ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన ‘కకోరి నుంచి నక్సల్బరి దాకా….’.

శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని విప్లవోద్యమాన్ని, నక్సల్బరీ ఉద్యమాన్ని వివరించే ఏకైక పుస్తకం ఇదే. కనీసం నాకు తెలిసి మరో పుస్తకం లేదు.

ఈ పుస్తకం చదవడం వల్లనే నాకొక అవగాహన ఏర్పడింది. ఎందుకంటే యిప్పుడు ఉత్తర ప్రదేశ్ చరిత్ర గురించి మాట్లాడేవారు లేదా సంపూర్ణ చిత్రాన్నిఅందించేవారు ఎవరూ లేరు. అందుకే శివకుమార్ మిశ్రా తన గతాన్ని, లేదా చరిత్రను నేటి విప్లవకారులకు అందించినందుకు మనం కృతజ్ఞతలు తెలపాలి.

ఉత్తరప్రదేశ్‌లో సాయుధ పోరాటం లేదా విప్లవోద్యమాల ప్రవాహం నక్సల్బరీకి ముందునుంచే ఉందని ఈ పుస్తకం చదివిన తరువాత నాకు తెలిసింది . ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలలో రెండు పంథాల మధ్య పోరాటం ఎల్లప్పుడూ కొనసాగుతూనే వుండింది, పార్టీ లోపలా, బయటా కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయంలో, చౌరిచోరా ఘటన ప్రజల ఆకస్మిక సమరశీలత ఫలితంగా జరిగింది, బ్రిటిష్ రాజ్యంపట్ల భ్రమలు తొలగిపోయిన ప్రజలు పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు. గాంధీజీ దీనిని ‘హింసాత్మక చర్య’అని ఖండించారు, విచారం వ్యక్తం చేశారు, ‘శాసనోల్లంఘన ఉద్యమాన్ని’ ఉపసంహరించుకున్నారు.

భగత్ సింగ్‌కి అప్పటినుంచే గాంధీజీ పట్ల భ్రమలు తొలగిపోయాయి. మొత్తం దేశంతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని విప్లవ ప్రజానీకం కూడా నిరాశ చెందారు. దీని తరువాత కూడా, ఉత్తరప్రదేశ్ విప్లవోద్యమ చరిత్రలో, ప్రజలు ముందుకు సాగుతుంటే, నాయకత్వం వారి వెనుక నడవడం అనేది మళ్లీ మళ్లీ జరిగింది. అంతేకాకుండా వారిని వెనక్కు మళ్ళేట్లుగా కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ చరిత్రలో, కమ్యూనిస్ట్ పార్టీతో విడిపోయిన నేతృత్వమూ, ప్రజానీకమూ కూడా మొదటిసారిగా సాయుధ విప్లవోద్యమాన్ని సరైన మార్గంగా భావించి, ఒకటిగా ముందుకు సాగిన మహత్తర కేంద్రబిందువు నక్సల్బరి.

ఆ తరువాత నాయకత్వం ఈ మార్గాన్ని వదిలేసిందనుకోండి. ఉత్తరప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీ, చాలా సందర్భాలలో కేంద్ర కమిటీతో భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, ప్రజల ఉద్యమ గతితో కలిసి నిలబడకుండా, చివరికి పైకమిటీని  సమర్థించడంతో,  ప్రతి సారీ గెలవబోతున్న పోరాటాన్ని ఓడిపోవాల్సివచ్చేది, లేదా వారి చొరవకు అంతరాయం కలిగేది అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నక్సల్బరికి ముందు, తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌లో ఇలా చాలాసార్లు జరిగింది.

ఈ సందర్భంలో, శివకుమార్ మిశ్రా పుస్తకంలో పేర్కొన్న కొన్ని సంఘటనలను చెప్పాలనుకుంటున్నాను-

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ ‘సామ్రాజ్యవాద యుద్ధాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంగా’ మార్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ‘వార్షిక కౌలు కట్టడాన్ని ఆపివేయాలనే’ (లగాన్‌బందీ) ప్రతిష్టాత్మక ప్రణాళికను వేసింది, కాని కేంద్ర కమిటీ అందుకు అనుమతించలేదు.

విశేషమేమిటంటే, ఈ ప్రణాళికను రైతులతో పాటు, భగత్‌సింగ్ పార్టీ, హిందుస్తాన్ సోషలిస్ట్ ప్రజాతాంత్రిక్ సంఘ్, ఆర్‌ఎస్‌పి, కమ్యూనిస్ట్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిపి ఏర్పాటు చేసిన స్థానిక నవ్‌యువక్‌సంఘ్ అమలు చేయాల్సివుండింది. కానీ ఈ సంఘంతో ఏమీ చేయించవద్దు అని  కేంద్ర నాయకత్వం ఆదేశమిచ్చింది. అయినప్పటికీ, ఉన్నావ్‌లో లగాన్‌బందీ ఉద్యమం తీవ్రతరమైంది, సంసిద్ధులైన ప్రజలు ఆ ఆదేశాన్ని  లెక్కచేయలేదు, స్థానిక కమిటీ కూడా క్రింది కమిటీలను ఒప్పించడానికి నిర్ధిష్ట మైన సూచనలేవీ ఇవ్వలేదు.

1946 లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే, ఉత్తర ప్రదేశ్‌లో కూడా, బహుశా మొదటిసారిగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా భూస్వామ్య వ్యతిరేక  ​​పోరాటం ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఒక చిన్న జిల్లా ఉన్నావ్ లోని హసన్‌గంజ్ తాలూకాలో ఈ పోరాటం జరిగింది. మకూర్‌గావ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఎంతగా ఉండిందంటే, గ్రామంలోని ఒక బస్తీకి ‘మార్క్స్ నగర్’ అని పేరు పెట్టారు. ఇది వారి ఆధార ప్రాంతం, ఇక్కడ వున్న కుటుంబాలన్నీ కమ్యూనిస్టు కుటుంబాలు. వీరు ఉమ్మడి వ్యవసాయం చేసేవారు. ఈ బస్తీ సాయుధ పోరాటాన్ని విశ్వసించే రైతుల కేంద్రంగా మారింది. కాబట్టి ఈ గ్రామం నుండి ‘తొలగింపు ఆపండి, తొలగించిన వారికి భూములు తిరిగి యివ్వండి’ అనే నినాదంతో రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి భూస్వాముల నుండి తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమం గ్రామం నుండి మోదలై తాలూకా అంతటా వ్యాపించింది.

ఈ రైతుల ఆయుధం లాఠీ మాత్రమే. లాఠీలతో సాయుధులైన రైతులు తమని ‘ఎర్ర సైన్యం’ అని పిలుచుకొనేవారు. ఈ ఉద్యమం తెలంగాణ నేపథ్యంతో ఆరంభమవడం వల్ల, ఆ ఉద్యమాన్ని ఇక్కడ ‘దక్షిణాది ధ్రువతార’ అనేవారు. రైతులు బయటికి వెళ్ళేటప్పుడు ‘ఎర్ర నక్షత్రం మెరుస్తుంది, మా లాఠీలు నిప్పులు కురిపిస్తాయి’ అనే నినాదాలిచ్చేవారు. ఈ ఉద్యమం తరువాత, హసన్‌గంజ్‌ను ‘రెడ్ జోన్’ గా ప్రకటించారు. ఈ పోరాటం పార్టీకి నూతన సమరశీల నాయకత్వాన్నిచ్చింది.

ఈ ఉద్యమకాలంలోనే పార్టీ మహిళల శక్తిని కూడా గుర్తించింది. ఒకసారి మకుర్ గ్రామానికి చెందిన పురుషులనేక మంది కాలువలోకి నీరు కావాలనే డిమాండ్‌తో లక్నోకి వెళ్లినప్పుడు, భూస్వాములు, కిరాయి గూండాలతో కలిసి దాడి చేసి, రైతుల పొలంలో పంటను కోయాలని హుకుం జారీ చేశారు. ఇది చూసిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రామ్‌గులాంసింగ్ భార్య జగదాంబికాదేవి, గ్రామంలోని మహిళలందరినీ సమీకరించి, ‘రాధేలాల్ తుపాకులను గుంజుకోండి ‘ అని నినాదాలు చేస్తూ భూస్వామి గూండాలపై రొట్టెల కర్రలతో  దాడి చేశారు. ఈ ఊహించని దాడికి భూస్వామి తన గూండాలతో వెనక్కు తిరిగి పారిపోవాల్సి వచ్చింది.

ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ శివకుమార్ మిశ్రా, సాయంత్రం ‘మేము తిరిగి వచ్చిన తరువాత మా అభ్యర్థన మేరకు జగదాంబికాదేవి జరిగిన ఘటనను ప్రజలందరి ముందు వివరించింది, ఆ తరువాత జిల్లాలోని వక్తలలో ఆమె పేరు కూడా వుండేది. కానీ మహిళలు సాయుధ పోరాటంలో పాల్గొనడానికి కమ్యూనిస్టు పార్టీ వైపు వెళ్ళినంతగా, పార్టీ మహిళల దగ్గరికి రాలేదని చెప్పవచ్చు.

ఇలాంటి అనుభవం చాలా ప్రాంతాల్లో వుంది. ఇంత మంచి పోరాటం జరిగిన తర్వాత పార్టీ సమీక్ష ఏమిటి అనేది పుస్తకంలో ప్రస్తావించలేదు, కాని తరువాత పార్టీ నాయకత్వం రివిజనిస్టుగా మారిందనేది స్పష్టంగా తెలుస్తుంది.

ఈ పోరాటాల తరువాత, మకుర్‌గావ్‌లో భూస్వాముల ముప్పై యిళ్లను బహిష్కరించారు. భూస్వాములు పదేపదే వీరిపై తుపాకులతో దాడి చేస్తుంటే, రైతులు లాఠీలతో ప్రతిఘటించేవారు. పోలీసులు భూస్వాముల తరఫున రైతులను అరెస్టు చేయడానికి వచ్చేవారు, కాని గ్రామంలోపలికి రావడానికి భయపడేవారు. అయితే ఒకరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మార్క్స్ నగర్‌కి వచ్చి, స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూస్వామ్య  వ్యవస్థను అంతం చేస్తామని హామీ యిచ్చి తమతో సహకరించాలని కోరాడు. భూస్వాములకు వ్యతిరేకంగా గోడలపై రాసిన నినాదాలను తొలగిస్తే, కేసులు వున్న రైతులకు బెయిల్‌ దొరుకుతుందనీ, జాబితాను 15 రోజుల్లో పంపాలని చెప్పాడు. రైతులు ఇది చాలా అవమానకరంగా భావించారు, కాని స్వాతంత్ర్యం రాబోతోందని అంచనా వేసిన పార్టీ ఆ షరతును అంగీకరించాలని విజ్ఞప్తి చేసింది. అవమానితులైన వారు గోడలపై తాము రాసిన నినాదాలను తొలగించారు. స్వాతంత్ర్యాన్ని స్వాగతించాలని కమ్యూనిస్టు పార్టీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. స్థానిక కమిటీలోనివారందరికీ దీంతో ఏకీభావం లేదు కానీ, అలా అని ఎవరూ వ్యతిరేకించలేదు కూడా. స్వాతంత్ర్యం వచ్చాక, కేసులు ఉన్న రైతులను జైల్లో పెట్టారు.

బంగర్‌మవులోని జోగికోట్ గ్రామంలో కూడా పోలీసులు గూండాలతో కలిసి దాడి చేసి, ముగ్గురు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సర్జు ప్రసాద్, బల్‌దేవ్ ప్రసాద్, రాజారామ్‌లను పట్టుకుని, ఇంటి ముందు కట్టేసి, విపరీతంగా కొట్టి జీవచ్ఛవాలను చేశారు. కమ్యూనిస్టుల మాట వినద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రైతులు, పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారంటే వారికీ కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఈ కేసులు 1950–51 వరకు నడుస్తూనే వున్నాయి.

అప్పుడప్పుడూ, భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు తలెత్తుతూనే ఉన్నాయి, కానీ వాటికి సరైన సమయంలో, సరైన దిశనివ్వడంలో నాయకత్వం ఎల్లప్పుడూ విఫలమవుతూనే వచ్చింది. 1948 లో ఆజమ్‌గఢ్‌లో,  రైతుల స్వయంస్ఫూర్తితో పెద్దఎత్తున పోరాటం జరిగింది. కాని, అలాంటి పోరాట అనుభవమేమీ లేకపోవడం వల్ల పార్టీ స్థానిక నాయకత్వం సరైన సమయంలో సరైన దిశను ఇవ్వడంలో విఫలమైంది. శివ కుమార్ మిశ్రా రాసిన పద్ధతి వల్ల ఇది చాలా మటుకు అర్ధమవుతుంది.

ఆయన ఇలా వ్రాశారు – “స్థానిక కమిటీ సమావేశంలో, కామ్రేడ్ జయబహదూర్ మొత్తం ఎజెండానే మార్చేసారు. ‘సూరజ్‌పూర్‌ను మూడు రోజుల పాటు పదివేల మంది రైతులు చుట్టుముట్టారు, వారు భూస్వాముల ఇళ్లను తగలబెట్టాలనుకున్నారు, వారు సాయుధ పోరాటాన్ని డిమాండ్ చేస్తున్నారు, మేము దాడి చేయించగలిగేవాళ్ళం. కానీ అది పారిస్ కమ్యూన్ అవుతుంది, స్వయంవినాశనం జరుగుతుంది అని తరువాత అనిపించింది. అందుకని రైతులను ఒప్పించి వెనక్కు పంపించేశాను, నేను పార్టీ ఆదేశం తీసుకోవడానికి వచ్చాను.”

‘………..’ కానీ అది బిటి రణదీవే యుగపు ప్రారంభ కాలం. పోరాటాన్ని ప్రతిపాదించినప్పుడు వ్యతిరేకించే ధైర్యం రాష్ట్రకమిటీలో ఎవరికీ లేదు. …… కేంద్ర కమిటీ కామ్రేడ్ సర్దేసాయ్ కూడా వచ్చారు. ఇది పారిస్ కమ్యూన్ కాదు, తెలంగాణ అవుతుంది” అన్నారు. ఆ తరువాత యిక్కడ పోరాటాలను తీవ్రతరం చేసే ప్రణాళిక వేశారు కానీ అక్కడికి వెళ్ళిన నేతృత్వమంతా అరెస్టు అయింది.

ఆ సమయంలో బలియా, బస్తీలలో చిన్న చిన్న పోరాటాలు జరిగాయి.

1951 నుండి పార్టీ నాయకత్వంలో మళ్లీ మార్పు మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లో కూడా శివకుమార్ స్థానంలో జెడ్‌. ఏ. అహ్మద్ కార్యదర్శి అయ్యారు. పై స్థాయి నాయకత్వంలో పోరాట చైతన్యం తగ్గుతోంది, కానీ 1947 తరువాత కూడా క్రింది స్థాయి శ్రేణుల్లో అలాగే వుండింది.

1954లో, పార్టీ పంథాకు వ్యతిరేకంగా బంగర్‌మవులోని పన్స్‌డా గ్రామంలో ప్రజలు ఒక వడ్డీ వ్యాపారస్తుణ్ణి  హతమార్చారు, దళ నాయకుడు పర్ంసుఖ్ చర్య జరిగిన తర్వాత ఉపన్యాసమిచ్చాడు. ఆ రోజు పన్స్‌డా ప్రజలు దీపావళి జరుపుకున్నారు, కాని పార్టీ వారిని బహిరంగంగా సమర్థించలేదు. ప్రజలు పరమ్‌సుఖ్‌ను ఉన్నవో భగత్ సింగ్‌గా ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అతనికి మద్దతు ఇచ్చింది, అతని ఉరి శిక్షను తొలగించడానికి కూడా ప్రయత్నించింది, కాని అంతా రహస్యంగానే. సాయుధ పోరాటం నుంచి చట్టబద్ధ పోరాటాల వైపు మళ్ళే ప్రారంభ సమయం అది. బనారస్- ఆజమ్‌గఢ్‌ల మధ్య వున్న నద్‌వాసరై గ్రామంలో భూమిని స్వాధీనం చేసుకోవడానికి సత్యాగ్రహం కూడా జరిగింది, రైతులు చాలా నష్టపోయారు, ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాని పార్టీ హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. ప్రజలు తన్నులు తింటున్నప్పటికీ అదే విజ్ఞప్తి కొనసాగింది .

చైనా-భారత్ యుద్ధ సమయంలో, ఉత్తరప్రదేశ్ పార్టీలో రెండు ధోరణులు ధృఢపడడం మొదలైంది, సిపిఐ చైనాను ఖండించాలని ప్రతిపాదించింది కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రకమిటీలో అత్యధికులు అంగీకరించలేదు.

ఈ వ్యతిరేకత కారణంగా, ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అరెస్టులు ప్రారంభమయ్యాయి. శివకుమార్ మిశ్రాను అరెస్టు చేసినప్పుడు, పీకింగ్ రేడియో, ఉన్నవోలో ‘మావో త్సే-తుంగ్ ను అరెస్టు చేశారు’ అని ప్రసారం చేసింది. జైలు నుంచి బయటకు రాకముందు, సిపిఐ మొదటి విభజన జరగడానికి ముందు, 1964లో, ఉత్తరప్రదేశ్ కమిటీ రివిజనిజానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. డెంగ్ నాయకత్వాన్ని అనుసరించబోమని సమావేశంలో 150 మంది తీర్మానించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఈ తిరుగుబాటు తరువాత, సిపిఎం ఏర్పడడంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహితులయారు, కాని మొత్తం దేశంలో లాగానే ఉత్తరప్రదేశ్‌లో కూడా, ఏర్పడిన వెంటనే, రెండు పంథాలు స్పష్టంగా కనిపించాయి, ఎందుకంటే విప్లవకర, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ కావాలనే ప్రజల ఆశ ఫలించలేదు.

కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ బాధ్యుడైన శ్రీ నారాయణ్ తివారీ స్వయంగా, కొత్త కేంద్రం పట్ల అసంతృప్తిగా వుండేవారు. శివకుమార్ మిశ్రాకు కూడా నానాటికీ అనేక మందిపట్ల అసంతృప్తి పెరిగిపోతోంది , కాని అతను కేంద్రం పట్ల తన వ్యతిరేకతను ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం చేయలేదు, ఈ విషయాన్ని కూడా ఆయన పుస్తకంలో ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా చెలరేగుతున్న అలజడి నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంది. కోల్‌కతా పార్టీ కాంగ్రెస్‌కు వెళ్తుండగా బెంగాల్‌కు చెందిన కొంతమంది కామ్రేడ్స్‌ను అరెస్టు చేశారు. చైనా తరహాలో బెంగాల్‌లో సాయుధ విప్లవానికి  ప్రణాళిక తయారు చేసినట్లు వీరిపై ఆరోపణ. వీరు అరెస్టైపోయినా, తమ ప్రణాళిక అమలు చేయలేకపోయినా, ఉత్తర ప్రదేశ్ ప్రజల మనస్సులలో, విప్లవానికి ఇది కూడా ఒక మార్గం కావచ్చు అనే ఆలోచనను రేకెత్తించింది.

ఈ మధ్య కాలంలో, లక్నోకి రాజేంద్ర అనే ప్రొఫెసర్ విదేశాల నుండి వచ్చారు, అతనికి క్యూబాలో సాయుధ పోరాటం చేస్తున్న విద్యార్థులతో పరిచయం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ప్రజలు అతన్ని కలుసుకునేవారు, అతను గెరిల్లా యుద్ధం గురించి క్లాస్ తీసుకునేవారు. అతని విద్యార్థులు కొందరు యూనిఫాం ధరించి పట్నంలో తిరిగేవారు కూడా. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు  ప్రొఫెసర్ రాజేంద్రను ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవాడిగా భావించేవారు.

కానీ యువత యితనితో ప్రభావితమయ్యారు, పార్టీ నాయకులకు తెలియకుండా కలుసుకునేవారు. అతనితో ప్రభావితులైన కార్యకర్తలు శివకుమార్ మిశ్రాతో సహా పార్టీ నాయకత్వం జడత్వానికి గురైందనీ, పిరికిదని ఆరోపించారు. కాని వారు ఏదైనా చేయగలిగే లేదా అర్థం చేసుకునే స్థితిలో లేరు.

ఏదో ఒకటి చేయాలనుకున్న రాష్ట్ర కమిటీ, సాయుధ పోరాటం జరిగేటప్పుడు ప్రజలు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి సులభంగా వుండడానికి ఒక రహస్య విభాగాన్ని ఏర్పాటు చేయమని కేంద్రానికి ప్రతిపాదనను పంపింది, కాని కేంద్రం మౌనం వహించింది. ప్రాదేశిక కమిటీ తన చొరవతో అత్యధిక చైనా సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఒక రహస్య వ్యవస్థను ఏర్పాటు చేసింది, ఇందులో కాన్పూర్‌లో ‘కరెంట్ బుక్ డిపో’ పేరు ప్రధానంగా గుర్తించదగినది, ఇది ఈనాటికీ వామపక్ష సాహిత్యానికి సుపరిచితమైనది. అయితే ఇలా చేసినందుకు కేంద్ర కమిటీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఈ సమయంలోనే, చైనాకు మద్దతు ఇస్తున్నవారి అరెస్టులు పెద్ద ఎత్తున జరిగాయి. కేంద్ర కమిటీ ప్రభుత్వానికి రాసిన లేఖను అరెస్టు అయిన సహచరులందరికీ పంపించారు, అందులో ప్రభుత్వానికి ఎలా క్షమాపణ చెప్పాలో సూచించారు. ‘చైనా విషయంలో మాకు, డాంగేకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, సాయుధ విప్లవానికి ఎలాంటి సన్నాహాలు చేయలేదనీ’ వగైరా రాయమన్నారు. శివకుమార్‌తో సహా ఉత్తరప్రదేశ్‌కు చెందిన చాలా మంది నాయకులు ఇలా లేఖ రాయడానికి నిరాకరించడమే కాకుండా జైలులోనే దొరికిన మావో రచనలన్నింటినీ చదవడం మొదలుపెట్టారు. పార్టీ కార్యకర్తలలో గెరిల్లా యుద్ధం గురించి చర్చ తీవ్రతరమైంది. పోరాటం ప్రారంభించడానికి అనుమతి కోరుతూ కబురు పంపారు, కాని అనుమతి దొరకలేదు.

గెరిల్లా యుద్ధానికి సన్నాహాలు జరుపుతున్నట్లు శివ్‌కుమార్ మిశ్రాపైన ఆరోపణలు వచ్చాయి, కాని వాస్తవానికి అతను కూడా ఏమి చేయాలో నిర్ణయించలేకపోగా, ఈ ఆరోపణలకు వివరణలు ఇస్తూ ఉన్నాడు. జైలునుండి బయటకు వచ్చాక, బహ్రాయిచ్‌లో అప్పటికే కొనసాగుతున్న రైతాంగ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం గురించి ఆలోచించడం ప్రారంభించాడు, ఇక్కడ రైతులు భూములను ఆక్రమించేసారు, కాని భూస్వాముల దాడికి తట్టుకోలేక వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. శివకుమార్ పార్టీతో చర్చించి ప్రణాళికను అమలు చేయాలనుకునేటప్పటికి, ప్రొఫెసర్ రాజేంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థులతో ‘జనతా క్రాంతికారీ దళ్’ ఏర్పాటు చేసి అక్కడికి చేరుకున్నాడు. వారు దాడులు కూడా చేసారు, కాని భూస్వాముల ప్రతి దాడిలో చెల్లాచెదురైపోయారు. ఈ వైఫల్యం తరువాత, అతను కమ్యూనిస్ట్ పార్టీ స్థానిక యూనిట్‌ని సంప్రదించాడు. మరుసటి రోజు వార్తాపత్రికలో, ప్రొఫెసర్ రాజేంద్రను కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శివకుమార్ మిశ్రా గెరిల్లా ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి పంపినట్లు వచ్చింది. దాంతో పార్టీకి చాలా కోపం వచ్చి, ప్రొఫెసర్ రాజేంద్రతో సహకరించడానికి నిరాకరించింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రజలకు ప్రభుత్వం పట్ల వున్న భ్రమలు తొలగిపోయి, మళ్లీ పోరాటంలోకి వెళ్లాలని కోరుకునే సమయం అది, వారు కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూస్తున్నారు, కాని పార్టీ ఇంకా రివిజనిజం బురదలోంచి  బయటపడలేదు, సాయుధ పోరాటం గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడలేదు. అయితే ఆలోచనా దిశ మాత్రం మళ్లీ మళ్లీ అటువైపు వెళుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ప్రజలలో చాలా సులభంగానే కమిటీలు ఏర్పడేవి, కాని వాటితో ఏ పని చేయించాలో నాయకత్వానికి అర్థమయ్యేది కాదు. ఈ సమయంలోనే కాన్పూర్‌లోనూ, ఇతర కొన్ని విశ్వవిద్యాలయాలలో ఒక బలమైన విద్యార్థి సంస్థ ఏర్పడింది, కాని వారికి విప్లవానికి సంబంధించిన పని ఏదీ లేకపోవడంతో, పోలీసులను ‘చంపండి- పారిపొండి’ అనే కార్యక్రమం ఇస్తే అది నియంత్రణ లేకుండా పోయింది, తరువాత ఆ సంస్థను విప్లవ కార్యకలాపాల్లో ఇమడ్చలేకపోయారు.

ఇంతలో, నక్సల్బరి ఉద్యమ ‘వసంత మేఘగర్జన’ ప్రారంభమైంది. శివకుమార్ మిశ్రా, శ్రీనారాయణ్ తివారీ, అనేక మంది ప్రాంతీయ సభ్యులు నక్సల్బరీ ఉద్యమాన్ని సమర్థించారు, కానీ బహిరంగంగా కాదు. సిపిఐ-ఎం తాము  రాసిన డాక్యుమెంట్లను చదివి అర్థం చేసుకొంటుందని వారు ఆశించినదానికి విరుద్ధంగా పార్టీ వీరిద్దరినీ బహిష్కరించింది.

అనేక జిల్లా కమిటీలు, స్థానిక ప్రజలు నక్సల్బరికి అనుకూలంగా ఉన్నారు. ఈ వసంత మేఘగర్జన ఉత్తరప్రదేశ్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ద్వంద్వత్వాన్ని పరిష్కరించి, విప్లవమార్గం ఏమిటో చూపించింది. శివకుమార్ మిశ్రా స్వయంగా ఇలా వ్రాశారు “…. ఇది దేశంలోని విప్లవకర శక్తులను మిళితం చేసి సాయుధ దళాల ద్వారా రైతాంగ – కార్మికవర్గ అధికారాన్ని సాధ్యం చేయాలనే లక్ష్యంతో ఉంది.”

… సాయుధ పోరాటం సమస్యను నక్సల్బరి ఎంత స్పష్టంగా, సమర్థవంతంగా మన ముందు ప్రతిపాదించిందంటే, సంవత్సరాల తరబడి అంతర్గత సైద్ధాంతిక పోరాటం ద్వారా కూడా బహుశా సాధ్యమయుండేది కాదు.”

ఈ ఉద్యమం ప్రారంభమైన తరువాత, ఉత్తరప్రదేశ్‌లో మొదటి ఉద్యమం షాజహన్‌పూర్‌లో జరిగింది, ఇది సగం  తయారీతోనే జరిగింది. ఇక్కడి పువాయా ప్రాంతంలో ఖాళీగా పడిఉన్న అటవీ భూమిని దాదాపు 250 మంది రైతులు ఆక్రమించారు.

ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మాయప్రకాష్, ఓంప్రకాష్‌లపై ప్రభుత్వం వారెంట్లు జారీ చేసింది, మరింత ఎక్కువ భూమిని యిస్తామని చర్చలు జరిపి రైతులను తమ వైపు తిప్పుకొంది. ఈ ఇద్దరు నాయకులు కూడా ప్రభుత్వపక్షమయ్యారు. ఈ ఉద్యమం తరువాత, ప్రాంతీయ కమిటీకి చారు మజుందార్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సమన్వయ కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీ నాయకత్వంలో రాష్ట్రంలో తిరిగి సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈసారి తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం చేసారు. కానీ ఎటువంటి అనుభవం లేకపోవడంతో, ప్రణాళిక తయారీ, అమలులో పటిష్టత లేదు. సాయుధ పోరాటానికి పిలుపునిస్తూ రైతులు గోరఖ్‌పూర్‌లో సాయుధ ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనతోనే భూస్వాములు ఎంతగా భయపడిపోయారంటే రైతులపై దాడి చేయడం ప్రారంభించారు. రైతులు ముందడుగు వేయలేదు కాని ప్రతిచర్యగా ఇద్దరు భూస్వాములను చంపారు. అయితే ఈ ఉద్యమం కూడా ముందుకు సాగలేదు. 100 మందికిపైగా వారెంట్లు జారీ అయ్యాయి, కాని అజ్ఞాతంలో ఉండటానికి సంసిద్ధత గానీ, అనుభవం గానీ లేకపోవడంతో  అందరూ అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు భూస్వామ్య కుటుంబానికి చెందినవారు కావడంతో, జీవిత ఖైదు పడినప్పటికీ, కుటుంబ ప్రభావం వల్ల విడుదలయ్యారు, మిగిలిన వారు పదమూడు- పద్నాలుగు సంవత్సరాల పాటు  జైల్లో ఉండాల్సి వచ్చింది.

ఇక్కడ వైఫల్యాన్నెదురుకున్నాక, లఖింపూర్ ఖేరీ వైపు దృష్టి మరల్చారు. అక్కడ జరిగిన రైతాంగ సాయుధ తిరుగుబాటు దేశవ్యాప్తంగా ప్రచారమైంది. ఇక్కడ పార్టీ ఆరంభంనుంచే గెరిల్లా దళాల నిర్మాణాన్ని ప్రారంభించింది. అంటే, గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొంటూ చేసిన సన్నాహాలు కొంత ఉత్తమ శ్రేణికి చెందినవిగా ఉన్నాయి.

గెరిల్లా బృందాలు ధనిక రైతుల నుండి తుపాకులను లాక్కోనే కార్యక్రమాన్ని తీసుకున్నాయి. రైతుల మధ్య రాజకీయ ప్రచారం చేయడం కోసం విడిగా ఒక యువకుల బృందం ఏర్పడడంతో చిరాకెత్తిన భూస్వాములు, ఒక రోజు రైతుల గుడిసెలను తగలబెట్టి తిరిగి వస్తున్నప్పుడు, గెరిల్లా సైన్యం వారిపై విరుచుకుపడి, పారిపోతున్న జమీందార్లను సాంప్రదాయ ఆయుధాలతో చంపేసింది. ఈ సంఘటన తరువాత, 1500 మంది పిఎసి సిబ్బందిని మోహరించారు.

ఈ కారణంగా గెరిల్లా యోధులు ఇళ్ళను వదిలేసి అడవులకు పారిపోవడమో లేదా తమ స్వంత వూళ్ళకు వెళ్లిపోవడమో చేయాల్సి వచ్చింది. కానీ ఈ పోరాటం ఉత్తరప్రదేశ్ నక్సల్బరి అయింది. అయితే, గెరిల్లాలు ఐక్యంగా ఉండటానికి బదులు ఈ సంఘటన తర్వాత చెల్లాచెదురైపోయారు. అడవిలో లేదా సమీప ప్రాంతాల్లో దాక్కున్న వారు, ‘తుపాకులను లాక్కోండి’ అనే కేంపెయిన్ కొనసాగింఛారు. టికారియా గ్రామంలో, భూస్వాముల ఇళ్లపై దాడి చేసి తుపాకులను లాక్కున్నారు.

ఈ ఘటన తరువాత అక్కడ కూడా పిఎసి సిబ్బందిని మోహరించారు. కాని వారు ప్రజలతో ఎంతగా కలిసిపోయారంటే ఒక్క అరెస్టూ జరగలేదు, టికారియా గ్రామంలో గెరిల్లా చర్యలలో పాల్గొన్న రైతులు బహిరంగంగా హోలీ పండుగ చేసుకున్నారు, విప్లవ పాటలు పాడుకున్నారు. భారత్‌తో పాటు నేపాల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఈ వ్యక్తులపై నిఘా పెట్టింది. కానీ శివకుమార్ మిశ్రా మాటల్లోనే, ‘లఖింపూర్ ప్రాంతం ఆయుధాలను సేకరించడం తప్ప ముందుకు పోలేకపోయింది.’

పార్టీలో మళ్లీ విభేదాలు తలెత్తడంతో లఖింపూర్ ఖేరీలోని ఈ ప్రాంతం ఆధార ప్రాంతంగా మారడం అనేది పగటి కలలా ముగిసిపోయింది. కానీ లఖింపూర్ ఖేరి ప్రభావంతో, నైనిటాల్‌లోని తరాయ్ ప్రాంతంలో కూడా రైతాంగ పోరాటాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమం తూర్పు, టెరాయ్ ప్రాంతాల్లో వ్యాపించడమే కాకుండా, విప్లవోద్యమ పాత కేంద్రాలైన ఉన్నావో, హార్దోయిలలో కూడా తీవ్రతరమైంది.

నక్సల్బరి పోరాటం ఈ శక్తులను కూడా విముక్తి చేసింది. హార్దోయికి చెందిన మల్లావా, మాథోగంజ్‌లలో గెరిల్లా దళాల నిర్మాణం వేగవంతమైంది. ఉన్నవో గ్రామం రైతు పోరాటాల కొత్త కేంద్రంగా మారింది. ఈలోగా, రైతుల పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటను కోయడానికి భూస్వాములు, పోలీసులతో కలిసి దాడి చేశారు, ప్రజలు ఆశించినదానికి విరుద్ధంగా రెండు వైపుల నుండి కాల్పులు జరిగాయి, పోలీసులు, భూస్వాములు ఖాళీ చేతులతో వెనుతిరిగి పోవాల్సివచ్చింది. తరువాత, అథహా గ్రామంలో కుఖ్యాత భూస్వామి శివశంకర్‌ను చంపేశారు. ప్రభుత్వం ఇక్కడ కూడా పిఎసిని మోహరించింది. బంగర్‌మౌలో, మనికాపూర్‌కు చెందిన కుఖ్యాత భూస్వామి రూప్‌సింగ్‌ని చంపారు, ప్రతి దళిత ఇంటి కొత్త కోడలు వాడి ఇంట్లో మొదటి రాత్రి గడపాల్సి వచ్చేది. తూర్పున కూడా బస్తీ, వారణాసి, జౌన్‌పూర్‌ వరకు ఉద్యమం వ్యాపించింది. కానీ మొదట నాయకత్వంలోని విభేదాలు, ఆ తరువాత ఉద్యమ గమనమే మారిపోవడం వల్ల ముందుకు సాగుతున్న పోరాటం ఆగిపోయింది. వాస్తవానికి, 1967లో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పడినప్పుడు, ఉత్తరప్రదేశ్‌లోని కమిటీ అదే సమయంలో కేంద్రానికి తన భిన్నమైన ఆలోచనను వ్యక్తపరిచింది. అంటే, ఉద్యమం రివిజనిజం చిత్తడి నుండి బయటకు వస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్ కమిటీ అటువైపు వెళ్ళడం ప్రారంభించింది.

ఈ మార్పులో ప్రధాన అంశం – గెరిల్లా యుద్ధాన్ని ఏకైక మార్గంగా కాకుండా  ప్రధాన మార్గంగా భావించడం. ఇది సరైనదని అనిపించవచ్చు, కాని ఇతర మార్గాల్లో ఎన్నికలను కూడా చేర్చారు. వాస్తవానికి, ఉత్తరప్రదేశ్ కమిటీ నక్సల్బరి ఉద్యమం ప్రభావంతో సాయుధ గెరిల్లా కార్యకలాపాలను చేపట్టింది, కానీ పూర్తిగా అంగీకరించలేదు. సాయుధ చర్యలు ప్రజలు చేయాలి కానీ పార్టీలో శిక్షణ పొందిన దళాలు కాదని అభిప్రాయపడింది.

మా-లే ఏర్పడిన తరువాత గెరిల్లా యుద్ధాన్ని తిరస్కరించే సత్యనారాయణ సింగ్ పంథా వచ్చినప్పుడు, ఉత్తర ప్రదేశ్ ప్రావిన్షియల్ యూనిట్ చారు మజుందార్‌కు బదులుగా సత్యనారాయణ సింగ్ వైపు మొగ్గు చూపింది. ఈ కారణంగా, రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యకలాపాలు ఆగిపోయాయి. చారు మజుందార్‌కు మద్దతు ఇచ్చేవారున్నప్పటికీ శివకుమార్ మిశ్రా కమిటీలో మాట్లాడకుండానే సత్యనారాయణ సింగ్‌‌కు తన మద్దతునిచ్చేసాడు.

తరువాత చారు మజుందార్ బీహార్, ఉత్తర ప్రదేశ్ కమిటీలని మొత్తంగానే పార్టీ నుండి తొలగించారు. సత్యనారాయణ సింగ్‌తో పాటు మొత్తం ఉత్తరప్రదేశ్ కమిటీ మళ్ళీ రివిజనిజం బురదలో కూరుకుపోయింది. అతని ప్రత్యర్థులు వినోద్ మిశ్రాతో విడిగా ఒక పార్టీని ఏర్పాటు చేశారు, కాని ఇద్దరూ సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టి పార్లమెంటరీ మార్గంలో ముందుకు సాగారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో చాలా కాలం వరకు అలాంటి ఉద్యమాలు జరగలేదు.

ఈ ఉద్యమాల సందర్భంలో, ఈ రోజు మనం మరింత బాగా అర్థం చేసుకోగల స్థితిలో ఉన్న మరో విషయాన్ని  శివకుమార్ మిశ్రా తన పుస్తకంలో కొద్దిగా ప్రస్తావించారు. మావో విప్లవ విజయానికి మూడు మంత్ర దండాల అవసరం గురించి చెప్పాడు. అవి పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన. ఇందులో, నక్సల్బరి ఉద్యమ కమ్యూనిస్టులు మొదటి రెండింటి గురించి బాగా అర్థం చేసుకున్నారు, వాటిని అమలుచేస్తున్నారు కూడా. కానీ ఐక్యసంఘటన గురించి వారి అవగాహన ఇంకా పరిమితంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ ఉద్యమాలలో దళితుల బలమైన భాగస్వామ్యం ఉంది, కాని దళితులవడం వల్ల  వారిపై జరుగుతున్న అణచివేతకు సంబంధించి పార్టీకి ఎలాంటి ప్రణాళికా లేదు, అదే సమయంలో దళితులు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక కుల సంఘాన్ని ఏర్పాటు చేసి పోరాడుతున్నారు కూడా. కాని పార్టీ వారిని సంస్కరణవాదులనీ, విప్లవ వ్యతిరేకులనీ అనేది.

శివకుమార్ మిశ్రా 1948 ప్రాంతంలో సుల్తాన్‌పూర్‌లో అజ్ఞాతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలోని జమీందార్లకు అగ్ర కులాల వారి మద్దతు ఉందని, ఈ రకంగా కూడా వారు ఐక్యంగా ఉన్నారని, వారితో పోరాడటానికి ఆ సమయంలో అక్కడ ఏర్పడిన  ‘షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్’, ‘ బ్యాక్వర్డ్ క్లాసెస్ యూనియన్’లు శివకుమార్ మిశ్రాను కలిశాయి, కలిసి పోరాడాలని అనుకున్నాయి కూడా. ఇలాంటి సంస్థలను విప్లవ వ్యతిరేకమని భావించడం సరికాదని శివకుమార్ మిశ్రా పార్టీకి రాసిన లేఖలో అన్నారు. పార్టీ ఈ లేఖను తన అధికారిక  పత్రిక ‘విప్లవ్’లో ముద్రించింది, కానీ దానిపై చర్చించలేదు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు, లేదా వాటికి సన్నిహితమవడానికి ఎటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఈ పరిస్థితి వామపక్ష పార్టీలలో ఇప్పటి వరకు ఉంది, ఈ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో దళితుల అణచివేత కంటే ఎక్కువగా  ‘గుర్తింపు’ రాజకీయాలు మరింత బలపడ్డాయి. దళిత సంఘాలు ఒక ‘సంస్థ’గా వామపక్షాలకు దగ్గరగా రావడానికి ఇప్పటికీ జంకుతాయి.

నేటికీ, ఈ జడత్వాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే దళిత ఉద్యమం యాదృచ్ఛికంగా వేగవంతం అవుతోంది, కానీ వ్యవస్థ మార్పుతో సంబంధం పెట్టుకోకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ లేచి  పడిపోతోంది. నేడు ఉత్తరప్రదేశ్ వామపక్ష ఉద్యమాలకు ఇది ఒక సవాలు. సంవత్సరాలు గడిచాక, ఈ ఉద్యమాల నుండి ప్రేరణ, పాఠాలు – రెండింటినీ తీసుకుంటున్న, ఉత్తరప్రదేశ్‌లో విప్లవోద్యమం మరోసారి నిలబడే సంసిద్ధతలో ఉంది,.

మరో రెండు లేదా మూడు విషయాలు – విరసం వేదికపై తప్పక చెప్పాల్సినవి-

ప్రతి ఉద్యమం అభ్యుదయ, విప్లవ సాహిత్యానికి జన్మనిస్తుంది. నక్సల్బరి కూడా ఇచ్చింది., ఉత్తరప్రదేశ్ గురించి కాకుండా హిందీ సాహిత్యం గురించి మాట్లాడితే, నక్సల్బరి ఉద్యమం కంటే ముందు సాహిత్యకారులలో ఏర్పడిన వ్యవస్థ పట్ల తొలగిన భ్రమలు, నిరాశ, అశాంతిల స్థితి వ్యక్తీకరణ ముక్తిబోద్ కవిత్వంలో కనిపిస్తుంది.

ఆ నిరాశా సమయంలో, అశాంతి నుండి బయటపడాలనే మధ్యతరగతి మేధో రచనా, ఆలోచనా, తపనని అతని కవిత్వమూ, రచనల్లో చాలా స్పష్టంగా అనుభూతి చెందుతాము. కేవలం అశాంతి మాత్రమే కాదు, ప్రత్యామ్నాయంగా తయారై వున్న నమూనాలను విచ్ఛిన్నం చేయాలనే విజ్ఞప్తి, సాహసం కూడా అతని రచనలలో స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ ‘ రాజకీయాలకు ముందు నడిచే కాగడా సాహిత్యం ‘ అనే ప్రేమ్‌చంద్ ప్రసిద్ధ వాక్యం మీకు గుర్తుంటే, ముక్తిబోద్ కవిత లోని ఈ పంక్తులు-

“ఇప్పుడు వ్యక్తీకరణపై వచ్చే

అన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి,

విచ్ఛిన్నం చేయక తప్పదు

కోటలు, మఠాలన్నింటిని”

ఆ సమయంలో రివిజనిస్ట్ మఠాన్ని బద్దలుకొట్టమనే విజ్ఞప్తులు రాజకీయాల్లోనూ, సాహిత్యంలోనూ కూడా వినిపిస్తాయి.

ముక్తిబోద్ కవితా కాగడా వెలిగిన తరువాత వచ్చిన నక్సల్బరి ఉద్యమం అన్ని బలమైన కోటలను, మఠాలను విచ్ఛిన్నం చేసింది, సృజనాత్మకతను కూడా విముక్తి చేసింది. స్వాతంత్ర్యోద్యమం తరువాత, స్తబ్దమైన సాహిత్యంలో ప్రవాహం మొదలైంది. ఈ ప్రవాహం నాగార్జున, ధుమిల్, సర్వేశ్వర్ దయాల్ సక్సేనా, అలోక్ ధన్వా, హరిహర్ ఓఝా, గోరఖ్ పాండే వంటి కవి సైన్యాన్ని, సంజీవ్, శ్రీంజోయ్ వంటి కథకులను సృష్టించింది, వారు నక్సల్బరి సాధించిన విజయాలను ప్రజల్లో వెదజల్లారు.

ఇంతే కాకుండా, అనేక  అజ్ఞాత ప్రజా గేయరచయితల సైన్యం కూడా తయారైపోయింది, వారి పేర్లు తెలియవు కాని వారి రచన అమరమైంది. ఏ రచయితకైనా ఇది ఒక ప్రధాన విజయం. హిందీ సాహిత్యం మాత్రమే కాదు, హిందీకి సంబంధించిన ప్రతి మాండలికంలోని సాహిత్యాన్ని నక్సల్బరి విప్లవ చైతన్యంతో సమృద్ధి చేసింది. తత్ఫలితంగా, ప్రతి గ్రామం ఇటువంటి రచనలతో నిండి పోయింది, ఈ ఉద్యమం అక్కడకు చేరుకోలేకపోయినా, ఈ ఉద్యమాల నుండి ఉద్భవించిన సాహిత్యం అక్కడకు చేరుకుంది.

నక్సల్‌బరి యుగంలో వచ్చిన రచనలు ప్రజలను ఇప్పటికీ కదిలిస్తున్నాయి, కాని ఈ రోజు మనం చేరుకున్న ఫాసిస్టు యుగంలో, నక్సల్బరి పూర్వ కాలంలో ఉన్న స్థితి మరోసారి కనిపిస్తోంది. నక్సల్బరి మార్గంలో నడుస్తున్న ఉద్యమాలు బలపడుతున్నాయి కాబట్టి, నిస్సందేహంగా ప్రస్తుతం అప్పటిలాగా దిక్కు తెలియని స్థితి లేదు. కాని రచయితలు, మేధావులు తమను వాటితో అనుసంధానించుకోలేకపోతున్నారు, హిందీ ప్రాంత సాహిత్యకారులు అయితే అసలే లేదు.

 నేను దీన్ని ఎందుకు సరిగ్గా గుర్తించలేకపోతున్నాను, బహుశా వాటిని జోడించే లింక్ మాయమైపోయింది, బహుశా అది ప్రస్తుత ఉద్యమ పరిమితి కావచ్చు. మరోవైపు, ఏ క్షణమైనా ఫాసిజం బాధితులం కావచ్చునేమోననే భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ  భయం వల్ల అసహనం పెరిగిపోతోంది.  బహుశా తమ  శక్తి కూడా విముక్తమవడానికి సాహిత్యం, సంస్కృతి మళ్ళీ ఒక దేశవ్యాప్త ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నాయి,.

మరొక విషయం – నక్సల్బరీ ఉద్యమ సమయంలో, చాలా విప్లవకర రచనలు వచ్చాయి, కాని ఆ ఉద్యమం భారతీయ సమాజంలోవున్న అనేక చెడులపై దాడి చేయలేదు కాబట్టి, ఆ రచనల్లో చెడులు కూడా చాలానే ఉన్నాయి.

 నక్సల్బరి ఉద్యమంలోని గొప్ప విప్లవ కవి, నేను అభిమానించే ధుమిల్ రచనల్లో అనేక స్త్రీ వ్యతిరేక చాయలతో పాటు, పితృస్వామిక వెనుకబాటుతనం కూడా వుంది. కవితల్లో మాత్రమే కాదు, చాలా కథల్లో కూడా ఉద్యమంలో మహిళల పరిమిత పాత్రను వర్ణిస్తాయి. ఏదేమైనా, ఈ భూస్వామ్య వ్యవస్థ పునాదులను సడలించే చాలా కథలు, కవితలు కూడా వున్నాయి.

 ఇది రచయితకున్న స్వీయ ప్రజాస్వామిక స్పృహ పరిమితిగా అనుకోవచ్చు. కానీ, ఈ మేధో సరిహద్దును విచ్ఛిన్నం చేయడం ఏ ప్రజాస్వామిక ఉద్యమానికైనా వున్న బాద్యత కూడా. అందుకని, ఈ మార్గంలో నడుస్తూ, రాబోయే ఉద్యమాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో వచ్చే ఇలాంటి ప్రతి సమస్యని ఎదుర్కొంటాయని, ఈ మేధో సరిహద్దును విచ్ఛిన్నం చేసి, నూతన ప్రజాస్వామిక సాహిత్యాన్ని సృష్టించే శక్తిని కూడా విముక్తి చేస్తాయని విశ్వాసం వుంది.  

(2017 లోనక్సల్బరి ఉద్యమం 50 సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా హైదరాబాద్‌లో విప్లవ రచయితల సంఘం ‘విరసం’ నిర్వహించిన రెండు రోజుల సదస్సులో సీమా ఆజాద్ ప్రసంగం)

అనువాదం : కె. పద్మ

Leave a Reply