(నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమ పునర్నిర్మాణానికి పూనుకున్న కా. కొండపల్లి సీతారామయ్య 1972లో రాసిన సుప్రసిద్ధ పత్రం ఇది. దీనికి ఆత్మ విమర్శ రిపోర్టు అనే పేరు కూడా ఉంది. ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని, తాత్కాలిక ఓటమిని విమర్శనాత్మకంగా అర్థం చేసుకోడానికి, భవిష్యత్తుపట్ల నిర్మాణాత్మక, ఆశావాదంతో వ్యవహరించడానికి స్పూర్తిని ఇస్తుందని ఈ పత్రంలోని ఉపోద్ఘాత భాగాన్ని పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాం.. వసంతమేఘం టీం)
నక్సల్బరీలో 1967లో ఆరంభమైన రైతాంగ సాయుధ విప్లవం భారత విప్లవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. రివిజనిస్టు నాయకత్వం తెలంగాణా రైతాంగ సాయుధ విప్లవానికి ద్రోహం తలపెట్టిన తర్వాత చైతన్యపూరితంగా నిర్దిష్టమైన లక్ష్యంతో మార్పిజం – లెనినిజం – మావో ఆలోచనా విధానం గైడెన్సులో ఆరంభమై కొనసాగుతున్న సాయుధ రైతాంగ విప్లవానికి నాంది నక్సల్బరీయే. 1948 నుండి 1951వరకు జరిగిన వీర తెలంగాణ పోరాటం, పునప్రా, వాయలార్, బెంగాల్లోని తెభాగ ఉద్యమాలలో జరిగిన వీరోచిత సాయుధ పోరాటాలకు ‘వారసులుగా’ ఈనాటి సాయుధ రైతాంగ విప్లవాన్ని ఆరంభించి కొనసాగించగలగడం కమ్యూనిస్టుపార్టీ (మాలె. )కి ఎంతైనా గర్వకారణం. రివిజనిస్టు నాయకత్వంపై తిరుగుబాటు చేసి పార్టీలో పదునైన సిద్ధాంత పోరాటం జరిపిన ఫలితంగా వచ్చింది కనుక నక్సల్బరీ పోరాటం గతంలోని తెలంగాణా తదితర విప్లవకర పోరాటాలకంటే మెరుగైన పోరాటం. శత్రువు బలహీనంగా వుండే విశాల గ్రామీణ ప్రాంతాలలో స్థావర ప్రాంతాలు నిర్మించి, ఒంటరి స్థలాల నుండి విస్తార ప్రాంతాలకూ విస్తరిస్తూ క్రమ క్రమంగా చుట్టుముట్టి చివరకు నగరాలలో అధికారాన్ని హస్తగతం చేసుకొని సాయుధ శక్తి ద్వారా దేశవ్యాప్తంగా విజయం సాధించడమే విప్లవం యొక్క కీలక కర్తవ్యమనే విషయాన్ని యిదివరకెన్నడూ పార్టీలో సిద్ధాంతపరంగా ఆమోదించి వుండలేదు.
మార్సిజం-లెనినిజం మావో ఆలోచనా విధానం గైడెన్సులో నక్సల్బరీలో ఆరంభమైన రైతాంగ సాయుధ విప్లవం మన దేశంలో ఊడలు దిగిఉన్న రివిజనిజానికి మొట్టమొదటి గొడ్డలిపెట్టు. దానితోనే రివిజనిజానికి పునాదులు కదలబారాయి. అందుకే ఒకవైపు రివిజనిస్టు నయారివిజనిస్టులూ, మరొకవైపు దళారీ బూర్జువా వర్గానికీ, భూస్వామ్య వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెసు ప్రభుత్వమూ కలిసి రైతాంగ సాయుధ విప్లవాన్ని రక్తపుటేరుల్లో ముంచి అణచివేయడానికీ, దానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు విప్లవకారులను ప్రజల నుండి వేరుచేసి దెబ్బకొట్టటానికీ తమ శక్తియుక్తులనన్నిటినీ ప్రయోగించి రంగంలో కురికాయి.
నక్సల్బరీ రైతాంగ విప్లవం దేశ వ్యాపితంగా పీడిత ప్రజల నెంత ఉత్తేజపరిచిందో దోపిడీ వర్గాలనంత కలవరపెట్టింది. నక్సల్బరీ మార్గమొక్కటే రైతాంగ విముక్తికి మార్గమనే భావన క్రమంగా పీడిత రైతాంగంలో పెంపొందసాగింది. నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగంతోనూ, ఆర్థిక సంక్షోభంతోనూ సతమతమౌతున్న పట్టణ మధ్యతరగతి ఆ పోరాటంతో భారత విప్లవ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఉత్తేజం పొందింది. నక్సల్బరీలో అంటుకున్న నిప్పురవ్వ అనతికాలంలోనే భారతదేశంలో పలుతావులకు వ్యాపించింది. శ్రీకాకుళం, ముషాహరి, బీరూమ్, గోపీవల్లభపూర్, లఖింపూర్, ఖేరీలలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటాలు దోపిడీ వర్గాలను దేశవ్యాపితంగా హడలెత్తించాయి. కార్మికవర్గంలోనూ, పట్టణ మధ్యతరగతిలోనూ, ముఖ్యంగా విద్యార్థి యువలోకంలోనూ ఎన్నడూ లేనంతగా ఉత్సాహోద్రేకాలను రేకెత్తించాయి.
రివిజనిస్టు నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టు విప్లవకారులు కామ్రేడ్ చారుమజుందార్ ఆధ్వర్యంలో వీర నక్సల్బరీ పోరాటానికి నాయకత్వం వహించారు. పోరాటం అవిచ్ఛిన్నంగా కొనసాగించి దానిని యింకా ఉన్నత దశకు తీసుకుపోవడానికై, నక్సల్బరీ పోరాట వీరుల ఆధ్వర్యం క్రిందనే అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పడింది. మార్పిజం – లెనినిజం మావో ఆలోచనా విధానం గైడెన్సులో నిర్దిష్టమైన కార్యక్రమంతోనూ, విప్లవకర పని పద్ధతులతోనూ పార్టీని నిర్మించడానికి అవసరమైన సైద్ధాంతిక సన్నాహాలను ఆ సమన్వయ కమిటీ చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యం క్రిందనే రైతాంగ సాయుధ పోరాటం భారతదేశంలో పలు ప్రాంతాలకు విస్తరించింది. రైతాంగ సాయుధ పోరాటంలో రాటుదేలిన కమ్యూనిస్టు విప్లవకారులతో భారతదేశంలో కొనసాగుతున్న సామాజిక విప్లవానికి మార్పిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానాన్ని అన్వయించి వ్యూహం, ఎత్తుగడలను రూపొందించడంలోనూ, దశాబ్దాలుగా ఊడలుదిగి ఉన్న రివిజనిజాన్ని చావుదెబ్బ కొట్టడంలోనూ ఆనాటి విప్లవకారులందరి అపార విశ్వాసాన్ని చూరగొన్న భారత విప్లవ నేత కామ్రేడ్ చారుమజుందార్ ఆధ్వర్యం క్రింద 1969 ఏప్రిల్ 22 లెనిన్ శతజయంతి దినాన కమ్యూనిస్టు పార్టీ (మా.లె.) నిర్మాణమైంది. దాదాపు అఖిల భారత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నవారందరూ కమ్యూనిస్టుపార్టీ (మా.లె.)లో సంఘటతమైనారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో, నక్సల్బరీ పోరాటాన్ని సమర్ధిస్తూనే సమన్వయ కమిటీ వెలుపల ఉండిపోయిన కమ్యూనిస్టు విప్లవకారులు, ఒక చిన్న సెక్షను మినహా, అందరూ పార్టీలో చేరారు. అందువల్ల 1967 నుండి కమ్యూనిస్టు పార్టీ (మాలె) నాయకత్వం క్రింద భారత రైతాంగ విప్లవం కొనసాగుతుందని చెప్పడం ఎట్టి పరిస్థితులలోనూ అతిశయోక్తికాదు.
నక్సల్బరీ తర్వాత అలలు అలలుగా పురోగమిస్తూ వచ్చిన భారత రైతాంగ విప్లవం 1970 చివరి నుండి వెనుకంజ వేసింది. మన పార్టీ నాయకత్వాన కొనసాగిన రైతాంగ సాయుధ విప్లవంలో మనం మహత్తర విజయాలను సాధించాం. అలాగే ఎన్నో నష్టాలనూ, వైఫల్యాలనూ కూడా పొందాం. వందలాది ఉత్తమ పార్టీ ఆర్గనైజర్లు, వీరులైన గెరిల్లాలు పోరాటంలో అమరులైనారు. తత్ఫలితంగా క్రింద నుండి పైకి చాలా వరకు నాయకత్వాన్ని కోల్పోయాం. చాలామంది పార్టీ సభ్యులూ, సానుభూతిపరులూ యీనాటికీ జైళ్ళలో మ్రగ్గుతున్నారు. వేలాది మంది కోర్టు కేసుల్లో యిరికించబడి యిప్పటికే వేధించబడుతున్నారు. ఈనాడు భారత రైతాంగం కొనసాగిస్తున్న పోరాటం దేశవ్యాపితంగానే సెట్ బ్యాక్ లో ఉందనడం వాస్తవం. మన పార్టీ నిర్మాణరీత్యా కూడా సెట్ బ్యాక్ కు గురి అయింది; ఎన్నో చీలికలు సంభవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాటి మన పరిస్థితి ఒక ఉత్తమ లక్ష్యం కొరకు తీవ్రతరంగా ఒక యుద్ధాన్ని కొనసాగించి, అందులో తాత్కాలికంగా వెనుకంజ వేసి ఓటమిని విజయంగా మార్చుకొనడానికి అవసరమైన గుణపాఠాలు తీసుకుంటూ మరో యుద్ధానికి సన్నద్ధమౌతున్న సైన్యంలా ఉంది.
విప్లవపార్టీ, పోరాటం నిర్వహించే క్రమంలో, అనుభవం లేనందువల్ల తప్పులు చేయడం అసహజమేమీ కాదు. ఒక గొప్ప పోరాటాన్ని నడిపిన మన పార్టీ వయసులోనూ, అనుభవంలోనూ కూడా చాలా చిన్నది. రివిజనిజం పట్ల గల అసహ్యమూ, విప్లవం కొనసాగించాలనే దీక్ష, మావో ఆలోచనా విధానంపై గల అచంచలమైన విశ్వాసం వగైరాలతో పోల్చిచూస్తే, ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములైన విభిన్న విప్లవ వర్గాలను కార్మిక వర్గ నాయకత్వం క్రింద సమైక్యం చేయడానికవసరమైన ఓర్పు, చాకచక్యమూ, అవిరళ కృషి, అలాగే రైతాంగాన్ని సమీకరించడానికీ, సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికీ అవసరమైన అనుభవ జ్ఞానమూ చాలా తక్కువ. అలాంటి స్థితిలోనున్న పార్టీ విప్లవాన్ని నిర్వహించడంలో తప్పులు చేయడం అసంభవమైన విషయమేమీ కాదు. తత్ఫలితంగా విప్లవ శ్రేణుల్లో సైద్ధాంతిక గందరగోళం తలఎత్తవచ్చు. కాని మన విషయంలో, మన ఎత్తుగడల పంథాలో ప్రతిబింబించిన సిద్ధాంతపరమైన పొరపాట్ల మూలంగా, మన నష్టాలు, సెట్ బ్యాక్ మరింత తీవ్రతరమైనవిగా తయారయ్యాయి. ఇందుకు కారణమైన అన్యవర్గ సిద్ధాంత ప్రాతిపదికన మనం గుర్తించి దానిని సరిదిద్దుకోవాలి. అయితే, కామ్రేడ్ చారుమజుందార్ నాయకత్వం క్రింద మహత్తర త్యాగసాంప్రదాయాలను సృష్టించినది మన పార్టీయే. పార్టీ సభ్యులు, ప్రజల అపార విశ్వాసాన్ని చూరగొన్న మన ప్రియతమ నాయకుల్ని అనేకమందిని కోల్పోయినప్పటికీ, మన పార్టీ ప్రభుత్వం యొక్క పాశవిక దాడులను తట్టుకొని నిలదొక్కుకోగల్గింది. ఇది మన పార్టీ యొక్క విశిష్టత. అందువల్ల, నిర్మొహమాటంగానూ – కుహనా ప్రతిష్టకు లోనుగాకుండానూ, జరిగిన పొరపాట్లను ఆ పొరపాట్లు జరగడానికి అవగాహనలో గల లోపాలనూ, దాని వెనుకనున్న వర్గ పునాదిని గూర్చి మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం గైడెన్సులో ఎలాంటి అరమరికలకు తావులేని ఆత్మవిమర్శ చేసుకొని స్పష్టమైన గుణపాఠాలు తీసుకోవాలి. అలా చేయడం ద్వారా మనం సైద్ధాంతిక లోపాలను సరిదిద్దుకొని గందర గోళం నుండి బయటపడి, పార్టీని సైద్ధాంతికంగా, రాజకీయంగా, నిర్మాణపరంగా సమైక్యం చేయగలుగుతాం. ఆ విధంగాసెట్ బ్యాక్ ను అధిగమించగలుగుతాం. ఈ విధంగా మాత్రమే మనం విప్లవాన్ని పురోగమింపజేయగలం.
గత పదేళ్ళ సాయుధ పోరాటాన్ని, అందలి లోపాలను గూర్చి ఆత్మ విమర్శకు పూనుకునే ముందు కామ్రేడ్ లెనిన్ చెప్పిన ఈ క్రింది విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడం అవసరం. ఆయన ఇలా అన్నారు.
“సుదీర్ఘంగా అత్యంత కష్టభరితంగా ఉండే పోరాటమూ, బహుశా గొప్ప తెగింపుతో కూడిన ఘనమైన త్యాగాలతో నిండిన పోరాటమూ లేకుండా ముందెన్నడూ విప్లవం జరగలేదు, అలా జరగదు కూడా.”
(పెకింగ్ రివ్యూ, నెం. 13, 1973, పే. 27)
చైర్మన్ మావో చెప్పిన ఈ క్రింది సూక్తిని కూడా మనం జ్ఞప్తిలో వుంచుకుందాం. “కష్ట సమయాల్లో మనం సాధించుకున్న విజయాలను మర్చిపోకూడదు. మనకు గల మంచి భవిష్యత్తును చూచుకుని దాని నుండి ధైర్యం పొందాలి”.
చేసిన లోపాలను, అందువల్ల సంభవించిన నష్టాలనూ మాత్రమే చూచి సాధించిన విజయాలను, తత్ఫలితంగా ప్రజాస్వామిక విప్లవంలో కలిగిన పురోభివృద్ధినీ చూడజాలకపోతే గత అనుభవం నుండి తప్పుడు గుణపాఠాలను తీసుకుని భవిష్యత్తులో విప్లవానికి తీరని అపచారం కూడా చేస్తాం. ఈనాడు జనరల్ పార్టీలో రెండు ధోరణులు ప్రబలి ఉన్నాయి. ఒక ధోరణి గత పదేళ్ళలో మనం చేసిన తప్పులను భూతద్దంలో చూచి మనం సాధించిన విజయాలను విభిన్న పద్ధతులలో నైపుణ్యంగా చులకన చేస్తూ ఉంటే రెండవ ధోరణి గతంలో జరిగిన ఏ ఒక్క పొరపాటునూ, కుహనా ప్రతిష్టకు లోనై, అంగీకరించడం లేదు. ఈ రెండు ధోరణులూ ప్రమాదకరమైనవే. రెండు ధోరణులనూ ప్రతిఘటించాల్సిందే. అయితే మొదటి ధోరణి చాలా ప్రమాదకరమైనది. ప్రపంచమంతటా ఇప్పటికీ రివిజనిజమే ప్రధాన ప్రమాదంగానున్న నేటి స్థితిలో అది తిరిగి అనేక ముసుగులతో మనలను రివిజనిస్టు రొంపిలోకి దిగజార్చడానికీ, సాయుధ పోరాటానికి ఆచరణలో తీరని ఆటంకాలు కల్గించడానికే ఉపకరిస్తుంది. రెండవ అతివాద దుస్సాహనిక ధోరణిని ప్రతిఘటించడంలో మొదటి ధోరణి యొక్క ప్రభావానికి గురికాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అంతేగాదు, ఓటమి తిన్న గాభరాలో ప్రతీది తప్పుగా కన్పించడం సాధారణ విషయం. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని, పోరాట క్రమంలో ప్రభుత్వ దమనకాండకు తట్టుకోలేక అనేక స్థాయిలలో వెనుకంజ వేసినవారు కొందరు పార్టీ తప్పు పంథానవలంభించబట్టే తమలాంటి వారలా దిగజారిపోవలసిన స్థితి దాపురించిందనే వాదనలు ప్రారంభించారు. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొంటూ, పోరాటంలో అచంచలంగా నిలబడిన వారందరినీ నష్టాలకు కారణభూతులుగానూ, తాము దిగజారిపోవడానికి కారకులుగానూ అలాంటివారు చిత్రిస్తున్నారు. వీరి కపట ప్రవర్తన చూచి, చిత్తశుద్ధితో నేటివరకు రంగంలో నిలబడియున్న కామ్రేడ్స్ లో కొందరు అసహ్యించుకోవడమే గాక గతాన్ని గూర్చి ఏమాత్రం ఆత్మవిమర్శ చేసుకున్నా అలాంటి అవకాశవాదులకు లోకువై పోతామనీ, తిరిగి పార్టీ అలాంటి అవకాశవాదులకు, నిలకడ లేని తిరోగమన వాదులకు నిలయమై రివిజనిస్టు బురదలో కూరుకొనిపోక తప్పదనీ భయపడుతున్నారు. వారికున్న భయం ఆధార రహితమైంది కూడా కాదు. తెలంగాణా సాయుధ పోరాటానికి ద్రోహం చేసి విరమించిన తర్వాత ఎవరైతే ఆచరణలో పోరాటానికి ద్రోహం తలపెట్టారో, ఎవరైతే పిరికితనంతోనూ, స్వార్ధంతోనూ సిగ్గుమాలిన విధంగా ప్రవర్తించారో, ఎవరైతే పోరాటకాలంలో నిలవలేక నాయకత్వ స్థానం నుండి దిగజారిపోయారో వారే తిరిగి పార్టీ యంత్రాన్ని క్రింది నుండి పైవరకు దుస్సాహసిక విధానాన్ని ప్రతిఘటిస్తున్నామనే పేరుతో ఆక్రమించుకున్నారు. పోరాటంలో క్రింది నుండి తయారైన విప్లవకర కార్యకర్తలందరినీ పనిగట్టుకొని ప్లాను ప్రకారం దిగజార్చివేశారు. అదంతా రివిజనిస్టు నాయకత్వం ప్లాను ప్రకారం కొనసాగించిన పెద్ద కుట్ర. ఈ అనుభవాలు చరిత్రలో మాసిపోలేదు. ఈనాడు మన పార్టీలో గత పదేళ్ళ సాయుధ పోరాటంలో అమలు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవాలని వాదిస్తున్న వారిలో చాలామంది నిజాయితీపరులున్నారు. అయితే వారితో పాటు పార్టీలో ఫాక్షనలిజాన్ని పెంపొందించిన కెరియరిస్టులూ, నిలకడలేని ఆలోచనలతో అలాంటివారికి మద్దతునివ్వడం ద్వారా ఆచరణలో పార్టీ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడిన వారూ, పోరాట క్రమంలో వివిధ స్థాయిలలో బలహీనతపాలైనవారూ కొంతమంది ఉన్నారు. నిజానికి “కామ్రేడ్ చారుమజుందార్ మూలంగా అంతా సర్వనాశనమయిపోయింది, పార్టీ ప్రజల నుంచి దూరమయిపోయింది” అంటూ ఇల్లెక్కి గోలచేసే వారిలో అలాంటి బాపతే హెచ్చుగా ఉన్నారు కూడా. అలాంటి స్థితిలో ఇప్పటి వరకు పోరాటంలో నిలబడి ఎర్రజెండా గౌరవాన్నీ, విప్లవ చేవనూ కాపాడుతూ విప్లవానికి అంకితమయి ఉన్న కామ్రేడ్సులో పై భయం ఉండడం వైపరీత్యమేమీ కాదు. అయితే అలాంటి కామ్రేడ్సు ఆచరణలో గత పదేళ్ళుగా చేసిన పొరపాట్లు గుర్తించకుండానూ, ఆ పొరపాట్లకు మూలకందమైన లోపభూయిష్టమైన అవగాహనను మార్చుకొనకుండానూ విప్లవాన్ని ముందుకు తీసుకొని పోవడానికి గానీ, పార్టీ ఏ దుస్థితికి గురవుతుందని వారు భయపడుతున్నారో అలాంటి దుస్థితి దాపురించకుండా నివారించడానికి గానీ తోడ్పడగలరా? అనేది కీలకమైన ప్రశ్న. అసంభవమని ప్రపంచ విప్లవ చరిత్ర చాటి చెపుతోంది. నిజమైన విప్లవకారుల మనస్సులో ఉండే యీ భయాన్ని ఆసరా చేసుకొని కొద్దిమంది అతివాద అవకాశవాదులూ పిడివాదులూ ఎటువంటి ఆత్మవిమర్శ జరగకుండా దిగలాగుతున్నారు. తత్ఫలితంగా చివరకు మితవాద అవకాశవాదమే బలం పుంజుకుంటుందీ. అందువల్ల కుశ్శంకలకూ, కుహనా ప్రతిష్టకూ లోనుగాకుండా మార్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం ప్రాతిపదికగా ఆత్మవిమర్శ చేసుకొని, విప్లవాన్ని విజయవంతం చేయడానికి కవసరమైన గుణపాఠాలను తీసుకోవడం. సాయుధపోరాటంలో ఆదర్శంగా నిలబడి ఎర్రజెండా గౌరవాన్నీ, విప్లవచేవనూ కాపాడుతున్న కామ్రేడ్సు అందరియొక్క ప్రప్రధమ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించడం ద్వారానే పార్టీని ప్రస్తుతం ఆవహించియున్న సిద్దాంత గందరగోళం నుండి బయటపడేలా చేయగలం. లెనినిస్టు నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా బలమైన పార్టీని నిర్మించగలం. బలమైన ప్రజాసైన్యాన్ని నిర్మించి విప్లవ విజయానికి ముందుకుపోగలం.
ఆత్మవిమర్శ ఒకనాటితో పూర్తి అయ్యే పనికాదు. పార్టీ అంతటా క్రింద నుండి పైకి అంతరంగికంగా కొనసాగాల్సిన ఒక ఉద్యమం అది. పార్టీ సభ్యుల అవగాహనలోనూ, ఆచరణలోనూ జీర్ణించుకొనిపోయిన తప్పు విధానాలను విసర్జించి మార్పిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం గైడెన్సులో సరయిన విధానాలను, అవగాహనలను రూపొందించుకొని విప్లవ పురోగమనానికి నూతనోత్తేజంతో సన్నద్ధమయ్యేందుకు జరిగే పెద్ద ఎడ్యుకేషన్ కాంపెయిన్. అందుచేత, ఇది ఒక పోరాటమే. బయట జరుగుతున్న వర్గపోరాటానికి ప్రతిబింబంగా పార్టీలోపల జరిగే అంతరంగిక పోరాటం. గంగలో మునిగినవెంటనే పాత పాపాలన్నీ పోయాయని భావించినట్లు గతం అంతా తప్పని లెంపలు వేసుకొన్నంత మాత్రాన పార్టీలో జీర్ణించుకొని ఉన్న లోపభూయిష్టమైన అవగాహన నుండి బయటపడలేము. మనం ఆచరణలో కొనసాగించిన తప్పులు అవగాహన చేసుకోవడం సులభమే కాని, ప్రత్యామ్నాయంగా ఏమిచేయాలో ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా తెలుసుకొనడం మాత్రం అంతకంటే కష్టతరం. కొన్ని విషయాలలో మన పొరపాట్లు అర్థమౌతాయేగాని, అందుకు బదులు ఏమిచేయాలో వెంటనే తెలియదంటే కూడా ఆశ్చర్యంలేదు. అలాంటి విషయాలు విప్లవ ఆచరణలో ప్రజలనుండి నేర్చుకోవాల్సిందే. ఐతే అందుకు అవసరమైన ఓర్పూ, ప్రజలే గురువులనే అణుకువతో కూడిన విజ్ఞత మనం అలవరచుకోవాలి. అంతేకాని, సర్వజ్ఞులవలే సబ్జక్టివ్ ధోరణికి గురయి కంఠస్తం చేసిన ఫార్ములాస్ చట్రంలో వాస్తవాలను (Facts) ఇరికించడానికి ప్రయత్నిస్తే పాత తప్పులనుండి బయటపడేదానికి బదులు అంతకంటే దుష్పలితాల నివ్వగల మరో తప్పుడు ఆచరణకు గురిఅవుతాము. అందుకే ప్రపంచ విప్లవానికి అగ్రగాములుగా వున్న చైనా కామ్రేడ్స్ తమ పది అంతరంగిక పోరాటాలను సమీక్షిస్తూ ఒక తప్పు విధానాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రతి పోరాటంలోనూ మరొక తప్పు అవగాహనకు బీజాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ బీజాలు పెరిగి పెద్దవికాకుండా సకాలంలో తగు జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఒక తప్పును సవరించుకొనబోయి ఆచరణలో మరోతప్పుకు గురి అవుతామనేదే తద్వారా ప్రపంచ విప్లవకారులందరికీ వారి హెచ్చరిక. భారతదేశంలో ఉన్న విప్లవ పరిస్థితితో పోల్చి చూచినప్పుడు నిర్మాణరీత్యానూ, విప్లవాన్ని నిర్వహించడానికి కవసరమైన చాకచక్యం, అనుభవంలోనూ కూడా వెనుకబడియున్న మన పార్టీకి అది మర్చిపోవడానికి వీలులేని హెచ్చరిక.
అంతేగాదు, గతంలో జరిగిన తప్పుల యొక్క లోతుపాతులనూ, అందుకుగల కారణాలనూ పార్టీ సభ్యులచేతనూ, సానుభూతిపరులచేతనూ, వీరులయిన గెరిల్లాదళ సభ్యులచేతనూ గుర్తింపచేయడానికి చాలా ఓపికతో కూడిన పోరాటం చేయాలి. క్రమబద్ధమైన ఒక ప్రాసెస్లోనే గాని అది సాధ్యంకాదు. అలాంటి ఓపికతో కూడిన పోరాటంలో పార్టీ సభ్యులలోనూ, వీరులైన గెరిల్లా దళ సభ్యులలోనూ ఎట్టి పరిస్థితిలోనూ పోరాట దీక్ష సడలిపోకుండానూ ఆత్మవిశ్వాసంగాని, విప్లవచేవగాని సన్నగిల్లిపోయి నిరుత్సాహానికి గురికాకుండానూ జాగ్రత్తపడడం ఎంతయినా అవసరం. అదే జరిగితే ఓటమి చెందిన గాభరాలో సైన్యాన్నంతటినీ గాభరా పెట్టి, నిరుత్సాహపర్చి దిగజార్చివేసిన సైన్యాధిపతులకెలాంటి దుర్గతి తప్పదో మనపార్టీ స్థితికూడా అలాగే పరిణమించక తప్పదు. ప్రపంచ విప్లవం నుండి లభిస్తున్న పై గుణపాఠాలను దృష్టిలో ఉంచుకొని అరమరికలులేని ఆత్మవిమర్శకు పూనుకుందాం. అందులో 1. గతంలో మన అవగాహన, ఆచరణలో ఉన్న (Positive aspect) ఫలితాలు, 2. మన ఆచరణలో ద్యోతకమైన ప్రధానమైన తప్పులు, వాటి వెనుకనున్న లోపభూయిష్టమైన అవగాహన, 3. నేర్చుకోవలసిన గుణపాఠాలు, 4. ప్రస్తుత రాజకీయ నిర్మాణ పరిస్థితి – మన కర్తవ్యం ప్రధాన అంశాలవుతాయి. ఒక్కొక్క విషయాన్నే తీసుకుందాం.,
నక్సల్బరీలో ఆరంభమై గత దశాబ్దంగా కొనసాగుతున్న వీరోచిత సాయుధ రైతాంగ విప్లవానికి సంబంధించిన మన అవగాహనలోనూ, ఆచరణలోనూ మార్సిజం-లెనినిజం-మావో ఆలోచనకు అనుగుణమైన కరెక్టు అంశాలెన్నో ఉన్నాయి. అందుమూలంగా మనం ఎన్నో విజయాలను (Achievements) సాధించాం. తద్వారా మనదేశంలోని ప్రజాస్వామిక విప్లవంలో నూతన దశ ఆరంభమైంది.




