నా నేలమీద చావుల సాగు చేస్తున్నరు...
కత్తులతో దున్ని శవాల విత్తులేస్తున్నరు...
వేళకి నెత్తుటి వాన మస్తు కురుస్తుంది...
పైరుకి బాంబుల ఎరువులు చల్లుతున్నరు...
అయినా ఏ మొక్కై మొలవాల్నో తెల్వక విత్తులు భూమి పొత్తిళ్ళలోనే దాక్కున్నయ్...
కుప్పలు తెప్పలుగా విత్తులు పోగైతనే ఉన్నయ్...
నెత్తుటి వాన కుండపోతగా కురుస్తనే ఉంది...
కన్నీటి కాలువల కన్న బిడ్డల శవాలనేరుకుంటున్నరు కొందరు...
నెత్తుటి వాసనని అత్తరు వాసనలా అస్వాదిస్తున్నరు కొందరు...
ఎవడి గెలుపోటముల కోసమో ఈ ఆటలు...
గెలిచాకా ఎవడు జరుపుకుంటరో ఆ గెలుపు సంబరాలు....
ఏ దిక్కుమాలిన దేహంలో పుట్టిందో ఈ నీతిమాలిన సాగు చేయాలనే ఆలోచన...
ఆ ఆలోచనని ఎవరు బొందపెడుతరో...
ఆ ఆలోచన పుట్టిన దేహం ఎప్పుడు దహనమైతదో...
ఆ విత్తులకి శక్తులొచ్చి చావుల సాగునాపి పంటల సాగు చేసి ఈ మన్నుని సస్యశ్యామలం చేస్తే బాగుండు...
నా నేల నిమ్మలంగుంటే బాగుండు...
నా నేల నిమ్మలంగుంటే బాగుండు...




