ఇంగ్లీషు భాషలోని ‘ఇంటలెక్చువల’కు సమానార్థకంగా ‘మేధావి’ అనే మాటను, రష్యన్ భాషనుంచి ఇంగ్లీషులోకివచ్చిన ‘ఇంటెలిజన్షియా’కు సమానార్థకంగా ‘బుద్ధిజీవులు’ అనే మాటను తెలుగులో వాడుతున్నాము. మొదటి మాటకు person possessing a good understanding, enlightened person  అని, రెండవదానికి the part of a nation that aspries to independent thinking అనిన్నీ ‘ద కన్సైజ్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ’ అర్థం చెబుతున్నది.

‘ది హిందూ’ పత్రిక (1967 డిసెంబరు 29)లోthe intelligentia in Indian politics అనే వ్యాసం రాస్తూ ఏ.యస్. సత్యనాథన్ ఇలా బుద్ధిజీవులను వర్ణించాడు.

It is that part of the educated classes who are credited with the capacity for objective, independent thinking – men in the learned professions, lawyers, accountants, business and service executives, economists, journalists, artistes, writers, thinkers  – who constitute the intelligentia.

బాగా అభివృద్ధి పొందిన దేశాలలోకూడా బుద్ధిజీవులది అల్పసంఖ్యాక వర్గమేనని ఈ నిర్వచనం బట్టి తెలుస్తుంది. విద్య సమాజమంతటా వ్యాపించని మనదేశంలాంటి వెనకబడిన దేశాలసంగతి మరిచెప్పే పనిలేదు.

బుద్ధిజీవులు చూపెట్టిన త్రోవలో ప్రభుత్వాలు నడిచే అలవాటు ఎక్కడాలేదు. అయినా, యుద్ధం వచ్చినా అక్రమం జరిగినా స్వేచ్ఛ దెబ్బతిన్నా, నియంతృత్వం విజృంభించినా బుద్ధిజీవులు యూరపియన్ దేశాలలో పలువిధాలుగా నిరసన తెలుపుతూ వస్తున్నారు. ప్రభుత్వాల ప్రచారాలను వేదప్రమాణాలుగా ఒప్పుకోకుండా, నిజం బయల్పడడం కోసమైనా, ఈ పనులు అవసరమవుతున్నాయి. మన దేశంలో కూడా రవీంద్రకవి వంటి మహామేధావి జలియన్‌వాలాబాగ్ వధ సందర్భంలోనూ, ద్వితీయ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలోనూ తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించిన ఘటనలున్నాయి. ఫ్రాన్సులో హెన్రీ బార్జూజ్, రోమారోలా తదితరులు తయారుచేసిన యుద్ధ వ్యతిరేక ప్రకటనపై బెర్నార్డ్‌షా, గాల్స్ వర్డీ, గోర్కీవంటి వారితోకలిసి రవీంద్రుడుకూడా సంతకం చేశాడు. బెంగాల్ రాష్ట్రం నేటివరకూ ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుతున్నది. ఇటీవలి కాలంలో సెతల్వాడ్, యన్.సి, ఛట్టర్జీ, పి.యన్ సప్రూవంటి న్యాయశాస్త్రవేత్తలు అనేక సందర్భాలలో ముఖ్య సమస్యలపై తమ అభిప్రాయాలను అభిప్రాయభేదాలను ప్రకటిస్తూ దేశంలోని ఆలోచనాపరులకు పనిబెట్టగలుగుతున్నారు. బుద్ధిజీవులు ప్రజల రాజకీయ, ఆర్థిక జీవితాలపై తమ ప్రభావాన్ని చెరిపేందుకు పాశ్చాత్య ప్రజాతంత్ర దేశాలలో ఉన్నటువంటి అవకాశాలు మనదేశంలో లేవని, పైన పేర్కొన్న వ్యాసకర్త తేల్చిచెప్పాడు.

పాశ్చాత్య ప్రజాతంత్ర దేశాలలో కూడా మేధావుల నైతిక కర్తవ్యాల గురించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వియత్నాంలో జరుగుతున్న యుద్ధమూ, అరబ్బులకూ ఇజ్రాయిల్‌కు మధ్య జరిగిపోయిన యుద్ధమూ, ఈ వాద ప్రతివాదాలకు సందర్భాన్ని కల్పించాయి.

ప్రపంచ రాజకీయ సమస్యలగురించి తగుదునమ్మా అని అభిప్రాయాలు వెలిబుచ్చడానికి ఇతరుల కెవ్వరికీ లేని యోగ్యత ఈ మేధావి వర్గానికెలా వచ్చింది ? ఏమిటి వీరి గొప్ప ? వీళ్ళు ఆలోచించేపాటి ఇతరులు ఆలోచించకనా? తమ తమ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలను కిందికి నెట్టి, వస్తువును వస్తుపరంగా చూసే ‘ఆబ్జెక్టివ్‌’ దృష్టినలవరచుకొని, ‘స్వచ్ఛందంగా’ వీళ్ళు ఆలోచించగలరా? ఇలాంటి ప్రశ్నలు బోలెడు ఎదురౌతున్నాయి. తమ సంప్రదాయానికి తామే గోయి తవ్వుకొంటున్న పాశ్చాత్య ప్రజాతంత్ర దేశాల మేధావుల్లో అందరూ ఒక తాటిమీద నడవడంలేదు. జాపాల్ సార్త్ర్‌(jean-paul sartre)) వంటి మేధావులు కొందరు ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణకు పూనుకోకపోయినా, తటస్థత వహించకుండా ఒక పక్షంవైపు బలంగా మొగ్గుతున్నందుచేత వాళ్ళను “engage” అనే ఫ్రెంచిమాటతో ఒకగాట కట్టివెయ్యడం జరుగుతున్నది. ఒక మహా సంక్షోభం ఏర్పడినప్ప్పుడు బెర్ట్రాండ్ రస్సెల్ ప్రతి దఫా లోకానికంతా తెలిసేంతగా తన గొంతెత్తి  తానే ఒక న్యాయమూర్తి అవుతున్నాడు. వియత్నాం యుద్ధంలో జరుగుతున్న అమానుష విధ్వంసకాండ గురించి విచారించి తీర్పుచెప్పేందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలాంటి ఒక మేధావుల బృందాన్ని ఆయన ఏర్పాటుచేసిన సంగతి సర్వజన విదితమే.

పశ్చిమ యూరపుదేశాలలో మేధావుల నైతికబాధ్యత గురించిన గుర్తింపు కనీసం 18వ శతాబ్ది చివరి భాగంనుంచి ఉంటూ వస్తున్నది. దానిని Age of Englihtenment    అని చరిత్ర వ్యవహరిస్తున్నది. దానికి ఎంతోముందు ‘రినేజాన్సు’ దినాలలో (15 – 16 శతాబ్దులు) ఎరాస్మస్, తర్వాత 17వ శతాబ్దిలో మిల్టన్ మహాకవి, 18వ శతాబ్ది చివర వోల్తేర్  , 19వ శతాబ్దిలో బైరన్‌కవి, గెటే  కవి, చివరిభాగంలో ఎమిలీజోలా    ఇలాంటి మేధావులందరూ ఆ నాళ్ళ ఘటనలతో ఏకీభవించక తమ వేర్పాటును స్థాపించుకొన్నారు. 1936లో స్పానిష్ అంతర్యుద్ధకాలంలో రిపబ్లిక్ సంరక్షణకై కవులూ కళాకారులూ నేరుగా యుద్ధంలోనే పాల్గొన్నారు కూడా. ఇదీ అక్కడి సంప్రదాయం.

ఇప్ప్పుడు ఊగిసలాంటి ఈ మార్పు ఎందుకువచ్చినట్లు? పాశ్చాత్య ప్రజాతంత్ర దేశాలుగా పేరుబడిన బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా వగైరా లొకవైపు, కమ్యూనిస్టు ‘నియంతృత్వ’ దేశాలుగా పేరుబడిన తూర్పు యూరపుదేశాలు, రష్యా వగైరా లింకొకవైపు తమతమ భావజాలాలకోసం  పెనగులాడుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సువంటి దేశాలకు లోగడ ఉండిన వలస రాజ్యాధిపత్యాలు ఊడాయి. కమ్యూనిజం వ్యతిరేకత అమెరికాకు మంచి అనుకూల్యాన్ని కలిగిస్తున్నది. ద్వితీయ మహాయుద్ధం తర్వాత చెదురుమదురుగా స్థానికంగా యుద్ధాలు జరుగుతూన్న నేటిరోజులలో మేధావులు మునుపటివలె కూటంకట్టి ఇరుపక్షాలలో ఒకదానిని వెనుకవేసుకొచ్చే వీలు ఎక్కువ లేకుండా వుంది. నేరుగా తమ మాతృదేశాలకు ఈ యుద్ధాలతో ప్రమేయం ఉండడం, ఒకప్ప్పుడు మేధావులను విపరీతంగా ఆకర్షించియుండిన కమ్యూనిస్టు భావజాలం సోవియట్ రష్యా కార్యాచరణలో వికృతమైపోవడం, “భ్రమలు” నీరుగారిపోవడం, అలనాటి రాజకీయ వ్యామోహులైన మేధావులలో ఒక్కొక్కరు తప్ప్పుకొని   మితవాదులు కావడం – ఇవన్నీ కారణాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు, 1930 – 40 మధ్యకాలంలో ఆంగ్లయువ  క‌వులకు నాయకుడైన ఆడెన్   ఇప్ప్పుడు మేధావులకు – ముఖ్యంగా సాహిత్య పరులకు రాజకీయ ప్రమేయాలెందుకని ప్రశ్నిస్తున్నాడు.

Why writers should be canvassed for their opinion on controversial issues I cannot imagine. Their views have no more authority than those of any reasonably well educated citizen.

‘Authors taken sides on Vietnam’ అనే గ్రంధంలో ఆడెన్ రాసిన వ్యాసం ఏ ధోరణిలో సాగిందో ఈ మచ్చుతునక చెబుతుంది. ‘ఎన్‌కౌంటర’ పత్రిక 1967 సెప్టెంబరు, అక్టోబరు సంచికలలోIntellectuals and just causes అనే అభిప్రాయవేదికను నిర్వహించింది. అందులో చాలామంది రచయితలు, మేధావులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి నీరద చౌదురీ కూడా.

హాన్స్ మార్గెంథోది సాంప్రదాయికమైన దృక్పథమనవచ్చు. ఇది మేధావుల ప్రత్యేకతను, వారి నైతిక బాధ్యతలను గుర్తిస్తుంది. అయితే మేధావి వట్టిమేధావిగా మాత్రమే లోకసమస్యలను పట్టించుకొనేందుకు ప్రత్యేకించి దక్షత గలవాడనుకోగూడదు. ఆ దక్షత ఇతరులది. ఇదమిత్థమయిన చెప్పదగిన ఒక ప్రయోజనానికి గాని ఒక స్థానానికి గాని కట్టుబడి ఉండరు కాబట్టి మేధావి వర్గానికి ఈ ప్రత్యేకత, సత్యానికే వారి కట్టుబాటు. సత్యదర్శనంలో పొరబాట్లు జరగవచ్చు. అభిప్రాయ ప్రకటనలో ఒక పక్షానికి ఆసరా దొరకవచ్చు. అలాంటి అభిప్రాయ ప్రకటనవల్ల వెనువెంటనే ఏ ఫలితాలూ లేకపోవచ్చు – అయినా

Still, the intellectual has a vital function to perform, a function that is both moral and practical. By confronting the powers that be with the truth, they erect a standard by whch the action of the government can be judged. They speak, in the Biblical phrase, truth to power. By doing this, they engage in a dialogue which establishes the intellectual respectability and, hence the practical possibility of alternative policies. Thus the intellectual, by providing an independent standard of evaluation, also provides the possibility for political change.

నిజం చెప్పడానికి నీతికి నిలబడడమనే దొక్కటే చాలదు. విషయ పరిజ్ఞానం లేనిదే నిజం వెలువడదు. తెలిసీతెలియని స్థితిలో నైతిక సూత్రాలను వెదజల్లుతూ పోవడంవల్ల లాభం ఉండదు సరికదా నష్టం ఉంటుంది. ఈ దృష్టితో ప్రొఫెసర్ మేక్స్‌బిలోఫ్, కాబర్ట్ కాంక్వెస్ట్, టైబర్ జామ్యూలీ ప్రభృతులు మేధావుల పనికిమాలినతనాన్ని గూర్చి రాశారు. చాలామంది మేధావులకు ఉన్నదంతా ఆ మేధావి అనే పేరేనంటాడు బెలోఫ్. వైదేశిక వ్యవహారాలను “నైతిక”మైన తీర్పు చెప్పవలసివచ్చేసరికి, మాస్కో విచారణలను సమర్థించిన వాళ్ళు మొదలు, కొరియాయుద్ధంలో అమెరికా క్రిమి ఆయుధాలను ప్రయోగించిందని నిరసన తెలిపిన వారివరకు ఎందరో ముద్దాయీలు (Guilty men) మేధావుల్లో కనిపిస్తారంటూ కాంక్వెస్ట్ రాశాడు. సర్వరోగనివారిణిని ముల్లెలో పెట్టుకొని ప్రతి అంతర్జాతీయ సమస్యకు దాన్ని వాడజూచే ఈ భిషక్కుల భేషజాలను జామ్యూలీ హేళన చేశాడు. మేధావులనబడే వాళ్ళు ఆ మేధస్సుకు పనిబెట్టకుండా ఉద్రేకాలపాలై తగుదునమ్మా అంటూ తీర్పుచేయబోవడం తెలివితక్కువ అన్నాడు. లుముంబా, కాస్ట్రోలాంటి  కల్పితవీరులను మెచ్చుతూ, జాన్సన్‌లాంటి కల్పిత దుష్టులను ఖండిస్తూ, యదార్థ ప్రపంచంనుంచి తప్ప్పుకొని కల్పిత ప్రపంచంలో చరిస్తూ ఉన్నారట “అభ్యుదయ” ముద్రాంకితులైన మేధావులు. తమ దేశానికి సంబంధించినంతవరకు అందరూ ధర్మపన్నాలు చెప్పేవారే. తమ స్వదేశానికి అతి దాపున ఉన్న నియంతృత్వ రాజ్యానికీ ఎంత ఎక్కువదూరం ఉంటే, అంత ఎక్కువ అభ్యుదయాంశ మేధావుల అభిప్రాయాలో ఉంటుందంటాడు సామ్యూలీ. పశ్చిమ దేశాల ప్రజాతంత్రవ్యవస్థను విమర్శించినంత తీవ్రంగానూ తరచుగానూ నియంతృత్వ దేశాలను విమర్శించే అలవాటు వీరికి లేదట.

The real mainspring of intellectual emotionalism seems to be a strange compound of irrational guilt, self hatred, anti Americanism, wishful thinking, power-worship, and arrogance. A considerable element of  hypocricy comes into it as well.

ఆంగ్లో – సాక్జన్ దేశాలలో మేధావులను అధికారస్థానాలకు ఎంతో కొంత దూరానపెట్టి వారి రాజకీయాభిప్రాయాలను ఖాతరు చెయ్యని సంప్రదాయం ఒకటి ఉంది. దాన్ని పునరుద్ధరించాలంటాడు ఈ రచయిత.

రెండు సంప్రదాయాలున్నాయి. తప్పని నమ్మినదాన్ని గర్హించే దొకటి. తమ తప్ప్పును చూచీ చూడనట్లు మిన్నకుండే దొకటి. మొదటిదానికి మోర్గెంథో, రెండవ దానికి కాంక్వెస్ట్, సామ్యూలీ వగైరాలు ప్రతినిధులని ఈ చర్చవల్ల తేలింది. ఇప్ప్పుడు ఈ ప్రజాతంత్రదేశాల పునాదులు కదలబారుతున్నాయి కాబట్టి, మేధావులలో వెనకటి సత్సంప్రదాయంపట్ల గురి సన్నగిల్లుతున్నది. My country, right or wrong  అనిన బైరన్‌కవి వాక్యం శిరోధార్యమౌతున్నది. అయితే ఆ బైరన్ కవి స్వదేశంలోని దుష్పరిపాలకులను కంటగించుకొని, గ్రీసువంటి దేశాల స్వేచ్ఛాసమరాల్లో పాల్గొని ప్రాణార్పణమే చేశాడని మరుస్తున్నారు. ఆ వెనకటి నైతిక సంప్రదాయం బెర్ట్రాండ్ రస్సెల్, జాన్‌పాల్ సార్త్ర్‌వంటి ఉత్తమ మేధావులను ఇంకా అంటిపెట్టుకొని ఉంది.

అభివృద్ధి చెందవలసిన మనదేశంలాంటి దేశాలలో మేధావులని పిలవదగినవారు. మోర్గెంథో అన్నట్లు, అధికారం ముందు సత్యం మాట్లాడవలసి ఉంటుంది. ఉన్నత నైతిక ప్రమాణాన్ని స్థాపిస్తే ఎప్పటికైనా వాస్తవానికి అది కొలబద్దకాదా ?

సృజన, ఫిబ్రవరి 1968

One thought on “మేధావులూ వారి నైతిక బాధ్యతలూ

  1. MEDHAVULU —-they are not right all the times-they take sides
    They look for popularity —
    =========buchireddy gangula

Leave a Reply