నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18న  ఆలయ దర్శన టికెట్ కోసం తలెత్తిన వివాదంలో అగ్ర కుల భూస్వామ్య శక్తులు జరిపిన దాడిలో రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘటనను విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కేవలం ఒక జాతరలో జరిగిన ఘర్షణ కాదు. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ఆధిపత్య  కుల దురహంకార దాడి.

జాతరలో ప్రవేశానికి ఫీజు చెల్లించలేదనే నెపంతో చాకలి గణేష్ కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వామ్య శక్తులు దాడి చేయడం, పసిబిడ్డను తన్నడం, మహిళలను వివస్త్రలను చేసేలా ఈడ్చుకెళ్లడం అగ్రకుల దురహంకారానికి నిదర్శనం.

దేశంలో రోజు రోజుకూ కుల వివక్ష పెరిగిపోతోంది. మనుషుల్లో మానవత్వం తగ్గిపోయి మతోన్మాదం, కులోన్మాదం పెరిగిపోతోంది.  భారత పాలకవర్గం సమాజాన్ని తిరోగమనం వైపు నడిపిస్తోంది. ఫాసిజం, మతోన్మాదం, కూలోన్మాదం వల్ల ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ, పీడిత కులాల ప్రజలకు, మహిళలకు రక్షణ కల్పించటంలో చట్టాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కుల మత ఉన్మాదం తారాస్థాయికి పోతోంది. సమాజంలో ఆధిపత్య కుల సమీకరణలు, సనాతనం పేరుతో మనువాద ధోరణులను కార్పొరేట్ బ్రాహ్మణీయ ఫాసిజం పెంచి పోషిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీటిని నియంత్రించడం లేదు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమాలు నడిచిన చోట, దళిత చైతన్యం వికసించిన చోట ఇటువంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంఘాటిత ఉద్యమాలతో ఎదుర్కోకపోతే ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోవలసి వస్తుంది. సామాజం అంధకారంలోకి మరలిపోతుంది.

ప్రజలు, ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిద్దాం. బ్రాహ్మణీయ మనువాద, భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా సామాజిక, విప్లవ ఉద్యమాల చారిత్రిక అనుభవాల నుండి ప్రజాస్వామిక సంస్కృతిని అభివృద్ధి  చేద్దాం. ఫాసిజానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడుదాం. కుమ్మెర దోషులను హత్యా నేరం కింద అరెస్టు చేసి శిక్షించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతపడాలి.

అర‌స‌విల్లి కృష్ణ‌, అధ్య‌క్షుడు                                                                                

రివేరా, కార్య‌ద‌ర్శి  

Leave a Reply