భాషకంటే ప్రతీకలు ప్రాచీనమైనవి. మనుషులు తమ వ్యక్తీకరణకు సంకేతాలను, ప్రతీకలనే మొదట సాధనం చేసుకున్నారు. ప్రకృతి పరిశీలనలో కలిగిన భావోద్వేగాలను, భయోద్విగతలను కొండ గుహల్లో బొమ్మలు గీచినట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు మానవ ఊహ తొలి వ్యక్తీకరణలు నిర్దిష్ట భాషార్థం సంతరించుకోకముందు గీతల్లో, చిత్రాల్లో ఉన్నట్లు చూడవచ్చు. ఆ తర్వాత తమ సామాజిక   నిరసనలను, కోపాలను, విజయాలను కూడా ప్రతీకాత్మం చేశారు.

మానవ నాగరికతా వికాసంలో ఊహా వ్యక్తీకరణలకు ఇంత పురాతన సంప్రదాయం ఉన్నది. చివరికి భగవంతుడ్ని కూడా అప్పటి దాకా ఏ ఏ విశేషణాలతో, ప్రతీకలతో గౌరవించారో వాటినే తిరగేసి ఆగ్రహావేశాలతో నిందా స్తుతి చేశారు. రాజులకు కూడా ఈ విషయంలో  మినహాయింపు ఇవ్వలేదు. ఈ ఒరవడే ఆధునిక యుగంలో సకల కళలుగా, భావజాల సంఘర్షణలుగా, సంవాదాలుగా మారింది. మనుషులు ఎప్పటికప్పుడు తమ అయిష్టాలను, అసమ్మతులను చెప్పుకోడానికి పాత వ్యక్తీకరణలనే వ్యంగంగా, హాస్యంగా, నిందార్థంగా తిరగేసి చెప్పడం చాలా మామూలు విషయం.

కానీ ఫాసిస్టు రాజ్యం దీన్ని భరించలేకపోతోంది. భారత రాజ్యం మరింతగా బలపడాలనుకుంటున్న కొద్దీ భయం గుప్పిట్లో విలవిల్లాడిపోతోంది. దాని భయ వ్యక్తీకరణల ముందు అన్ని ప్రజా వ్యక్తీకరణలూ దేశద్రోహంగా మారిపోతున్నాయి. 2026 జనవరి 10,11 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం తిరుపతి మహా సభల సందర్భంగా తయారు చేసిన ఒక బేనర్‌ను పోలీసులు నేర వ్యక్తీకరణగా భావించడం కంటే దీనికి ఉదాహరణ ఏం కావాలి?

ఈ బేనర్‌లో జాతీయ చిహ్నమైన అశోక స్తంభం మీద మూడు సింహం మూడు తలల స్థానంలో ఎద్దు ముఖాలు, ఖాకీ ప్యాంట్‌, తుపాకీతో కాల్చే వ్యక్తి,  ”సత్యమేవ జయతే” స్థానంలో ”సత్యమేవ పరాజయతే” అనే అక్షరాలు ఉన్నాయి. పౌరహక్కుల ఉద్యమంతోగానీ, మరే ప్రజాస్వామిక ఉద్యమంతోగాని కాస్త పరిచయం ఉన్న వాళ్లకు ఈ చిత్రం చాలా పాతదే అనిపిస్తుంది. ఈ ఒక్క చిత్రమే కాదు, భారత రాజ్యాంగబద్ధ పాలన ఎంత దుస్థితిలో ఉన్నదో చెప్పడానికి ఆందోళనకారులు ఇలాంటి ఎన్నో చిత్రాలను బేనర్ల మీదికి, పోసర్ల మీదికి ఎక్కించి తన నిరసన తెలిపిన చరిత్ర ఉంది. ప్రత్యామ్నాయ పత్రికలు ఇలాంటి నిరసన చిత్రాలను ఎన్నోసార్లు ప్రచురించాయి. సాహిత్యకారులు ఇలాంటి ముఖ చిత్రాలతో పుస్తకాలు అచ్చేశారు.

పౌరహక్కుల సంఘం బేనర్‌ మీది ఉపయోగించిన బొమ్మకు మూలమైన నమూనా చిత్రాన్ని అసిం త్రివేదీ అనే కార్టూనిస్టు 2011లో వేశారు. దాన్ని సాకు చేసుకొని ఆయనను అరెస్టు చేశారు. బాంబేె హైకోర్టు విచారణ జరిపి, ఆయన మీద మోపిన రాజద్రోహం కేసు చెల్లదని, అందులో అలాంటి ఉద్దేశాలేమీ లేవని కొట్టేసింది. 

ఇప్పుడు అదే చిత్రం ఆధారంగా పోలీసులు పౌరహక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్యను అరెస్టు చేశారు. హేమాద్రి అనే కార్యకర్త, ఆ బేనర్‌ అచ్చేసిన  గ్రాఫిక్స్‌ యజమాని సహా సిఎల్‌సి అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్‌, మిగతా నాయకులు శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు, వై. రాజశేఖర్‌లను కూడా నిందితులుగా కేసు నమోదు చేశారు. ఆ బేనర్‌ను ప్రదర్శించడం ద్వారా వీరంతా రాజద్రోహానికి పాల్పడ్డారని కేసు సారాంశం.

దీని వెనుక అసలు కథ నడిపింది తిరుపతిలోని సనాతన ధర్మ పరిరక్షణ సమితి. ఆ సంస్థ నాయకుడు సనాతన ధర్మంతోపాటు రాజధర్మాన్ని కూడా కాపాడాలనుకొని ఈ బేనర్‌ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధునిక చట్టబద్ధ పాలన ఆకాంక్షించే వారి మీద సనాతన ధర్మ పాలన కోరుకొనే వారి ఫిర్యాదు ఇది. దాన్ని భారత రాజ్యానికి నికార్సయిన ప్రతినిధి పోలీసు వ్యవస్థ అమలు చేసింది.

ఇది సాదాసీదా ఘటన కాదు. ఒక పట్టణంలోని రెండు భిన్న భావజాలాలుగల సంస్థల వ్యవహారమే కాదు. ఈ వివాదం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవదీస్తున్నది. మన సమాజ సంక్షోభం లోతును, విస్తృతిని, పతనావస్థను మనం పట్టించుకోకపోయినా దానికదే చెంప చెళ్లుమనిపించేలా మన ఎరుకలోకి తీసుకొస్తోంది.

ఇది భారత రాజ్య స్వభావాన్నీ, వేర్వేరు అంతస్తుల్లోని రాజ్య నిర్మాణాన్నీ, ఒక్కో తలంలో దాని పరిభాషనూ, పనితీరునూ, ఈ మొత్తానికి ఫాసిజంతో ఉండే  సంబంధాన్నీ బట్టబయలు చేసింది. చూడ్డానికి ఇది ఒక ‘నేరారోపణ’గా కనిపిస్తున్నది కాబట్టి  న్యాయ, చట్టపరిధిలోనే ఆలోచిస్తే అసలు విషయాల దరిదాపులకు కూడా వెళ్లలేం. ఒక ప్రతీకపై రాజ్యం కూడా ప్రతీకాత్మక చర్యగా నేరారోపణకు, అరెస్టుకు పాల్పడిందిగాని, వాస్తవానికి ఇది చట్టానికి, నేరానికి సంబంధించిందే కాదు. మౌలికంగా ఇది స్వేచ్ఛాయుతమైన మానవ సాంస్కృతిక, కళా, భావజాల సంఘర్షణా సారం మీద రాజ్యం చేసిన దాడి.

మామూలుగా చాలా మంది ఫాసిజాన్ని రాజ్య ప్రమేయంలేని సాంస్కృతిక కోణంలో వివరిస్తూ ఉంటారు. మరి కొందరు రాజ్యాన్ని పోలీసుల, సైనికుల, జైలు అధికారుల దుశ్చర్యలతో సమానం చేసి చూస్తుంటారు. మరి కొందరు సంఫ్‌ుపరివార్‌(ఈ కేసులో సనాతన ధర్మ పరిరక్షణ సమితి) మూక చేస్తున్న ఆరాచక, అమానవీయ చర్యలకు ఫాసిజాన్ని పరిమితం చేస్తుంటారు. ఈ మూడు వాస్తవాలే. ఈ పరిశీలనా పద్ధతులూ అవసరమే. వాటికవిగా తప్పు కాదుగాని రాజ్యాన్నీ, ఫాసిజాన్నీ, పౌర సమాజంలో దాని విస్తరణను కలిపి చూడాలి.

ముఖ్యంగా రాజ్యమంటే ఏమిటో, అది ఎన్ని తలాల్లో పని చేస్తుందో, దాని నియంత్రణాధికారం చట్ట రూపంలో ఎన్నెన్ని జీవన పార్శ్వాల్లోకి చొరబడుతుందో తెలియజెప్పే ఘటన ఇది. హింస మీదే రాజ్యం ఆధారపడదని, హింసా రూపాలకే అది పరిమితం కాదని మనకు తెలిసినంతగా దాని నియంత్రణాధికార రూపాల గురించి అంతగా తెలియదు. ఒక అధికార రూపంగా సమాజంలోని ఏ ఏ ఆధిపత్య శక్తులను బలపరుస్తుంటుందో తెలిసినంతగా, ఏ ఏ భావజాలాలతో కలిసి రాజ్యం బలోపేతం అవుతుంటుందో తెలియదు.

ఉదారవాద భావజాలాలు, ఉద్యమాలు రాజ్యాన్ని సామాజిక మార్పుకు సాధనాలుగా భావిస్తుంటాయి. కానీ రాజ్యం మాత్రం పౌరుల ఊహలు, ఆలోచనలు, సృజనాత్మక శక్తులు అన్నీ సమాజం మీద తన సర్వంసహాధికారానికి లోబడి ఉండాలనేగాక, బలపరిచేలా ఉండాలని కోరుకుంటుంది. దీని కోసం తాను ఏ భావనలను, ప్రతీకలను, సూచికలను, చట్రాలను తయారు చేసుకున్నదో వాటికి భిన్నంగా ఎవరైనా తమ ఊహలకు పదునుపెడితే, పరిభాషను తయారు చేస్తే, రంగులకు, సంకేతాలకు కొత్త అర్థాలు అద్దితే ఆగ్రహిస్తుంది. నేరంగా భావిస్తుంది. రాజద్రోహం అనే పాత మాట ఇప్పుడు దేశద్రోహం అనే అర్థం సంతరించుకోవడం విశేషమేమీ కాదు. రాజులు లేని పాలనలో రాజ్య ప్రయోజనం దేశ ప్రయోజనంగా మారింది. ఇక ఈ ‘ప్రయోజనానికి’ పౌరులందరూ తలవంచాల్సిందే.

పౌరహక్కుల సంఘం బేనర్‌  మొదట సనాతన ధర్మ పరిరక్షణ సమితికి భావజాలపరమైన కోపం తెప్పించింది. ఆ తర్వాత పోలీసులకు చట్టపరంగా నేరం అనిపించింది. ఈ రెండూ వేర్వేరని మనం అనుకుంటే రాజ్యమంటే ఏమిటో మనకు తెలియనట్లే. ఇక్కడ మనకు సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ఒక ఫిర్యాదు మాత్రమే చేసినట్లు కనిపిస్తుంది. కానీ అది రాజ్య వ్యవస్థలోని ఒక ప్రక్రియను పూర్తి చేసింది. దాన్ని పోలీసులు చట్ట పరిధిలోకి తీసుకపోయి కేసు నమోదు చేశారు. అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పాలన అనీ, కూటమి నాయకత్వమనీ అనుకుంటాంగాని ఇక్కడ సనాతన ధర్మ కార్పొరేట్‌ హిందుత్వ రాజ్యం కొనసాగుతున్నది.

అందువల్ల తిరుపతి ఘటనను  మనం సనాతన ధర్మ పరిరక్షణ  సంస్థ నాయకుడి ఉన్మాదానికీ, స్థానిక పోలీసుల దౌర్జన్యానికీ, న్యాయమూర్తి రాజ్యాంగేతర వైఖరికీ పరిమితం చేస్తే మనకు రాజ్యం పని తీరు తెలియనట్లే. సనాతన ధర్మ రాజ్యానికంటే ఆధునిక రాజ్యం చాలా ప్రత్యేకమైనది. అది చాలా సంక్లిష్టంగా పని చేస్తుంది. రాజ్యాంగ ఆదర్శాలతో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలతో మాత్రమే భారత రాజ్య స్వభావాన్ని తెలుసుకోలేం.  దేశాన్ని కాపాడే కర్తవ్యం మాటున అది ఈ సమాజంలోని కొత్త, పాత ఆధిపత్య భావజాలాలను, సంస్కృతులను కూడా కాపాడుతోంది. ఈ పని తగదని ప్రశ్నించిన వాళ్లందరినీ దేశ ద్రోహులనే  ఊరకే అనడం లేదు.  తన అధికార ప్రతీకలను విమర్శించినవాళ్ల మీదికి  రాజ్యం దేశద్రోహమనే, రాజద్రోహనే కొత్త ముద్రలను, ప్రతీకలను ప్రయోగిస్తోంది. ఇక ఇప్పుడు ఎవరైనా సరే,  అధికారం మీద కాదు,  అధికార ప్రతీకల మీద ప్రతీకాత్మక నిరసన తెలపాలన్నా భయపడాల్సిందే. చూడండి.. రాజ్యం, ఫాసిజం ఒక్కటిగా మారి ఎక్కడి దాకా చేరుకున్నాయో.

Leave a Reply