తెలంగాణలో కాల్పుల విరమణ కోసం ప్రజలతో, ప్రభుత్వంతో సంభాషణ
ప్రజలు శాంతిని కోరుకుంటున్న కాలం ఇది. సమాజం ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలు చర్చనీయాంశం అవుతాయి. వాటికి అర్థవంతమైన పరిష్కారాలు దొరుకుతాయి. కానీ శాంతి, సామరస్యం నానాటికీ అడుగంటిపోతున్నాయి. హింస, విద్వేషం లెక్కలేనన్ని రూపాల్లో పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులుగా మంచి సమాజం కోసం ప్రయత్నించిన మేము ఇప్పుడున్న ఈ స్థితిని గ్రహించాం. దీన్ని మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు తోడు నిలబడాలని అనుకున్నాం. యుద్ధాలు ఉన్నంత కాలం శాంతి ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు దేశాల మధ్య, దేశాల లోపలా దురాక్రమణ యుద్ధాలు సాగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కోటానుకోట్ల మంది ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. శాంతి ఒక పోరాట నినాదంగా మారింది.