2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016 (పిఇసిఎ) కింద వేరే రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుస్ (పిఎఫ్యుజె) సెక్రటరీ జనరల్ అర్షద్ అన్సారి మాట్లాడుతూ, 2025 సవరణ తర్వాత పిఇసిఎ కింద 500 మందికి పైగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. న్యాయపరమైన కేసులు, అరెస్టులు, బెదిరింపులతో సహా జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిడితో పాకిస్తాన్ పోరాడుతున్నప్పుడు, జర్నలిస్టులను రక్షించే కమిటీ (సిపిజె) రూపొందించిన కొత్త ప్రపంచ నివేదిక- 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పత్రికా సభ్యులకు అత్యంత ప్రాణాంతక సంవత్సరం. గత రెండేళ్లలో జర్నలిస్టుల హత్యల్లో కనీసం మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ పైన ఉంది. ఫిబ్రవరి 24న విడుదల చేసిన ఈ ప్రత్యేక నివేదిక 2025లో 129 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలు హత్యకు గురైనట్లు నమోదు చేసింది. ఈ సంస్థ మూడు దశాబ్దాల క్రితం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధికం. ఇది వరుసగా రెండవ సంవత్సరం జర్నలిస్టుల మరణాల్లో రికార్డు బ్రేకింగ్.

జర్నలిస్టుల హత్యల్లో ఇజ్రాయెల్ అగ్రస్థానం

2024- 2025 సంవత్సరాల్లో జరిగిన మొత్తం జర్నలిస్టుల హత్యల్లో మూడింట రెండు వంతులకు (2/3) ఇజ్రాయెల్ బాధ్యత వహించిందని ఈ నివేదిక పేర్కొంది, ప్రధానంగా కొనసాగుతున్న గాజా యుద్ధ నేపథ్యంలో ఈ మరణాలు సంభవించాయి. 2025లో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన 86 మంది జర్నలిస్టులలో 60% కంటే ఎక్కువ మంది గాజా నుండి వార్తలను అందిస్తున్న పాలస్తీనియన్లే.

1992లో ఈ సంస్థ కేసులను నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి, ఏ ఇతర ప్రభుత్వ సైన్యం కంటే కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కువ మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని హత్య చేశాయని నివేదిక వెల్లడించింది. 2025లో తమ వృత్తిపరమైన పని కారణంగా ఉద్దేశపూర్వకంగా చంపబడిన 47 మంది జర్నలిస్టుల కేసులను ఈ బృందం నమోదు చేసింది — వీటిని వారి పద్ధతి ప్రకారం “హత్యలు” గా వర్గీకరించారు. ఈ లక్షిత హత్యలలో 81 శాతానికి ఇజ్రాయెల్ పాలకవర్గం చేసినవే.

అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం జర్నలిస్టులు పౌరులని, వారిని ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోకూడదని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె) నొక్కి చెప్పింది.

జర్నలిస్టులు హత్యకు గురైన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇదిలా ఉండగా, సిపిజె నివేదికపై స్పందిస్తూ అర్షద్ అన్సారీ ‘వాయిస్‌పిక్’ తో మాట్లాడుతూ.. 2025లో పిఇసిఎ ను సవరించబడినప్పటి నుండి, ఈ చట్టం ద్వారా కనీసం 500 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.

“PECA కారణంగా 500 మందికి పైగా జర్నలిస్టులు వేధింపులకు గురయ్యారు,” అని ఆయన అన్నారు. “పిటిఐప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో ఈ చట్టం వచ్చింది; అప్పుడు మేము జర్నలిస్టులమంతా ఈ అన్యాయపు చట్టానికి వ్యతిరేకంగా ఒక నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రధాని షెహబాజ్ షరీఫ్, పిపిపి ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీతో సహా నాయకులందరూ మా శిబిరానికి వచ్చి మాకు మద్దతు తెలిపినట్లు రికార్డుల్లో ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నాయకులు ప్రజాస్వామిక ఛాంపియన్లుగా వ్యవహరిస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక, 2025లో అదే చట్టానికి కఠినమైన సవరణలు చేసి ఆమోదించింది వీరే.”

ముఖ్యంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును ఆయన విమర్శించారు. “ప్రభుత్వానికి నచ్చనిది ఏదైనా రాసినా, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా విమర్శ కనిపించినా, వెంటనే పిఇసిఎ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు,” అని అన్సారీ అన్నారు. “జర్నలిస్టులు మొదటి నుంచీ దీనిని ఒక క్రూరమైన చట్టంగానే పరిగణిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము అన్ని ప్రాంతీయ హైకోర్టులతో పాటు ఇస్లామాబాద్ హైకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు చేశాము.”

ఇస్లామాబాద్ హైకోర్టులో తదుపరి విచారణ మార్చి 6న ఉందని ఆయన తెలిపారు. వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేయడం ద్వారా అసమ్మతిని అణచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారనేది  స్పష్టం అని ఆయన అన్నారు.

“ఒకవేళ వారు ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే, రాబోయే నెలలో మేము భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తాము,” అని చెబుతూ, ఈ విషయంలో తమకు న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తల మద్దతు ఉందని అన్నారు.

ఇదిలా ఉంటే, జర్నలిస్టుల మరణాలు ఎక్కువగా యుద్ధ ప్రాంతాలలోనే సంభవించినప్పటికీ, ‘అధికారికంగా’ యుద్ధంలో లేని దేశాలలో కూడా జర్నలిస్టుల హత్యలను సిపిజె నమోదు చేసింది – వీటిలో మెక్సికో, భారతదేశం, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, కొలంబియా, నేపాల్, పెరూ, సౌదీ అరేబియా, మరియు పాకిస్థాన్ ఉన్నాయి.

చట్టబద్ధమైన పాలన బలహీనంగా ఉన్న చోట, నేరస్థుల నెట్‌వర్క్‌లు స్వేచ్ఛగా తిరుగుతున్న చోట, స్వతంత్ర రిపోర్టింగ్‌పైన రాజకీయ శక్తులు ఒత్తిడి తెచ్చే దేశాలలో జర్నలిస్టులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది.

పాకిస్థాన్ చాలా కాలంగా జర్నలిస్టుల భద్రత విషయంలో ఇబ్బందులు పడుతోంది. గాజా లేదా సూడాన్ స్థాయిలో అక్కడ ఘర్షణలు లేనప్పటికీ, ఇటీవలి కాలంలో ఆ దేశంలోని రిపోర్టర్లు హత్యలు, బలవంతపు అదృశ్యాలు, దాడులు, చట్టపరమైన వేధింపులను ఎదుర్కొన్నారు. స్వతంత్ర జర్నలిజానికి అవకాశం తగ్గిపోతోందని పత్రికా స్వేచ్ఛా సంఘాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి.

అత్యంత ప్రమాదకరంగా మారిన యుద్ధ ప్రాంతాలు

2025లో మరణించిన 129 మంది జర్నలిస్టులలో కనీసం 104 మంది యుద్ధ వార్తలను కవర్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్, సూడాన్‌లలో జర్నలిస్టుల మరణాలు పెరిగినప్పటికీ, గాజాలో నమోదైన గణాంకాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ.

సూడాన్ అంతర్యుద్ధంలో తొమ్మిది మంది జర్నలిస్టులు మరణించారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక డ్రోన్ల దాడిలో నలుగురు జర్నలిస్టులు చనిపోయారు — 2022 తర్వాత ఆ యుద్ధంలో ఒక సంవత్సరంలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే.

డ్రోన్ దాడులు జర్నలిస్టులకు ఎదురవుతున్న కొత్త ముప్పుగా మారాయి. 2023లో డ్రోన్ దాడుల వల్ల కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే మరణించగా, 2025లో ఆ సంఖ్య భారీగా పెరిగి 39కి చేరుకుందని సిపిజె నమోదు చేసింది.

శిక్షల నుండి తప్పించుకోవడం సర్వసాధారణం. నిందితులను చట్టం ముందు నిలబెట్టడంలో నిరంతరం వైఫల్యానికి సంబంధించిన అంశం ఈ నివేదికలోని అత్యంత ఆందోళనకరమైనది.

2025లో తాము నమోదు చేసిన లక్షిత హత్యలపైన చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పారదర్శకమైన విచారణలు జరిగాయని, వాటిలో ఏ ఒక్క కేసులో కూడా ఎవరినీ బాధ్యులుగా పరిగణించలేదని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా, జర్నలిస్టుల హత్యలలో దాదాపు 80% కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

“సమాచారాన్ని తెలుసుకోవడం ఎంతో కీలకమైన ఈ సమయంలో, జర్నలిస్టులను రికార్డు స్థాయిలో చంపుతున్నారు” అని సిపిజె సీఈఓ జోడీ గిన్స్‌బర్గ్ ఈ నివేదికపైన స్పందిస్తూ వ్యాఖ్యానించారు. “మీడియాపై దాడులు జరగడం అనేది ఇతర స్వేచ్ఛలపై జరగబోయే దాడులకు ఒక ప్రధాన సూచిక.”

పత్రికా స్వేచ్ఛలో విస్తృత క్షీణత

హత్యలే కాకుండా, 2025లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో జర్నలిస్టులు జైలు పాలయ్యారని సిపిజె గుర్తించింది. ఆన్‌లైన్ వేధింపులు, దుష్ప్రచారాలు, రిపోర్టింగ్‌ను నేరంగా పరిగణించడానికి ‘జాతీయ భద్రతా చట్టాలను’ ఉపయోగించడం వంటివి చాలా దేశాలలో పెరిగాయి.

ప్రభుత్వాలు జర్నలిస్టుల హత్యలపై విచారణ చేసే విధానంలో నిర్మాణాత్మక సంస్కరణలు కావాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ దర్యాప్తు యంత్రాంగాల ఏర్పాటు, నేరస్థులపై లక్షిత ఆంక్షలను విధించాలని డిమాండ్ చేసింది.

“పత్రికా స్వేచ్ఛ క్షీణించడం అనేది తరచుగా ప్రజాస్వామ్య పతనానికి మొదటి సూచిక,” అని ఈ నివేదిక హెచ్చరించింది.

మీడియా నియంత్రణ, డిజిటల్ చట్టాలు, జర్నలిస్టుల భద్రతపైన నిరంతరం చర్చలు జరుగుతున్న పాకిస్థాన్ వంటి దేశాలకు ఈ ఫలితాలు ఒక గట్టి హెచ్చరిక. పత్రికలకు ఎదురవుతున్న ముప్పులు కేవలం విడిగా వేటికవే జరిగే సంఘటనలు కావని, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక విస్తృత ధోరణిలో భాగమని ఈ నివేదిక గుర్తు చేస్తోంది.

చివరికి, తుపాకీ గుళ్లు, డ్రోన్లు, జైలు శిక్షలు లేదా చట్టపరమైన ఒత్తిళ్ల ద్వారా ఏ జర్నలిస్టు గొంతునైనా నొక్కివేసినప్పుడు, అది ప్రజల ‘తెలుసుకునే హక్కు’కే భంగం కలిగిస్తుందని నివేదిక ముగింపులో చెప్పింది.

2026 ఫిబ్రవరి 2026

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply