తెలుగు సాహిత్యంలో విమర్శ తిరోగమనదిశగా ప్రయాణం చేస్తుందనే చెప్పవచ్చు. విమర్శ పేరుతో రాస్తున్నవన్నీ విమర్శకుండే మౌలికసూత్రాలకు అనుగుణంగా రాయడం లేదనే అపవాదు ఇటీవల బలంగా వినిపిస్తున్నది. అసలు విమర్శకుని కర్తవ్యం ఏమిటి? ఒక పుస్తకాన్ని ఎలా పరీక్ష చేయాలి? కవిత్వమైతే కావ్యపరీక్ష ఎలా చేయాలి? కథ అయితే వర్తమాన సమాజంతో పోల్చి ఎలా చెప్పాలి? నవల ప్రయాణం ఎలా సాగింది? ఇలా సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఎలా మూల్యాంకనం చేయాలన్నదే విమర్శలో కీలకం. ఎవరెన్ని చెప్పినా విమర్శకు మార్క్సిజమే పునాది రాయి అనే విషయాన్ని ఎప్పుడైతే విమర్శకులు విస్మరిస్తారో విమర్శప్రయాణం తిరోగమనమే.

విమర్శకులకు శాస్త్రీయ అవగాహన ఎలా కలుగుతుంది అన్నప్పుడు ముందుగా గుర్తుకు రావాల్సింది చార్లెస్‌ డార్విన్‌. డార్వీన్‌ జీవపరిణామ సిద్దాంతం కనీస అవగాహన లేకుండా శాస్త్రీయంగా ఆలోచించడం సాధ్యమేనా? కవికి భౌతికవాద దృక్ఫథం లేదా హేతువాద దృక్ఫథం కలగడానికి కారణమే డార్వీన్‌ జీవపరిణామ సిద్దాంతం. సిద్దాంతంపై భిన్నాభిప్రాయాలకు తావులేదు. ఇప్పటివరకు ఈ సిద్దాంతం తప్పు అనే మరొక సిద్దాంతం రాలేదు. అది వచ్చినా అశాస్త్రీయమే. అందుకే విమర్శకులకు ప్రాథమికంగా అవగాహన ఉండాల్సింది శాస్త్రీయ దృక్ఫథం.

సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ని చదవకుండా కావ్యవిమర్శ చేయలేము. ఈ సిద్ధాంతంతో విమర్శకులకు ఏం పని అని అనుకోడానికి వీల్లేదు. ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ సిద్దాంతమే సాహిత్య విమర్శను మలుపుతిప్పింది. మనస్తత్వశాస్త్ర నేపథ్యంలోనే అనేక వాదాలు పుట్టుకొచ్చాయి. బహిరంగంగా కనిపించే ప్రవర్తనలన్నింటికీ, అంతరంగంలోని ప్రేరణలు కారకాలని ఫ్రాయిడ్‌ సిద్దాంతం చెబుతుంది. కవిత్వమైనా, కథ అయినా పాత్రల అంతరంగాన్ని విశ్లేషించి విమర్శ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రాయిడ్‌ను చదివి వుండాలి.

సమాజ పురోగమనంలో ఆర్థిక సమానత్వానికి ఉన్న పాత్రనీ శాస్త్రీయంగా వివరించిన సామాజిక శాస్త్రం మార్క్సిజం. దోపిడి వర్గాలు సమాజ నిర్మాణానికి ఎలా కారణమౌతాయనే విశ్లేషణనీ, ఈ వర్గ భేదాల్ని పోగొట్టడానికి వర్గపోరాటం మాత్రమే పరిష్కారమౌతుందన్న దర్శనాన్నీ, సమానత్వం పొందిన సమాజంలో మాత్రమే అందరూ సుఖంగా జీవించగలరనే పరమ సత్యాన్నీ, మార్క్స్‌ తన అపూర్వ పరిశోధనలతో ఆవిష్కరించి, ప్రపంచమంతటినీ ప్రభావితం చెయ్యగలిగాడు. ఈ సత్యం విమర్శకులకు తెలియకపోతే అది విమర్శకానే కాదు. అందుకే ఈ ముగ్గురిని చదవకుండా గొప్ప విమర్శ చేశామనో రాశామనో, తాము రాసిన విమర్శ అతిపెద్ద పత్రికల్లో ప్రచురితమైందనో చెప్పినంత మాత్రాన అది విమర్శ కానే కాదు. ఇంకా ఉండొచ్చు కానీ పైన పేర్కొన్న వ్యక్తుల సిద్దాంతాలన్నీ విమర్శకులకు కనీస ఫండమెంటల్‌ టూల్స్‌ అనే విషయాన్ని గమనించాలి.

విమర్శ అన్నది సాహిత్య సిద్దాంతాలకు లోబడి మాత్రమే చేయాలి. ఏ రచన అయినా మార్క్సిస్ట్‌ దృక్ఫథంతో చూడటం, మనస్తత్వ దృష్టి నుంచి పరిశీలించడం చేయాలి. అలాగే శాస్త్రీయపద్దతులతోనే పరిశీలించి విమర్శ చేయాలి. వర్తమాన సమాజమే కాక, వర్తమాన సాహిత్య సమాజగమనమూ విమర్శకునికి తెలిసి ఉండకపోతే  అసలైన విమర్శ వచ్చే అవకాశమే లేదు. ఒక రకంగా విమర్శకుడు సమకాలీన విషయాలకు ప్రాతినిధ్యం వహించే వాహికగా వుండాలి.

మనిషి ఈ భూమ్మీద తన ప్రయాణం మొదలు పెట్టి దాదాపు 197 లక్షల సంవత్సరాలైందని అంటున్నారు. ఎన్నో నాగరికతలు, ఎన్నో యుగాలు మారిపోయాయి. ఈ మానవ నాగరికతపై ఇంకా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత సుదీర్ఘ ప్రయాణం. లక్షల ఏళ్ల ప్రయాణం కూడా చాలా నెమ్మదిగా సాగింది. అయితే పారిశ్రామిక విప్లవం క్రీ.శ1900లో వచ్చాకే  ఈ సమాజం వేగం అందుకుంది. అప్పటివరకు సాగిన ప్రయాణం, సాధించిన ప్రగతి మానవజీవితంలో వచ్చిన మార్పులు గమనించకపోతే విమర్శకుడు ఎలా ముందుకు సాగుతాడు. ఈ శతాబ్ధం చాలా వేగవంతంగా సాగుతున్నది. మానవుడు వేగంతో దూసుకుపోతున్నాడు. వేగాన్ని లెక్కగట్టగలిగే నేర్పు ఈ క్రమంలో జరిగే మార్పులను గమనించే స్థితప్రజ్ఞత విమర్శకులకుండాలి. ప్రపంచీకరణ వచ్చాక మనిషి నుండి మనిషికి దూరం పెరిగాక మానవుని విలువల్లోనూ అనేక మార్పులొచ్చాయి. ఈ క్రమంలో అంతరించిన విలువలు, మానవసంబంధాలు, నైతికత వంటివాటిపై లోతైన అవగాహన అందాలి.

కవిలాగే విమర్శకుడు కూడా జీవితాన్ని చూస్తాడు. మనుషుల్ని పరిశీలిస్తాడు. స్వభావాలను అర్థం చేసుకుంటాడు. ఈ క్రమంలో కవి సమాజాన్ని ఎలా చూస్తున్నాడో, కవి దృక్ఫథమేమిటో, జీవితం కవికి ఎలా కనబడిరదో కూడా విమర్శకుడు చూస్తాడు. ఈ క్రమంలో విమర్శకుడు కవిత్వ విమర్శ చేసేటప్పుడు అసలు కవిత్వానికి నిర్మాణపద్దతులు ఏమున్నాయని ఎంతమంది అనుకున్నా అది సామాన్యజనంలోకి వెళ్లడానికి కొన్నైనా నిర్మాణపద్దతలు అనుసరించితీరాల్సిందే. వస్తువు, వస్తువైవిధ్యం,శైలి, శిల్పం ఇవే కాక అధునాతన సాహిత్య విమర్శ సిద్దాంతాలొచ్చాక కవిత్వ ఎత్తుగడ, భావచిత్రాలు, పద చిత్రాలు, దృశ్యం ఇలా అన్నింటినీ పరిశీలించి పైన పేర్కొన్న సిద్దాంతాల అవగాహనతో విమర్శ చేయాలి. అదే కవికి విమర్శకుడిచ్చే బహుమతి. వొక్కోసారి, మనస్తత్వ, తాత్విక దర్శనాన్ని కవిత్వంలో విమర్శకుడు దర్శించగలగాలి. కవి నిర్మించిన కావ్యానికి చదువరికి మధ్య అనుసంధానకర్తవంటివాడే విమర్శకుడని ఏ పుస్తకంలోనో చదవినట్లు జ్ఞాపకముంది. కవి యొక్క కవిత్వాన్ని విమర్శ చేయడానికి ముందు ఆ కవి ఇదివరకు రాసిన కావ్యాలన్నింటినీ చదవకపోయినా కవి దృక్పథాన్ని విమర్శకుడు సరిగ్గా అంచనా వేయలేడు. అసలు కవి పరిణామ క్రమాన్ని, వేగాన్ని లెక్కగట్టగలిగితేనే అసలు విమర్శ వెల్లడించగలుతారు. విమర్శకులు పుస్తకం మొత్తం చదవకుండా ఏ కొన్ని కవితలో చదివి అంచనా వేయడం కూడా సరైన పద్దతి కాదు. చాలా మంది ముందు మాటల్ని చదివి కవి గూర్చి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడటం, రాయడం కూడా ఈ వర్తమాన సాహిత్య సమాజం గమనిస్తున్నది.

కవిత్వం గూర్చి చర్చించినంత కథ గూర్చి చర్చ జరగదు. అంటే కథ విమర్శకు నోచుకోలేదా అంటే అదేం కాదు. ఒకటి రెండు మాటల్తో తెగేసి చెప్పే సంస్కృతి అధికమైంది. కథకు సంబంధించి క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం ఉండాలని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య అంటారు. కథకు వస్తువు సమాజమే. అయితే క్లుప్తత అన్నప్పుడు కథలో చెప్పవలసిన దానికంటే తక్కువ చెప్పాలని చెకోవ్‌ అంటారు. సంఘటనలకు సంబంధించి రాసేటప్పుడు వివరం ఎక్కువగా ఉండకూడదంటారు. ఇవి విమర్శకులకు తెలిసి ఉండాలి. ఇవి కాస్త నిర్మాణానికి సంబంధించినవి. అలా కాకుండా కథను వర్తమాన సమాజంతో పోల్చి, వస్తువును మాత్రమే అవగాహన చేసుకొని వస్తువైవిధ్యతను మాత్రమే చెబుతూ చేసే విమర్శను కూడా విమర్శ అని అన్నప్పడు ఉప్పులేకుండా వంట చేయడమే అవుతుంది. కథలో ప్రారంభం, ముగింపు ఎంత ముఖ్యమో కథలో సాగిన సంఘర్షణను కూడా మనోనేత్రంతో విమర్శకుడు చూడాలి. వాస్తవానికి సంఘర్షణ రచయిత దృక్ఫథానికి సంకేతమంటారు. కథకుడు ఎటువంటి సమాజాన్ని కోరుకున్నాడో విమర్శకులు పసిగట్టగలగాలి.  ఎవరికథలకు వాళ్లే విమర్శకులు కాగలగాలి. వివిధ సాహిత్యప్రక్రియలకు వివిధ సాహిత్య విమర్శసిద్దాంతాలు ఉన్నందున వాటిని విమర్శకులు తెలుసుకుని అంచనా వేసి, వర్తమాన సమాజంతో తూచి విమర్శచేయాలి. అటువంటి విమర్శనే ఈ సమాజాన్ని ముందుకు నడిపించగలుగుతుంది.

Leave a Reply