(జనవరి 24, 25 తేదీల్లో జరిగిన విరసం 30 మహా సభల కీలక పత్రంలోంచి కొన్ని భాగాలు- వసంతమేఘం టీం)
ఉపోద్ఘాతం:
విరసం ముప్పైవ మహా సభలకు హాజరైన కామ్రేడ్స్‌కు విప్లవాభివందనాలు. మార్క్సిజం లెనినిజం మావోయిజం మార్గదర్శకంగా విప్లవ సాహిత్య, భావజాల, సాంస్కృతికోద్యమాలను నిర్వహిస్తున్న విరసం ఈ మహా సభల ఇతివృత్తంగా వర్గపోరాటాన్ని ఎంచుకున్నది. వర్గపోరాటం చరిత్ర నియమమే అయినా అది నిర్దిష్ట స్థల కాలాల్లో కొనసాగుతూ ఉంటుంది. నక్సల్బరీతో మొదలైన విప్లవోద్యమ చరిత్రలోని అనుకూల, ప్రతికూల సందర్భాలన్నిటినీ విరసం తన ప్రాపంచిక దృక్పథంతో వర్గపోరాటం గీటురాయి మీద విశ్లేషిస్తూ వచ్చింది. అట్లాగే ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని అర్థం చేసుకొని, దాని చుట్టూ సమాజంలో వ్యక్తమవుతున్న విశ్లేషణలను, వైఖరులను వివరించడం భావజాల సాంస్కృతిక రంగాలకు చెందిన ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తోంది.
గత ఇరవై పాతికేళ్ల విప్లవోద్యమ గుణాత్మక దశలో తీవ్రమైన అణచివేత, విధ్వంసం విడదీయలేని అంశం. ఇది ఆపరేషన్ గ్రీన్‌హంట్ నుంచి ఆపరేషన్ కగార్‌కు చేరుకున్నది.బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్ ఫాసిజం రెండేళ్లుగా విప్లవోద్యమాన్నేగాక భారత సమాజాన్నీ, ప్రజా జీవితాన్నీ ధ్వంసం చేస్తున్నది. దేశ ప్రజలపై దళారీ రాజ్యం, ఫాసిజం చేస్తున్న అంతర్యుద్ధాన్ని పోలిన దాడిగా మారింది. దీనికి తోడు విప్లవోద్యమాన్ని, విప్లవ భావజాý సంస్కృతులను తుదముట్టించే అంతర్గత విద్రోహం బయల్దేరింది.
ఇది గతంలో విప్లవోద్యమం ఎదుర్కొన్న సంక్షోభాల వంటిది కాదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో ఇలాంటి సంక్షోభాలు ఉండవచ్చు, కానీ మన దేశ విప్లవోద్యమంలో కూడా ఇది భిన్నమైనది. వర్గపోరాటానికీ, దాని అత్యున్నత రూపమైన సాయుధ పోరాటానికీ వ్యతిరేకంగా ఇది ముందుకు వచ్చింది. ఇదంతా ఒక రాజకీయ నిర్మాణానికి సంబంధించిన సంక్షోభం కాదనీ, మొత్తంగానే విప్లవోద్యమాన్ని, ప్రగతిశీల భావజాలాన్ని, సంస్కృతిని దెబ్బతీసే పథకం కావడంతో విప్లవ శిబిరమంతా అప్రమత్తమైంది. విప్లవ రచయితల సంఘం కూడా ఇందులో జోక్యం చేసుకున్నది.
వర్గపోరాటం గురించి గతం కంటే ఇప్పుడు మరింత పదునుగా, సృజనాత్మకంగా, సైద్ధాంతికంగా మాట్లాడవలసిన ఉన్నది. దీనికి మరి కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. అందులో ముఖ్యమైనది భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు నిండటం. అట్లాగే ఇవాళ మనం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అంటున్న సంఘ్‌పరివార్ సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, భావజాల దౌర్జన్యాలకు, అమానవీయ ధోరణులకు మూలమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి కూడా వందేళ్లు. ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభ నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయి. అసాధారణ త్యాగాలతో, ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించడానికి ఈ దేశ ప్రజలు చేస్తున్న విప్లవ ప్రయత్నంతో, అన్ని మానవీయ క్రమాలతో హింసాత్మక రాజ్యమూ, దోపిడీ విధానమూ, వీటితో కలిసి వచ్చిన ఫాసిజం ఇవాళ ఘర్షణ పడుతున్నాయి. సారాంశంలో ఇదంతా వర్గ సంఘర్షణే. చరిత్రలోని ఆయా స్థల కాలాల్లో అనేక వర్గపోరాట అనుభవాలను, సాయుధ పోరాట వారసత్వాలను గుర్తించి ఇప్పుడు మాట్లాడుకోవాలి.
ఈ పని మన చరిత్రలోకి, విప్లవోద్యమ అనుభవంలోకి వెళ్లి చేయాలి. ఎక్కడైనా సరే విప్లవోద్యమ రాజకీయ నిర్మాణ సంక్షోభం భావజాల, సాంస్కృతిక సంక్షోభంగా వ్యక్తమవుతుంది. భావజాల సిద్ధాంత సంక్షోభం రాజకీయ ఉద్యమాన్ని అతలాకుతలం చేస్తుంది.ఈ రెండూ వేర్వేరు కాదు. కలిసే ఉంటాయి. ప్రస్తుత సంక్షోభం తక్షణమైందే కాక విప్లవోద్యమ భవిష్యత్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి సుదీర్ఘ గతం నేపథ్యంగా ఉంది. అందువల్ల వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని, వందేళ్ల హిందుత్వ ఫాసిజాన్ని తడుముతూ ఈ శతాబ్దపు ఫాసిస్టు ప్రత్యేకతల్లోంచి, విప్లవోద్యమ ప్రత్యేకతల్లోంచి ఈ సంక్షోభాన్ని చర్చించే వేదికగా విరసం 30వ మహాసభలు ఉండాలనేదే ఈ పత్రం ఉద్దేశం. భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం గురించి మాట్లాడుతున్న ప్రస్తుత సందర్భంతో ఈ పత్రం ఆరంభమవుతుంది.
1
సందర్భం: అంతర్యుద్ధం`అంతర్గత విద్రోహం
విప్లవోద్యమ పంథా గురించి జరుగుతున్న ప్రస్తుత చర్చా సందర్భాన్ని గుర్తించాలంటే భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోకి కొంచెం వెళ్లాలి. మూడో ఇంటర్నేషనల్ చొరవతో తాష్కెంట్ కేంద్రంగా జరిగిన నిర్మాణ ప్రయత్నాలను కూడా కలుపుకొంటే భారత కమ్యూనిస్టు ఉద్యమానిది పది పదులు దాటిన పథం. వలసల ప్రతిఘటన పోరాటం భారత కమ్యూనిస్టు పార్టీకి సాధారణ రాజకీయ పంథాను ఇచ్చింది. ఫాసిస్టు వ్యతిరేక అంతర్జాతీయ ఐక్య సంఘటన భావజాల, సాంస్కృతిక రంగాల్లో తక్షణ, దీర్ఘకాలిక కార్యాచరణను అందించింది. భాష, విలువలు, సంస్కతికి సంబంధించిన భూస్వామ్య భావనలను ఈ కార్యాచరణ సవాల్ చేయడం మన భావజాల, సాంస్కతిక ఉద్యమానికి స్థల, కాల నిర్దిష్టతను సంతరించి పెట్టింది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీకి రాజ్యాధికార స్పృహ లేకపోయినా, విప్లవ పంథా లేకపోయినా క్షేత్రస్థాయి పోరాట రంగంలో గడించిన అనుభవంతో వర్గపోరాట అవగాహనను విస్తరించింది. విప్లవ రాజకీయ కార్యక్రమాన్ని స్వీకరించి, ఆచరించడానికి కమ్యూనిస్టు పార్టీ ముందుకు ప్రజాపోరాటాలు తీసుకొచ్చిన సందర్భాలను నాయకత్వం తిరస్కరించింది. 1960ల నాటికి ఈ అవగాహన మన సామాజిక సంక్షోభాల నుంచి, ప్రజా పోరాటాల నుంచి స్పష్టమైన సిద్ధాంత రూపం తీసుకున్నది.
ఈ పంథాను నక్సల్బరీ ముందుకు తెచ్చి భారత విప్లవానికి బాటలు వేసింది. వందేళ్ల తర్వాత తిరిగి చూస్తే, ఈ అవగాహనలు ఇవాళ పూర్తి స్థాయిలో పదునెక్కాయి. వర్గ పోరాటం అంటేనే సాయుధ పోరాటం అనేంతగా విప్లవ పంథాకు ఆమోదం పెరిగింది. మరోవైపు ఈ అవగాహన, ఆచరణ తీవ్ర సవాళ్లకు గురి అవుతున్నాయి. కమ్యూనిస్టులు తిరిగి తమ ప్రారంభ బిందువు వద్దకే వచ్చి చేరారనే మాటలు వింటున్నాం. అణచివేతకు సంబంధించిన దగ్గోచర అంశాలు మనుషుల మానసికతపై పై చెయ్యి సాధించాయనేది వాస్తవం. కార్పొరేట్ లక్ష్యాల కోసం ప్రారంభించిన కగార్ అంతిమ యుద్ధ వ్యూహం సరిగ్గా ఇక్కడే ఫాసిస్టు పాలకులకు ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు సాయుధ పోరాట పంథాను చర్చలోకి లాగింది. ఇదంతా కలిసి సమకాలీన విప్లవ సందర్భాన్ని ప్రత్యేకంగా నిలిపింది.
విప్లవాలు తీవ్ర నష్టాలకు, వెనుకంజలకు గురవడం సహజం. అంతిమ విజయం వరకు విప్లవం వెనుకడుగులోనే ఉంటుందనే అర్ధంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ భావనను మనం తీసుకుంటాం. అయితే, దీర్ఘకాలిక ప్రజా యుద్ధం అనే మాట సైనిక అర్ధాన్ని మాత్రమే ఇవ్వదు. సాయుధ పోరాటం మనకు దూరంగా జరిగే ఒకానొక కార్యకలాపం మాత్రమే కాదు. ఒకవేళ మనం ఇలాగే తీసుకుంటే.. యుద్ధాన్ని లేక విప్లవాన్ని ఆయుధాల వినియోగానికి సంబంధించిన ఒక ప్రక్రియగానే చూసినట్లవుతుంది.
అప్పుడు దానికి సంబంధించిన సంప్రదాయ భావనల దగ్గరే మన చైతన్యం, అవగాహన, ఆచరణ ఆగిపోతాయి. యుద్ధంలో ఆయుధాలు ఉంటాయి. కానీ, యుద్ధ జయాపజయాలను అవి మాత్రమే నిర్ణయించలేవు. మనుషుల ఆకాంక్షలు, సంప్రదాయ అనుభవాల నుంచి తీసుకొనే వైఖరులు విప్లవ పరిస్థితులను తీసుకరాలేవు. విప్లవ విజయాన్ని రాజ్య మిలిటరీ బలంతో మాత్రమే పోల్చి భవిష్యత్తును నిర్ణయించలేం. రాజ్యం బలానికి, అణచివేతకు మరి ఏ ప్రాధాన్యతలు లేవా? అంటే ఉంటాయి. సైనిక బలం అంతులేని బీభత్సం సృష్టించగలదు. ఉద్యమంపై దూకుడుగా దాడులు చేయగలదు. కానీ, తాత్కాలిక నష్టం కలిగించవచ్చుగాని ప్రజలకు విజయం సిద్ధించకుండా ఇవేవీ నిర్ణయాత్మక పాత్ర పోషించలేవు. ఇలాంటి యుద్ధ సన్నివేశంలోని వర్గపోరాటం, దాని ప్రతిఫలనమైన, రక్షణ కవచమైన భావజాలంలో, సంస్కృతిలో సమాజపు ఎదుగుదలే ఫలితం అటా ఇటా అనేది తేలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో భౌతిక పరిస్థితులు, వాటిని విప్లవాత్మకంగా మలిచే మనుషుల ఆచరణ, ఆలోచనా క్రమాలు కీలకం. అక్కడి నుంచే పరిస్థితులను మార్చే విప్లవ సిద్ధాంతం వస్తుంది.
పోరాడేవారిలోని బలహీన భాగాలపై రాజ్యం గట్టి దెబ్బలు తీసినప్పుడు, వారిలోంచే ద్రోహులు బయలుదేరుతారు. అయితే, ఎందుకిలా జరుగుతుంది అనే ప్రశ్నకు కేవలం సైనిక శాస్త్రమే సమాధానమివ్వలేదు. పెరిగిన నిర్బంధం, తగ్గిన ప్రజాదరణ అంటూ చేసే వాదనలు కూడా అలాంటివే. ప్రజా పునాది కలిగిన కేడర్ పార్టీకి, అదీ సుదీర్ఘకాలం సాయుధ పోరాటాన్ని నడిపించిన నిర్మాణానికి ఇలా జరగడం ఏమిటనే ఆందోళనతో మాట్లాడేవారు మనచుట్టూ కనిపిస్తున్నారు. విప్లవోద్యమ నాయకులే రాజ్యం చేతిలోకి ఎందుకు వెళతారో, ఎందుకు ద్రోహులుగా తయారవుతారో ఈ విచారం వివరించలేదు. అయితే వర్గపోరాటం పట్లేగాక మానవులకు సహజమైన ఆశావాదం, చరిత్రపట్ల విశ్వాసం కూడా పోయే భావజాల సంక్షోభానికి ఇది దారి తీస్తుంది. ఒక రకమైన తాత్విక సందిగ్ధతకులోను చేస్తుంది.
అడవుల నుంచి విప్లవకారుల మృతదేహాలు బయటకు రావడం దగ్గర నుంచి, అవే అడవుల నుంచి ఆయుధాలతో లొంగిపోవడానికి బయటకు వస్తున్న నాయకుల చిద్విలాసాల దాకా.. అనేక దృశ్యాలు కలగాపులగమై మన మానసికతను గట్టిగా ఆవరించుకున్నాయి. వీటిలోని ఒక్కొక్క పొర విడదీస్తూపోతే అసలు వాస్తవికతకు కొంచెమైనా దగ్గర కాగలం. అలా చూస్తే, విప్లవకారుల హత్యలు ఒక విడి అంశం. సాయుధ లొంగుబాట్లను సమర్ధించుకునేందుకు, మౌలిక సిద్ధాంతాలకు ద్రోహం తలపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మరో విడి అంశం. మొదటిది రాజ్యహింసలో భాగం. రెండోది రాజ్య ప్రేరిత విద్రోహం. ఈ రెండూ ఒకటే అనుకొని, మొదటి దాని వల్ల రెండోది అనివార్య ఫలితంగా వచ్చిందని వాదించేవాళ్లు ఉంటారు. పైగా రెండో దానికి సమర్థన కూడా వస్తుంది. రెంటినీ కలిపి అర్థం చేసుకుంటున్న వాళ్లు తాము గందళగోళానికి గురై ఇతరులను అందులోకి తోసేస్తున్నారు. మనం దీని ప్రభావంలోకి వెళ్లితే విప్లవానికి ద్రోహం తలపెట్టిన నాయకుల, వారి మద్దతుదారుల వలలో పడిపోతాం. అప్పుడు మనలోని సహజ మానవ స్పందన జాగృతమై మనిషి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదని తేల్చేస్తుంది. దాని కోసం ఏమైనా చేయవచ్చనే అంగీకారాన్ని ప్రకటిస్తాం. అందువల్ల రెంటినీ విడిగానే డీల్ చేయాలి. అప్పుడు మాత్రమే విప్లవాన్ని స్థలంలోనే కాకుండా కాలంలోనూ లేకుండా చేయాలన్న అతి పెద్ద కుతంత్రం మూలాలను ఈ ద్రోహంలో పసిగట్టగలం.
ఈ ద్రోహ చింతన ఒకరో ఇద్దరో వ్యక్తుల స్వీయ ప్రయోజనాలకు పరిమితం కాదు. ముఖ్య నాయకులే లొంగిపోయాక ఏర్పడిన అనిశ్చితిలో తిరుగు ముఖం పడుతున్న మిగతా విప్లవకారుల నిబద్ధతను శంకించడానికి లేదు. వాళ్లనూ వీళ్లనూ కలిపి చూడటానికి లేదు. ఇక సాయుధ విప్లవోద్యమం నడిచే పరిస్థితి లేదని లొంగుబాటును విప్లవాత్మక చర్చగా భావించే కొందరి రాజకీయ, వ్యక్తిగత దురుద్దేశాలకే కుదించడానికి లేదు. పోరాట సంస్కృతినీ, పోరాడి జయించగలమనే తాత్వికతనూ ధ్వంసం చేయగల ప్రతీఘాతుక భావజాలం ఇది. మానవులనేగాక, మావన సంస్కతిని కూడా ధ్వంసం చేయడానికి జరుగుతున్న ఈ విధ్వంసాన్ని సాధారణ మానవీయ కోణంలో కాకుండా మనుషులు నడిచి వచ్చిన చరిత్రలోంచి మాత్రమే చూడగýం. మనుషులు నిర్మించుకుంటున్న చరిత్రను అర్థం చేసుకోడానికి సామాజిక శాస్త్ర పద్ధతులను, వాటి మీద వెలుగు ప్రసరించే తాత్విక భావనలను కలిపి చూడాలి. మొత్తంగా రాజకీయ, సాంస్కృతిక వికాసానికి ఇంజన్‌గా ఉండే వర్గపోరాటం అనే ఇరుసు మీద ఈ సంక్షుభిత సందర్భాన్ని చూడాలి. ఇవాళ మనం చిక్కుకపోయిన ఫాసిజానికే ఉన్న ప్రత్యేక లక్షణంగా కగార్ అంతిమ యుద్ధ సారాన్ని గ్రహించాలి.
స్థల కాలాల్లో విప్లవం-వర్గపోరాట నిర్దిష్టత
నక్సల్బరీ వెనుకంజకు గురై శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటం కూడా చివరకు వచ్చిన దశలో చారుమజుందార్ విప్లవం భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ప్రకటించారు. ఆయన రచనలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆయుధాలు అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కానీ మనమే అందుకు సిద్ధం కావడం లేదంటూ 1965లో సీపీఎం నాయకత్వానికి రాసిన తొలి డాక్యుమెంట్ నుంచి వెంపటాపు సత్యం, ఆదిభట్ట కైలాసం అమరత్వం తర్వాత శ్రీకాకుళంలో మిగిలిన నాయకత్వానికి, కార్యకర్తలకు రాసిన చివరి లేఖల వరకు పుస్తకాలుగా వచ్చాయి. ఆన్లైన్లో డిజిటల్ కాపీలుగా దొరుకుతున్నాయి. విప్లవకారులు తప్పులు చేస్తారు అని చెబుతూ..తప్పులు కావాలని చేయమని, సమాజ నిర్దిష్టతను శాస్త్రీయంగా గ్రహించడంలో, తదనుగుణమైన కార్యాచరణకు ప్రజలను సిద్ధం చేయడంలో పడే తప్పటడుగులే తప్పులుగా బయటపడతాయని ఆయన అంటారు. నక్సల్బరీ పోరాటంలో చాలానే తప్పులు జరిగాయని, వాటికి బాధ్యత నాయకత్వానిదేగానీ, ప్రజలది కాదంటూ.. తన తొలి డాక్యుమెంట్ స్ఫూర్తిని చివరి గడియ వరకు చారుబాబు ప్రదర్శించారు. ఎప్పటి తప్పులు అప్పుడు దిద్దుకోకపోతే విప్లవ చలనానికి దూరమయిపోతామని హెచ్చరించారు. అయితే, నిర్బంధం, అణచివేత వంటి అసాధారణ పరిస్థితులు ఒక్కోసారి ఇలాంటి సమీక్షలకు అవకాశం ఇవ్వవని, అప్పుడు విప్లవం తీవ్రంగా నష్టపోతుందని కేడర్‌కు రాసిన ఉత్తరాల్లో ఆయన తెలిపారు.
అణచివేత, దెబ్బతిన్న ఉద్యమం కళ్ల ముందు కాదనలేని వాస్తవాలు కాబట్టి విప్లవాచరణలోని కేడర్‌తోపాటు, మనం పనిచేసే ప్రజల్లోను మన మార్గం పట్ల మునుపటి విశ్వాసం సడలే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. రాజ్యం తనకు ఉన్న శక్తివంతమైన సమాచార, భావజాల, సాంస్కృతిక యంత్రాంగాల ద్వారా మన మార్గాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి చేయాల్సినంతా చేస్తుంది.
స్వీయాత్మక, పెత్తందారీ పోకడల కారణంగా విప్లవాచరణలో నిలబడలేక దిగజారిపోయిన ద్రోహులు విప్లవకారుల ముసుగులో మన మార్గంపై విషం చిమ్ముతారు. సైద్ధాంతికంగా మన మార్గం తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితి ఉద్యమంలో ఉత్పన్నమయినప్పుడు ఆయుధం దించడం కాదు, మరింత గట్టిగా పట్టుకోవాలని 1905 స్టోలోపిన్ నిర్బంధ కాలంలో లెనిన్ అంటారు.
చారుబాబు అదే స్పూర్తిని ప్రదర్శిస్తూ..మన మార్గాన్ని కాపాడుకునేందుకు నాయకత్వం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పునాదిని నిర్మించడంలో వ్యక్తిగతంగానూ నాయకత్వం చేసిన తప్పులు, కలిసిరాని స్వీయాత్మక బలం, విపరీతమైన శత్రు నిర్బంధం.. ఇలా కారణం ఏదైనా మన మార్గం ఈ రోజున ఓడిపోయి ఉండవచ్చుగానీ, రేపటి రోజున మన మార్గమే గెలిచి తీరుతుందంటూ.. ఇందుకు నాయకత్వం త్యాగాలు ఎరువు కావాలని స్పష్టం చేస్తారు. రెండు విషయాల గురించి కేడరును ఆయన అప్రమత్తం చేస్తారు. ఈ సమయంలో రాజకీయ లొంగుబాటు, మార్గంపై పునఃసమీక్ష అనేవి విప్లవం పాలిట ఆత్మహత్యాసదశాలు అవుతాయని హెచ్చరించారు. కలకత్తాలోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో 1972 జూలై 28న అమరుడయ్యేవరకు విప్లవబాటలోనే ఆయన కొనసాగారు.
ఆయన వల్ల జరిగిన తప్పులను ఎంతయినా చర్చించవచ్చుగాని, ఆయన విప్లవ రాజకీయాలను మన సమాజ వాస్తవ స్థితి నుంచి గుర్తించారు. సమాజ అవసరంగా ఎత్తిపట్టారు. ఆనాటికి ఊపిరి సలపని నిర్బంధమేగాక అంతకంటే చుట్టుముట్టి ఉన్న విప్లవ వ్యతిరేకుల, పారుబోతుల, లొంగుబాటుదారుల విద్రోహ భావజాలం మీద యుద్ధం చేయడానికి ఆయన నిస్సంకోచంగా, దృఢంగా నిలబడ్డారు. ఆనాటి స్థలకాలాల్లో అదొక రాజకీయ, నిర్మాణ పోరాటమే. కానీ అది విప్లవ భావజాల పోరాటం, విప్లవాచరణలోని సాంస్కృతిక పోరాటం. ఈ కోణాలు ఉన్నందు వల్లనే ఇవాళ గుర్తు చేసుకోగలుగుతున్నాం. ఒక నిర్దిష్ట స్థల కాలాల్లోని విప్లవం, అందులో తలెత్తిన సంక్షోభం భావజాల సంక్షోభం కూడా. దాన్ని ఆయన ప్రతిభావంతంగా ఎదుర్కొన్నారు. వర్గపోరాటాన్ని చర్యలకు కుదించకుండా చారిత్రక ధారగా గుర్తించినందు వల్లనే ఆయనకు అది సాధ్యమైంది.
వర్తమానంలోకి వస్తే, ఈ రోజున పోరాట ప్రాంతం దాదాపుగా ఖాళీ అయిందని చెబుతున్నారు. కమిటీలకు కమిటీలు కగార్ అంతిమయుద్ధంలో తుడిచి పెట్టుకుపోవడం, లేదంటే సామూహికంగా సాయుధంగా లొంగిపోవడం మనం చూస్తున్నాం. ఇలాంటి సన్నివేశంలోనూ పోరాటాన్ని తుదకంటా కొనసాగిస్తామంటూ అదే పోరాట భూమి నుంచి లేఖలు, ప్రకటనలు వస్తున్నాయి. కుటుంబంతో చెప్పించినా, ఇతర మార్గాల్లో ఒత్తిడి చేసినా మిగిలిన నాయకులు పోరాటాన్ని సవరించుకుంటూ, ముందుకుతీసుకపోతూ మరణించడానికే సిద్ధమవుతున్నారు. చారుబాబు అమరత్వాన్ని అయినా, వర్తమాన త్యాగాలనైనా కేవలం వ్యక్తిగత సంసిద్ధత, స్వీయ నిబద్ధతగానే తేల్చలేం. చారిత్రకమని, శాస్త్రీయమని, సత్యమని సాయుధ పోరాట పంథాను వారు నమ్మారు. ఆ సత్యాన్నే వారు ప్రకటించారు. ఈ పని వారు చేయకపోతే స్థానీయ ప్రత్యేకతలతో నిర్దిష్ట కాలావధి మధ్య మొదలై అతివాద దుస్సాహసిక పోకడలతో అంతర్గంగానే బలహీనపడి దెబ్బతిన్న పోరాటంగా రాజ్యం అప్రతిష్ఠపాలు చేస్తుంది. దాన్నొక చేదు అనుభవంగా ప్రజలతోనూ ఒప్పించగలుగుతుంది. ఆ పనిలో కొందరు మేధావులు కూడా భాగమై భావజాలంగా మార్చుతారు.
చారుబాబు అమరత్వం తర్వాత అప్పుడు రాజ్యం అదే చేసింది. బెంగాల్లో విప్లవం కాదు కదా, కనీసం గడ్డి పరక కూడా మొలవదని ఒక రకంగా సవాలే చేసింది. ఒక చోట దెబ్బతిన్న తర్వాత తిరిగి అక్కడ ఉద్యమం రాదనే అభిప్రాయం విప్లవ శిబిరంలోనూ గూడుకట్టుకుని ఉండేది. బెంగాల్లోలోని నందిగ్రామ్, లాల్‌ఘడ్ ప్రజలను సాయుధ పోరాటంలోకి తెచ్చి ఈ అభిప్రాయాన్ని మావోయిస్టు పార్టీ పటాపంచలు చేసింది. పోరాటాలకు ఉండే ప్రాసంగికతను, సార్వజనీనతను, స్థల, కాలాల్లో మునుపటి కంటే మెరుగైన రూపంలో విస్తరించే గుణాన్ని, అంతర్జాతీయ విప్లవాలతో ఉండే బాండింగును తెలియజెప్పింది. ఇంతకంటే ముఖ్యంగా చారుబాబు, ఇతర నక్సల్బరీ నేతలు ఏ సాయుధ పోరాట మార్గాన్ని సత్యం, నిత్యం అని నమ్మారో అదే మార్గాన్ని, మరింత అడ్వాన్స్ చేసి బెంగాల్లో మావోయిస్టులు ఆచరించి చూపించారు. చారుబాబు నిర్మించిన విప్లవ పంథాను కాలంలోనూ నిలబెట్టినట్టే, ఇప్పుడూ తమ త్యాగాలతో ఆ పంథాను ప్రాణాలిచ్చి కాపాడుకుంటున్నారు.
ఇప్పుడు విప్లవోద్యమం ముగిసిపోయిందని కొందరు అంటున్నారు. ఆ రోజు కూడా ఇదే మాట అన్నారు. కాలం మారింది. సందర్భం మాత్రం అదే. అణచివేతతో, ద్రోహంతో విప్లవోద్యమం దెబ్బతింటున్న ఈ సందర్భాన్ని అర్థం చేసుకోడానికి చరిత్రలోకి వెళ్లడం అవసరం. ఉద్యమాలు అననుకూల స్థితిలో వెనుకతట్టు పట్టి, అనుకూలతలు పెరిగినప్పుడు తిరిగి విజృంభిస్తాయి. ఇది మనుషులు ఆయుధాలు దించడంతో, ఎత్తడంతో సంబంధం లేని, వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేని వర్గ పోరాట వాస్తవికత. సామాజిక పరిస్థితుల్లోంచి విప్లవక్రమాలు నడుస్తాయి. కానీ, ఈ మాటల దగ్గరే ఆగిపోతే ఇదేదో అమూర్త సత్యంలా అనిపించే ప్రమాదం ఉంది.
మార్క్సిజం ప్రకారం, వ్యక్తిగత ఆస్తి సంబంధాలు వర్గాలను అస్థిత్వంలో ఉంచుతాయి. వర్గాల పొందికలో మార్పులు వస్తుంటాయి. కానీ వర్గాలు ఉన్నంతవరకు వర్గ పోరాటం ఉంటుంది. అయితే, స్థల, కాల నిర్దిష్టతతో, సంస్కతితో, భావజాలంతో సంబంధం లేని వాస్తవికత కాదిది. ఒక్కో సమాజంలో ఒక్కో రూపంలో వర్గ పోరాటం క్రియాశీలం అవుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక సంబంధాలు కలిగిన సమాజంలో ఒక రకంగాను, భూస్వామ్య వ్యవసాయ ఆర్థిక సంబంధాలు కలిగిన సమాజంలో ఇంకో రూపంలోను ఈ వాస్తవికత వ్యక్తం అవుతుంది. భారత సమాజ ప్రత్యేకతల్లోని బ్యురాక్రటిక్ దళారీ పెట్టుబడిని, అర్ధ భూస్వామ్యాన్ని పట్టించుకోకుండా వట్టినే వర్గపోరాటం గురించి, విప్లవం గురించి వల్లించడం వల్ల ఉపయోగం లేదు. ఉత్పత్తి శక్తుల వాదనను ఎదుర్కొంటూ లెనిన్.. విప్లవం అనేది మనుషులు ఇష్టంతో పాల్గొనే కార్యకలాపం అని తెలిపారు. ఎడ తెగని పదార్ధం- చైతన్యం చర్చతో గిడసబారిన తత్వశాస్త్రంలోకి ఫ్యుయిర్బా తొలిసారి మానవుడిని ప్రవేశపెట్టాడు. మార్క్స్ ఆర్థిక శాస్త్రానికి మానవ చెమటను అద్ది దాన్ని మానవ శాస్త్రంగా మలిచాడు. లేదంటే అదీ గణితంలా పిడచగట్టుకుపోయేదే. ఇంతకు ఆ మనుషులు ఎక్కడ ఉంటారు? ఉత్పత్తి సంబంధాల్లో ఉంటారు. సమాజంలో, సంస్కృతిలో ఉంటారు. ఆ సమాజం, సంస్కృతి వర్గపోరాటానికి ఏ వ్యక్త రూపం ఇస్తుందనేది పూర్తిగా అక్కడి ప్రత్యేక చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సామ్రాజ్యవాద దశలోకి పెట్టుబడిదారి వ్యవస్థ చేరినప్పటి నుంచీ విప్లవ ఆవశ్యకత పెరిగింది. ఇది విప్లవాల యుగం అని రూఢి చేస్తూ యూరప్‌లో, రష్యాలో సార్వత్రిక సాయుధ తిరుగుబాటు రూపంలో, ఆసియాలోని చైనాలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ రూపంలో వర్గ పోరాట వాస్తవితక రూపు కట్టింది.
భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో వర్గ పోరాటం రమారమీ 175 ఏళ్లుగా సాయుధ ఆచరణ రూపంలోనే కొనసాగుతోంది. నిజానికి అంతకంటే ఎంతో ముందు నుంచి ఆదివాసులు, స్థానిక ప్రజలు సకల ఆధిక్యాలకు, ఆ తర్వాత వలసవాదానికి వ్యతిరేకంగా సాయుధంగా పోరాడారు. అందువల్ల సమకాలీన విప్లవోద్యమం గురించిన చర్చలో సాయుధ పోరాటాన్ని వదిలేసి చేసే వర్గ పోరాట సంభాషణలో నిజాయితీ కనిపించదు. ఏ వాస్తవికతనూ అలాంటి వాదన ప్రతిబింబించలేదు. మనం జీవిస్తున్న స్థల కాలాలతో సంబంధం లేకుండా విప్లవం గురించి మాట్లాడటం కంటే, చరిత్ర అందించే అనేక స్థల కాల విప్లవానుభవాల నుంచి మనం జీవిస్తున్న చోటికి వచ్చి మాట్లాడాలి. అప్పుడే నేల విడిచి సాము చేయకుండా, గాలిలో వాదనలు వినిపించకుండా చారిత్రక ఆధారంతో విప్లవంలో భాగం కాగలం.
అయితే ఆధునిక యుగంలో విప్లవాలకు ఎంత చరిత్ర ఉన్నదో అంతే ద్రోహాలకూ ఉన్నది. ఇది విప్లవం చేయడానికి అనుకూలమైన కాలం కాదని వాదించే వాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా విప్లవోద్యమం ఒక దశ నుంచి మరో దశలోకి ఎదిగే క్రమంలో నిర్బంధం తీవ్రమైనప్పుడు, లేదా కొన్ని పొరబాట్ల వల్ల కూడా వెనుకడుగు వేసినప్పుడు విప్లవాన్ని విరమించాలని గోల చేసిన వాళ్లు ఉన్నారు. అది కొందరి విరమణ కాదు. విరమణ వాదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఇప్పటి లాగే విప్లవకారులు తీవ్రమైన విమర్శ పెట్టారు. పోరాటం, పోరాట విరమణ, విద్రోహం, పోరాటాన్ని కొనసాగించడం అనేవి వేర్వేరుగా కాకుండా కలిసే నడిచాయి. ఆ చరిత్ర తెలుసుకోవడం అవసరం. గతంలో కూడా ఈ వాద వివాదాలు రాజకీయ రంగానికే పరిమితం కాలేదు. భావజాల, సాంస్కతిక వాదవివాదాలుగా మారాయి. ఈ వర్గపోరాట అనుభవం ఇప్పటి కగార్ అణచివేతను, విద్రోహాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుంది. విప్లవోద్యమం సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ వైఖరే శాస్త్రీయమవుతుంది.
విరమణవాదం: విప్లవ విమర్శ-భావజాల రంగం
ఈ విషయం చర్చించడానికి కూడా మనం మళ్లీ చారుబాబు దగ్గరికే వెళదాం. ఆయన విషయంలో పార్టీలోని ఆయన శత్రువులు సైతం వ్యతిరేక అర్థంలో అంగీకరించే విషయం ఒకటి ఉంది. సాయుధ పోరాట రాజకీయాలకు ఆయనతోనే భారత సమాజంలో సాధికారికత లభించిందని వారు ఒప్పుకొంటారు. ఆయన ఎన్ని తప్పులైనా చేసి ఉండవచ్చుగానీ, విప్లవ మార్గానికి ఏ కోశానా అపకారం తల పెట్టని నేతగా విప్లవకారులకు చారుబాబు సదా ఆదర్శప్రాయుడని కేఎస్ రాస్తారు. నిజంగానే పార్టీలో సాయుధ పంథాను చారుబాబు ఎంత సుదఢంగా నిలబెట్టారంటే రాజకీయ శత్రువులు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారుగాని, పంథాను ముట్టుకోలేకపోయారు. ఈ కారణంగా తీవ్రంగా నష్టపోయి, దాదాపు నాయకత్వమంతా తుడిచిపెట్టుకుపోయి కూడా..నక్సల్బరీ నాలుగేళ్లలోనే తిరిగొచ్చింది. ఆయనకు మన దేశ రాజకీయ పరిస్థితుల మీద అంత స్పష్టత ఉన్నది. చరిత్ర కల్పించిన పరిస్థితుల్లోంచి ఒక భౌతికశక్తిగా విప్లవోద్యమం లేచి నిలబడుతుందని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో రాజకీయ, సిద్ధాంత, భావజాల రంగాల్లో ఆయన అంత బలమైన వర్గపోరాటం చేశాడు కాబట్టే వ్యక్తిగా ఆయను ఎంత టార్గెట్ చేసినా ఆయన విప్లవ వ్యక్తిత్వం చరిత్రలోంచి పక్కకు తొలగి పోలేదు. భారత చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా ఆయన ద్వారా అందివచ్చిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా మన దేశ కాలాలకు తగినట్లు అభివద్ధి చెందుతూ ఉన్నది. పొరబాట్లు జరిగినా అదే సరైనదని ఈ సంక్షోభం కూడా చెబుతున్నది.
దీనికి భిన్నంగా సాయుధ పోరాట విరమణ చేసి, రాజకీయంగా నాయకత్వం లొంగిపోతే ఎట్ల ఉంటుందో తెలంగాణ రైతాంగ పోరాట విరమణ సందర్భంలో చూశాం. అలాంటి సందర్భాల్లో తిరిగి వర్గపోరాటం పుంజుకోవడం ఎంత కష్టమనేది కూడా చూశాం. తెలంగాణ రైతాంగం 1946 జూలై 4 కొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం మొదలుపెట్టి, 1948లో హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించిన నెహ్రూ సైన్యాలతోనూ తలపడుతూ, 1951 వరకు ఆయుధం దించకుండా పోరాడింది. నిజాం రజాకార్లతో పాటు నెహ్రూ సైన్యాలకు సైతం వెన్నుచూపకుండా పోరాడిన సమరశీల రైతాంగానికి నాయకత్వమే వెన్నుపోటు పొడిచింది. ఐదేళ్ల పాటు కొనసాగి, మూడు వేల మంది అమరులై, మూడు లక్షల ఎకరాలను ప్రజలు పంచుకున్న ఇంత పెద్ద రైతాంగ పోరాటం అప్పటికి మరొకటి లేదు. నాయకత్వ ద్రోహం వల్ల 1952 నాటికి పోరాట విరమణ జరిగింది. అప్పటి నాయకత్వంలోని ఒక భాగం గాంధేయ భావనలతో పోరాటంలోకి వచ్చింది. మితవాదంతో విప్లవం గురించి మాట్లాడుతూ ఉండింది. తొలినుంచీ సాయుధ పోరాటం విషయంలో విముఖంగానే ఉంది.
1947 ఆగస్టు 15 తర్వాత ఈ విముఖత మరింత పెరిగింది. నెహ్రూ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించగా, ఆ నాయకత్వం ఏమైనా సరే సాయుధ పోరాటం ఆపేయాల్సిందేనంటూ బొంబాయిలోని కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఇక నాయకత్వంలోని రెండో బృందం కూడా సారంలో ఇదే కోరుకుంది. కానీ, ఎకాఎకిన ఆయుధం దించమంటే రైతాంగం అంగీకరించదు. అందువల్ల సుదీర్ఘ ప్రక్రియను నడిపించారు. అప్పటి ప్రపంచ సోషలిస్టు శిబిరానికి నాయకత్వం వహిస్తుండటంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని తుడిచిపెట్టిన మహా నాయకుడిగా జోసెఫ్ స్టాలిన్‌కు గొప్ప పేరు ఉంది. కమ్యూనిస్టు కార్యకర్తలకు, పోరాడుతున్న రైతాంగానికి స్టాలిన్ పట్ల మంచి గురి ఉంది. ఆయన పైనా, ఎర్రసేన మీదా పాటలు రాసి పాడుకున్నారు. దీంతో పోరాటం కొనసాగుతుండగానే బొంబాయి నుంచి ఒక బృందం రష్యాకు వెళ్లి స్టాలిన్‌ను కలిసింది.
ఈ సందర్భంగా ఆయనకు, మన నాయకులకు మధ్య నడిచిన సంభాషణ మినిట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్టాలిన్ నోట్లో పెట్టి చాలా విషయాలు ప్రచారంలోకి తెచ్చారు. వాటి అంతిమ సారాంశంగా సాయుధ పోరాట విరమణ నిర్ణయం నాయకత్వం తీసుకుంది. విప్లవం ప్రారంభించి, సుదీర్ఘకాలం దానిని సాగించి, విజయవంతం చేయడంలో అంతర్గత వైరుధ్యం 80 శాతం పనిచేస్తే, బయటి సహకారం 20 శాతం వర్కవుట్ అవుతుంది. ఇదే విషయం స్టాలిన్ చెప్పారని, బయటి సాయం అందించడానికి మీ పోరాటం విషయంలో నైసర్గిక అననుకూలతలు పెద్ద అడ్డంకిగా ఉన్నాయని ఆయన చెప్పారని వీరు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణకు సముద్రం లేకపోవడం వల్ల రష్యా సాయం ఏ రూపంలోనూ అందించలేమని స్టాలిన్ అన్నారని వీరు అన్నారు. బయటి సాయం అందకుండా ఇంత పెద్ద సైన్యాన్ని ఎదిరించలేమని తేల్చారు. ఇలాంటి కొసరు కబుర్లు తప్ప 20వ శతాబ్ద విప్లవాల గురించి స్టాలిన్ అంచనా ఏమిటనేది నాయకత్వం చెప్పలేదు.
ప్రపంచ సోషలిస్టు శిబిరం స్టాలిన్ సాయం, సలహా మనమే కాదు, ఆనాడు ఎన్నో దేశాల కమ్యూనిస్టులు కోరేవారు. తమ దేశ నిర్దిష్ట విప్లవ పరిస్థితికి దగ్గరగా ఉండే సలహాలను తీసుకునేవారు. లేదంటే, తమ దారిలో ముందుకెళ్లేవారు. రెండవ ప్రపంచ యుద్ధం విరమణ, జపాన్ ఓటమి తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు స్టాలిన్‌ను కలిశారు. ఉత్తర చైనాలో కమ్యూనిస్టులు, దక్షిణ చైనాలో చాంగై షేక్ నాయకత్వంలోని కొమింగ్ టాంగ్ పరిపాలించేలా ఒప్పందం చేసుకొమ్మని వారికి స్టాలిన్ సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాను మావో నేతత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించి అంతిమ యుద్ధం చేసి నాలుగేళ్ల తరువాత దేశ వ్యాప్త విజయం సాధించింది. అప్పటికే మావో చైనా నిర్దిష్టతకు తగిన పోరాట పంథాను రూపొందించారు. వలసలు, అర్ధ వలసలు, పూర్వ వలసల్లో విముక్తి పోరాటాలు నూతన ప్రజాస్వామిక విప్లవం రూపంలో జరగాలని, ఈ విప్లవ దశ అంతా సాయుధ పోరాటాన్ని ఆయన తప్పనిసరి షరతుగా ప్రకటించారు. ఇక్కడ మన నాయకత్వమేమో సాయుధ పోరాట పంథాను వదిలేసేందుకు స్టాలిన్ సలహాను సాకుగా చూపించారు. పోరాడేందుకు రైతాంగం, సహకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా, ఆయుధం దించేయడానికి నాయకత్వం తొందరపడింది. ఈ పోరాటం పట్ల మొదటి నుంచీ పట్టింపు లేని జాతీయ నాయకత్వం సాయుధ పోరాట విరమణ ద్వారా ద్రోహం చేసింది. పోరాటం మీ ఇష్టం.. మా సాయం విషయంలో ఇదీ పరిస్థితి అని స్టాలిన్ చెప్పిన విషయం నాయకత్వం కేడర్‌కు చెప్పలేదని ఆ పోరాటంలో పాల్గొన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి నాయకులు రాశారు.
విరమణ జరిగిన 20 ఏళ్లకు ఈ పోరాటాన్ని ఒక గుణపాఠంగా తేల్చుతూ ప్రధాన నాయకత్వం స్వీయ, ఆత్మ కథనాత్మక కథనాలను చరిత్రగా గ్రంథస్తం చేసింది. అప్పటికి మావో నూతన ప్రజాస్వామిక విప్లవ సారాన్ని అందుకుని రంగంపైకి వచ్చిన నక్సల్బరీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ గ్రంథాల్లో విషం చిమ్మారు. ఇంత విరామం తర్వాత ఈ రచనలు తేవడంలో మరే ఇతర కారణం మనకు కనిపించదు. నిజానికి, తెలంగాణ పోరాటం నుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలు లేవా అంటే.. అలాంటివి కోకొల్లలుగా కనిపిస్తాయి. అయితే, అవన్నీ నాయకత్వం వైపు నుంచి దిద్దుకోవాల్సిన పొరపాట్లు. ఆంధ్ర మహాసభ రూపంలో ఉన్న లీగల్ అవకాశాలు అప్పటికి తగ్గిపోతూ వచ్చాయి. వీర తెలంగాణ గుణపాఠాలను తీస్తూ నాయకత్వం..సాయుధ పోరాట ఆలోచనే తప్పు అన్నట్టు రాసింది. కానీ, వాస్తవంగా సాయుధ పోరాటంలోకి ప్రజలను నాయకులు మరింత మిలిటెంట్‌గా తీసుకరాలేకపోవడం వల్లే, లేదా ఆలస్యంగా తీసుకురావడం వల్లే ఉద్యమం ఎక్కువగా దెబ్బతింది. నాయకత్వ ద్రోహం మిగతా పనిని పూర్తిచేసింది.
ప్రపంచ సోషలిస్టు శిబిరం బలంగా ఉన్న రోజుల్లో జరిగిన ద్రోహం ఇది. సాయుధ పోరాట విరమణను ఒక విరమణ వాదంగా మార్చడానికి నాయకత్వం చేయరాని పనులు చేసింది. ఇది పార్టీ నాయకత్వానికి సంబంధించిన విషయంగా మిగిలిపోలేదు. కమ్యూనిస్టు శిబిరంలో చాలా పెద్ద భావజాల సంఘర్షణగా మారింది. సాంస్కతిక రంగ చర్చగా కొనసాగింది. ఇప్పటికీ ఆనాటి విరమణవాదాన్ని వర్గపోరాట దృష్టితో విప్లవశక్తులు ఎండగడుతూనే ఉన్నాయి. సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవని విరమణవాదం లేవదీసిన వాళ్లకు పోరాటం పట్ల గురి లేదు. పోరాటానికి బైట ప్రయోజనాలు ఉన్నాయి. వర్గపోరాటాన్ని దెబ్బతీసే మితవాదంలో ముగినిపోయి ఉన్నారు. పార్లమెంటరీ భ్రమల్లో ఉన్నారు. అప్పుడు స్టాలిన్ కలిసి వచ్చి, ఆయన చెప్పాడని విరమణవాదం లేవదీస్తే, ఇప్పుడు శతృవుకు దగ్గరై ద్రోహానికి పాల్పడి విరమణవాదం వినిపిస్తున్నారు. సాకు మాత్రం సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవనే. వీళ్లు కూడా భవిష్యత్తులో తెలంగాణ పోరాటానికి ద్రోహం చేసిన నాయకుల్లాగే తమ వాదనను బలపరుచుకుంటూ రచనలు చేయవచ్చు.
ఆనాటి కంటే ఇప్పుడు చాలా సవాళ్లు విప్లవోద్యమం ముందున్న మాట వాస్తవమే. రాజ్య స్వభావమూ మారిపోయింది. అణచివేత తీవ్రస్థాయిలో ఉన్నది. కానీ సాయుధ పోరాటాన్ని ఎంచుకోవడమనే రాజకీయ నిర్ణయం, చర్య భారత కమ్యూనిస్టు ఉద్యమ భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాట చైతన్యాన్ని ఇచ్చాయి. విరమణవాదంలోని ప్రతీఘాతుకత్వం కూడా వర్గపోరాటంగానే భావజాల రంగంలో కొనసాగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది.
అప్పటిలాగే ఇప్పుడూ మావోయిస్టు ఉద్యమం మీద అమలవుతున్న తీవ్ర అణచివేత సందర్భంలో విరమణవాదం తలెత్తింది. అప్పటిలాగే విరమణవాదులు ఎన్నికల ద్వారా విప్లవం తెస్తామని అంటున్నారు. ఇది రివిజనిజం. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మితవాదం, రివిజనిజం తరతరాలుగా ఉన్నది.పోరాటాలు ఓడిపోవడానికి, లొంగిపోవడానికి చాలా తేడా ఉంది. ఒక ఉద్యమం ఓడిపోతే అప్పటికి నష్టం కలుగుతుంది. కానీ చరిత్రలో ఎన్నో పోరాటాలకు ప్రేరణనిస్తుంది. తన ఓటమి నుంచి గుణపాఠాలను అందిస్తుంది. ఆ ఓటమి తాత్కాలికమేనని, తిరిగి పోరాడి జయించాలనే స్ఫూర్తిని నిలపుతుంది. కానీ లొంగిపోయిన ఉద్యమాల వల్ల, లేదా కొందరు నాయకులు వల్ల వర్తమానంలోనే ఇక పోరాడలేమనే నిరాశ, భయం కలుగుతాయి. అవి చరిత్రలో వెంటాడే ప్రమాదం ఉంది. ప్రగతిశీల భావజాలంలోకి, పోరాట సంస్కృతిలోకి వచ్చి స్థిరపడిపోతాయి. విరమణ, లొంగుబాటు, విద్రోహం అనేవి ఎట్లా జరిగినా భావజాల రంగాన్ని ఆక్రమించి, నిర్ధారణలుగా మారి పైచేయి సాధిస్తాయి. వర్గపోరాటం అనే భావన తిరిగి ముందుకు రావడానికి దశాబ్దాలు పడుతుంది. పైగా ఇవన్నీ నష్ట నివారణకు అవసరం అని, మెరుగైన పోరాటమార్గం కోసం చేశామని ద్రోహులు సమర్థించుకుంటారు. తద్వారా ప్రజల కామన్‌సెన్స్‌లో పాజిటివ్‌గా నమోదయ్యే ఇంకో ప్రమాదం ఉంటుంది.
ఇలాంటివి చరిత్రలో అన్నిసార్లు ఒకేలా జరగవు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాయకత్వం అధికారికంగా విరమణ ప్రకటించింది. ఇప్పుడు అధికార ప్రతినిధి విరమణ ప్రకటించి లొంగిపోయాడు. కానీ విప్లవోద్యమం తాను దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను కొనసాగిస్తానని అంటున్నది. రాజ్య ప్రేరిత అంతర్గత విద్రోహం వల్ల విప్లవోద్యమం నష్టపోయి ఉండవచ్చుగాని, విప్లవోద్యమం కొనసాగుతున్నది. ఇప్పుడు లొంగుబాటువాదం ఇక సాయుధ పోరాటం చేయలేమని చెప్పడానికి, ఎన్నికలతో విప్లవం తేస్తానని చెప్పడానికి వచ్చింది. గతంతో ఈ పోలిక ఉన్నది.
సుమారు డెబ్పై ఐదేళ్ల ఎడం తర్వాత అదే భావజాలం తిరిగి పైకి వచ్చింది. వర్తమాన విప్లవోద్యమ చారిత్రక స్థితిగతులను విస్మరించడం వల్ల ఈ లొంగుబాటువాదం వచ్చింది. విప్లవ అవసరాన్ని దాని పంథాలో గుర్తించాలి. విప్లవ మార్గాన్ని తిరస్కరించి విప్లవాన్ని కోరుకోవడం నటన అవుతుంది. ఏది సరైన మార్గం? అనే చర్చ వర్తమాన చారిత్రక పరిస్థితులే నిర్ణయిస్తాయిగాని మన విశ్వాసాలు కాదు. ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు అధి నాయకులు సాయుధ పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవనే విరమణవాదనకు ప్రతినిధులు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు సందర్భంలో మన సమాజ స్థితి సాయుధ పోరాట అవసరాన్ని బలపరుస్తున్నది. అదే ఫాసిస్టు రాజ్యం ఈ నాయకుల అవగాహనలోని, వ్యక్తిత్వంలోని బలమైన భాగాన్ని ధ్వంసం చేసింది. అందువల్ల విరమణవాదాన్ని అందుకున్నారు. విప్లవానికి చాలా అనుకూలంగా ఉన్న కాలంలో ఇదెలా జరిగింది? అనే సందేహం మనకు వస్తుంది. ఇలా జరుగుతుందనడానికి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఇంకొన్ని ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వెనుక కూడా కమ్యూనిస్టు పార్టీ పరిస్థితులల్లోని విప్లవాత్మక తత్వాన్ని గ్రహించలేకపోయింది. పరిస్థితులను వాడుకొని ముందుకుపోవడమా? వెనకడుగు వేయడమా? అనే సందిగ్ధానికి పదే పదే గురైంది. ఇది పార్టీ వందేళ్ల సందర్భం కాబట్టి ఇంకాస్త చరిత్రలోకి వెళ్లి ఈ ధోరణిని చూద్దాం.
* * *
కాన్పూర్‌లో 1925 డిసెంబరు 26వ తేదీన ఏర్పడిన వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం విరుచుకుపడింది. మీరట్ కుట్రకేసులో దాదాపు జాతీయ నాయకత్వమంతా అరెస్టు కావడంతో చాలాకాలం రాజకీయ ఆచరణకు అవకాశం లేకపోయింది. 1942 వరకు కొనసాగిన ఇంటర్నేషనల్ పిలుపులకు అనుగుణంగా సామ్రాజ్యవాద వ్యతిరేత రాజకీయ విధానంతో జాతీయోద్యమంలో సమరశీలంగా పాలుపంచుకుంది. ఫాసిస్టు ప్రతిఘటన పోరాట రూపాలను భావజాల, సాంస్కతిక రంగాల్లో సృష్టించింది. భాష, సంస్కతి విషయంలో పాత భూస్వామ్య విలువలతో తలపడటంతో దేశీ ప్రత్యేకతను పొందింది. ఇష్టా (ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆర్టిస్ట్స్), ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సమాజాల్లో అభ్యుదయ రచయితలసంఘం, ప్రజా నాట్య మండలి వంటి సంస్థలు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి.
అప్పటి దాకా పరిస్థితులను పార్టీ గుర్తించినట్లే కనిపిస్తుంది. దాన్ని విప్లవాత్మకంగా తయారు చేయడానికి అన్ని రంగాల్లో ప్రయత్నించింది. రాజకీయ రంగంతోపాటు సాహిత్య, సాంస్కృతిక భావజాల రంగాల్లో కొంత వర్గపోరాటాన్ని అందుకున్నది. ఫాసిస్టు వ్యతిరేకంగా బలపడింది. కానీ 1942లో అమెరికా, బ్రిటన్ కూటమిలో సోవియట్ రష్యా చేరిక తర్వాత వలస వ్యతిరేక పోరాటాల నుంచి పార్టీ పక్కకు వైదొలగింది. అప్పటివరకు జరిగిన సామ్రాజ్యవాద యుద్ధం రష్యా ప్రవేశంతో ప్రజాయుద్ధంగా మారిందని సూత్రీకరించింది. విప్లవానికి సిద్ధం కావాలంటూ తన నాయకత్వంలోనే జరుగుతున్న గ్రామీణ రైతాంగ పోరాటాలు ఇస్తున్న రాజకీయ సంకేతాన్ని కమ్యూనిస్టులు గ్రహించలేకపోయారు. 1947 ఆగస్టు 15 తర్వాతి పరిస్థితిని విశ్లేషిస్తూ.. రాజకీయ అధికారం చేతులు మారిందేగానీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంకా రాలేదని తేల్చారు. తెల్లదొరలతో పోరాడినట్టే నల్ల దొరలతో పోరాడాలని తొలుత పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొద్ది కాలానికే జాతీయ ప్రజాస్వామ్యం కోసం పార్లమెంటరీ పంథాలో పోరాడాలని నిర్ణయించారు. జాతీయ బూర్జువాకు వ్యతిరేకంగా ఈ పోరాటం ఎక్కు పెట్టాలని, కార్మికుల నాయకత్వంలో రైతాంగం కలిసి రావాలని కోరారు. బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ పట్టులో ఉండటం వల్ల కావచ్చు, భారతీయ సమాజ వాస్తవికతను సొంత అనుభవంతో విశ్లేషించే పనికి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పూనుకోలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ అప్పటికే అర్ధ భూస్వామ్య, అర్ధ వలసగా తమ సమాజాన్ని విశ్లేషించి, దళారీ నిరంకుశ బడా బూర్జువా రాజకీయ ప్రతినిధి చాంగై షేక్ వ్యతిరేకంగా జరగాల్సిన నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాను నిర్దేశించింది. మరోవైపు పునప్రో, తె.భా.గ. తెలంగాణ రైతాంగ పోరాటాలు భూస్వామ్య వ్యతిరేక వ్యవసాయ విప్లవ పంథాలోకి మారుతున్నాయి. అయినా, భారత కమ్యూనిస్టులు మాత్రం ఇక్కడి పాలకులను జాతీయ బూర్జువా ప్రతినిధులుగా చూస్తూ గడప దాటకుండా మాటలు చెబుతున్నారు. రైతాంగ పోరాట ఒత్తిడిలో ఒక దశలో.. ఇది బూటకపు స్వాతంత్య్రం.. అని అన్నా ఆ వెంటనే సర్దుకుని పార్లమెంటరీ పంథాలోకి మళ్లారు. స్టాలిన్ మరణంతో అధికారంలోకి వచ్చిన కృశ్చేవ్ ముందుకు తెచ్చిన శాంతియుత సహజీవన సిద్ధాంతం కమ్యూనిస్టులను మరింతగా పార్లమెంటుకు అతుక్కుపోయేలా చేయడమే కాకుండా పాలకవర్గాలకు దగ్గర చేసింది. మరోవైపు క్షేత్రస్థాయి నివేదికలు తుపాకీ మందు వాసనలను మోసుకు వస్తున్నాయి. ఇందిరాగాంధీని మరీ నేరుగా వెనుకేసుకురావడం, అది చివరకు 1963 యుద్ధాన్ని చైనా దురాక్రమణగా సూత్రీకరించే దాకా పోవడంతో నాయకత్వంలోని ఒక భాగం వేరయింది. భూస్వామ్య సమస్యను గుర్తించడంలో ఆ నాయకత్వమూ విఫలమైంది.
సారాంశంలో కమ్యూనిస్టు పార్టీ పరిస్థితుల్లోని విప్లవ స్వభావాన్ని గుర్తించి తన విప్లవాత్మక పాత్ర పోషించలేకపోయింది. పరిస్థితులు అనుకూలంగా మారుతున్నప్పుడు, లేదా అనుకూలంగా మార్చుకోవలసి వచ్చినప్పుడు నాయకత్వం ధాటీగా వ్యవహరించకపోవడంలో మితవాదం ఉన్నట్లే. అది అననుకూల పరిస్థితుల్లో బలపడుతుంది. పరిస్థితులలోని అనుకూలతను, ప్రతికూలతను వేరు చేసుకొని చూసి, అననుకూలతను ఎదుర్కొంటూ, అనుకూలతలను విప్లవాత్మకంగా తయారు చేసే శక్తి భారత కమ్యూనిస్టు పార్టీకి మొదటి నుంచి లేదు. అది కొన్నిసార్లు పార్టీ మొత్తంగా బైట పెట్టుకున్నది. కొన్నిసార్లు అందులోని బృందాలు బైటపెట్టుకున్నాయి. వ్యక్తులుగా పోరాటాన్ని వదిలి ద్రోహం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి పార్టీలోనే కాదు. నక్సల్బరీ తర్వాత కూడా బృందాల్లో, వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే మితవాదం, తప్పించుకొనే ధోరణి, లొంగుబాటుధోరణి మొదటి నుంచీ ఒక ధారగా ఉంది. దీని ప్రభావంతో పోరాటం నుంచి బైట పడ్డానికి, పోరాటాన్ని తప్పుపట్టడానికి కొందరు నాయకులు ప్రయత్నించారు. రాజ్యం పని విధానం మీద అంచనా లేక, రాజ్య వ్యతిరేక పోరాటానికి సిద్ధంకాలేక, చివరికి రాజ్యాన్ని చూసి భయపడి దానితో చేతులు కలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం నుంచి బైటపడ్డ లొంగుబాటు నాయకుడు చేసింది ఇదే. ప్రజలు సాయుధ పోరాటాలకు సిద్ధంగా లేరని వాదించే ధోరణి కమ్యూనిస్టు పార్టీకి గత చరిత్రలోంచి కొనసాగుతున్న బలహీనత.
పోరాట పథంలో రాజీలేకుండా, త్యాగాలకు వెరకుండా, ముందో వెనుకో ఉద్యమ పురోగమనానికి తగినట్లు ఎత్తుగడలను సవరించుకుంటూ విప్లవోద్యమం ముందుకుపోతున్నందు వల్లనే ఈ లొంగుబాట్లు, విద్రోహాలు బట్టబయలవుతూ వచ్చాయి. ఇదీ ఉద్యమం లోపల రాజకీయ, భావజాలపరమైన వర్గపోరాట వ్యక్తీకరణ.
దీని ముందు వెనుకల రాజ్యం ఉంటుంది. ప్రజల చేతిలో ఆయుధాలు లేకుండా చూడటానికి రాజ్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమాలు రాకముందు కూడా రాజ్యం ఇట్లాంటి పనులే చేసింది. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం దెబ్బతినిపోయాక ఇదే జరిగింది. సిపాయిల తిరుగుబాటుగా బద్దలై కొందరు స్థానిక భూస్వామ్య ప్రభువుల చేరికతో జాతీయ రూపం ధరించిన ఈ ఉద్యమంలో సమరశీల పాత్రను పోషించి, త్యాగాలను చేసింది పేద రైతులు, వ్యవసాయదారులే. వారు ఆయుధం పట్టడం వల్లే ఈ తిరుగుబాటును అణచడానికి రెండేళ్లు పట్టింది. ఈ ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి బ్రిటీష్ ఇండియా ఏలుబడి ప్రారంభం కాగానే తీసుకున్న మొదటి చర్య.. భారతీయులకు ఆయుధం అందకుండా చేయడం. సిపాయిలు గ్రామీణ నిరుపేద, భూమి లేని రైతుల పిల్లలే కాబట్టి, వారికి ఆయుధం అందితే అంతిమంగా ఎవరి చేతికి అది చేరుతుందో, ఏ వర్గం పక్షాన ఎక్కుపెట్టడబడుతుందో ప్రభుత్వం గ్రహించింది. ఈ కారణంగానే చాలాకాలం వరకు భారతీయులను సైన్యంలోకి తీసుకోలేదు. ఆ తర్వాత కూడా రెగ్యులర్ ఆర్మీలో కలపలేదు. ప్రత్యేక రెజిమెంట్లను భారతీయుల కోసం ఏర్పరిచింది. మెకాలే చదువులతో తెలివి తెచ్చుకున్న సంపన్న భూస్వామ్య కుటుంబాల్లోని పిల్లలు, పట్టణ మధ్యతరగతి ఈ పోరాటానికి దూరంగా ఉంది. అప్పటి వలస పెట్టుబడి రూపమైన వాణిజ్య పెట్టుబడి…దేశంలోని ముడిసరుకును యూరప్‌కు తరలించడానికి సరఫరా గొలుసు (సప్లయి చెయిన్) పెద్ద సమస్య అయింది. దీని కోసం ఓడరేవు పట్టణాలను అనుసంధానిస్తూ పెద్ద పెద్ద రైలు మార్గాలను నిర్మించారు. చాలా ఖరీదుకు భూస్వాములు, జమిందార్ల భూములను కొని ముడిసరుకుల ప్రధాన క్షేత్రాలు, వ్యాపార పంటలు సాగయ్యే ప్రాంతాల వెంబడి రైలు మార్గాలు వేశారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, బ్రిటీష్ ఇండియా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలకూ భూస్వామ్యం సహకరించింది. అదే సమయంలో సంఘ సంస్కరణల పట్ల మునుపటి ఆసక్తిని ప్రభుత్వం కోల్పోయింది. దేవదాసీ వ్యవస్థ రద్దు, శారదా చట్టం వంటి సంస్కరణలను ఆధునిక సంస్కృతి, ఆధునిక భావాల ప్రభావంతో పట్టణ విద్యాధిక యువత జాతీయోద్యమంలో భాగంగా కోరి, పూనుకొని సాధించింది. ఇందుకు అవసరమైన ఆధునిక కళా, సాహిత్య రూపాలను రూపొందించుకుంది. వీటన్నిటి వెనుక రైతాంగం చేసిన వీరోచిత పోరాటాలు వెన్నెముకలా ఉన్నాయి.
ప్రజలకు ఆయుధాలు అందకుండా చేయడానికి ఆయా కాలాల్లో రాజ్యం ఎంత ప్రయత్నించినా 1857కు ముందు, ఆ తర్వాత కూడా సాయుధ పోరాటాలు జరిగాయి. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే ఉప ఖండంలో సామ్రాజ్యవాదానికి, స్థానిక భూస్వామ్య, ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఎన్నో సమరశీల సాయుధ పోరాటాలు జరిగాయని పరిశోధనల్లో తేలుతోంది. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఈ అన్ని పోరాటాల్లో నూతన ప్రజాస్వామిక విప్లవ బీజాలను నక్సల్బరీ చూసింది. భూస్వామ్యానికి, వలస పెట్టుబడికి వ్యతిరేకంగా రైతాంగం తెగించి పోరాడటం, ఆ పోరాటాలన్నీ సాయుధ రూపంలో బద్దలు కావడం నూతన ప్రజాస్వామిక విప్లవావశ్యతను తెలియజేశాయి. బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి శ్రవణాత్మక చారిత్రక రచన ఝాన్సీలో భూస్వామ్యం, వలస పెట్టుబడి జమిలిగా రైతాంగాన్ని అణచివేయడం కనిపిస్తుంది. కమ్యూనిస్టు ఉద్యమానికి ముందు జరిగిన సాయుధ పోరాటాల మీద కూడా తీవ్ర అణచివేత సాగింది. ఆ పోరాటాల వారసత్వం కూడా ఇప్పటి సాయుధ పోరాటాలకు ఉంది.




