(ఇటీవల విడుదలైన తాయమ్మ కరుణ కథల సంపుటి *విభజన రేఖ*కు రాసిన ముందుమాట)
రచయితగా కరుణ పాఠకులకి కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కథలు రాస్తోంది. ‘తాయమ్మ కథ’తో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన కరుణ, మొట్టమొదటి కథతోనే చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కథ పేరే ఇంటి పేరుగా మారిపోయి తాయమ్మ కరుణ అయ్యింది. ఇప్పటికే రెండు కథా సంకలనాలు ప్రచురించి ఉంది. విప్లవోద్యమం నేపథ్యంలో కథలు రాసిన తొలి తరం అజ్ఞాత విప్లవ మహిళా రచయితల్లో కరుణ కూడా ఒకరు.
నక్సల్బరి ఉద్యమం భారత ప్రజల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది దేశ స్వాతంత్రం పట్ల భ్రమలను పోగొట్టి, భారత సమాజాన్ని అర్థవలస-అర్థభూస్వామ్య సమాజంగా విశ్లేషించింది. శాంతియుత మార్పులతో కాదు, కార్మిక-రైతాంగ నాయకత్వంలోని దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సాధ్యమని ప్రకటించింది. కామ్రేడ్ చారు మజుందార్ నేతృత్వంలో ఈ ఉద్యమం భూ సమస్యకే పరిమితం కాకుండా ప్రజల రాజ్యాధికార లక్ష్యంగా ముందుకు సాగింది.
ఈ ఉద్యమం మహిళల త్యాగాలతోనే ప్రారంభమైంది. 1967 మే 25న నక్సల్బరిలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది మహిళలతో సహా 11 మంది అమరులయ్యారు. నక్సల్బరి ఉద్యమంలో మహిళలు గ్రామ స్థాయి పోరాటాల్లో ముందుండి, ఉద్యమాన్ని సజీవంగా నిలిపారు. అయితే విప్లవోద్యమంలో వారి పాత్ర ప్రధానంగా సహాయకారిగా మాత్రమే ఉంది. నేరుగా ఉద్యమంలో పనిచేసిన మహిళల సంఖ్య తక్కువే. నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలను తీవ్రంగా అణచివేసాకా ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో మళ్ళీ పోరాటాలు రాజుకున్నాయి. దండకారణ్యాన్ని విప్లవోద్యమానికి వ్యూహాత్మకంగా అనువైన ప్రదేశంగా గుర్తించిన అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ 1980లో 35 మంది సభ్యులను (సాయుధ దళాలుగా) దండకారణ్యానికి పంపింది.
దండకారణ్యంలోనూ, తూర్పు కనుమలలోనూ (విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) ఆదివాసీ సమాజంపై విప్లవోద్యమ ప్రభావం ఎంతో లోతుగా వుంది. మహారాష్ట్రలోని గఢ్చిరోలి, గోండియా జిల్లాలలోనూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోనూ, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లోనూ, ఒరిస్సాలోని మల్కన్గిరిలోనూ అధికశాతం ఆదివాసులు గోండులలో ఉపజాతికి చెందినవారు – మాడియా, మురియా, ప్రధాన్, దొర్ల లేదా రాజగోండ్. ఆయా తెగల్లోని ఆచారాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఇవి పితృస్వామ్య సమాజాలు. ఉత్పత్తిలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. వాళ్ళు పొలాల్లోనూ, ఇళ్ళల్లోనూ ఎన్నో గంటలు శ్రమిస్తారు, కానీ సంప్రదాయంగా మహిళలకి భూమిపై హక్కు లేదు. వాళ్ళకి సామాజిక హక్కులు కూడా ఏమీ లేవు. అసలైన సంప్రదాయాల్లో వాళ్ళు పాల్గొనకూడదు. సామూహిక నిర్ణయాలు, చర్చలలో వాళ్ళ పాత్ర నామమాత్రం. మహిళలు భూమిని దున్నవచ్చు, పంటని కోయవచ్చు, కానీ పంట నూర్పిడిలో పాల్గొనకూడదు. ఇంకా చెప్పాలంటే నూర్పిడి కల్లంలోకి వాళ్ళు అడుగుకూడా పెట్టకూడదు. కుటుంబ ధాన్యాగారంలోకి బాలికలు వెళ్ళకూడదు. బహిస్టు సమయంలో వాళ్ళు ఊరి బయట గడుపుతూ ఎవరి కంటా, ప్రత్యేకించి పూజారుల కంట పడకూడదు. యువతీ, యువకుల పెళ్ళి నిర్ణయించే అధికారం కుటుంబానికి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయంతో అమ్మాయి ఏకీభవించకపోతే ఆమెను బలవంతంగా అత్తగారింటికి పంపిస్తారు. అందుకు ఆమె ప్రతిఘటిస్తే అమానవీయంగా కొట్టి, వేటాడి చంపిన పశువుని కర్రకి కట్టి మోసుకెళ్ళినట్లు ఆమెను కట్టి తీసుకెళతారు. కొన్ని ప్రాంతాలలో యువకులు అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. మహిళ చేసే శ్రమ విలువైనది కాబట్టి బహుభార్యాత్వం సాధారణ విషయం. వివాహానికి ముందు శృంగారాన్ని ఆదివాసీ సమాజం నిషేధించకపోయినప్పటికీ పెళ్ళికాని యువతి గర్భవతి అయితే చిన్నచూపు చూస్తారు. గఢ్చిరోలి వంటి ప్రాంతాలలో మాడియా జాతిలో పెళ్ళి అయిన యువతి రవిక వేసుకోగూడదన్న ఆచారాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇతర ప్రాంతాలలో కూడా ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తరువాత మహిళలు రవిక వేసుకోకపోవటం సాధారణ విషయం. అడవిలోకీ, ఆదివాసీ గ్రామాలలోకీ వచ్చే కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులూ, సెటిలర్లూ, పోలీసులూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులూ ఆదివాసీ మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లైంగికంగా ఉపయోగించుకుని వదిలిపెట్టిపోతారు. బయటివాళ్ళు ఆదివాసీ సమాజాన్ని విశృంఖల సమాజంగా భావించి వారిని వేశ్యలుగా చూసే హక్కు ఉందని అనుకుంటారు.
1980 నుంచి దండకారణ్యం అడవులలోకి మునుపటి సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్‌వార్) దళాలు ప్రవేశించటం మొదలయిన నాటినుంచి ఈ పితృస్వామ్య ఆచారాలు, పద్ధతులను వ్యతిరేకించసాగారు. అడవిమీద హక్కుకోసం పోరాటాలు మొదలుపెట్టటంతో వాళ్ళు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. నడి వేసవిలో సేకరించే బీడీ ఆకుల ధరలు పెంచాలని పోరాడటంతో మహిళల విశ్వాసాన్ని కూడా పొందారు. బీడీ ఆకులు సేకరించేది ఎక్కువగా మహిళలే కాబట్టి వాళ్ళు పోరాటాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ మహిళలు తమ పై అమలవుతున్న పితృస్వామ్య అణచివేత గురించి కూడా తమను కలవడానికి వచ్చే విప్లవకారులకి పాటల ద్వారా చెప్పుకోసాగారు. ఆయా సమస్యలను నెమ్మదిగా విప్లవోద్యమం చేపట్టటం మొదలయ్యింది.
బయటివాళ్ళు ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నప్పుడు దళాలు వారిని ప్రజల ముందు నిలబెట్టి వివిధ రకాలుగా శిక్షించిన ఫలితంగా పోరాట ప్రాంతంలో లైంగిక దోపిడీ ఘటనలు గణనీయంగా తగ్గిపోయాయి. పోలీసు అణచివేత మొదలయ్యి విప్లవ శక్తులు, వారి పోరాటాలు వెనక్కి తగ్గినప్పుడు పోలీసులను ఎదుర్కొంటూ ఉద్యమాన్నీ, సంఘాన్నీ సజీవంగా ఉంచే విధానాలను మహిళలు నేర్చుకున్నారు. ఈ అనుభవాలన్నింటిలోంచి క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన (కెఎఎంఎస్) పుట్టింది. విప్లవోద్యమంలో నేరుగా పాల్గొనే యువతుల సంఖ్య పెరిగింది.
సరిగ్గా ఈ నేపథ్యంలో రచయిత కరుణ తెలంగాణలో డిగ్రీ చదివి మార్క్సిజం పరిచయంతో సమాజాన్ని చదవడానికే కాక దాన్ని మార్చాలనే పట్టుదలతో విప్లవోద్యమంలోకి అడుగుపెట్టింది. అప్పటికే విప్లవోద్యమంలో భాగంగా ఉన్న మఠం రవికుమార్ సహచరి అయ్యింది. రవి రచయిత కూడా కావడం వల్ల ఇద్దరికీ బాగా జత కుదిరింది. ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొంది రచనలు చేశారు. వారిద్దరి ప్రయాణం హైదరాబాదు నుండి నల్లమల మీదుగా దండకారణ్యానికి సాగింది. అక్కడి నుండీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతానికి నల్లమల కేంద్రంగా వారి ప్రస్థానం సాగింది. ఈ విప్లవ జీవితంలో భాగంగా విప్లవోద్యమంలోని ఎన్నో అంశాలను తీసుకుని కరుణ వాటిని కథలుగా మార్చింది. విప్లవోద్యమ జీవితాన్ని గురించి బయటి పాఠకులకి సునిశితంగా పరిచయం చేసింది. విప్లవ రచయిత్రులు చేసిన సాహిత్య సృజనలో చాలా ముఖ్యమైన భాగాన్ని సృష్టించిన ప్రధానమైన రచయితల్లో కరుణ ఒకరు. రేణుక (మిడ్కో), షహీదా, కరుణ, నిత్య, మైనా, సుజాత, జీవని వంటి రచయితల కథల వల్లనే విప్లవోద్యమంలో మహిళల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో పాఠకులకి తెలిసింది.
ముఖ్యంగా కరుణ కథల్లో మనకు దళ జీవితానికి సంబంధించిన అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. తన మొత్తం విప్లవోద్యమ జీవితంలో ఒక దశాబ్దకాలంపాటు గెరిల్లా జీవితం గడిపింది. ఆ అనుభవ నేపథ్యంలో వాటిని మహిళా కోణం నుండి తన విమర్శనాత్మక దృష్టికోణం నుండి పరిశీలించి రాస్తుంది. తాను ఎలాగైతే నిర్మొహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడుతుందో ఈ కథల్లో పాత్రల పట్ల కూడా అలాంటి దృష్టికోణంతోనే ఉంటుంది. ఒక మధ్యతరగతి నేపథ్యం నుండి చదువుకున్న పట్టణ ప్రాంత అమ్మాయిగా వెళ్ళి విప్లవోద్యమాన్ని పరిశీలించిన కళ్ళతో మనకు ఈ కథల ద్వారా అక్కడి జీవితాన్ని పరిచయం చేస్తుంది. మొట్టమొదట దళ జీవితాన్ని పరిచయం చేసిన కథలు మనకు ఎనభయ్యవ దశకం చివరిలోనూ తొంభయ్యవ దశకం ప్రారంభంలోనూ వచ్చాయి. అవి ప్రధానంగా పురుష రచయితలు రాసినవే. అప్పటికి విప్లవోద్యమంలో మహిళలు ప్రవేశించినా వారి సంఖ్య తక్కువగా ఉండటం, వారు ఇంకా కథలు రాయడం మొదలుపెట్టకపోవడం వల్ల మనకు మహిళా కోణం నుండి వచ్చిన కథలు కొంత ఆలస్యంగా అంటే తొంభైల మధ్య కాలం నుండి మొదలయ్యాయి. అయితే అప్పుడు కూడా నిత్య, సుజాత, ఎల్లంకి అరుణ, కరుణ లోపలి పత్రికల్లోనే ఎక్కువగా రాయడం వల్ల ఆ కథలు దండకారణ్యం నుండి వెలువడే ‘పోరు మహిళ’, తరవాతి కాలంలో నల్లమల నుండి కొంతకాలం పాటు వెలువడిన ‘విప్లవ మహిళ’, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా నుండి వెలువడే ‘విప్లవి’, ‘తూర్పు కనుమ’ వంటి అజ్ఞాత పత్రికల్లోనే ఎక్కువగా ప్రచురితమయ్యాయి. ఈ కథలు అరుణతారలో ప్రచురితంకావడం మొదలుపెట్టాక కానీ బయటి పాఠకులకి అందలేదు. విరసం వాటిని అనేక రకాలుగా (దండకారణ్య సంకలనాలు, వియ్యుక్క సంకలనాలు) ప్రచురించడం మొదలుపెట్టాకా మరింత విస్తృతంగా ఈ కథలు ప్రజల్లో ప్రచారం అయ్యాయి.
కరుణ 1996-2007 వరకూ (అటూ ఇటూగా) ఒక దశాబ్దకాలం పాటు సాగిన తన దళ జీవితంలో తన స్వానుభవంలో జరిగిన ప్రధాన ఘటనలను, పరిశీలనలను కథలుగా మలిచింది. తాను సమాజంలోని అనేక సమస్యల మీద కథలు రాసినప్పటికీ కూడా విప్లవోద్యమంలోని గెరిల్లా జీవితం గురించి రాసినవి చాలా ముఖ్యమైనవి. తన కథలను గతంలోనే రెండు విడతలుగా సంకలనం చేసింది. ఆ వరుసలో ఇది మూడవది. ఇందులో ప్రధానంగా దళజీవితం నేపథ్యంలోని కథలే ఎక్కువగా ఉన్నాయి.
ఆదివాసీ జీవితంలోని రీతి రివాజులు వాటిలోని పితృస్వామిక అణచివేతకు సంబంధించిన అంశాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా వివాహిత మాడియా మహిళలు జాకెట్టు వేసుకోవడంపై ఉండే ఆంక్షలు, పార్టీ ఆ మహిళలకు జాకెట్లు పంచడం విషయ వస్తువుగా ‘జాకెట్టు…సోకా!’ కథ రాసింది.
విప్లవకారుల్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? వాళ్ళు తమ సహచరులని ఎలా ఎంచుకుంటారు తదితర విషయాలను చాలా విపులంగా చర్చిస్తుంది ‘పెళ్లి’ కథ. పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తయితే పెళ్లయ్యాక వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో పని చేస్తుంటే కలుసుకోవడం ఎంత సమస్యనో చెప్పే కథ ‘ప్చ్!’. మహిళలుగా ఎదుర్కొనే సమస్యల్లో అతి ముఖ్యమైనది పీరియడ్స్ సమస్య. మామూలు సమాజంలోనే ఇంట్లో ఉండేవాళ్ళకి ఒకలాంటి సమస్య అయితే చదుకోవడానికో ఉద్యోగం చేయడానికో, బయట పనులకో వెళ్ళే మహిళలు ఆయా స్థల కాలాలను బట్టి ఆ సమయంలో అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారు. కానీ అజ్ఞాత జీవితం అందునా నిత్యం కదలికలో ఉండే దళ జీవితం, అనుక్షణం ప్రమాదం పొంచి ఉండే యుద్ధరంగంలాంటి వాతావరణంలో పీరియడ్స్ సమస్యను ఎదుర్కోవడం ఎలా ఉంటుందో మామూలు సమాజంలో బతికే వారి ఊహకు అందనిది. ‘బలహీనులు?’ కథ ఆ విషయాన్ని చర్చిస్తుంది. నిజానికి ఇందులోని మరో కోణం పీరియడ్స్ బాధలు అనుభవంలోకి రాని పురుషులు ఆ సమస్యను ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళకి ఎలా అర్థం చేయిస్తారు? పురుషాధిపత్య భావజాలాన్ని ఇంకా పూర్తిగా వదిలించుకోని వాళ్ళకు ఆ విషయం అర్థం అయ్యే అవకాశం వచ్చి ఉంటే అది ఎలా ఉండి ఉంటుంది! ఇవన్నీ ఆ కథలో చక్కగా చిత్రిస్తుంది. అంతే కాదు నిజంగా మహిళలు గెరిల్లా యుద్ధంలో వీరోచితమైన పాత్ర పోషించగలుగుతారా? వాళ్ళకి అంత శక్తి ఉందా? ధైర్యం ఉందా? అని చాలా మందికి వచ్చే సందేహాలను ఈ కథల్లోని, దేవే, రీతూ, సుగుణ, సంధ్య వంటి వారు తమ ఆచరణతో నివృత్తి చేస్తారు. అంతే కాదు సామాన్య ప్రజలు సైతం అనన్య ధైర్య సాహసాలతో గెరిల్లాలను కాపాడుకోవడం కూడా కనిపిస్తుంది. విప్లవకారుల ప్రాణాలను కాపాడడానికి తన పిల్లల ప్రాణాలను, పసి బిడ్డ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడం చాలా ఉద్వేగపరుస్తుంది.
ఈ కథల్లోని ఇతివృత్తాల కంటే కూడా వాటితోపాటు పూసల్లో దారంలాగా వుండే గెరిల్లా జీవిత చిత్రణ చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే ఇవి ఒక రకంగా వాస్తవాలను కథనా పద్ధతిలో చెప్పడమే. ఇందులోని పాత్రలకి చాలా వాటికి వాడిన పేర్లు కూడా కల్పించినవి కాదు. వారు అమరులయిన సందర్భంలో కథ చివరన రాసిన వివరాల వల్ల కానీ విప్లవోద్యమ సానుభూతిపరులుగానో ఉద్యమంతో దగ్గరి సంబంధాల వల్లనో ఇందులోని పాత్రల్లో మనకు తెలిసిన మనుషులను చాలా మంది పోల్చుకోగలుగుతాం.
గెరిల్లా జీవితంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో ఈ కథలు చదివినపుడు మనకి అనుభవంలోకి వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం కాకపోయినా, పొరపాటు అంచనానో, మరో పది నిమిషాల్లో బయలుదేరేస్తాం కదా అనో కొంత అలసత్వం వహించినపుడు ఎంత పెద్ద నష్టం జరిగిపోగలదో చదివినపుడు రోమాలు నిక్కపొడుచు కుంటాయి. హృదయం భారమైపోతుంది.
ప్రజలతో కలిసిపోవడం అంటే వారి ఆహారపుటలవాట్లను మనవిగా చేసుకోవడం కూడా. ముఖ్యంగా సాంస్కతికంగా ఒక ప్రాంతీయతను బట్టి, మతాచారాలను బట్టి, అగ్రకుల నేపథ్యాల నుండి వదుల్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు మాత్రమే కాక అలవాటు చేసుకోవలిసిన అలవాట్లు కూడా అంతకన్నా ముఖ్యమే. గొడ్డుమాసం తినడం కూడా అలాంటి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. ఈ ఆహారపుటలవాట్లు ప్రజల మధ్య లేవదీసే గోడలను గురించి కూడా ఈ కథల్లో తెలుసుకుంటాం. అవి ఒకే కుటుంబాల వారిని కూడా వేరు వేరు కులాల వారీగా మార్చడానికి దారితీసిన పరిస్థితులు, సనాతన ధర్మ ప్రచారకులు ఆ పనిని ఎంత నైపుణ్యంగా చేయగలుగుతున్నారో వాటిని ఎదుర్కోవడానికి విప్లవకారులు ఎంత తెలివిగా వ్యవహరించాల్సి వస్తుందో చర్చించిన కథలో “అసలు కులాలు ఇలాగే ఏర్పడ్డాయేమో!” అని కరుణ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.
ఎప్పుడో ఒకసారి ఏ రాష్ట్ర కమిటీ సమావేశాల కోసమో ఒకే దగ్గర ఎక్కువ కాలం ఉండగలం అనుకున్నప్పుడు చొరవ చేసి ఎవరన్నా కొన్ని పిండి వంటలు చేస్తే అవి తినే లోపే పోలీసుల దాడి జరిగి ఎక్కడివక్కడ వదిలిపెట్టి తప్పుకోవాల్సి వచ్చినపుడు ఉసూరుమనిపించక మానదు. నోటి వరకూ వచ్చిన తిండి నోటి లోపలికి పోయెవరకూ గ్యారెంటీ లేని జీవితం కదా అనిపించకమానదు. అలాగే సుదీర్ఘ ఎడబాటు తరవాత కలిసిన జంట ఒక్కరోజైన కలిసి గడపలేకపోవడం కలిసీ కలవక ముందే మళ్ళీ విడిపోవాల్సి రావడం గుండెని పిండేస్తుంది. ఇన్ని రకాలైన సంక్లిష్టతలను, అనుక్షణం పొంచి ఉండే ముప్పునూ, ఎంతో శారీరక కష్టం, మానసిక వత్తిడి ఇవన్నిటితో కూడా ప్రజల కోసం పనిచేసే విప్లవకారుల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగిస్తాయి ఈ కథలు.
ఎంతో ఇష్టంగా జీవితాన్ని పంచుకున్న జంటల్లో సహచరులను కోల్పోయిన దుఃఖం మాత్రం అలవికానిది. ఆ లోతుల్ని కొలవడానికి ఏ కొలమానాలు సరిపోవు. అలాంటి అంతులేని దుఃఖాన్ని కరుణ కూడా మోయవలిసి వచ్చింది. తన సహచరుడు రవి (కవి, మంజీర) అమరుడైనప్పటి ఉద్వేగాన్ని కథగా ఇక్కడ చదువుతాం. అందుకే దానిని ‘కథ గాని కథ’ అంటుంది కరుణ. నిజానికి ఇందులో ఉన్నవి శిల్ప రీత్యా కథలే. అంతకు మించి జీవితాలు. కథ అంటే “ఒక వాస్తవాన్ని చెప్పడానికి చేసే కల్పన” అని అందుకే అంటారు. ఆ రకంగా ఇవి భారత సమాజంలోని ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగి జీవితాన్ని మనకి చెప్పడానికి చేసిన కల్పనలు. ప్రముఖ రచయిత అల్లం రాజయ్యగారు చెప్పినట్టు ఇవి కట్టు కథలు కావు పుట్టు కథలు.
అంతే కాదు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన కరుణకు గ్రామీణ జీవితంలోని అన్ని సాధక బాధకాలు, వ్యవసాయ కుటుంబాల్లోని ఆర్థిక సాంస్కృతిక జీవనంతో ఉన్న లోతైన బంధం చాలా అద్భుతంగా కథల్లోకి ప్రవహించింది. గ్రామీణ వ్యవసాయ కుటుంబాల్లోని జీవన సంక్లిష్టతల గురించి చెప్పే కథలు ఈ సంకలనంలో కూడా ఉన్నాయి. ‘ఏం జరిగింది’, ‘పాప భరోసా’ ఈ కోవలోనివే. చిన్నప్పటి నుండే మగపిల్లల్లో వ్యక్తమయ్యే పురుషాధిపత్యపు ధోరణిని సాధారణంగా తల్లిదండ్రులు కూడా పెంచిపోషిస్తుంటారు. కానీ పట్టణ మధ్య తరగతిలోని అలాంటి ఒక చిన్న కుటుంబంలోని తల్లి పిల్లవాడిలో వ్యక్తమయిన ‘మగబుద్ధి’ని గ్రహించి మొక్కలోనే కఠినంగా తుంచేసే ప్రయత్నం చాలా హృద్యమైన కథగా రూపొందింది.
ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి. అది కరుణ శైలి గురించి. చాలా సరళంగా సూటిగా మాత్రమే కాకుండా ప్రజల నిత్య జీవితంలోని వ్యక్తీకరణ, ఆర్ద్రత, సంక్లిష్టతలతో కూడిన భావావేశాలతో ఆయా ప్రాంతీయతలోని సాధారణ ప్రజల భాషతో, మట్టిపరిమళాలు వెదజల్లే సంభాషణలు ఈ కథలకు ఒక అదనపు అందాన్ని చేకూరుస్తాయి. అంతే కాదు పాత్రల చిత్రణలో కూడా నిజాయితీ కనిపిస్తుంది. పాత్రలన్నీ అద్భుతమైన మనుషులుగా అసలు వంక పెట్టడానికి వీల్లేని అపూర్వ మానవులుగా కాకుండా వారి లోపాలను కూడా చిత్రిస్తుంది. సమాజాన్ని మార్చాలనే ఉన్నత ఆశయంతో విప్లవోద్యమానికి రావడం వల్ల ఆ మేరకు వారు తప్పక ఉన్నతమైన భావాలను కలిగినవారే అయినా విప్లవోద్యమంలో చేరిపోగానే సమూలంగా మారిపోవడానికి మంత్రదండాలు ఏమీ వుండవు. ఆమేరకు ఘర్షణ పడాల్సిందే. అన్యవర్గ భావజాలాలను, పితృస్వామ్య ధోరణులను, బలహీనతలను వదుల్చుకోవాల్సిందే. ఉన్నత మానవులుగా తీర్చిదిద్దుకొనే క్రమం అది. ఆ క్రమాన్ని నిజాయితీగా చిత్రిస్తుంది కరుణ. ఆయా పాత్రలకు సంబంధించిన తెలుపు నలుపులను కాక ఆయా పాత్రలను అనేక ఛాయలలో చిత్రిస్తుంది.
అలాగే మరొక్క విషయం కూడా చెప్పుకోవాలి. కరుణ రాసిన విప్లవోద్యమ కథలకు సంబంధించిన ఘటనా కాలం కూడా కొన్ని కథల్లో మనకు అర్థం కాదు. కొన్ని కథలను తాను దండకారణ్యం నుండి వచ్చేసిన తరవాత ఎన్నో యేళ్ళకి రాసింది. అంటే కొన్ని కథలు 2019, 2022 కాలంలో రాసింది. తాను రాసిన కథల ఘటనా కాలం అంతకు కనీసం రెండు దశాబ్దాల ముందు కాలానికి చెందినవి. ఆ ఘటనా కాలం ఎప్పుడనేది ఆ కథలు చదివే పాఠకులకి అర్థం కాదు. మరికొన్ని సమకాలీన రాజకీయ చారిత్రక అంశాల ప్రస్తావన, లేదా చిత్రీకరణ ద్వారా ఆ కాలాన్ని సూచించవచ్చు. ముఖ్యంగా ఈ కథలు విప్లవోద్యమ చరిత్రని నమోదు చేస్తున్నాయి. అందువలన కూడా ఆ రకమైన జాగ్రత్తను కూడా తీసుకొని ఉంటే ఇంకా ఎంతో ఉపయోగంగా ఉండేది. కథలను ఒక చారిత్రక స్థలకాలాల్లో చెప్పడం కూడా రచయితల బాధ్యతే. అప్పుడు ఆ కథల స్థాయి కూడా పెరుగుతుంది.
కరుణ మరెన్నో కథలు రాయగలదు, రాస్తోంది కూడా. ఈ ప్రత్యేకమైన కథలు మనకి అందించినందుకు తనకి పాఠకుల తరుఫున కూడా అభినందనలు.
జనవరి 2026




