1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు  భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర  పరిణామాలలో ముఖ్యంగా  వీ పి సింగ్ నాయకత్వంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ, ఓబిసి రిజర్వేషన్లను అమలు లోనికి తేవడం జరిగింది. ఇదంతా 1990 కి ముందు దశగా చెప్పుకోవచ్చు.  1990 దశకం తర్వాత భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, బిజెపి గాని ( యు.పి.ఏ., ఎన్డీఏ కూటములు) ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేసిన తర్వాత 1998 – 2004 వరకు ఆరు సంవత్సరాలు ఎన్డీఏ కూటమి వాజ్పాయ్ గారి నాయకత్వంలోనూ, 2014 నుంచి ఇప్పటివరకు నరేంద్ర మోడీ నాయకత్వంలోనూ బీజేపీ ( ఎన్డీఏ కూటమి ) ప్రభుత్వం మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మ నిర్భరభారత్  పేర్లతోనూ, నేడు వికసిత్ భారత్  పేరుతోనూ చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓ బి సి కులాలు, వర్గాలను పేదరికం నుంచి విముక్తి చేశాయా? అన్న ప్రశ్న నేడు చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత వికసిత్  భారత్ లక్ష్యం ఆర్థిక, సామాజిక, రాజకీయ, నైతిక, విద్య, సాంకేతిక రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించుట కోసంగా చెప్పబడుతుంది. రైతులకు ఆధునిక సాంకేతికత, నీటిపారుదల సదుపాయాలను కల్పించి,  మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయుట, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి  నిరుద్యోగాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో సృజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించుటకు మెరుగైన పాఠశాల వ్యవస్థను నెలకొల్పాలని సంకల్పిస్తున్నారు. డిజిటల్ ఇండియా, అంతరిక్ష పరిశోధన, వైద్య, సాంకేతిక రంగాల అభివృద్ధి,  మహిళా సాధికారత, బాలల హక్కుల రక్షణ, స్వచ్ఛభారత్,ఓటుహక్కు సద్వినియోగం,  పర్యావరణ పరిరక్షణ, యువతలో దేశభక్తి, నవీన ఆలోచనలు  మొదలగునవి లక్ష్యంగా ప్రకటించబడ్డాయి. కానీ గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ కూటమి పాలన నిర్వికసిత్ భారత్ గా రూపాంతరం చెంది, తిరోగమన చర్యలు  చేపట్టడం జరిగింది. గతంలోని  పథకాలు, సంస్థలు, వ్యవస్థల పేర్లు మార్పిడి తప్పా, పురోగమన చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.

 గతంలో  జరిగిన బ్యాంకుల జాతీయకరణను  ఇప్పుడు బ్యాంకుల విలీనం పేరుతో బ్యాంకింగ్ రంగంలోనూ, ఇన్సూరెన్స్ రంగంలోనూ ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ రంగ  పరిశ్రమలను మూసివేసి ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. 10 శాతం ఈ. బీ.సీ రిజర్వేషన్లు తీసుకొని రావడం గాని,  ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలను కోత విధించి, ప్రైవేటు రంగ ఉపాధిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం గానీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంలో గానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం (యూపీఏ కూటమి) తీసుకుని వచ్చిన సి.పి.ఎస్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలను

ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం యధాతధంగా కొనసాగించడం వలన ఉద్యోగ వర్గాలకు అవి అశనిపాతంగా మారాయి. ఇక న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాల పేరుతో పాత చట్టాల పేర్లు మార్పు, ఊపావంటి నల్ల చట్టాల కొనసాగింపు,  నాలుగు లేబర్ కోడ్లు అమలు న్యాయ,  కార్మిక రంగాలను మరింతగా దిగజార్చడం జరుగుతుంది.

ఇక దేశంలో పేదరికం తగ్గిందా అంటే అదీ  లేదు. ఇప్పటికే అత్యంత పేదరికంలో ఎస్టీలు 43%, ఎస్సీలు 29%, ఓబిసిలు 21% వెరసి దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 93% గా ఉన్నారు. ఈ సంఖ్యా శాతం బీహార్ వంటి  రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉంది.  గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీల పరిస్థితి, పట్టణ ప్రాంతంలో క్యాజువల్ లేబర్ మరియు స్వయం పోషక చిరు వ్యాపారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఫలితంగా వారు పోషకాహార లోపంతోనూ, ఆరోగ్య సమస్యలతోనూ సతమత మవుతున్నారు. ఫలితంగా వారిలో పని చేసే  సామర్థ్యం తగ్గుతుంది .సామాజిక అసమానతలు పెంపొందుతున్నాయి. ఇక ఓటు హక్కు సద్వినియోగం పేరుతో SIR ను ఏర్పాటుచేసి బిజెపి,  ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావజాల కుల, మతాలకు చెందిన వారి ఓట్లను గల్లంతు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గొప్పలు చెబుతున్న ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్లు ఆదివాసి ప్రాంతంలో పెట్టుబడిదారీ అనుకూల విధానాలను అనుసరిస్తూ, అక్కడ గల ఆదివాసీలను వెళ్ళగొట్టడం కోసం తిరుగుబాటు చేస్తున్న ఆదివాసీలను ఊచకోత కోస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి జల్, జంగిల్, జమీన్ కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటాలు నేడు మరింత తీవ్రతరం కావడం జరిగింది. మహిళా సాధికారత,  బాలల హక్కుల పరిరక్షణ వంటివి నీటి మీద రాతలు గానే మిగిలి పోతున్నాయి. ఇందుకు ఉన్నావ్ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లోని 14 సంవత్సరాల బాలుడు అశ్వమిత్ గౌతం పై పోలీసులు కేసు నమోదు చేయడం  అత్యంత దారుణమైన అంశం గా చెప్పవచ్చు. సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారడం జరిగింది. ఇక సామాన్య ప్రజలు బంగారం, వెండి కొనుగోలుకు భవిష్యత్తులో దూరం కావడం జరుగుతుంది. ఇప్పుడు విద్య, వైద్య రంగాలు వ్యాపార వస్తువుగా మారిపోయాయి.

కాబ‌ట్టి పాలకులలో చిత్తశుద్ధి లేనప్పుడు ఎన్ని పేర్లతో పథకాలు పెట్టినా, అవి దేశంలోని పేదరికాన్ని నిర్మూలించటంగాని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని కానీ తీసుకురావని చెప్పవచ్చు. ఈ విషయాన్ని గత ఎనిమిది దశాబ్దాల భారత పాలకుల పరిపాలనా విధానాలే నిదర్శనంగా మనం భావించవచ్చు.

Leave a Reply