ఆశా కార్యకర్తల తర్వాత, ఆదివాసీ సంఘాలు కూడా కేరళ ప్రభుత్వం రాబోయే “తీవ్ర పేదరికం లేని రాష్ట్రం” ప్రకటన కార్యక్రమంలో సినీ నటులను పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రకటనను అవి “తప్పుడు, ఎన్నికల ప్రేరేపిత రాజకీయ ఎత్తుగడ”గా అభివర్ణించాయి.
ఆదివాసీ గోత్ర మహాసభ, ఆదిశక్తి సమ్మర్ స్కూల్‌లు చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, నవంబర్ 1 (కేరళ ఆవిర్భావ దినం)న చేయబోయే ఈ ప్రకటన ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులతో సహా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచిపెడుతోందని పేర్కొన్నాయి.
అధికారిక కార్యక్రమానికి సినీ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్‌లను ఆహ్వానించడం “తప్పుడు కథనాన్ని చట్టబద్ధం చేసే” ప్రయత్నమని వారు ఆరోపించారు. “మేము దుర్భర జీవితాన్ని గడుపుతుండగా కేరళను తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించడం సరికాదు” అని పేర్కొంటూ, ఈ వేడుక నుండి వైదొలగాలని నటులకు విజ్ఞప్తి చేసారు.
“పేదరికం, ఆకలి, వ్యాధులు, నిరుద్యోగం, భూమి, ఇల్లు, సామాజిక భద్రతా పథకాలు లేకపోవడం కేరళలోని అత్యంత తీవ్రమైన సామాజిక-రాజకీయ సమస్యలలో కొన్ని. చవకబారు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భయంకరమైన వాస్తవాన్ని దాచిపెట్టడానికి నవంబర్ 1 ప్రకటన ఒక ప్రయత్నం” అని వారు అన్నారు.
అధ్యయనాలు, ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ, 64,000 కుటుంబాలను తీవ్ర పేదవారుగా అధికారికంగా గుర్తించారని, వారిలో 5% మంది మాత్రమే ఆదివాసీలు, 20 శాతం దళితులు, 75 శాతం మంది ఇతర సమూహాల నుండి ఉన్నారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ లెక్కలు “మోసపూరితమైనవి” అని సంస్థలు అభివర్ణించాయి.
వయనాడ్‌లోని ఆదివాసీ సముదాయాలలో విస్తృతమైన పోషకాహార లోపం, భూమి లేకపోవడం, నిరుద్యోగం, పేలవమైన ఆరోగ్య సూచికలను వారు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆదివాసీ పిల్లలలో 50% పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని; మహిళలు, పిల్లలలో రక్తహీనత రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
“పణియ, అడియ, కట్టునాయకన్, వెట్టకురుమ వంటి పెద్ద సంఖ్యలో ఆదివాసీ సముదాయాలు నివసించే వయనాడ్‌లో, మెజారిటీ ప్రజలు భూమి లేనివారు, ఇల్లు లేనివారు, నిరుద్యోగులు. వందలాది కుటుంబాలు నదీతీరాలలో, ప్రభుత్వ భూములలో, అటవీ ప్రాంతాలలో కారుతున్న గుడిసెలలో నివసిస్తున్నాయి” అని వారు అన్నారు. సికిల్ సెల్ ఎనీమియాకు సంబంధించిన 1,234 రికార్డు అయిన కేసులు; పిల్లలలో విస్తృతమైన పోషకాహార లోపం ఉన్నాయని కూడా తెలిపారు.
2020 నాటి ఒక అధ్యయనం (సాబు తదితరులు) ప్రకారం 59% ఆదివాసీ పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని; 52.3% మంది ఎదుగుదల లోపాన్ని కలిగి ఉన్నారని వారు వాదించారు. అలాగే, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ & పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించిన 2022 అధ్యయనం వయనాడ్‌లో ఐదేళ్లలోపు పిల్లలలో 54.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని రిపోర్టు చేసింది.
వ్యవసాయ ఉపాధి క్షీణించడం, ముఖ్యంగా మహిళలకు, పేదరికం, పోషకాహార లోపాలను మరింత పెంచిందని ఆ ప్రకటన ఎత్తి చూపింది.
వారి ప్రకారం, వరి పొలాలలో యంత్రాల వాడకం; వలస కార్మికుల ప్రవాహం స్థానిక కార్మికులను నిర్వాసితులను చేసింది. అదే సమయంలో, ఉపాధి పథకాలు పేదలలో కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయి. విద్యావంతులైన యువతకు ఉద్యోగాలు లేవు; బడి మానేసిన వారికి పట్టణ ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు లేవు. వేలాది మంది రోజుకు ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన రోజువారీ వేతన ప్రమాణం రూ. 157 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఉచిత రేషన్ సరఫరాపై ఆధారపడుతున్నారు.
పదేపదే శిశు మరణాలు సంభవించిన అట్టపాడిలో పరిస్థితి కూడా అంతే భయంకరంగా ఉందని వారు అన్నారు.
20 ఆదివాసీ నివాసాలు, 480 కుటుంబాలు, 523 మంది పిల్లలు, 40 మంది గర్భిణీ స్త్రీలు, 110 మంది పాలిచ్చే తల్లులను కవర్ చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం, 48% మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని, 40% మంది ఎదుగుదల లోపాన్ని కలిగి ఉన్నారని; 91% మంది పిల్లలు, 96% మంది కౌమార బాలికలు, 80% మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని కనుగొన్నారు. సర్వే చేసిన వారిలో ముప్పై శాతం మంది భూమి లేనివారు.
దళితులు, మత్స్యకారులు, తోటల కార్మికులు, కేరళ అంతటా ఉన్న ఇతర అణగారిన శ్రామిక సమూహాలు ఇంకా లేమిలోనే జీవిస్తున్నారని, ఆశా (ఎఎస్‌హెచ్‌ఎ) కార్యకర్తలతో సహా చాలా మంది వారి కీలక సామాజిక సేవా పాత్రలు ఉన్నప్పటికీ తక్కువ వేతనాలు పొందుతున్నారని ఆ ప్రకటన తెలియజేసింది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు వారి జీవితాలను మరింత దిగజార్చాయి.
“ఈ అణగారిన వర్గాల తీవ్రమైన జీవన పరిస్థితులను ప్రభుత్వం దాచడానికి ప్రయత్నిస్తోంది” అని ఆ ప్రకటన పేర్కొంది, నవంబర్ 1న చేయబోయే “తీవ్ర పేదరికం లేని కేరళ” ప్రకటనను “మోసపూరితమైన, ఎన్నికల ప్రేరేపిత రాజకీయ విన్యాసం” అని పేర్కొంటూ, ఇది రాష్ట్రంలో పేదరికపు నిజమైన ముఖాన్ని దాచిపెడుతోందని తెలిపింది.
అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపైన సమగ్ర సర్వే నిర్వహించాలని; దానిని పరిష్కరించడానికి స్థిరమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
కేరళ నవంబర్ 1న తీవ్ర పేదరికాన్ని నిర్మూలించినట్లు అధికారికంగా ప్రకటించనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకారం, ఈ మైలురాయిని సాధించిన భారతదేశంలో కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా నిలవనుంది.
ముఖ్యమంత్రి దీనిని “చారిత్రక విజయం”గా అభివర్ణించాడు; “పేదరికం లేదు”; ” ఆకలి శూన్యం” అనే ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పూర్తిగా సాధించిన దేశంలో కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
దక్షిణ భారతీయ సినీ దిగ్గజాలు మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్ ఈ ప్రకటన చేయడంలో ముఖ్యమంత్రితో చేతులు కలపనున్నారు.
గతంలో, రోజుకు కేవలం రూ. 233 సంపాదించే; తీవ్ర పేదరిక పరిస్థితుల్లో జీవిస్తున్న అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు (ASHAs) కూడా నవంబర్ 1న కేరళను “తీవ్ర పేదరికం లేని” రాష్ట్రంగా ప్రకటించే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనవద్దని ప్రముఖ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి మరియు కమల్ హాసన్‌లను అభ్యర్థించారు. “మేము దుర్భర జీవితాన్ని గడుపుతుండగా కేరళను తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించడం సరికాదు” అని వారు పేర్కొన్నారు.
తెలుగుః పద్మ కొండిపర్తి
2025 అక్టోబర్ 31




