కశ్మీర్‌ ప్రభుత్వం 25 పుస్తకాలను నిషేధిస్తూ ఆగస్టు 5 నాడు జారీ చేసిన ఉత్తర్వు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట. మన దేశంలో పుస్తకాలను నిషేధించడం కొత్త కాదు. ఈ విషయంలో బ్రిటీష్‌ పాలకుల వారసత్వాన్ని మన ప్రభుత్వం నిస్సిగ్గుగా స్వీకరించింది. అయితే ఒకేసారి 25 పుస్తకాల జాబితా ఇచ్చి, వీటిని నిషేధిస్తున్నామని, ఆ కాపీలు ఎక్కడున్నా జప్తు చేస్తామని ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని విపరీత పోకడ. ఈ జాబితాలో కశ్మీర్‌ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పరిశోధనలు ఉన్నాయి. ఏండ్ల తరబడి అధ్యయనం చేసి, ఎన్నో డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసిన రచనలున్నాయి. ఎ జి నూరాని, అరుంధతి రాయ్‌, ప్రొ. సుమంత్ర బోస్‌ వంటి సుప్రసిద్ధ రచయితల పుస్తకాలున్నాయి. ప్రభుత్వం వీటన్నిటినీ ‘తప్పుడు కథనాల’ని పేర్కొంటూ ఒక్క కలం పోటుతో రద్దు చేసే ప్రయత్నం చేసింది. ఇది తనకు నచ్చని సాహిత్యం మీద, చరిత్ర పరిశోధనల మీద, పాత్రికేయ కథనాల మీద అక్కసు వెళ్లగక్కడంగాక మరోటి కాదు. ఈ పని చేసి ఆ పుస్తకాలను, రచయితలను చరిత్ర మరింత ఉన్నతంగా గుర్తు పెట్టుకునేలా చేసింది.
ఇటీవలి కాలంలో చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ తీసిన రజాకార్‌, కేరళ ఫైల్స్‌ వంటి చవకబారు సినిమాలకు అవార్డులిచ్చి తన నైజాన్ని చాటుకున్న ప్రభుత్వం నిజాయితీ గల చరిత్ర పరిశోధనల మీద నిరంకుశ చట్టాలను ప్రయోగించింది. ఆ పుస్తకాలు కశ్మీర్‌ యువతను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, అందులో అభ్యంతరకరమైన విషయాలున్నాయని, అవి దేశ సమగ్రతకు, శాంతి భద్రతలకు హాని కలిగిస్తాయని చెబుతూ భారతీయ నాగరిక సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌-సిఆర్‌పిసి స్థానంలో ప్రవేశపెట్టినది) సెక్షన్‌ 98 కింద వాటిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేసి కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తినే కాక, రాష్ట్ర హోదాను కూడా తొలగించి ఆ ప్రాంతాన్ని తన పూర్తి అధీనంలోకి తీసుకున్నాక దాన్ని మొత్తానికి మొత్తంగా బహిరంగ జైలుగా మార్చేసింది. కశ్మీర్‌ ప్రజల మనోభావాలను వ్యక్తం కానివ్వకుండా అణిచేసి ఎన్నికైన ప్రతినిధులను కూడా జైళ్లలో పెట్టింది. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే కశ్మీర్‌ అమరుల సంస్మరణలో పాల్గొననివ్వకుండా పోలీసులు అడ్డుకుంటే ఆయన గోడ దూకి వెళ్లాల్సి రావడం అందరూ చూసారు. కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘల గురించి అంతర్జాతీయ సంస్థలు ఎన్నో రిపోర్టులు ప్రచురించాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా నివేదికలు వచ్చాయి. భారత ప్రభుత్వం మాత్రం ఆర్టికల్‌ 370 రద్దును ఆ ప్రాంత ప్రజలు స్వాగతించారని, అది అభివృద్ధికి బాటలు వేస్తోందని చెబుతూ వస్తోంది. కశ్మీర్‌ గురించి అధికారికంగా వెలువడుతున్న వార్తలకు, అక్కడి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బైటి ప్రపంచానికి చెప్పడానికి అక్కడి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఎంతో మంది జర్నిలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఇప్పుడు అటువంటి వాస్తవ కథనాలతో పాటు, చరిత్రను కూడా ఉక్కుపాదంతో అణిచేయాలని కుట్ర పన్నారు. కశ్మీర్‌ చరిత్ర, కశ్మీర్‌ సంస్కృతి, అక్కడి ప్రజలు గర్వంగా చెప్పుకునే కశ్మీరియత్‌ ఉనికి పుస్తకాలు జప్తు చేస్తే మాసిపోయేది కాదు. అది కశ్మీర్‌ రక్తంలో ఉంది, కశ్మీర్‌ ప్రకృతిలో ఉంది. చరిత్రలో ఇటువంటి నిషేధాలన్నీ అభాసుపాలయ్యాయి. కశ్మీర్‌ చరిత్ర గురించి ప్రపంచమంతా తెలుసు. దేన్ని దాచాలని, దేన్ని అణిచివేయాలని ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిరది?
బహుశా ఇది కశ్మీర్‌తో ఆగదు. ఫాసిస్టు పాలకులకు చరిత్ర అన్నా, ప్రగతిశీల సాహిత్యమన్నా, జ్ఞానమన్నా కంటగింపు. ఎందుకంటే ప్రజలు నిజాలు తెలుసుకుంటే, జ్ఞానవంతులైతే వాళ్ల ఆటలు సాగవు. ఇప్పటివరకు అనధికారికంగా, తన గూండాలతో సాహిత్యం మీద, రచయితలు, బుద్ధిజీవుల మీద దాడులు చేయిస్తున్న ఫాసిస్టులు ఇప్పుడు అధికారికంగానే చట్టాన్ని ఉపయోగించుకుని ఆ పని చేయాలని చూస్తున్నారు. రచయితలు, ప్రజాస్వామికవాదులందరూ దీనిని తీవ్రంగా నిరసించాలి. తమ ధిక్కారాన్ని ప్రకటిస్తూ ఆ 25 పుస్తకాలను ఎత్తి పట్టాలి. చదవాలి, ప్రచారం చేయాలి. తక్షణం ప్రభుత్వం తన నిషేధ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేలా ఉద్యమించాలి. ఆ రకంగా మనం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకాలు ఇవి. ఇందులో అరుంధతి రాయ్‌ ‘ఆజాదీ’, ఎస్సార్‌, ఇఫ్రా తదితరులు రాసిన ‘కునన్‌ పోష్పోరా -మరువకూడని కశ్మీరీ స్త్రీల ప్రతిఘటన గాథ’ తెలుగులో కూడా ఉన్నాయి.

Leave a Reply