రాజ్యాంగమూ రాజదండమూ
మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో, భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది. కళ్ల ముందు కనిపించే వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది. అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం ఘర్షణ పడినప్పుడు అది పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న