ఇది కార్పొరేట్, ప్రభత్వాల కలయికలో
రాజ్యం కృత్రిమ శిశిరపు కాలానికి పురుడోసింది
ఇది కాగర్ శిశిరపు కాలం
ఇప్పుడు అడవిలో
యే ఆకు తనకు తానుగా చెట్టుని విడవడం లేదు
యే చెట్టు తనకు తానుగా ఆకుల్ని విడవడం లేదు
కొన్ని
రాజ్యపు మాయ మాటలకూ లోబడుతున్నాయి
కొన్ని బందీ అవుతున్నాయి
కొన్ని నేల రాలి
నెత్తుటితో మట్టిలో కలిసిపోతున్నాయి
మరి కొన్ని కాల్చి బూడిదవుతున్నాయి
ఇంకా కొన్ని మాత్రం
రాజ్యానితో చేతులు కలిపి
ద్రోహనికి మంచి ముసుగేసి
నేలరాలి బూడిదయ్యే వాటిని చూస్తూ
చెట్ల శివారున వున్న లేలేత ఆకులని సైతం
నేల రాల్చేలా చూస్తున్నాయి
ప్రస్తుతం రాజ్యం కలల్ని బంధించింది
ఇప్పుడు నడుస్తుంది కాగర్ శిశిరపు కాలం
ఇది దుఃఖాన్ని మిగిల్చే కాలం
ఇది విషాదాన్ని రెట్టింపు చేసే కాలం
ఇది కాగర్ శిశిరపు కాలమే కావచ్చు
అడవి ఎండి పోవచ్చు
చెట్లు మోడుబారి పోవచ్చు
కానీ
నేలరాలి అమరత్వం పొందిన
వారి ఆశయాలు, పోరాట మార్గం
అడవిలో చెట్లకి బలాన్ని అందిస్తూనే
భూమిని చిల్చుతూ పచ్చదనాన్ని కంటుంది
ఈ కాలం
వసంతాన్ని చేరుకోవడం కోసం చేసే పోరాట కాలం.




