25 అక్టోబర్ 2025ఛత్తీస్‌గఢ్‌లోని ఘట్‌బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను రద్దు చేయడాన్ని హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ, దానిని ‘ఆందోళనకర’మైనదిగానూ ‘తీవ్రంగా నిరాశపరిచేది’గానూ అభివర్ణించింది.

ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్-జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు భారతదేశంలో ఒక సాముదాయిక అటవీ హక్కుల  పట్టా ను రద్దు చేయటం బహుశా ఇదే మొదటి సందర్భం అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అక్టోబర్ 23న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

కోర్టు తన అక్టోబర్ 8 నాటి ఉత్తర్వులో, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి లేవనెత్తిన అంశాల గురించి సిద్ధాంతపరంగా అంగీకరించింది. అయితే, అది సాంకేతికత, నిర్దిష్ట వాదనల ఆధారంగా మినహాయింపులను ఏర్పరచింది. “ఈ తీర్పు పిటిషనర్‌ల- హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితిల లోకస్‌ను (వాదన చేయడానికి ఉన్న అర్హత) ప్రశ్నించింది; పిటిషనర్‌లు ఘట్‌బర్రా గ్రామానికి నివాసులని చూపించడానికి ఎటువంటి పత్రాలు దాఖలు చేయకపోవడాన్ని తప్పుగా పేర్కొంది” అని ఆ ప్రకటన తెలిపింది. పిటిషనర్‌ల నుండి వ్యక్తిగత అఫిడవిట్‌లు, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి ప్రాతినిధ్యాన్ని అధికారికం చేస్తూ 200 మందికి పైగా ఘట్‌బర్రా నివాసులు సంతకం చేసిన తీర్మానాన్ని ఇది తీవ్రంగా పట్టించుకోకపోవడం అని కూడా జోడించింది.

ఈ వివాదం ఒక సముదాయానికి—అంటే ఘట్‌బర్రా గ్రామానికి చెందిన గ్రామ సభ సముదాయానికి—గుర్తించిన అటవీ హక్కులపైన దృష్టి సారించింది కాబట్టి, గ్రామ సముదాయంలోని ప్రతి సభ్యుడు హక్కుదారుగా మారారు; ఆ హక్కుల రద్దును సవాలు చేసే లోకస్ (locus – వాదన చేయడానికి ఉన్న అర్హత) వారికి ఉంది. తమకు నేరుగా లభించిన హక్కులను రద్దు చేసే ఉత్తర్వును సవాలు చేసే లోకస్ అదే గ్రామానికి చెందిన నివాసితులకు లేకపోతే, మరెవరికి ఉంటుంది?

ఒక ఉదాహరణను ఉదహరిస్తూ ప్రకటన కోర్టు మరొక వాస్తవాన్ని కూడా విస్మరించిందని జోడించింది: ఈ విషయం పూర్తిగా భిన్నమైనది—ఇది ఘట్‌బర్రా నుండి కాకుండా ఫత్తేపూర్ నుండి వచ్చిన వివిధ పిటిషనర్‌లను వాటాదారులుగా కలిగి ఉన్న మరొక బొగ్గు బ్లాక్‌తో సంబంధం కలిగి ఉంది—అందువల్ల ఇది అటవీ హక్కుల వివాదం కాకుండా భూసేకరణకు సంబంధించిన పూర్తిగా భిన్నమైన వివాదం.

ఈ తర్కం ప్రకారం, పిటిషనర్‌లు ఉపశమనం పొందలేరు, ఎందుకంటే ఏదైనా నిర్దిష్ట విషయానికి ఉపశమనం పరిగణించబడటానికి ముందు భారతదేశం అంతటా ఉన్న పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాల్సి ఉంటుంది, కాబట్టి ఏ కేసును కూడా విచారించరు.

ఎక్కువ సమయం గడిచిపోయింది, విశాలమైన ప్రాంతాలు అడవులుగా లేవు కాబట్టి, ఘట్‌బర్రా గ్రామ నివాసితుల వ్యక్తిగత లేదా సాముదాయిక అటవీ హక్కుల దావాలకు డబ్బు రూపంలో పరిహారం ఇవ్వవచ్చని కోర్టు పేర్కొనడం ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే, ఇది కేవలం సమయం మించిపోయిందనే కారణంతోనే ఆ చట్టవిరుద్ధతను  ధృవీకరిస్తుంది అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వు సాముదాయిక అటవీ హక్కుల  సమస్యను కేవలం పరిహారానికి మాత్రమే పరిమితం చేస్తుంది. “సాముదాయిక అటవీ హక్కుల  దావాలకు చట్టబద్ధమైన కారణం ఉండవచ్చని కోర్టు ఊహించినప్పటికీ, వాస్తవానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల  టైటిల్‌ను తిరస్కరించి, చెల్లదని ప్రకటించడం కొంచెం ఆశ్చర్యకరం” అని ఆ ప్రకటన జోడించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే అటవీ అనుమతిని రద్దు చేసింది కాబట్టి; సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుకు వ్యతిరేకంగా కంపెనీ వేసిన అప్పీల్‌ను కూడా ఉపసంహరించినందుకు, ఆ బొగ్గు బ్లాక్‌కు చెల్లుబాటు అయ్యే అటవీ అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని కోర్టు విచారించడంలో విఫలమైంది అని ఆ ప్రకటన నొక్కి చెప్పింది.

అటవీ భూమి మళ్లింపు కోసం గ్రామ సభ సమ్మతిని కంపెనీ సమర్పించలేదనే వాస్తవాన్ని కూడా కోర్టు గుర్తించడంలో విఫలమైంది—ఇది అటవీ అనుమతుల కోసం తప్పనిసరి అయిన చట్టపరమైన షరతు. బదులుగా, గ్రామ నివాసితులు బొగ్గు బ్లాక్ కేటాయింపును ఎందుకు సవాలు చేయలేదని కోర్టు నిర్దిష్ట ప్రశ్నలు అడిగిందని ఆ ప్రకటన పేర్కొంది.

ఇటువంటి పూర్వ ఉదాహరణ, భవిష్యత్తు కేసులకు వర్తింపజేస్తే, భారతదేశ రాజ్యాంగానికి; చట్టపరమైన ప్రక్రియలలో అంతర్లీనంగా ఉన్న సహజ న్యాయం పునాదులకే ముప్పు కలిగించవచ్చునని కన్వీనర్లు అన్నారు.

బొగ్గు బ్లాక్ కేటాయింపును నియంత్రించే చట్టం, గ్రామస్థుల జోక్యానికి ఎటువంటి అవకాశాన్నీ ఇవ్వడం లేదని వారు చెప్పారు. అంతేకాకుండా, కేవలం కేటాయింపు చేసినంత మాత్రమే, బొగ్గు బ్లాక్ ప్రాంతంలో నివసించే అడవిలో నివసించే సముదాయాల అటవీ హక్కుల గుర్తింపుకు అడ్డంకిగా మారడానికి మైనింగ్ కంపెనీకి షరతులు లేని హక్కులను ఇవ్వదు.

ఈ ఉత్తర్వు స్థానిక సముదాయాలపై వారి హక్కులను రక్షించుకోవడానికి అసమానమైన, అధిగమించలేని భారాన్ని మరింతగా పెంచుతుందని, పరిమితమైన సమ్మతి అవసరాలతో కంపెనీలు వారి హక్కులను అతిక్రమించడానికి వీలు కల్పిస్తుందని కన్వీనర్లు అన్నారు. ప్రాథమికంగా, ఇది అటవీ అనుమతిని మరియు/లేదా గ్రామ సభ సమ్మతిని కూడా కేవలం నామమాత్రపు తంతుకి తగ్గిస్తుంది.

“ఈ కోర్టు ఉత్తర్వు ఆదివాసులు, అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించే పోరాటాన్ని అనేక దశాబ్దాలు వెనక్కి నెట్టింది. మొదటిసారిగా, ఇది ఒక అటవీ హక్కుల పట్టా రద్దును చట్టబద్ధం చేస్తుంది; ఇది కొత్త హక్కును మంజూరు చేయడం కోసం కాకుండా, కేవలం స్థానిక సముదాయాలకు ముందునుంచి  ఉన్న చారిత్రక హక్కులను గుర్తించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది స్థానిక సముదాయాల అటవీ హక్కులను మైనింగ్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా గుర్తించకుండా ఉండడానికి ఒక ప్రక్రియను, ప్రమాదకరమైన పూర్వ ఉదాహరణను (ప్రిసీడెంట్) కూడా సృష్టిస్తుంది,” అని ఆ ప్రకటన పేర్కొంది.

కాలయాపన, లోపాలవంటి సాంకేతిక కారణాలు చూపించి పిటిషనర్‌లకు ఉన్న మౌలిక అటవీ హక్కుల రద్దును సమర్థించడం ద్వారా అడవిలో నివసించే సముదాయాలపైన కోర్టు, 20 సంవత్సరాల క్రితం అటవీ హక్కుల చట్టం పరిష్కరించడానికి ఉద్దేశించిన అదే “చారిత్రక అన్యాయాన్ని”  మళ్లీ అమలు చేసింది.

కేసు నేపథ్యం

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఉన్న ఆదివాసీ గ్రామమైన ఘట్‌బర్రా, రాష్ట్రంలో సాముదాయిక అటవీ హక్కుల చట్టం చేత గుర్తింపు పొందిన మొదటి గ్రామాలలో ఒకటి. ఈ గుర్తింపును 2013 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ ద్వారా ధృవీకరించారు.

810 హెక్టార్ల అటవీ భూమిలో విస్తరించి ఉన్న మూడు సాముదాయక అటవీ హక్కుల కోసం ఈ పట్టాను ఇచ్చారు.  వీటిలో కలప సేకరణ, పశువుల మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ హక్కులు ఉన్నాయి.

వైల్డ్‌ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం, ఈ కార్యకలాపాల నుండి హస్‌దేవ్ అరణ్య ప్రాంతంలోని గ్రామస్థులు వారి వార్షిక ఆదాయంలో సుమారు 60 శాతం సంపాదిస్తున్నారు.

వారి జీవనోపాధి హక్కును, సాంస్కృతిక గుర్తింపును నిర్ధారించడానికి ఈ అటవీ హక్కుల గుర్తింపు చాలా కీలకమైనది. ఘట్‌బర్రా గ్రామం కూడా పర్సా ఈస్ట్ కేట్ బసెన్ బొగ్గు బ్లాక్‌లో ఉంది; దీనిని ఎక్కువ షేర్లను కలిగి ఉన్న  అదానీ ఎంటర్‌ప్రైజెస్ యజమానిగా ఉన్న ఒక జాయింట్ వెంచర్ కంపెనీ నిర్వహిస్తోంది.

ఈ సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను గుర్తించడానికి ఒక సంవత్సరం ముందు— 2012 సంవత్సరంలో అటవీ హక్కులను పరిష్కరించకుండా, సంబంధిత గ్రామ సభల సమ్మతి లేకుండానే ఈ ప్రాజెక్ట్‌‌కు అటవీ అనుమతి మంజూరు చేసారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ అనుమతి అటవీ ప్రాంతంలో రెండు దశలలో మైనింగ్ చేయడానికి వీలు కల్పించింది, ఇందులో ఘట్‌బర్రా గ్రామానికి ఆనుకుని ఉన్న అడవి ప్రాంతాన్ని రెండవ దశలోకి చేర్చారు. అన్ని అటవీ హక్కులను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుకు, అలాగే మైనింగ్ ప్రాజెక్ట్ కోసం గ్రామ సభల నుండి ముందస్తు సమ్మతి తీసుకోవాలనే నిబంధనకు ఇది స్పష్టంగా విరుద్ధంగా ఉన్నది.

“మైనింగ్ కంపెనీ దగ్గర చెల్లని అటవీ అనుమతి ఉన్నప్పటికీ, అది జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసింది. మైనింగ్ కంపెనీకి అనుకూలంగా ఉన్న ముందస్తు అటవీ అనుమతిని విస్మరించడం వల్ల ఘట్‌బర్రా గ్రామస్తులకు ఇచ్చిన సాముదాయక అటవీ హక్కుల గుర్తింపు తప్పు అని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, సాముదాయిక అటవీ హక్కుల పట్టా మైనింగ్ కార్యకలాపాలకు అడ్డంకిగా మారుతోందని ఫిర్యాదు చేసింది. ఇందుకు జిల్లాస్థాయి కమిటీ అంగీకరించి, 2016 లో సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను రద్దు చేసింది. హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి ఈ రద్దును హైకోర్టులో సవాలు చేసింది” అని ఆ ప్రకటన తెలిపింది.

చెల్లుబాటు అయ్యే అటవీ అనుమతి పొందడానికి తప్పనిసరి అవసరమైన ఘట్‌బర్రా అటవీ భూమిని మైనింగ్ కోసం మళ్లించడానికి అనుకూలంగా ఉన్న ఒకే ఒక్క గ్రామ సభ తీర్మానాన్ని కూడా మైనింగ్ కంపెనీ ఇప్పటివరకు సమర్పించలేకపోయిందని అది నొక్కి చెప్పింది.

తెలుగు: పద్మ కొండిపర్తి

https://www.downtoearth.org.in/forests/high-court-order-on-adani-operated-mine-a-mockery-of-forest-rights-act-hasdeo-activists

Leave a Reply