ఇజ్రాయిల్ తో పొత్తు పెట్టుకుని అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ప్రపంచ ఆధిపత్యం కోసం కొన‌సాగిస్తున్న యుద్ధంలో భాగం. కాబట్టి ఇది అన్యాయమైన యుద్ధం. దీనికి ప్రతిఘటనగా ఇరాన్ చేస్తున్నా ఆత్మరక్షణ యుద్దం న్యాయమైనది. అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా మనం నిరసన తెలపాలి. మనం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. శాంతి కోసం అమెరికా ఇరాన్ తో మూడు రౌండ్ల చర్చలు జరిపింది. నాలుగో సారి చర్చలు జరగాల్సి ఉంది. ఈ లోపలే, ప్రపంచ ప్రజల మొదటి శత్రువు ఉగ్రవాద ఇజ్రాయిల్, అమెరికా సామ్రాజ్యం సంయుక్తంగా సైనిక దాడికి దిగాయి. సమావేశం జరుగుతున్నప్పుడు జరిగిన ఈ ఊహించని దాడిలో ఇరాన్ ఆధ్యాత్మిక నాయకుడైన ఆయాతుల్ ఖమేని, మిలటరీ చీఫ్ హ‌త్య‌కు గుర‌య్యారు.

ఈ దాడి అత్యంత అనైతికమైనది, అనాగరికమైనది. అహంకారపూరితమైనది , అదే సమయంలో పిరికి పంద చర్య. ఈ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లలపై కూడా బాంబులు వేసి చంపుతున్నారు. ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. పశ్చిమ ఆసియా మొత్తం కూడా తీవ్రమైన యుద్ధ నీడలో ఉంది.
“ఈ యుద్ధం ఇరానీయుల స్వేచ్ఛ, శాంతి కోసం అని ట్రంప్, నెతన్యాహు అంటున్నారు. ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ, శాంతి అందించటానికి వీరెవరు ?

తమ దేశంలో అమెరికా సామ్రాజ్యానికి సైనిక స్థావరాలు కల్పించేవారు, ఇతర దేశాల మీద నిఘా పెట్టటం కోసం తమ దేశంలో కార్యాలయాలు అనుమతించేవారు సార్వభౌమాధికారం కోసం గుండెలు బాదుకోవటం, ఏడవటం సిగ్గు చేటు. ఇదే సమయంలో ఇండియా మౌనంగా ఉండటాన్ని ఖండించాలి.

అమెరికా సామ్రాజ్యం ఏ దేశంపై యుద్ధం ప్రకటించినా , ఎక్కడ తిరుగుబాటు, కుట్రలు చేసి కీలు బొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా ఇలాంటి మాటలు చెప్పే సమర్థించుకుంటుంది. తమ వలస వాద , నయా వలస వాద ఎత్తుగడలను కప్పిపుచ్చుకోవడానికి చేసే కపటపూరిత, హేయ‌మైన వాదన ఇది. అమెరికా సామ్రాజ్య చరిత్ర పరిశీలించినట్లైతే ఇలాంటి చర్యలు అనేకం కనిపిస్తాయి. గతంలో వెనిజులా విషయంలో ఇలాంటి హేయ‌మైన మొహం కనిపించింది. ఇప్పుడు ఇరాన్ లో కనిపిస్తున్న‌ది.

ఇక్కడ శాంతి కోసం విలపించ‌టానికి చోటు లేదు. అమెరికా తుపాకీ గురిపెట్టినప్పుడు ఎవరైతే సంతకం చేయటానికి నిరాకరిస్తారో వారిపై దాడి చేసి లొంగదీసుకుంటుంది. ఇదే వారి విధానం. కుట్ర, మోసం , అనైతికతలే లక్షణాలుగా ఉన్న ఈ దురాక్రమణ దారులను ఒంటరి చేయాలి. వారిని కట్టడి చేసి , అంతిమంగా వారి వినాశనానికి మార్గం వేసేలా నిరసనలు, ఇతర విషయాలను ప్లాన్ చేసి నిర్వహించాల్సిన సమయం ఆసన్న మయినది. ఈ దిశగా కేరళలో, ఇండియా లో ఏం చేయగలం?

ప్రజాస్వామ్య , ప్రగతిశీల , విప్లవ శక్తులు , వ్యక్తులు తమ బాధ్యతను నిర్వర్తించాలని మేము పిలుపునిస్తున్నాం. ఇది కేవలం ఇరాన్ దేశ సమస్య కాదు. ఇది మానవత్వ‌ సమస్య అని మనం అందరం గుర్తించాలి. సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం లేని సమాజం, శాశ్వత శాంతి సాధ్యమవుతుంది.

ఎంఎన్ రావుణ్ణి, చైర్మ‌న్‌,
శాంతో లాల్‌, జ‌న‌ర‌ల్ క‌న్వీన‌ర్‌
పోరాట్టం, కేర‌ళ

3, మార్చి 2026
తెలుగుః అరుణ్ కాలా

Leave a Reply