తెలుగు సాహిత్యంలోకి అనేక జీవన మూలాల నుంచి కొత్త తరం రచయితలు వస్తున్నారు. కొత్త అనుభవాలను పరిచయం చేస్తున్నారు. అద్భుత నిర్మాణ పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. చాలా ప్రశంసనీయమైన ఈ కృషిలో ఈ కాలపు జీవన సంఘర్షణ ఎంత ఉన్నది? యువ రచయితలు దాన్ని ఎంత మేరకు ఒడిసిపట్టుకోగలగుతున్నారు? జీవితంలోని మార్పు క్రమాలను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించగలుగుతున్నారు? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి అన్ని తరాలు ఎదుర్కొన్నవే.
సాహిత్య విమర్శ ఈ సమస్యలను చర్చనీయాంశం చేయాలి. పరిష్కారం చూపాలి. తెలుగు సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాపరంగా తక్కువే కావచ్చుగాని, కొత్త తరం ప్రవేశించింది. రచయితలైనా, విమర్శకులైనా, మొత్తంగా మేధో సృజన రంగాల్లో పని చేసే వారెవరైనా తమ స్థల కాలాల అవసరాలు ఎంత తీర్చగలుగుతున్నారు? తమ ముందు తరాల ఒరవడిని ఎంత ముందుకు తీసుకపోతున్నారు? ముందు తరాల వాళ్లు మిగిల్చిన పనులను ఎట్లా భర్తీ చేసి కొత్త విస్తరణలకు ప్రయత్నిస్తున్నారనే ప్రశ్నలను ఎదుర్కోవలసిందే. అసలు సాహిత్య విమర్శలో గతంలో జరిగిన కృషి గురించి ఈ తరం విమర్శకులు ఏమనుకుంటున్నారు? ఏ అంచనాలతో ఉన్నారు? అనేవి కూడా ఆసక్తి కరమైన విషయాలే. కొత్త విమర్శకుల సాహిత్య విమర్శ అధ్యయన పద్ధతి ఎలా ఉన్నదనే విషయం కూడా మన విమర్శ భవితవ్యానికి ఒక ముఖ్యమైన గీటురాయి.
సాహిత్య విమర్శ రంగంలోకి వస్తున్న యువ విమర్శకులకు సృజనాత్మక సాహిత్య పఠనంతోపాటు వివిధ సామాజిక శాస్త్రాల ప్రవేశం ఎంత ఉన్నది? తత్వ శాస్త్ర ప్రమేయంగా ఏ మేరకు విమర్శ రంగాన్ని చూస్తున్నారు? అనేవీ పరిశీలనాంశాలే.
ఈ వైపు నుంచి చూస్తే తెలుగు సాహిత్య విమర్శ రంగంలో కొన్ని సాహిత్య సిద్ధాంత సంబంధమైన సమస్యలు ఉన్నాయి. మరి కొన్ని అన్వయపరమైనవి ఉన్నాయి.. వివిధ ప్రక్రియల సామాజిక, సాంస్కృతిక లోతును, ప్రత్యేకతలను వివరించడంలో సమస్యలు ఉన్నాయి. ఈ సవాళ్లు గతంలో కూడా ఎంతో కొంత ఉన్నవే. వాటితో ఈ తరం విమర్శకులు ఎట్లా వ్యవహరిస్తారనే అంశానికి ప్రాధాన్యత పెరిగిన సందర్భంలోకి మనం చేరుకున్నాం.
వీటన్నిటితో చాలా స్థిమితంగా, గంభీరంగా తలపడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ పని అంతా ఈ తరం రచయితలను, పాఠకులను దృష్టిలో పెట్టుకొని జరగాలి. అప్పుడే భవిష్యత్తుకు కూడా భరోసా ఉంటుంది.
నిర్దిష్టంగా తెలుగు సాహిత్య విమర్శ ముందున్న ఇలాంటి సవాళ్లను, అవసరాలను ఈ తరం సాహిత్య విమర్శకులు ఎట్లా చూస్తున్నారు? యువతరం రాస్తున్న సాహిత్య విమర్శలో ఉన్న సమస్యల గురించి ఆ తరం విమర్శకులే ఏమనుకుంటున్నారు? అనే విషయం కూడా చర్చలోకి వచ్చేలా కొత్త సాహిత్య విమర్శకుల వ్యాసాలతో వసంతమేఘం అంతర్జాల పక్ష పత్రిక ‘ఈ తరం సాహిత్య విమర్శ’ అనే శీర్షిక ఆరంభించాలని అనుకుంది.
సాహిత్య విమర్శలో పుస్తక సమీక్షలు, పరిచయాలు, ముందుమాటలు భాగమే అయినా, అంతకంటే పై స్థాయికి వర్తమాన సాహిత్య విమర్శను ముందుకు తీసుకపోయే ప్రయత్నం కూడా ఇది. దీనికి దోహదం చేసేలా యువ సాహిత్య విమర్శకుల నుంచి విమర్శ వ్యాసం కోరుతున్నాం. ఒక కంప్లీట్ వ్యాసం రాసిచ్చి ఈ శీర్షిక నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాం.




