మార్చి 23 భారతదేశ చరిత్రలో మరువలేని రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ నేలకొరిగి 95 ఏళ్ళు నిండాయి.ఈ సందర్భంగా వారిని స్మరించుకోడంతో పాటు వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశాన్ని‌  కుల,మత,జాతి వివక్షలకు తావులేకుండా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లే సార్వసత్తాక దేశంగా నిర్మించుకోవాల్సిన బాధ్య‌త‌ ఈ దేశ యువతీ యువకులపై, విద్యార్థులపై ఉంది. క్రీ.శ 1608 లో బ్రిటన్ కు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో మన దేశ ప్రజలు అనేక కష్టాలు పడ్డారు.మన దేశ ప్రజలను బానిసత్వంలో నెట్టి బ్రిటిష్ పాలకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు‌. అది సహించని మన దేశంలోని ఎందరో యువతీయువకులకు  బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ దేశ స్వాతంత్ర్యంకై పోరాడుతూ అమరులయ్యారు.ఈ పోరాటంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు  హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నౌజవాన్ భారత్ సభ వంటి సంస్థల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ వలస వాదుల చేత కుట్ర కేసులు మోపబడి జైలు జీవితం గడపడంతో పాటు తమ ప్రాణాలను త్యాగం చేశారు.1927లో ఏర్పాటు చేయబడిన సైమన్ కమిషన్‌లో భారతీయ ప్రతినిధులు లేకపోవడం, బ్రిటిష్ వలసవాదుల నిర్లక్ష్య పాలనను ఈ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ “సైమన్ గో బ్యాక్” నినాదంతో దేశవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు జరిపారు.ఈ సందర్భంగా లాహోర్‌లో లాలా లజపతిరాయ్ నేతృత్వంలో జరిగిన నిరసనపై పోలీసులు దాడి చేయగా, ఆయన గాయపడి 3 వారాల తర్వాత మరణించారు. ఈ సంఘటణతో తీవ్రంగా చలించిపోయిన భగత్ సింగ్, రాజ్‌గురు,సుఖ్‌దేవ్ లు లాలా ల‌జపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటషు పోలీసు అధికారి జేమ్స్ స్కాట్‌ను చంపి ప్రతికారము తీర్చుకోవాలని, ఆ క్రమంలో మరో బ్రిటిష్ అధికారి సాండర్స్‌ను కాల్చి చంపి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (పార్లమెంట్) పై పొగ బాంబులు విసిరి, బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికీ హాని తలపెట్టకుండా స్వాతంత్ర్య‌ నినాదాలు చేస్తూ పట్టుబడ్డారు. సాండర్స్ హత్య కేసు మరియు పార్లమెంటు దాడి వంటి కారణాలను చూపి  23 మార్చి, 1931 నాడు బ్రిటిష్ పాలకులు  భగత్ సింగ్, సుఖ్ దేవ్,రాజ్ గురులను ఉరి తీశారు.ఈ ముగ్గురు వీరుల ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్య పోరాటం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడింది.భగత్సింగ్ మరియు ఆయన సహచరులను ఉరితీశారని తెలుసుకున్న ఈ దేశ వాసులు స్వాతంత్ర్య పోరులో కదం తొక్కారు.వారి అమరత్వం అనంతరం జరిగిన దేశ ప్రజల స్వాతంత్ర్య పోరాటం ఎట్టకేలకు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల మెడలు వంచి దేశానికి విముక్తి కల్పించగలిగింది. ఈ ముగ్గురినీ ఉరితీసిన మార్చి 23 ను ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవం(షహీద్ దివస్)గా ఈ దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. అంతటి గొప్ప పోరాట యోధులు భగత్ సింగ్ .. సహచరుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటాల్సిన మన పాలకులు భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల నుండి ఈ ఏడాది తొలగించారు.ఆయన ఏ మూడో నమ్మకాలను వ్యతిరేకించాడో ఆ పాఠ్యాంశాలను నేడు విద్యార్థుల పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు.మనువాద భావజాలాన్ని అమలుచేయడం కోసం విద్య కాషాయికరణ చేస్తున్నారు, మనువాద భావజాలంతో బహుజన సంస్కృతిని కూడా కాషాయికరిస్తున్నారు. కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, పురాణాలు సిలబస్ లో చేరుస్తూ మూడోనమ్మకాలను సుస్థిరం చేస్తున్నారు. భగత్ సింగ్ సమాజంలో అంతరాలు పోవాలని, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై, ఒక దేశం మరో దేశంపై ఆధిపత్యం చేయకూడదని అన్నాడు.

నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం మరో దేశంపై యుద్దం చేయడం, ఆక్రమించుకోవడం పెగరిగింది.ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ కాంక్ష ప్రపంచ వ్యాప్తంగా కోరలు విప్పుతోంది. వెనిజూల, ఇరాన్, పాలస్తీనా వంటి తదితర దేశాలపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా యుద్ధం చేస్తూ ఆయా దేశాల సౌర్వభౌమనత్వాన్ని కాలరాస్తూ ఆక్రమించుకుంటున్నారు. వేల మంది చిన్నారులను చంపుతున్నారు.లక్షల మందిని నిరాశ్రయులుగా మార్చుతున్నారు. ఈ యుద్ద నేపథ్యంలో ఈ సారి భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల వర్థంతి రోజైన మార్చి 23 ను సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా జరుపుకోవడం సమంజసంగా ఉంటుంది.

భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ లు ఇండియా స్వాతంత్ర్యం పొందిన అనంతరం రిపబ్లిక్ దేశంగా ఏ ఇతర దేశాల ఆధిపత్యం లేకుండా సార్వభౌమాధికారాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోని ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో విలసిల్లాలని పేదరికం, దోపిడీ నశించాలని ఆకాంక్షించారు.కానీ నేడు మన దేశ పాలకులు వారి సొంత ప్రయోజనాల కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికా,రష్యా, ఇంగ్లాండ్,చైనా తదితర దేశాలపై ఆధారపడుతూ ఆర్థిక సహకారం (అప్పులు), వాణిజ్యం, వ్యాపారం, టెక్నాలజీ సహకారం పేరుతో సామ్రాజ్యవాద దేశాలకు లొంగిపోయి ఉండటం నేడు మనం చూస్తున్నాము. ప్రపంచ వాణిజ్య సంస్థ  నియమాలు మన దేశంలో అమలుచేస్తూ ఇక్కడ విదేశీ కంపెనీలు,వ్యాపార సంస్థలు నెలకోల్పేందుకు అవకాశం ఇస్తున్నారు. మన దేశ సహజ సంపదలు మరియు మన దేశ రైతాంగం కష్టపడి పండించే పంటలు అతి చౌకగా విదేశాలకు ఎగుమతి చేస్తూ మన దేశ ప్రజల సంపదను కొల్లగొడుతున్నారు. విద్య, వైద్యం తదితర సేవారంగాలను ప్రెవేటీకరించి విదేశీ వ్యాపార వర్గాలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అన్ని దేశాల కంటే ముఖ్యంగా అమెరికా మన దేశ సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీస్తోంది. ఆ దేశ అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో మాట్లాడుతూ ఇండియా -పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని అనడం,రష్యా నుండి చమురు నిల్వలు కొనడానికి అనుమతి ఇస్తున్నామనడం, మన దేశ వస్తువుల దిగుమతిపై సుంకాలు పెంచడం ఈ విషయాలపై మోడి సర్కారు మౌనం అమెరికా ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది.నిజానికి మన పాలకులు విదేశాల వద్ద మోకరిల్లుతోంది దేశ ప్రయోజనాలకై కాదు, కేవలం ఈ దేశంలో ఉన్న పిడికెడు మంది బడా పెట్టుబడిదారుల సేవకోసమే,వారి అధికారాన్ని నిలుపుకోవడం కోసమే.2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని చెప్తూ దేశంలో ఒక వైపు సామ్రాజ్యవాద కార్పోరేట్ శక్తులు జ్యోక్యాన్ని మరోవైపు బహుళ సంస్కృతి స్థానంలో హిందుత్వ భావజాలాన్ని అమలుచేయడం అంతిమంగా అమెరికా చెప్పుచేతల్లో విదేశీ – స్వదేశి దోపిడి దారుల “కార్పోరేట్ హిందుత్వ ” రాజ్యాన్ని స్థాపించేందుకు ఈ దేశ నేటి పాలకులు కృషి చేస్తున్నారు. ఈ దేశంలో నానాటికీ పెరుగుతున్న ఈ రకమైన ధోరణిని విద్యార్థి, యువజనులు తెలుసుకొని అసలైన దేశభక్తులుగా ఈ దేశ సహజ సంపదలు కాపాడాలి.మన దేశంపై విదేశాల ఆధిపత్యం ఇక ఎంతమాత్రం సహించకూడదు. మన దేశ గణతంత్ర్యాన్ని,స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో పోరాడాలి.అదే విధంగా భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ లకు భారత రత్న అవార్డు ప్రకటించాలి.భగత్ సింగ్ చరిత్రను NCERT, స్టేట్ సిలబస్ పాఠ్యాంశాలలో కొనసాగించాలి.ఇరాన్, పాలస్తీనా,వెనిజులా తదితర దేశాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దాడులు నిలిపివేయాలి. ప్రపంచ బ్యాంకు,ఐ.యం.ఎఫ్ లనుండి ఇండియా వైదొలగాలి.భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి. దేశంలో విద్య కషాయికరణ, సంస్కృతి కషాయికరణలను నిలిపివేయాలి.కుల వ్యవస్థను,మూడో నమ్మకాలను రద్దు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని,దేశంలో నానాటికీ పెరుగుతున్న డ్రగ్స్, గంజాయి వినియోగంను అరికట్టాలని ఉద్యమించాలి.

-ర‌చ‌యిత‌ ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్, కార్యదర్శి, 8712352122

Leave a Reply