ప్రయత్నం
దుర్గమ్మ గుడి ముందు - ఇందిరమ్మ ఎస్.టి. కాలనీలో ఆరోజు గ్రామసభ జరుగుతోందని, ఒకరోజు ముందే దండోరా కొట్టడం వల్ల, జనం అక్కడ గుమిగూడి పోయారు.మధ్యాహ్నం మూడు దాటింది. ఎండ చుర్రుమంటోంది. ఆ పంచాయతీలో ఉపాధిహామీ పనుల్ని పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్ రమణ వేపచెట్టు నీడలో చాపపరిచి కూర్చుని ఉన్నాడు. రెండు పాతచాపలు ఒకదాని పక్కన ఒకటి పరచబడి ఉన్నాయి. ఆ రెండు చాపల చుట్టూ నాలుగు ఇనుప కుర్చీలు, రెండు ప్లాస్టిక్ కుర్చీలు పహారా కాస్తున్నట్లు ఉన్నాయి. చాపపైన తెల్లకాగితాలు, గ్రామసభ రిజిష్టరు, హాజరు పట్టిక, ఇంక్ ప్యాడ్, ప్లాస్టిక్ సంచిలో కొన్ని అర్జీలు రమణ ముందుపేర్చబడ్డాయి.