తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న “మా మాటి మాలి సురక్ష మంచ్” నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో, సుమారు 200 మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు వరుసగా మూడు గ్రామాల్లోకి ప్రవేశించి, రాయగడ SDM, కాశీపూర్ JMFC జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సురక్షా మంచ్ నాయకుల ఇళ్ల గోడలకు అంటించారు.

ఫిబ్రవరి 26న వారు బంతేజీ గ్రామానికి, 27న ఉద్యమానికి కంచుకోట లాంటి కంటమాల్ గ్రామానికి, 28న సగాబరి గ్రామానికి వెళ్లారు. ఈ వారెంట్లను వ్యక్తిగతంగా ఇవ్వలేదు; చెట్లకు అంటించారు. అప్పటి నుండి నేటి వరకు డ్రోన్లు, పోలీసు వాహనాల రాకపోకలు నిత్యకృత్యమయ్యాయి.

తీవ్రతరమవుతున్న అణచివేత

 మార్చి 10 రాత్రి, తాలాంపదర్ (కలహండి జిల్లా) గ్రామస్థులకు, కంపెనీ మద్దతుదారుడైన ఒక గ్రామస్థుడికి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. అర్ధరాత్రి పోలీసులు గ్రామంపై దాడి చేసి 21 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు, వారిలో 11 మంది మహిళలలు. ఇళ్లపై దాడులు చేసి, తలుపులు బద్దలు కొట్టారు. అరెస్టయిన 11 మంది మహిళల్లో ఒకరు 19 ఏళ్ల గర్భిణి, ముగ్గురు మైనర్లు, చిన్న పిల్లలు ఉన్న తల్లులు కూడా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కలహండి జిల్లాలోని భవానీపట్న జైలులో మగ్గుతున్నారు. వందల సంఖ్యలో వచ్చిన పోలీసు బలగాలతో పాటు యూనిఫాంలో ఉన్న మరికొందరు వ్యక్తులు, అనేక ప్రైవేట్ వాహనాలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. అర్ధరాత్రి పూట మహిళలను ఇలా అరెస్టు చేయడం నిస్సందేహంగా చట్టవిరుద్ధం.

జనవరి మధ్యలో తిజ్మాలి, మజింగిమాలి, కుటురుమాలి గ్రామస్థులు తమ భూమి, కొండలు, వాగులపైన హక్కుల కోసం, తమ పవిత్రమైన కొండలపైన స్వయంప్రతిపత్తిని చాటుకుంటూ నిర్వహించిన పాదయాత్రల తర్వాత ప్రభుత్వ అణచివేత మరింతగా పెరిగింది. ఈ ప్రాంతమంతా భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కిందకు వస్తుంది. సిజిమాలి బాక్సైట్ గనుల కోసం 708.204 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ స్టేజ్-I అనుమతిని సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ ఈ పాదయాత్రలు జరిగాయి. కంపెనీ గూండాలు, పోలీసుల ఒత్తిడితో జిల్లా యంత్రాంగం నిర్వహించిన గ్రామసభలను ప్రజలు ఇప్పటికే హైకోర్టులో సవాలు చేశారు. జైలులో ఉన్న పద్మన్ నాయక్, కార్తీక్ నాయక్, లాబణ్య నాయక్ (భవానీపట్న జైలు), నారింగి దేయ్ మాఝీ, జలేశ్వర్ నాయక్, రమాకాంత్ నాయక్, మిథున్ నాయక్, సుందర్ సింగ్ మాఝీ, లక్ష్మణ్ నాయక్ (రాయగడ జైలు) లాంటి తొమ్మిది మందికి పైగా నాయకులను విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.

మెగా కార్పొరేట్ సంస్థల మైనింగ్ అవసరాల కోసం—అది తిజ్మాలిలో బాక్సైట్ అయినా లేదా సుందర్‌గఢ్ జిల్లాలో సున్నపురాయి అయినా—ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కేవలం అణచివేత, దౌర్జన్యపు చర్యలనే సమాధానంగా ఇస్తోంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో డ్రోన్లు, పెరుగుతున్న పోలీసుల మోహరింపు ఇప్పుడు శాశ్వత లక్షణాలుగా మారిపోయాయి.

బయటకు అడుగు పెట్టడం కూడా అసాధ్యంగా మారడంతో తమ జీవనోపాధిని ఎలా కోల్పోతున్నారో అనేకమంది ఆదివాసీ రైతులు, దినసరి కూలీలు ఇటీవలి మా పర్యటనలోతమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతుండటంతో, రోజువారీ పనులకు అడవిలోకి లేదా నదికి వెళ్లడానికి ఆలోచించాల్సి వస్తోంది. ఈ డ్రోన్ల వెంటే వరుసగా సుమారు 18 నుండి 25 వరకు పోలీసు వాహనాలు పెట్రోలింగ్ చేస్తున్నాయి; సాయుధ పోలీసులు భారీగా కవాతు నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో, ఎప్పుడు ఎవరిని పోలీసులు పట్టుకుపోతారో తెలియని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జైలులో ఉన్న తమ ఆత్మీయులను కనీసం కలుసుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వీటన్నిటికీ తోడు, పని లేకపోవడం; సంపాదన నిలిచిపోవడంతో కుటుంబాలు రోజుకు ఒక్క పూట భోజనంతోనే గడపాల్సి వస్తోంది.

మార్చి 10 నుండి 13 వరకు ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రజల కదలికలను, వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మార్చి 13న, “మా మాటి మాలి సురక్ష మంచ్”కు చెందిన ఐదుగురు నాయకత్వ సభ్యులను పోలీసులు వెంబడించారు. వారు కొండపైకి పరుగెత్తుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే క్రమంలో, ఉమాకాంత్ నాయక్ వెనుకబడిపోవడంతో పోలీసులు అతన్ని వెంటనే అరెస్టు చేశారు. అతను జైలు పాలవ్వడం ఇది రెండోసారి.

మా గత నివేదిక నవంబర్ ప్రారంభంలో వెలువడింది. ఆ తర్వాత జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను ఇక్కడ వివరిస్తున్నాము. కంపెనీ మద్దతుదారులు లేదా అద్దె గూండాల ద్వారా జరుగుతున్న దాడులు; కంపెనీతో జిల్లా యంత్రాంగం చేతులు కలపడం వల్ల ఈ ఉద్యమంపైన ఎంతటి ఒత్తిడి పెరుగుతుందో ఇవి వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ, మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు, దళితులు అటు కోర్టులలో న్యాయపోరాటం చేస్తూనే, ఇటు క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున సమీకరిస్తూ పోరాడుతున్నారు.

బిర్సా ముండా జయంతి

2025 నవంబర్ 15 న బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని కలహండి జిల్లాలోని నక్రుండి పంచాయితీలో భారీ ఏర్పాట్లు జరిగాయి. వేడుకకు ముందు రోజు, అమ్జోల గ్రామానికి చెందిన సాను మాఝీని పోలీసులు కొన్ని గంటల పాటు అదుపులోకి తీసుకొన్నారు; కాచలేఖ గ్రామానికి చెందిన మిథున్ నాయక్ ను అరెస్ట్ చేసి రాయగడ జైలుకు తరలించారు. కార్యక్రమం జరుగుతున్న రోజున, కొందరు స్థానిక యువకులు దానిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, నిర్వాహకులు శాంతియుతంగా జోక్యం చేసుకుని వారు అక్కడి నుండి వెళ్ళిపోయేలా ఒప్పించారు. ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన క్రమశిక్షణ, పట్టుదల ప్రశంసనీయం; బిర్సా ముండా జయంతి తమ భూమిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేసే నిరంతర పోరాటానికి ప్రతీకగా వారు భావిస్తారు, అందుకే వారు అక్కడి నుండి కదలడానికి నిరాకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అదే రోజున, కొంతమంది నిర్వాహకులపైన ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్రంలో, ఇటువంటి పవిత్రమైన వేడుకను కూడా లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు. ముందు రోజు అరెస్టులు చేయడం, వేడుక రోజున కావాలని గొడవలు సృష్టించడం, ఆ తర్వాత రెండు రోజుల్లోనే కార్తీక్ నాయక్‌ను అరెస్టు చేయడం వంటివి జరిగాయి. త్వరలోనే లాబణ్య నాయక్ కూడా అరెస్టయ్యారు. కార్తీక్ నాయక్ జైలుకు వెళ్లడం ఇది రెండోసారి. ఆయన భవానీపట్న జైలులో నాలుగు నెలలు గడిపి, మార్చి 18న బెయిల్ పైన విడుదలయ్యారు. ఆయనపైన ఆయుధాల చట్టం సెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోపణలు మోపారు. లాబణ్య నాయక్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

సుంగర్ చౌక్ దగ్గర మఫ్టీలో ఉన్న పోలీసుల దాడి

డిసెంబర్ 7న, కాశీపూర్ బ్లాక్‌లోని సుంగర్ చౌక్ వద్ద ఉన్న దయానిధి నాయక్ (28 ఏళ్లు) గ్యారేజీలోకి ఒక గుర్తుతెలియని వ్యక్తుల గుంపు ప్రవేశించి దయానిధిపైన దాడి చేసి, అతన్ని బలవంతంగా వాహనంలోకి లాగారు. బహుశా వీరు కాశీపూర్ పోలీసులే అయి ఉండవచ్చు; రెండు వాహనాల్లో వచ్చారు. తాము పోలీసు సిబ్బందిమని వారు చెప్పుకున్నప్పటికీ, ఎవరూ యూనిఫాంలో లేరు. ఆ వాహనాలకు పోలీస్ ప్లేట్లు లేవు, కనీసం పోలీస్ వాహనాలపై ఉండే సైరన్ లైట్లు కూడా లేవు.

అతన్ని రక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో, పోలీసులు ఒక 11 ఏళ్ల బాలుడి కాలిపైన తీవ్రంగా కొట్టారు; దీనివల్ల అతను చాలా రోజుల వరకు నడవడానికి ఇబ్బంది పడ్డాడు. అంతేకాకుండా, తల్లి ఒడిలో ఉన్న ఒక చిన్నారిని విసిరికొట్టారు. దయానిధి నాయక్ పోలీసులను ఎదిరించి, వారి పట్టు నుండి తప్పించుకోగలిగారు. అక్కడ ఉన్న వారిలో ప్రజలు గుర్తించిన ఏకైక వ్యక్తి కాశీపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ  పి.కె. స్వైన్. ఒక ఆదివారం మధ్యాహ్నం, గుర్తుతెలియని వ్యక్తుల గుంపు ఇలా ఒక వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేయడమనేది, మైనింగ్ ముప్పు నుండి తమ భూములను, అడవులను కాపాడుకోవాలనుకునే ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేయడానికి యంత్రాంగమూ, కంపెనీ కలిసి సాగిస్తున్న “గూండా రాజ్”ను స్పష్టం చేస్తోంది.

వేదాంత కంపెనీ కోసం అటవీ భూమి అక్రమ సేకరణ

2025 డిసెంబర్ 2నాడు సిజిమాలి బాక్సైట్ గనుల కోసం 708.204 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (FAC) స్టేజ్-I (సూత్రప్రాయ) ఆమోదాన్ని సిఫార్సు చేసింది. గ్రామసభల నిర్వహణలో అక్రమాలు, మోసపూరిత ప్రవర్తన జరిగినట్లు తమకు అనేక ఫిర్యాదులు అందినట్లు కూడా కమిటీ గుర్తించింది. పర్యావరణ అనుమతులు రాకముందే, సగాబరి మీదుగా మైనింగ్ ప్రాంతానికి వెళ్లే రహదారిని నిర్మించడానికి అధికారులు విపరీతమైన ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం పోలీసులు లేదా యంత్రాంగం ప్రవేశించడాన్ని “మా మాటి మాలి సురక్ష మంచ్” గత కొన్ని నెలలుగా వ్యతిరేకిస్తోంది. వారు సగాబరి సమీపంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఈ రహదారి కొండ పైన ఉన్న మాలిపదర్, తిజ్మాలి గ్రామాలకు దారితీస్తుంది.

అక్రమ భూసేకరణను నిరసిస్తున్న న్యాయవాదులు

2025 డిసెంబర్ 15నాడు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) జాతీయ మీడియాకు ఒక లేఖను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 125 మందికి పైగా న్యాయవాదులు, న్యాయ నిపుణులు, లా విద్యార్థులు ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాల్లో వేదాంత లిమిటెడ్ ప్రతిపాదిత సిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం అటవీ భూమిని, ఐదవ షెడ్యూల్ భూములను అక్రమంగా సేకరించడాన్ని నిరసించారు. అలాగే, దీనిని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ గ్రామస్థులను నేరస్థులుగా చిత్రీకరించడాన్ని, వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. ఒడిశా గవర్నర్, డీజీపీ, రాయగడ, కలహండి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సమర్పించిన సమగ్ర వినతిపత్రంలో, ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో భూసేకరణను వెంటనే నిలిపివేయాలని, గ్రామస్థులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, వేదాంత మైనింగ్ ప్రాజెక్టుకు సహకరించేందుకు సాగిస్తున్న “వలస పాలన కాలం నాటి అణచివేతను” ఆపాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలను ప్రస్తావిస్తూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో శాంతిని, సుపరిపాలనను పునరుద్ధరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని న్యాయవాదులు కోరారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించకూడదని వారు నొక్కి చెప్పారు.

ప్రధాన డిమాండ్లు , నిరసనలు

న్యాయవాదులు కోరిన ప్రధాన డిమాండ్లలో—వేదాంతకు మంజూరు చేసిన మైనింగ్ లీజును సమీక్షించడం, గ్రామస్థులపై పెట్టిన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకోవడం, అక్రమ అరెస్టులు, చిత్రహింసలకు గురైన నాయకులను నష్టపరిహారంతో విడుదల చేయడం వంటివి ఉన్నాయి. అలాగే, నిర్భయ వాతావరణంలో గ్రామసభలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వరకు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను పూర్తిగా నిలిపివేయాలని వారు కోరారు. వీటితో పాటు, పోలీసులు, పరిపాలనాయంత్రాంగం చేపడుతున్న మితిమీరిన చర్యలపైన స్వతంత్ర విచారణ జరిపించాలని, కంపెనీ సిబ్బంది గ్రామాల్లోకి రాకుండా నిషేధం విధించాలని, ఈ ప్రాంతంలో పోలీసుల మోహరింపుకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరి చేయాలని వారు డిమాండ్ చేశారు.

 

సంబల్‌పూర్, కటక్‌లలో విద్యార్థుల నిరసనలు

బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా జనవరి 12, 13 తేదీల్లో సంబల్‌పూర్ యూనివర్సిటీ , రెవెన్షా యూనివర్సిటీలలో స్వచ్ఛందంగా నిరసనలు జరిగాయి. ఆదివాసీలు, దళితుల అక్రమ నిర్బంధాలను, పెరుగుతున్న పోలీసు అణచివేతను ఖండిస్తూ జరిగిన ఈ నిరసనలు—తమ ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను రక్షించుకునే, బాక్సైట్ మైనింగ్‌ “వద్దు” అని చెప్పే ప్రజల హక్కును సమర్థించాయి. రెవెన్షా యూనివర్సిటీలో ప్రదర్శించిన ఒక ప్లకార్డుపై “మా ఆరావళి: సిజిమాలి!! మేము సిజిమాలి ప్రజలకు అండగా ఉంటాము” అని రాసి ఉంది.

2026 మార్చి 8

మార్చి 8 ఉదయం, తీవ్రమైన నిఘా, పోలీసు పెట్రోలింగ్‌కు వ్యతిరేకంగా వందలాది మంది మహిళలు ఏకమయ్యారు. వారు కంటమాల్ నుండి సగాబరి వరకు “వేదాంత – గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ, ఆ భూమి తమదేనని చాటుతూ కవాతు నిర్వహించారు. అది ఏదైనా వేడుక అయినా, బహిరంగ సభ అయినా, ర్యాలీ లేదా ప్రదర్శన అయినా—మహిళలు, బాలికలు భారీ సంఖ్యలో పాల్గొని తమ చైతన్యాన్ని చాటుతున్నారు. వీరే ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారు.

అరెస్టు, బెయిల్, షరతులు

జైలు నిర్బంధం నుండి విడుదలయ్యే వారికి స్వాగతం పలకడానికి గ్రామస్థులు భారీగా తరలిరావడంతో, బెయిల్ రావడం ఒక పెద్ద ఉత్సవంలా మారుతోంది. ఫిబ్రవరి 18న నారింగి దేయ్ మాఝీ, సుందర్ సింగ్ మాఝీ, రమాకాంత్ నాయక్ రాయగడ జైలు నుండి బయటకు వచ్చారు. జలేశ్వర్ నాయక్ మార్చి 11న విడుదలయ్యారు. తమ భూమిని కాపాడుకోవడం కోసం జైలు శిక్షను అనుభవిస్తున్న ఆదివాసీలు, దళితుల త్యాగం ఈ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన అంశం. సిజిమాలిని కాపాడాలనే నినాదాలతో పాటు “జై భీమ్” నినాదాలు ఆ రాత్రి మిన్నంటాయి.

లక్ష్మణ్ నాయక్‌ను డిసెంబర్ 1న రాయగడలోని అతని ఇంటి నుండి అదుపులోకి తీసుకొన్నారు. ఆయనకు డిసెంబర్ 16న బెయిల్ మంజూరైంది. కాచలేఖ గ్రామానికి చెందిన మిథున్ నాయక్ నవంబర్ 14 నుండి జనవరి 14 వరకు జైలులో ఉన్నారు. డిసెంబర్ 15న మిథున్ నాయక్, లక్ష్మణ్ నాయక్ విడుదలైన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. అయితే, మిథున్ నాయక్‌ను జనవరి 29న మళ్ళీ అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 28న విడుదల చేశారు.

మిథున్ నాయక్ అరెస్టు తీరును గమనిస్తే, కిరాయి గూండాలు, దళారీలపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. మరుసటి రోజు జరగాల్సిన బిర్సా ముండా జయంతి కార్యక్రమం కోసం ఆయన ఏర్పాట్లలో నిమగ్నమై, కర్లాపట్ రోడ్డు గుండా తిరిగి వస్తున్నప్పుడు, ఒక గ్రామం సమీపంలోని వంతెన వద్ద తొమ్మిది మంది గుంపు ఆయనపైన మెరుపుదాడి చేసింది. వారు అతన్ని దారుణంగా కొట్టి, అతని బ్యాగును లాక్కున్నారు. ఆ తరువాత అతన్ని రాంపూర్‌లోని ఒక ప్రాంతంలో వదిలేస్తే, అక్కడకు వచ్చిన ఒక బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆయన గుర్తించారు; అందులో ఒకరు కర్లాపట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మఫ్టీలో ఉన్న పోలీసు అధికారి. ఆ తర్వాత వారు అతన్ని కాశీపూర్‌లోని రాయగడ పోలీసులకు అప్పగించారు.

కోర్టు విచారణ, అమానవీయ బెయిల్ షరతులు

అతన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, అతను తీవ్రమైన నొప్పి, దిగ్భ్రాంతిలో ఉన్నాడు. అయినప్పటికీ, న్యాయమూర్తి అతని పరిస్థితి గురించి విచారించలేదు; అతను కూడా తాను అనుభవించిన చిత్రహింసల గురించి ధైర్యంగా చెప్పలేకపోయాడు. కోర్టు ముందు ఏమీ చెప్పవద్దని అతన్ని తీవ్రంగా భయపెట్టారు. అయితే, జనవరి 14న విడుదలైన తర్వాత, నవంబర్ 14న జరిగిన తన అపహరణపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ కర్లాపట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడానికి అతను కొంతకాలం ఆగాడు. పోలీసులు అతని ఫిర్యాదును తీసుకుని, కొన్ని రోజుల తర్వాత రమ్మని చెప్పారు. కానీ కర్లాపట్ పోలీసులు అతని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు, కనీసం డైరీ ఎంట్రీ కూడా చేయకపోగా అతను జనవరి 29న తిరిగి వెళ్ళినప్పుడు, అతనిపై వారెంట్ జారీ అయిందని చెప్పి అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ మొత్తం ఉదంతం ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది.

గతంలో హైకోర్టు చేసినట్లుగానే, రాయగడ జిల్లా కోర్టు కూడా లక్ష్మణ్ నాయక్, నారింగి దేయ్ మాఝీ, సుందర్ సింగ్ మాఝీ, రమాకాంత్ నాయక్, జలేశ్వర్ నాయక్‌లపై అవే బెయిల్ షరతులను విధించింది:

“పిటిషనర్ విడుదలైన తేదీ నుండి రెండు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం (గంటలు 6.00 నుండి 9.00 మధ్య) కాశీపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేయాలి. చీపురు, ఫినాయిల్ వంటి శుభ్రపరిచే వస్తువులను కాశీపూర్ పోలీస్ స్టేషన్ ఐ.ఐ.సి పిటిషనర్‌కు అందించాలి.”

ఇటువంటి బెయిల్ షరతులు ఎస్‌సి, ఎస్‌టి సముదాయాల పట్ల ఉన్న వివక్షను సూచిస్తున్నాయి. ఇవే గనుక న్యాయపరమైన ఉదాహరణలుగా మారితే, అది బెయిల్ పొందే ప్రాథమిక హక్కుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది , అధికారుల నిరంకుశత్వానికి దారితీస్తుంది. ఇది ప్రతీకార న్యాయ వ్యవస్థలో భాగంగా, విచారణకు ముందే విధించే శిక్షగా, కక్షపూరిత చర్యగా కనిపిస్తోంది.

సమీప ప్రాంతాల్లో రాజుకుంటున్న ప్రతిఘటన

ఉద్యమంలోని మరో వైపు, పులింగ్‌పదర్, చాంద్‌గిరి గ్రామస్తులు కూడా వేదాంత సంస్థ చేస్తున్న భూ ఆక్రమణను ప్రతిఘటిస్తున్నారు. సిజిమాలి మైనింగ్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులు కాబోయే వారి కోసం పునరావాస కాలనీలను నిర్మించడానికి కంపెనీ బలవంతంగా ప్రయత్నిస్తోంది. 2026 మార్చి 19 నుండి, పులింగ్‌పదర్‌కు చెందిన వందలాది మంది గ్రామస్తులు కుర్కుటి అటవీ ప్రాంతంలో నిరవధికంగా శిబిరాలు ఏర్పాటు చేసి ఉంటున్నారు. కంపెనీ బుల్డోజర్లు చెట్లను నరకకుండా, వారి పవిత్రమైన వనాలను ధ్వంసం చేయకుండా వారు అడ్డుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ భూమిపై వారికి సంప్రదాయబద్ధమైన హక్కులు ఉన్నాయి.

ప్రభుత్వం-పరిశ్రమ-సైన్యాల మధ్య ఉన్న అపవిత్ర కలయిక మైనింగ్ వనరులను అక్రమంగా దక్కించుకోవడానికి చట్టాలన్నింటినీ ఎలా ఉల్లంఘిస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. సుందర్‌గఢ్ జిల్లాలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది; అక్కడ భారీ పోలీసు, పారామిలిటరీ బలగాల సహాయంతో దాల్మియా సిమెంట్ సంస్థ సున్నపురాయి తవ్వకాలు జరపడానికి యంత్రాంగం సహకరిస్తోంది. ఇవి ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు, ఇక్కడ నివసించే ప్రజలకు వారి భూములు, అడవులు, కొండలు, వాగులు, పవిత్ర స్థలాలపైన రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. తిజ్మాలి ప్రాంతం వేగంగా ఒక సంఘర్షణ ప్రాంతంగా  మారుతోంది. ప్రభుత్వం వారి భూములను, జీవితాలను, జీవనోపాధి మొదలైన వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో—ఆదివాసీలు, దళితుల నిరసన తెలిపే హక్కును మనం సమర్థిద్దాం.

ఈ అంతులేని అక్రమ నిర్బంధాలను ఆపాలి.

డ్రోన్ల నిఘాను నిలిపివేయాలి!

పోలీసు పెట్రోలింగ్‌కు స్వస్తి పలకాలి!

తెలుగు: పద్మ కొండిపర్తి

https://countercurrents.org/2026/03/tijimali-an-undeclared-conflict-zone/?fbclid=IwY2xjawQvBBJleHRuA2FlbQIxMQBicmlkETFnZGxXdERoaWRWa1d0R2Nmc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHr7jhQIV6lTwAEdln_MVb-h-ubxYtl5je4F0UJnITpxtszaouFdTtqbxYUJV_aem_c5OCUFehD_U6hvt-VTw80A

Leave a Reply