు రోడ్లపై నిల్చున్నారు.

ఈ దేశానికి సంబంధించి నంతవరకు  కార్మికులు, కర్షకులు పునాదిగా ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా    ఉన్నారు. రైతులు ఈనాటికీ తమకు ఉన్న కొద్దిపాటి భూమి సాగులోనే ఉన్నారు. వ్యవసాయం కలసి రాకున్నా, భూమిని నమ్ముకున్నారు. నేలతో ఉన్న అనుబంధం మానసికమైనదిగా భావిస్తారు. దాని ద్వారా వచ్చిన ఫలసాయం రైతుకి కనీస జీవితాన్నిస్తుంది. కుటుంబం యావత్తు శ్రమించే ఆవరణ. 

కార్మికులలో వివిధ విభాగాలకు చెందినవారు ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని, సంఖ్యను అంచనా వేయడం సాధ్యం కాదు. అలాంటి అంచనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నాయనుకోవడం బ్రమ. రెండు ప్రధాన అంశాలైన కార్మిక, కర్షక శ్రమ విలువ గురించి మాట్లాడవలసిన సందర్భం.గ్రామాల విఛ్చిన్నత, పట్టణీకరణ అనివార్యత ఈ రెండు  పరిష్పర విరుద్ధ అంశాలు కాదు. పాలక వర్గాలు పట్టించుకోలేని అంశం మాత్రమే. తమ ఉపాధి మార్గంను ప్రజలే  ఎన్నుకున్నారు.ఈ మార్గాన్ని గుర్తించి పాలకవర్గాలు మరింత వెసులు బాటు కలిగించవలసి ఉంది.ఆవైపు శూన్యం.  అసంఘిటిత రంగంలో పనిచేస్తున్న వారిని గుర్తించడం, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో పాలక వర్గాలు విఫలమయినాయి.  విస్మరణకు గురి అయిన రంగం ఏదైనా ఉన్నది అంటే అసంఘటిత రంగం మాత్రమే. గ్రామాలు స్వయం ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమం బలహీనపడింది. ఉపాధి మార్గంగా రైతులు, రైతు కూలీలు పట్టణాలపై చూసే దృష్టి కూడా కాల అనుభవంలో ఉన్నది. అధికార మార్పిడి అనంతరం వేగవంతమైన వలసలు, రైతు కార్మికులుగా మారిన విధానం జీవన అభద్రత లోనే ఉన్నది. అభద్రత మాత్రమేనా సాంస్కృతిక, సామాజిక అంశాలు  అంతర్లీనంగా ఉన్నాయి. ఆచర్చకు ఇక్కడ అవకాశం లేదు.

ఎంత మాత్రమూ కన్న ఊరు తమ ఉపాధికి ఊతమివ్వదు అనుకున్నప్పుడు వలసలు సర్వసాధారణం. అసంఘటిత రంగంలో కోట్లాదిమందికి ఉపాధి పట్టణాల అభివృద్ధి నమూ నాలో దొరికింది. సంపన్న, మధ్య తరగతి ఇంటి    అవసరాలుకు ఎంతో కొంతమేర గ్రామీణ మహిళలు, బాల కార్మికులు అవసరం అయినారు.

 గ్రామాలను మరింత పటిష్టం చేయడానికి, వలస లను కట్టడి చేయడానికి      మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఎంతో కొంత మేర ఫలితాలను అందించింది.ఈ పధకం నిర్వహణలో అవినీతి, లోటు పాట్లు కంటే ‘కరేగా’ పధకం కొనసాగడం ఎంతో కొంత మేలు అనుకుని గ్రామాల శ్రమశక్తి ఎదురుచూసింది.తాజాగా మోదీ ప్రభుత్వం ఈ పథకం విలువను తగ్గించింది.

 భారతదేశ రైతులు మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాన్ని నిర్మించారు. ప్రభుత్వం అమలు చేసిన హింసాత్మక చర్యలలో ప్రాణాలు కోల్పోయారు.. కార్పొరేట్ రంగానికి సత్తువ పెంచే మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తిరిగి మళ్లీ రైతులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. భారత ప్రభుత్వం సందిగ్ధతలో  పడింది.

భారతదేశ కార్మిక రంగానికి అనేక తలాలు ఉన్నాయి. ఇది పాలకులకు తెలియని, అవగాహనలో లేని విషయం. అనేక రంగాలలో సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం ఉన్నది. భారతదేశ ఉత్పత్తి సూచికలో ఇది కీలకమైన విషయం. భారతదేశ ఉత్పత్తి సంబంధాలలో, ఇద్దరు కార్మికులతో పని చేయించుకునే దగ్గర నుండి వందలాదిమంది కార్మికులతో పని చేయించుకుంటున్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు  ఉన్నాయి.  బూర్జువా పారిశ్రామికవేత్తలకు  కొదవ లేదు.  రోజు కూలి  మార్గంలో తాపీ, వడ్రంగి, లేదా ప్రజల జీవన అవసరాలు తీర్చే అనేక వృత్తులలో అసంఘటిత కార్మిక రంగం ఉంది. కార్మికులుగా తమకు ఉన్న హక్కులు ఏమిటి అనే ఆలోచన కూడా దరికి చేరని  మానసిక స్థితి. ఈ నేపథ్యంలో కార్మికులను కట్టడి చేయాలనే ఆలోచనా ధోరణి   పాలకవర్గాల‌కు ఉన్న‌ది. 

కార్మికులు అంటే ఎవరు? వారికున్న హక్కులు ఏమిటి?   నిరంతర పోరాటాల ద్వారా పారిశ్రామిక కార్మిక‌వ‌ర్గం సాధించిన హక్కులు ఏమిటి?  భార‌త కార్మికోద్య‌మ చ‌రిత్ర‌లో వీటికి స‌మాధానాలు ఉన్నాయి.  కార్మిక రంగంలో మహిళల ప్రాతినిత్యం   క్ర‌మంగా  పెరుగుతున్నది.. కుటుంబ పోషణలో కార్మికులుగా మారిన ఒక అనివార్యత  కనబడుతుంది.  మహిళా కార్మికుల హక్కుల విషయంలో జవాబు చెప్పేవారు కూడా లేరు. అనేక చేతి వృత్తులలో, దుకాణాలలో మహిళల  ప్రాతినిధ్యం పెరుగుతుంది. వీరి సంపాదన కూడా కుటుంబ అవసరాల కోసం వెచ్చిస్తున్నారు. మహిళల శ్రమకు తగిన గౌరవ వేతనం లభించదు. కార్మిక రంగంలో ఇదొక ప్రధానమైన వివక్ష.

కార్మికుల సమస్యలను పరిష్కరించి మెరుగైన కనీస వేతనాలను అమలు చేయాల్సిన స్థితిలో కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కార్మిక చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టింది.  నిజానికి పాత కార్మిక చట్టాలు స్థానే ఈ నాలుగు  చట్టాలను తయారు చేసింది. చివరకు భారతదేశ కార్మిక సంఘాలు కొత్త చట్టం స్థానే పాత చట్టమే  మెరుగైనది అనే ఆలోచనకు వచ్చింది. ఎన్ని  ఖాళీలు ఉన్నా పాత కార్మిక చట్టమే మెరుగైనది అనే భావన వ్యక్త మౌతుంది. నిజానికి పాత కార్మిక చట్టాలలోని అంశాలను అలానే ఉంచి పది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం  మార్చగలిగింది.ఈ శాతం  భారత కార్మిక వర్గానికి వ్యతిరేకమైనది. వారి మానసిక, సృజనాత్మక శారీరిక అవసరాలను కుదించి వేసేది.

నూతన నిబంధనలు మారుతున్న జీవన శైలికి అవసరమైన వేతనాలను మరింత తగ్గిస్తుంది. పనిగంటలు మారుతున్నాయి. ఇరవై నాలుగు గంటల పని విధానంలో,,మూడు షిఫ్టుల స్థానంలో, రెండు షిఫ్ట్ లకు కుదించబడిన స్థితి కనబడుతుంది. పన్నెండు గంటల విధానం ఇప్పటికే అమలవుతుంది.కార్మికుల రక్త, మాంసాలను హరించి సృజనాత్మకత జీవన విధానాన్ని కొనసాగించలేని యంత్ర స్థితికి కార్మికుడి జీవితం నెట్టబడుతుంది.పాలక వర్గం బడా కంపెనీలకు ధన రూపంలో సహాయం చేస్తుంది. ఈ దళారి పాత్రకు భూమిక ఎన్నికల ఆవరణకు కావలసిన ఆర్థిక బాండ్ల రూపంలో వ్యక్తమవుతుంది.

ఈ నాలుగు  కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ భారత కార్మిక వర్గం ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమైంది. కార్మిక వర్గం లేకుంటే భారతదేశ ఉత్పత్తి సంబంధాలుకు అవకాశం లేదు. ఈ దేశ నిర్మితిలో అత్యంత నిజాయితీగల వర్గం. వారిలో పని సంస్కృతిని పెంచే బదులు వారి ఆర్థిక స్థిరత్వాన్ని  కుదించడానికి భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం ముందు మోకరిల్లుతుంది.దీనిని పూర్వపక్షం చేయడానికి వామపక్ష, ఇతర సంఘాలు, కార్మిక నాయకులు మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోరాట రూపాన్ని తయారు చేసుకున్నాయి. ప్రజలు,ప్రజాస్వామిక  వాదులు కార్మిక సంఘాల వైపు నిలబడి, ఈదేశ కార్మికులకు సంఘీభావంగా సమ్మెను విజయవంతం చేయాలి. ఫిబ్రవరి  పన్నెండుతో వివిధ వర్గాలు, ప్రజా సమూహాలు మమేకం కావాలి.

Leave a Reply