“సేవ్ ఆరావళి” ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో సాయుధ పోరాటయేతర ఉద్యమాల పట్ల విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయాల పట్ల కూడా ప్రస్తావనలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, “భారతదేశంలో సాయుధ పోరాటాలు యొక్క ప్రాసంగికత ఏమిటన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశం అయింది.” అయితే ఇక్కడ సేవ్ ఆరావళి, ఢిల్లీ రైతు ఉద్యమం అన్నవి ఈమధ్య కాలంలో జరిగినప్పటికీ, వీటికంటే ముందు చిప్కో ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, సోంపేట, కాకరాపల్లి ధర్మల్ వ్యతిరేక ఉద్యమాలు నిరాయుధంగానే జరిగాయి. ఈ ఉద్యమాలలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇక కాశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు జరిగిన, జరుగుతున్న జాతుల పోరాటాలు కూడా సాయుధంగానూ, నిరాయుధం గానూ ఉన్నాయి.  ఇక మావోయిస్టు ఉద్యమం అయితే పూర్తిగా సాయుధ పోరాట రూపాన్ని సంతరించుకొని జరుగుతున్నది.

 పై రెండు రకాల ఉద్యమాలను మనం పరిశీలించినట్లయితే, నర్మదా బచావో ఆందోళన్, చిప్కో ఉద్యమం,  ధర్మల్ వ్యతిరేక ఉద్యమాలు, ఢిల్లీ రైతు ఉద్యమం, సేవ్ ఆరావళి ఉద్యమం కొన్ని నిర్దిష్ట ప్రజాసమస్యలు,  పర్యావరణ సమస్యలపై జరిగి అవి విజయాలను సాధించడం జరిగింది. ఈ ఉద్యమ సంస్థలకు, వేదికలకు ఆయా ప్రజా సమస్యలు పరిష్కారం జరిగితే చాలన్న విధంగా చేయడం జరిగింది. వీటికి రాజ్యాధికారం గాని, ప్రభుత్వ అధికారంగాని సాధించాలన్న  లక్ష్యాలు లేవు. కానీ జాతుల పోరాటాలకు స్వయం ప్రతిపత్తితో కూడిన స్వయం పాలన కావాలని పోరాడుతున్నారు.  ప్రభుత్వ అధికారంలో వారికి భాగస్వామ్యం గూర్చి మాట్లాడుతున్నారు. ఇక మావోయిస్టు పార్టీ అయితే ప్రస్తుత వ్యవస్థ స్థానంలో కార్మిక వర్గ రాజ్యం గూర్చిన రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నది. పై రెండు రకాల ఉద్యమాలలో మొదటి రకం ఉద్యమ సంస్థలు వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే చాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్న భారత పాలకవర్గాలకు కూడా రాజ్యాంగ పరిధిలో ఎన్నికల వ్యవస్థకు లోబడి, వారు ఉంటే చాలునన్న భావన ఉంది. అదేవిధంగా వారిని బుజ్జగించడం ద్వారా ఓట్ల రాజకీయం చేయవచ్చునన్న సంకల్పం కూడా ఉంది. కానీ రెండవ రకమైన పోరాటంలో జాతుల స్వయం ప్రతిపత్తి,  స్వయంపాలన, ప్రభుత్వ అధికారంలో భాగస్వామ్యం దగ్గర భారతపాలక వర్గాలకు పేచి ఉంది. కావున వారి పట్ల భారత పాలకులు కఠిన వైఖరినే కలిగి ఉంటున్నారు. ఇక్కడ కార్మిక వర్గ రాజ్యాధికారం కోరుకుంటున్న  మావోయిస్టు పార్టీ పట్ల భారత పాలకులు పూర్తిగా నిరంకుశ వైఖరి కలిగి ఉంటూనే, నిర్మూలనా చర్యలు చేపడుతున్నారు.

 మరో అంశం ఏమిటంటే, “సాయుధ  పోరాటం అవసరం లేదని అంటున్నవారు జాతీయ ఆకస్మిక తిరుగుబాట్లు గూర్చి కూడా మాట్లాడుతున్నారు.” అయితే ఇటీవల భారత పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో జరిగిన జన్ -జెడ్ ఉద్యమాలను పరిశీలిస్తే, అవి అక్కడ పాలక ప్రభుత్వాల పట్ల అసంతృప్తి మరియు అవినీతి వ్యతిరేక భావనతో తిరుగుబాట్లు చేయడం జరిగింది.  అక్కడ అవి ప్రభుత్వ మార్పిడికే దోహదపడ్డాయి తప్ప, అంబేద్కర్ గారు చెప్పినట్లుగా భూమి, పరిశ్రమలు జాతీయం చేయడం కోసం గానీ, మార్క్స్ చెప్పినట్లుగా ఉత్పత్తి సాధనాలు ఉత్పత్తి శక్తుల పరం కాబడే  కార్మిక వర్గ రాజ్యం ఏర్పాటు దిశగా గానీ  అవి సాగలేదు.

 కావున ప్రజా సమస్యల పట్ల, పర్యావరణ సమస్యల పట్ల పోరాడే ఉద్యమ సంస్థలకు రాజ్యాధికార లక్ష్యం లేనప్పుడు భారత పాలకవర్గాలు వాటిపట్ల సీరియస్ గా ఉండడం లేదు.  అదే రాజ్యాధికారం కోసమో, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం కోరుకుంటున్న  జాతుల పోరాటాల పట్లను వారు సాయుధంగా పోరాడినా, నిరాయుధంగా పోరాడినా భారత పాలకులు వాటిని  సీరియస్ గానే తీసుకొని, అణచివేత చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితులలో సాయుధ పోరాటాలకు ప్రాసంగికత ఉందా? లేదా? అన్నది పోరాడే సంస్థలు, ఆయా పార్టీలు నిర్ణయించుకోవలసిన అంశం. ఈ పోరాటాలకు బయట ఉన్న మనం నిర్ణయించవలసిన అంశం కాదు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు  ఆ పోరాటాల పట్ల పాలకవర్గాల వైఖరి, అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగయేతర అణచవేత చర్యలు పట్ల మాత్రమే స్పందించాలి. నేడు భారతీయ పౌర సమాజంలో ఆ రకమైన స్పందన కరువై పోవడం వలన కేంద్ర, రాష్ట్ర పాలకులు ఫాసిస్టుగా తయారు కాబడి సాయుధ పోరాటాల పట్లగాని, జాతుల పోరాటాల పట్లగాని అమానవీయంగా మారణకాండకు పాల్పడుతున్నారు. ఈ అమానవీయ చర్యలను ఖండిస్తున్న వారి పట్ల కేంద్ర, రాష్ట్ర పాలకులు ఉపా, పిడి యాక్ట్లు వంటి నల్ల చట్టాలను ప్రయోగించి, విచారణ పేరుతో సంవత్సరాల తరబడి చరశాల  పాల చేస్తున్నారు. పై అనుభవాలను బట్టి అర్థం అవుతున్నది ఏమంటే, ప్రజా ఉద్యమ సంస్థలు గాని, పార్టీలు గాని  పీడిత వర్గ కుల రాజ్యాధికారం కోసం పోరాడినప్పుడు మాత్రమే వాటికి తగిన ప్రాముఖ్యత భారత సమాజంలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.

 జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.

Leave a Reply