ఈనెల 25వ తేదీన కామ్రేడ్ సూరపనేని జనార్ధనరావు పుట్టిన ఊరు గరికపర్రు (కృష్ణా జిల్లా)లో ఆయన అన్నయ్య పూర్ణ మోహనరావు (ఆయన కూడా వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థియే) ఆర్‌ఇసి పూర్వ విద్యార్థులు. గ్రామస్తులు విరసం వంటి ప్రజాసంఘాలు గిరాయిపల్లి మృతవీరుల ఏభయ్యో వర్ధంతి జరుపుకుంటూ విప్లవ సంప్రదాయాన్ని స్మరించుకుంటున్నారు.

జనార్థన్ తలిదండ్రులు బతికుండగానే గరికపర్రులో ఇంట్లోనే చిన్న స్మారకం నిర్మించుకున్నారు. ఉయ్యూరులో ఎపిసిఎల్‌సి అధ్యక్షులు బోసుగారు, అనసూయమ్మగారి పూనికపై గిరాయిపల్లి అమరుల స్థూపం నిర్మాణమై బహిరంగ సభ కూడ జరిగింది. ఈ రెండు చోట్లా విరసం పాల్గొన్నది. పూర్ణమోహనరావు ఉద్యోగ విరమణ తర్వాత గరికపర్రులో ఆయన నిర్మాణం చేయించిన స్థూపావిష్కరణలో కూడ విరసం పాల్గొన్నది. గిరాయిపల్లి అమరుల ఏభై ఏళ్ల సంస్మరణ సభల నిర్వహణలో కూడ ఇపుడు విరసం పాల్గొంటున్నది.

ఎమర్జెన్సీ (జూన్ 25, 1975) విధించే నాటికే  రీజనల్‌కు బదులు రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని గుర్తింపు వచ్చింది. ఇంక 1972 నుంచే ఈ కాలేజీలోనూ, కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌కు, విప్లవ విద్యార్థులకు జరిగిన భావ భౌతిక సంఘర్షణల వల్ల ఎబివిపి పత్రిక సందీపని కూడా ఈ కాలేజిని, తన పాఠకులను హెచ్చరించడానికి ఈ పరిభాషను వాడింది. బహుశా ఇప్పుడు సిపిఐ మావోయిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ హత్య తర్వాత ప్రపంచమంతా ఆయనను స్మరించుకునే క్రమంలో ఆర్‌ఇసి మళ్లీ ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించే చరిత్రలోకి వచ్చి ఉంటుంది. దానికి ఈ ఏభై ఏళ్లది మాత్రమే కాదు 59 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర  ఉండడానికి భౌతిక కారణాలు, అందువల్ల రూపొందిన విప్లవ చైతన్యం కారణం. నంబాళ్ళ కేశవరావు (బసవరాజ్) అమరత్వం తర్వాత మళ్లీ ఒకసారి ఢిల్లీ నుంచి కాజీపేట మీదుగా, లేదా వరంగల్ మీదుగా దక్షిణానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వాళ్ళు సెంట్రల్ రైల్వే రైళ్ళలో ప్రయాణించేవారు వడ్డేపల్లి చెరువు దాటి ఫాతిమా నగర్ కాజీపేట రైల్వే వంతెన దాటుతుండగా ఒకసారయినా అదిగో అదే ఆర్‌ఇసి అదే వరంగల్ అని చూపు అటు తిప్పడం, తెలిసిన వారయితే ఆ అరవయ్యేళ్ళ చరిత్ర చెప్పుకోకుండా ఉండరు. ఇదివరకెన్నోమార్లు చెప్పుకున్నాం గనుక రేఖామాత్రంగా ఆ చరిత్రను తడుముతాను. ఆ ఫాతిమా నగర్ హైస్కూల్లో హిందీ పండిట్‌గా కొండపల్లి సీతారామయ్య, వాళ్ళదే అయిన గేబ్రియల్ స్కూల్లో కె. జి. సత్యమూర్తి సోషల్, సైన్స్, ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసారు. వాళ్ళు ఫాతిమా నగర్‌లోనే ఉండేవాళ్లు. కెఎస్ కొడుకు చంద్రశేఖర్ ఆజాద్ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవడం వల్ల, ఆ కాలేజీ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు మొదలు ఎందరో ప్రొఫెసర్లు, లెక్చరర్లు కృష్ణాజిల్లా నుంచే వచ్చిన వాళ్ళు కావడం వల్ల, విద్యార్థులూ కోస్తా జిల్లాల నుంచే (ముఖ్యంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం గోదావరి జిల్లాల) వచ్చిన వాళ్ళు కావడం వల్ల ఆ కాలేజి విద్యార్థి, అధ్యాపకులు అందరూ పై ఇద్దరు ఉపాధ్యాయుల, రాజకీయ భావజాలం ప్రభావంలోకి వచ్చారు. అందుకు ముఖ్యంగా దార్శనికత ఉన్న రాజకీయ వ్యూహకర్త కెఎస్ పునరుజ్జీవనానికి తోడ్పడిన బాహిర వర్గ పోరాట ప్రేరణ – మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం 1966  (జనచైనా) – అందుకాయనకందివచ్చిన  తక్షణ ఆర్థిక పోరాటం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఆ కాలేజీలో అణచడానికి కేంద్ర ఆర్థిక బలగాలను దించవలసి వచ్చింది. వాళ్ళు విద్యార్థులపై కాల్పులు జరిపారు. ఇంగువ మల్లిఖార్జునశర్మ తొడలోంచి తూటా దూసుకుపోయింది. ఉద్యమ నాయకుడు ముక్కు సుబ్బారెడ్డిని రోడ్డుమీద నడుస్తుంటే లారీతో గుద్దిస్తే జరిగిన ప్రమాదం ఆయన జీవితాంతం మెదడు మీద ప్రభావం వేసింది. ఆ ఉద్యమం నుంచే మువ్వా రవీంద్రనాథ్, చంద్రశేఖర్ ఆజాద్ ఆదిలాబాదు జన్నారంల దాకా విప్లవ సాహిత్య సాంస్కృతిక కళారూపాల ప్రచారం చేసారు.  చంద్రశేఖర్ ఆజాద్‌ను పార్వతీపురం కుట్రకే‌సు (1969)లో ముద్దాయిగా చేసి అప్రూవర్ కావడానికి ఒత్తిడి పెట్టి ‘అదృశ్యం’ చేశారు. మువ్వా రవీంద్రనాధ్ మొట్టమొదటి సెంట్రల్ ఆర్గనైజర్‌గా కిషన్ పేరుతో కరీంనగర్‌కు  పోయాడు. చారు మజుందార్ రచనలు తెలుగుజేసి సికింద్రాబాద్ కుట్ర కేసులో ముద్దాయిగా, చిత్త చాంచల్యంతో 1973లో రైలు నుంచి పడిపోయి చనిపోయాడు.

ముక్కు సుబ్బారెడ్డి సిపిఐ ఎంఎల్,  సిపిఐ ఎంఎల్ సిఓసి రాష్ట్ర కార్యదర్శిగా 1979 దాకా కొనసాగి పీపుల్స్ వార్ ఏర్పడినాక సెంట్రల్ కమిటీ మెంబర్‌గా 1986లో సరెండర్ అయి, సాధారణ జీవితం గడిపినా విప్లవోద్యమానికి హాని చేయకుండా సానుభూతిపరుడిగా జీవించి మరణించాడు. ఇంగువ మల్లికార్జునశర్మ కూడ నలగొండ ఆర్గనైజర్‌గా అరెస్టయి సికింద్రాబాద్ కుట్ర కేసులో విడుదలయి మార్క్సిస్టు అధ్యయన వేదిక నిర్వహిస్తూ సైద్ధాంతిక కృషి చేస్తున్నాడు.

ఆ ఉక్కు ఉద్యమం నుంచి వచ్చిన వాడే పూర్ణ మోహన్ రావు గిరాయిపల్లి అమరుల స్మృతి నిలిపే రూపంలో విప్లవ భావజాల ప్రచారంలో ఈనాటికి నిమగ్నమై ఉన్నాడు. ఇంకా ఇక్కడ నేను ప్రస్తావించలేకపోయిన, నాకు తెలిసిన, తెలియని అమరులు, సజీవంగా ఉన్నవాళ్లు ఉండవచ్చు.  వాళ్లందర్నీ స్మరించుకోవాల్సిన సందర్భం ఇది.

కానీ కొండ ఎక్కే క్రమంలో (ఇప్పుడు విప్లవ చరిత్రలో నమోదయ్యే విధంగా) ఈ రాడికల్ ఇంజనీరింగ్ కాలేజి (దాంతో పాటు లాల్ బహుదూర్ కాలేజి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, దెశాయిపేట  గ్రామం లేదా ఎనుమాముల వరంగల్ మార్కెట్ మనకు అందించిన అమరులు (సూరపనేని  జనార్ధన్ , లంకామురళీమోహన్, ఆనందరావు, వనపర్తి సుధాకర్) తర్వాత ఆర్‌ఇసి నుంచే గజ్జల గంగారామ్, చెరుకూరి రాజకుమార్, నంబాళ్ళ కేశవరావు వరకు శిఖరాయమానమయ్యారు) ఇంతగా ప్రాచుర్యంలోకి రాని శ్యాంప్రసాద్ (కడప జిల్లా)  నిర్బంధ కాలంలో విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని వరంగల్‌లో నిర్మాణం చేస్తూ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. అట్లే ఎల్‌బి కాలెజి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వానికెదిగిన రామకృష్ణ (సుదర్శన్ రెడ్డి, మొగిలిచెర్ల) వంటి వాళ్లు కూడా ఉండి ఉంటారు.

ఇప్పుడు వృద్ధాప్యం వచ్చి పూర్తిగా క్షీణించిన స్థితిలో పది సంవత్సరాలు జైల్లో ఉండి విడుదలై  ఇప్పుడు కలకత్తా నగరంలో షరతులపై బెయిలు మీద ఉన్న రామకృష్ణ ఆర్‌ఇసి నుంచే వచ్చాడు. టెక్‌ నిర్మాణంలోకి వెళ్ళి ముప్ఫై ఏళ్ళు దాటేవరకు కేంద్ర కమిటీ స్థాయి టెక్ విభాగానికి ఎదిగాడు.

అందులో ఆ దళనాయకుడుగానే కాకుండా జనార్ధన్ విద్యార్థిగా గంగారాం ఆర్.ఇ.సి విద్యార్థులుగా రాజకుమార్, కేశవరావులు విప్లవోద్యమాన్ని ఏభై ఏళ్లు సజీవంగా దేశవ్యాప్తంగా చేసినవాళ్లే కాకుండా ప్రపంచానికి ఒక ఆశాదీపంగా నిలిపారు.

వీరిలో గంగారామ్ ఆర్‌ఎస్‌యు నుంచి ఆర్‌వైఎల్‌కు అక్కడి నుంచి సికాస వంటి కార్మిక రంగానికి నిర్మాణానికి, పీపుల్స్ వార్ నిర్మాణానికి, దండకారణ్యోద్యమానికి దోహదం చేసిన తొలి నాయకులు శ్యాం, కిషన్‌జీల వలె ప్రవేశించి అపారమైన మెకానికల్ జ్ఞానంతో, నైపుణ్యంతో తయారుచేసిన బాంబు ప్రయోగంలో చేతిలో పేలి 1982 లోనే అమరుడయ్యాడు కానీ వరంగల్, మెదక్ ఉద్యమాలకు జనార్ధన్ చేసినంత సేవ, గంగారాం ఆదిలాబాదు, ఆరంభ దండకారణ్య ఉద్యమాలకు చేసాడు. ఇంక బసవరాజు అమరత్వం ప్రపంచమంతా గానం చేస్తున్న సందర్భంలో ఆ నెత్తుటి తడి ఆయన రక్త బంధువుల అనుభవానికి రాకున్నా, ఆ బూడిద కూడా వాళ్ళ చేతికి దక్కకున్నా ఆయన ఆదర్శం ఇప్పుడు ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నది.

 జనార్దన్ ప్రత్యక్షంగా ప్రభావితం చేసిన విప్లవకారులు ఇద్దరు. ఒకరు వరంగల్ పైడిపల్లి వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన జన్ను చిన్నాలు, మరొకరు ఆర్‌ఇసి విద్యార్థి చెరుకూరి రాజకుమార్. గిరాయిపల్లి ఎన్‌కౌంటర్ నాటికి ఎమర్జన్సీ నాటికి ఒక 20 రోజులుగా 1975 జూలై 4 నుంచి ఆయన వరంగల్ జైల్లో మీసా కింద ఆర్‌యస్‌యు విద్యార్థిగా డిటెన్యూగా ఉన్నాడు. జనార్దన్ బాటలో నడిచి విప్లవోద్యమ నిర్మాణం చేయాలనే ప్రతిజ్ఞను ఆయన ఆ  24 /25 రాత్రి తీసుకున్నాడు కనుకనే అదే అక్టోబర్ నెల 1న అన్నా, తండ్రీ చేసిన ప్రయత్నాల వల్ల విడుదలయినా ఆయన ఎమర్జెన్సీలోనే గ్రామాలకు తరలి జగిత్యాల జైత్ర యాత్రకు దారి తీసిన గుణాత్మక పరిణామాలకు తన సహ విద్యార్థులు మల్లోజుల కోటీశ్వరరావు వంటి వాళ్ళతో బాధ్యుడయ్యాడు. వరంగల్‌లో జరిగిన ఆర్‌ఎస్‌యు రెండవ మహాసభ నాటికి విశాఖలో ఎం.టెక్ చేస్తూ, అక్కడ విద్యార్థి, విప్లవ ఉద్యమాలు నిర్మాణం చేస్తూ ఆర్‌ఎస్‌యు అధ్యక్షుడిగా ఎన్నికై  విద్యార్థులకు “గ్రామాలకు తరలండి” పిలుపు ఇచ్చిన చారిత్రక బాధ్యత నిర్వహించాడు. ఆయన విషయంలో ఈ వ్యాస పరిమితికి తర్వాతదంతా అఖిల భారత విప్లవోద్యమ చరిత్ర.

‘నేను ఆర్‌ఇసి లైబ్రరీలో కోశాంబి చదివి, బయట జనార్ధన్ ఆచరణ చూసి ఈ రాజకీయాలకు ఆకర్షితుణ్ణయానని చిన్నాలు హత్య (అక్టోబర్ 1979) తర్వాత విరసం, ఎపిసిఎల్‌సి లో చేరిన డాక్టర్ కె. బాలగోపాల్ చెప్పుకున్నాడు.

జన్ను చిన్నాలు పైడిపల్లిలోని భూమిహీనులైన నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన దళితుడు. నాన్న రిక్షా కార్మికుడు. తాను కాకతీయ మెడికల్ కాలేజీలో మెస్ వర్కర్. కానీ ఆయనను, వ్యవసాయ కూలీలను, రిక్షా కార్మికులను ఒకరని ఏమిటి 1974 చారిత్రాత్మక రైల్వే సమ్మె నాటికి వరంగల్‌లోని అన్ని ప్రజాసంఘాలను ఐక్యపరిచి విప్లవోద్యమ నిర్మాణం చేసినవాడు సూరపనేని జనార్ధన్. ఆయన ఆర్‌ఇసి మెస్‌లో బండి యాదగిరి మొదలు, పైడిపల్లిలో చిన్నాలు వరకు అందర్నీ స్పృశించి విప్లవంలోకి తెచ్చాడు. గిరాయిపల్లి దళం సిద్ధిపేట కేంద్రంగా మెదక్ జిల్లాలో తిరుగుతున్న సమయానికి జన్ను చిన్నాలు వరంగల్ పరిసర గ్రామాల్లో భూమి హీనులైన, దళిత కుటుంబాల్లో పుట్టిన వ్యవసాయ కూలీలను, వాళ్ళ కుటుంబాలను విప్లవంలోకి, భూస్వాధీన ఉద్యమంలోకి నిర్మాణం చేస్తున్నాడు. అందుకే ఎమర్జెన్సీలో రోజుల తరబడి ఎసీ గార్డ్స్‌లో చిత్రహింసలకు గురయి ఒక నెత్తుటి ముద్దగా చిలక్కొయ్యకు వేళ్ళాడాడని ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత షా కమిషన్‌కు పంపిన రిపోర్టులో డాక్టర్ రామనాథం దగ్గర ఆయన తన వాగ్మూలం ఇచ్చాడు. 1977-79 మధ్య కాలంలో ఆయన పార్టీ నిర్మాణంలో ఏ స్థానమైనా ఒక ప్రజానాయకుడుగా పీడిత ప్రజల ప్రతినిధిగా నిలిచాడు.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత డాక్టర్ రామనాథంగారి పూనిక వల్ల ఎపిసియల్‌సి  పునర్నిర్మాణానికి ప్రాతిపదికగా 1977 చివరి రోజుల్లోనే ఎపిసియల్‌సి మహాసభలు వరంగల్‌లో జరిగి కన్నభిరన్ అధ్యక్షుడుగా, డాక్టర్ రామనాథం ఒక ఉపాధ్యక్షుడుగా, బి.ప్రదీప్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పేర్కొనదగిన సంచలనం 1978 ఫిబ్రవరిలో వరంగల్ ఆదర్శ పాఠశాలలో జరిగిన ఆర్ఎస్‌యు రెండవ మహాసభలు. ఈ సభల కోసం ఆర్‌ఇసి, కాకతీయ మెడికల్ కాలేజీలతో పాటు వరంగల్‌లో బలంగా ఉన్న కాలేజీల్లో ఏర్పడిన ఆర్ఎస్‌యు విద్యార్థులు, జన్ను చిన్నాలు నాయకత్వంలోని అన్ని ప్రజాసంఘాలు. ఇటీవలనే ఆర్ఎస్‌యు 50 ఏళ్ళ చరిత్రను పూర్వ విద్యార్థులు ప్రచురించారు గనుక ఆ వివరాల్లోకి ఎక్కువ పోను గాని సూరపనేని జనార్ధన్ లేదా గిరాయిపల్లి అమరుల విప్లవ ఆచరణ మునుసాగడానికి ఈ సభలు చేసిన దోహదం, సందర్భం మాత్రం ప్రస్తావిస్తాను.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత  ఆంధ్రప్రదేశ్‌నంతా కుదిపేసిన సంఘటన రమీజాబీ, ఆమె భర్తను అరెస్ట్ చేసి లాకప్‌లో ఆయనను చంపి రమీజాబిపైన పోలీసులు అత్యాచారం చేసిన సంఘటన. ఇది హైదరాబాదులో అడిక్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇది విద్యానగర్, ఓయు క్యాంపస్ దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్. దానికి దగ్గరగా రామభద్ర కామర్స్ కాలేజీ ఉంటుంది.  ఆ కాలేజీ ఆర్ఎస్‌యు యూనిట్ బాధ్యుడుగా అక్కడ బికాం ఫైనల్ విద్యార్థి పులి అంజయ్య ఆ పోలీస్ స్టేషన్ ముందు మిలిటెంట్ ప్రదర్శన చేసిన ఆర్ఎస్‌యు బృందానికి నాయకుడు. ఆ విధంగా ఆయన ఆర్ఎస్‌యు పోరాట ఆచరణలో భాగమయ్యాడు.

1978 ఫిబ్రవరి ఆర్ఎస్‌యు రెండవ మహాసభకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్ఎస్‌యు టీం లో ఒకడుగా ఆయన ఆ సభల ప్రభావంతో ఇంక ఎం.కాం. కాకతీయ యూనివర్సిటీలో చేయాలని నిర్ణయానికి దారి తీసింది. ఆయనకు అక్కడే ఆర్‌ఇసి, కెయంసి ఆర్ఎస్‌యు విద్యార్థులతో, ఎమర్జెన్సీలో ఏర్పడిన కాకతీయ యూనివర్సిటీలో అప్పటికింకా నామమాత్రంగా ఉన్న ఆర్ఎస్‌యు లేదా విప్లవాభిమాన విద్యార్థులతో పరిచయమైంది. అంతకన్నా మించి తాము కాలేజీ మెట్లు కూడా ఎక్కలేని ఎందరో వ్యవసాయ కూలీ కుటుంబాల నుంచి వచ్చిన యువకులు చిన్నాలు నాయకత్వంలో ఆ సభల కోసం పడిన శ్రమ, నిమగ్నత ఆయనను బాగా ఆకట్టుకున్నది. ఆయన జన్ను చిన్నాలు వైపు సూదంటురాయి వలె ఆకర్షితుడయ్యాడు.

1978 విద్యా సంవత్సరంలో ఆయన కెయు లో యం.కాంలో చేరాడు. 1978-79లో  ఏర్పాటు చేసిన లెఫ్ట్ ఫ్రంట్‌లో ఆర్ఎస్‌యు పక్షాన కార్యదర్శిగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడు పిడిఎస్‌యు తరఫున లెఫ్ట్ ఫ్రంట్ అధ్యక్షుడిగా బుర్ర రాములు ఎన్నికయ్యాడు. ఇక కాకతీయ యూనివర్సిటీ ఒక విప్లవ విద్యార్థి కేంద్రముగా మారిపోయింది. గోపగాని అయిలయ్య, జి. లింగమూర్తి వంటివాళ్లు కూడా కె యు లో చేరేనాటికి  కేవలం విప్లవ విద్యార్థి ఉద్యమానికే కాదు 1980లో పీపుల్స్ వార్ ఏర్పడేనాటికి కెయు క్యాంపస్ విప్లవ రాజకీయాలకు ఆటపట్టు అయింది. ఈ వాతావరణంలో కెఎస్ 1979 అక్టోబర్‌లో బెయిలు పైన వరంగల్‌కు వచ్చి మూడు రోజులు ఉన్నాడు. ఆర్‌ఇసికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. అక్టోబర్ 17 సాయంత్రం వరంగల్ దుర్గేశ్వరాలయంలో వరంగల్ పౌరులు, విప్లవాభిమానులకు వ్యవసాయ విప్లవం గురించి ప్రసంగం చేశాడు.

జన్ను చిన్నాలుకు జగిత్యాల జైత్రయాత్రకు వెళ్లి వచ్చినప్పటి నుంచి (1978 సెప్టెంబర్ 8) అటువంటి ఒక బహిరంగ సభ వరంగల్‌లో పెట్టాలని తొలుస్తున్న ఆకాంక్ష. నిజానికి వరంగల్, గవిచెర్ల, నల్లబెల్లి, బట్టుపల్లి, వడ్డేపల్లి, ఉనికిచెర్ల, సోమిడి, కడిపికొండ పరిసర గ్రామాలు ఎక్కువలో వరంగల్, హనుమకొండ, కాజీపేటల పరిసర గ్రామాలు తప్ప జగిత్యాల, సిరిసిల్ల తాలూకాల 150 గ్రామాల్లో భూస్వాధీన ఉద్యమం ఎమర్జెన్సీ కాలం నుంచే  జరిగిన పరిణామాల ఫలసాయంగా అది జరిగింది. అతి త్వరలోనే కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల స్థాయికి ఎదిగే అంతర్నిహిత శక్తి అందులో ఉంది. ఆ రెండు జిల్లాల్లో ఫ్యూడల్ వెలమ దొరలు, ఆదిలాబాద్ జిల్లా లోనైతే సంస్థానాధీశ్వరుల వల్ల (తపాలాపూర్, నస్పూర్ వంటివి).

ఒకవైపు జగిత్యాల జైత్ర యాత్ర ప్రేరణ, మరొకవైపు గిరాయిపల్లి అమరులు – నలుగురు, జనార్ధన్ తన గురువుగా, మురళీ మోహన్, సుధాకర్‌లు తన సమీప గ్రామస్తులుగా,  ఆనందరావు జూనియర్ కాలేజ్ విద్యార్థిగానే కాకుండా విప్లవోద్యమం నల్లబెల్లి నుంచి నర్సంపేట విస్తరించే క్రమంలో బుధరావుపేట గ్రామం తన పోరాట క్షేత్రమవుతున్న సందర్భం వల్ల కూడ వాళ్ల  స్మృతిలో వాళ్ల  విగ్రహాలతో స్థూప నిర్మాణం చేయాలనుకున్నాడు. కెఎస్ రాకతో – ఇంక ఇది నిర్ణీత కార్యక్రమంగా మారింది. అయితే అమరుల స్థూపాల్లో సుత్తి కొడవలి తప్ప వాళ్ల రూపాలు పెట్టడం చాల అరుదు. ఈ విషయంలో కూడ చిన్నాలు పట్టుదల చెల్లడానికి దోహదం చేసిన చండ్ర ప్రసాదరావును కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఆయన అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్. చండ్ర రాజేశ్వరరావు బంధువుగా కమ్యూనిస్ట్  కుటుంబం. తమ కాలేజిలోనే అటు ఆర్‌యస్‌యు విద్యార్థులు ఇటు మెస్‌బాయ్‌గా ఉన్న చిన్నాలు. సహజంగానే ఆయనను ఆయనతో పాటు ల్యాబ్ అసిస్టెంట్‌గా ఉన్న బాబురావును విప్లవ రాజకీయాల్లో తెచ్చినవి. చండ్ర ప్రసాదరావు చిన్నాలు కోరికపై విజయవాడకు వెళ్లి గిరాయిపల్లి అమరుల ఫోటోల ఆధారంగా వాళ్ల రూపాల శిల్పాలు చేయించుకొని వచ్చాడు.

ఆ తర్వాత 79 అక్టోబర్ 17న పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు జన్నుచిన్నాలు ఆధ్వర్యంలో పైడిపల్లి లో కామ్రేడ్ కె.ఎస్.నలుగురు అమరుల విగ్రహాలతో ఉన్న స్థూపాన్ని ఆవిష్కరించి వేలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో ప్రసంగించాడు.

ఆ సభల ఫోటోలు వరంగల్ ఫోటో స్టుడియోలో కడిగించుకొని వస్తున్న చిన్నాలును రాజ్య ప్రేరేపిత వైఎస్ మూర్తి ముఠా అక్టోబర్ 18న పోచమ్మ మైదాన్ సికెఎంకాలెజ్ రోడ్ పై హత్య చేసింది.

అక్కడికి కొద్దిదూరంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌బిఐ క్వార్టర్స్ లో కె.ఎస్.వరంగల్ నగర్ బుద్ధి జీవులనుద్దేశించి నూతన ప్రజాస్వామిక విప్లవంలో నిర్వహించవలసిన బాధ్యతల గురించి   ప్రసంగిస్తున్న సమయమది.

ఇంక వరంగల్ ఎంజిఎం శవాగారం నుంచి నగర ప్రధాన మార్గాల మీదుగా కె.ఎస్ నాయకత్వం లో పైడిపల్లికి వెళ్లి చిన్నాలు సమాధి దగ్గర కె.ఎస్. చేసిన ప్రసంగమే వ్యవసాయ విప్లవంలో వర్గశతృ నిర్మూలన అంటే జనమేజయుడు సర్పయాగం చేయడం వంటిది కాదు. రైతు తనను కాటేయడానికివచ్చిన విషసర్పాన్ని చంపడం వంటిది. కనుక  దీనికి ప్రతీకార మనేది వ్యవసాయ విప్లవాన్ని మరింత దృఢంగా నిర్మాణం చేసే రూపంలో ఉంటుందని చాలా ఉద్విగ్నంగా ప్రసంగించాడు.

రెండవ ఆర్‌ఎస్‌యు మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జి. లింగమూర్తి వరంగల్ జిల్లా ఆర్‌ఎస్‌యు బహిరంగసభ (కాజీపేట)లో నూతన ప్రజాస్వామిక విప్లవంలో విద్యార్థుల, బుద్ధిజీవుల బాధ్యత గురించి మాట్లాడుతున్నప్పుడే ద్రోహి వైఎస్‌ను ఖతం చేసారన్న వార్త సంచలనమైంది.

అప్పటిదాకా కెయు కేంద్రంగా లెఫ్ట్ ఫ్రంట్ విద్యార్థి సంఘాన్ని, జిల్లా ఆర్‌ఎస్‌యును నిర్మాణం చేస్తున్న పులి అంజయ్య అమరుడు చిన్నాలు సమాధి దగ్గర వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించే విప్లవోద్యమం కోసం పార్టీ నిర్మాణానికి ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఆయన కన్నీళ్ళతో ఉబికి, రక్తం చిమ్ముతున్న మొహం నుంచి ఆ సాయంత్రం ఆ సంకల్పం అందరి హృదయాల్లో స్పందించింది. కొద్ది నెలల్లోనే 1980లో పీపుల్స్ వార్ ఏర్పడి 1985 నాటికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అయ్యే స్థాయికి వెళ్లడానికి ఆయన చేసిన నిర్మాణం, ఉద్యమాలే కారణం. గిరాయిపల్లి అమరుల స్థూపం పక్కనే జన్ను చిన్నాలు స్థూపం కూడ వచ్చింది. రెండవసారి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ 3 సెప్టెంబర్ 1985 డాక్టర్ రామనాథం హత్య తరువాత అమలుచేసిన లాటిన్ అమెరికాను పోలిన నిర్బంధంలో 1985 సెప్టెంబర్‌లో పైడిపల్లిలో గిరాయిపల్లి మృతవీరుల స్థూపాలు, కామ్రేడ్ చిన్నాలు స్థూపాన్ని పోలీసులు డైనమేట్లు పెట్టి పేల్చారు. అదేవిధంగా ఇంద్రవెల్లిలో కూడ డైనమైట్లు పెట్టి ఇంద్రవెల్లి మృతవీరుల స్థూపాన్ని కూడ కూల్చే ప్రయత్నం చేసారు. 

చావంటే భయం లేనివాళ్ళకు భయపడి చంపేసారు

చచ్చి అమరత్వం పొందినవాళ్ళకు భయపడి

స్థూపాలను డైనమైట్లతో పేల్చేసారు

దీపాలు ఆర్పేసి దీపాల తీపి గుర్తులు

స్థూపాలు కూల్చేస్తే పోరాటం చెరిగిపోతుందా

రూపానికీ స్థూపానికీ ప్రాణమిచ్చిన 

ఈ భూమి సంగతేమిటి? అక్కడ భూమి ఉందిగదా

ఇంక 1990 చరిత్రాత్మక రైతుకూలీ సంఘం మే 5-6న 14 లక్షల మందితో జరిగి అమరుల స్థూపం దగ్గర జన్ను చిన్నాలు తల్లి ఎర్రజెండా ఎగురేసేదాకా చిన్నాలుకు, గిరాయిపల్లి అమరులను విప్లవ వారసుడు సాగర్‌గా పులి అంజయ్య నిర్మించిన విప్లవ సంప్రదాయం విస్తరించి ఆయన 1993 పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బెంగళూరులో అరెస్టయి పీచర వెంకటాద్రి పొలాల్లో సహచరి భాగ్యతో పాటు ఎన్‌కౌంటర్ అయ్యేదాకా కొనసాగింది. ఆయన స్మృతిలో శేషు సారు నాయకత్వంలో విప్లవరాజకీయాల్లోకి వచ్చిన ఆయన స్మారక స్థూపాన్ని నిర్మాణం చేయాల్సిన ప్రయత్నం, ఆయన జీవితం, పోరాటం, జ్ఞాపకాలు రచించే కృషి వలెనే అర్థాంతరంగానే ఆగిపోయాయి.

కానీ 1990 తర్వాత పైడిపల్లిలో మళ్ళీ గిరాయిపల్లి అమరులకు, జన్ను చిన్నాలుకు మాత్రమే కాదు అప్పటి దాకా అమరులైన వీరులందరికీ స్మారక స్థూపాల నిర్మాణం జరిగింది. విప్లవ పోరాటం కూడ కొనసాగి ఎఒబి ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన జన్ను చిన్నాలు మేనకోడలు, అమరుల బంధు మిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు శాంత కూతురు సృజనతో పాటు రాష్ట్రస్థాయి నాయకుడైన వ్యవసాయ కళాశాల విద్యార్థి రమేశ్ స్మృతిలో కూడ ఇపుడక్కడ స్మారక స్థూపం ఉంది.

Leave a Reply