ఇది దుఃఖం ఒరుపుతో
గుండె కరిగిపోయే కాలం కదా
వారి గురి పాఠశాలలపైనే
ఎందుకు ఉంటుందో
ఒకమారు ఆలోచించామా
పసిగుడ్డుల యెగిరిపడిన
మాంసపు ముద్దల మధ్య
వాళ్ళు ఆకలిని తీర్చుకునే
పాలకులయ్యారు
ఇది ఆయిల్కోసమో గ్యాస్ కోసమో
జరుగుతున్న యుద్ధం కాదు
తమకెదురు నిలిచిన జాతిని
సమూలంగా నాశనం చేసే కుట్ర కదా
ఏ మూల తలెత్తి నిలబడినా
ప్రశ్నించే మనుషుల హృదయాలను
చీల్చే యుద్ధ పిపాసుల దాహమిది
మధ్య ప్రాచ్యం నుండి
మధ్య భారతం వరకు కురిసిన బాంబుల
వెనక దాగిన నిజం కదా
ద్రోహమొక్కటే వారికి
కనుచూపుగా మారింది
గుండె జారిన మనుషులను
చూపుతూ రేపు లేదని
వెలుగు రాదనీ
ఆకాశాన్ని ఆక్రమించామని
మిడిసి పడుతున్నారు
భూమి నవ్వుతూ
బద్ధలైన దేహంలోంచి
మొలకేత్తే చిగురును
ప్రసవిస్తోంది...




