స్వప్నం సాకారమవుతుందని
సంబరపడుతున్న వేళ...
కల చెదిరి, నిజం బొట్లు బొట్లుగా
కారిపోతూవుంది.
వేదన కన్నీరు మున్నీరుగా
ఉబికివస్తూ వుంది.
ఇప్పుడిప్పుడే..మొలకెత్తి,
ఎదుగుతున్న విశ్వాసం..
ఊపిరి సలుపక..
ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంది.
ఉత్సాహ జవనాశ్వాలతో
పరిగెడుతున్న వేళ..
కాళ్ళు నరికివేయబడ్డ
ఖండిత దేహం రోదిస్తూ వుంది.
ఈ నేల బిడ్డలు
పోరాడి, సాధించుకున్న
పిడికెడు మట్టి, దోసెడు నీళ్లు,
చారెడు నేల....
కాసింత స్వేచ్ఛలను
కసాయి కర్కశత్వం...
ఆసాంతం కబళిస్తూ వుంటే...
ఏ జయ గీతాలను
ఆలపించగలను ?
బొడ్డు పేగు కూడా తెగని,
పసికందుల కుత్తుకలను కోసే
కంసులకు ఇక్కడ కొదువ లేదు.
పాలుగారే పసిబుగ్గలకు..
ముదిమి దేహాలకు...
తేడా లేదిక్కడ !
అన్నీ చిద్రం కావలసిందే !
బ్రతుకే భారమైన చోట...
త్యాగాలకు లెక్కలేదు..
విలువ లేదు !
ఇక్కడ యుద్ధం చేస్తున్న కపోతాలను...
శాంతి పేరిట కసాయి డేగలు
మట్టు బెడుతూ ఉన్నాయి.
ఇక్కడ ' శాంతి యుద్ధం ' తిరోగమన విలువలు !
అయినా...
అలసిన పావురాలు
డేగల సరసన
యుగళ గీతాలను
ఆలపిస్తూ వుంటే....
నమ్ముకున్న నేస్తాలే...
ద్రోహం చేస్తూ వుంటే...
ఏ విషాద గీతాలను
ఆలపించగలను ?
ఎన్ని పుటుకలూ,
ఎన్ని గిట్టుకలూ !
ఇక్కడ కొలవ లేని ప్రమాణాలు !
ఇదే పునరపి మరణం...
పునరపి జననం !
కారు మబ్బుల్లో మెరుపులు...
చిమ్మ చీకటి లో మిణుగురులు...
మళ్ళీ వస్తాయి !
పునరపి మరణం...
పునరపి జననం ఇక్కడ
ప్రకృతి అంత సహజం !
Related