అమెరికన్ సామ్రాజ్యవాదం ఫాసిస్టు ఇజ్రాయిల్ పాలకులతో చేతులు కలిపిన తర్వాత పశ్చిమాసియాలోచమురు వనరులపై ఆధిపత్యం కోసం గల్ఫ్ దేశాలలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని గల్ఫ్ దేశాలు అమెరికా సైనిక రక్షణ పేరుతో ఆర్థికంగాను, వాణిజ్యపరంగాను అమెరికా ఆంక్షలకు తలలూపినా, ఇరాన్ మాత్రం అమెరికా ఆంక్షలకు తల వంచక పోవడం వలన, మొదట ఆర్థిక, వాణిజ్య పరమైన ఆంక్షలు ఇరాన్ దేశంపై విధించిన అమెరికా, ఇప్పుడు ఏకంగా ఇజ్రాయులకి ఇరాన్ కి గల శత్రుత్వాన్ని ఉపయోగించుకొని అణు, అన్వాయుధ తయారీ నిషేధం పేరుతో ఏకంగా ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించి, ఆదేశ అధ్యక్షునితో పాటుగా ముఖ్యమైన సైనిక అధికారులను ఇజ్రాయిల్ తో దాడి చేయించి హతమార్చడం జరిగింది. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ లోని పాఠశాల పిల్లలు దగ్గరనుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజానీకం వరకు మానవ హననానికి ఒడిగట్టింది. ఈ యుద్ధం నేటికి ఈ వ్యాసం రాసిన నాటికి నెల రోజులు కావస్తున్నా అమెరికా, ఇజ్రాయిల్ అమానవీయ దాడులు ఇరాన్ పై జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి పాలకులు భారతదేశ చిరకాల మిత్ర దేశమైన ఇరాన్ ను వదిలిపెట్టి, అమెరికా, ఇజ్రాయిల్ ఫాసిస్టు పాలకులకు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ బంధానికి వారి భావజాల బంధమే కారణము. అమెరికన్ పెట్టుబడిదారీ వర్గం గల్ఫ్ దేశాల చమరు సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గానే, భారత పెట్టుబడిదారీ వర్గం మధ్య భారతంలోనూ, దండకారణ్యంలోను ఖనిజ సంపదను దోచుకోవడానికి అమెరికా, ఇజ్రాయిల్ సహాయ సహకారాలను పొందుతున్నారు. ఈ దోపిడీ బంధాలు మరింతగా బలపడి, గత సంవత్సర కాలంగా జెల్, జంగిల్, జమీన్ కోసం చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్న ఆదివాసి ప్రజలను ఊచకోత కోస్తున్నారు. ఆదివాసీ ప్రజల పోరాటాలకు అండగా ఉన్న విప్లవకారులను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపుతున్నారు. ఇందుకు గాను వారిని చంపటానికి ఇజ్రాయిల్ ఇచ్చిన డ్రోన్ లను, అధునాతన ఆయుధాలను భారత పాలకవర్గాలు తమ సొంత ప్రజల పైన ఉపయోగిస్తున్నారు.
అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయిల్ పాలకులు, దేశీయంగా ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి పాలకులు అంతర్జాతీయ, జాతీయ మానవ హక్కులను నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ, దారుణంగా మానవ హననానికి పాల్పడుతున్నారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు నిరసన వ్యక్తం చేసినప్పటికి, వీరి ఆర్థిక, వాణిజ్య పరమైన దోపిడీ విధానాలను కొనసాగించడానికి యుద్ధకాండను కొనసాగిస్తున్నారు. ఫలితంగా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో పాటుగా నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజల జీవన విధానం జాతీయం గాను, అంతర్జాతీయం గానూ అతలాకుతలం కాబడుతున్నాయి. వీరి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రపంచ ప్రజానీకంతో పాటుగా ఇజ్రాయిల్, అమెరికా ప్రజలు కూడా వీధులలో బహిరంగ నిరసన ప్రదర్శన లు చేపడుతున్నారు. అటు అమెరికన్ సామ్రాజవాదాన్ని ఓడించడానికి గాని, ఇటు ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి పాలకుల ఫాసిస్టు విధానాలను ఓడించడానికి గాని, ప్రజల ప్రతిఘటనా పోరాటాలే సరైన మార్గంగా భావిద్దాం.
జిల్లా కార్యవర్గ సభ్యుడు, ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.




