ఏ మట్టి పొత్తిళ్ళలోంచి
కన్ను తెరుస్తుందో
విత్తనం
మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది
ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే
మాయమైపోవడం కాదు
పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా
పైకి కనబడని గాయాలనుండి
తొణికే కన్నీటి బొట్లే
అమ్మ గుండెల్లోంచి పట్టిన పాలవలే
కన్నీళ్ళన్నీ కూడా చిక్కటి రక్తమే
కన్నీళ్ళతో మట్టి, చిత్తడి మత్తడిగా తడిచిన తర్వాతే
తురాయిపూలు ఎర్ర రంగు పులుముకున్నాయి
ఆకలేసినవాడికి అన్నం మెతుకులు పండాయి
ఆశలకి ఆధారం దొరికింది
చెట్లను కూల్చేయడమంటే అడవి మాయమైపోవడం కాదు
కొమ్మల వేల చేతుల్నెత్తి
పిల్లల్ని చంకనెత్తుకునే తల్లులందరూ
మట్టిలోంచే మళ్ళీ మళ్లీ పుడతారు
గుట్టల్ని లోయల్ని జల్లెడపట్టిన డ్రోన్లకి
ధాన్యపు కంకుల్లా పుట్టే
మట్టి రంగూ వాసనలు తెలీవు
మట్టి -
తల్లి, బిడ్డల్ని జోకెట్టే తావు
నిదురించే వాళ్ళ ముఖాలలోని
కాంతి పుంజాల్ని దాచుకున్న అద్భుత లాంతరు
మార్చి 31 కి టార్గెట్లు పెట్టడం
బ్యాంకుల్లో మాత్రమే ఉంటుందనుకున్నాను
లాభనష్టాల బాలన్షీట్ వలే
చావుపుట్టుకల లెక్క తేల్చడానికి
ఎన్ని ఆర్థిక సంవత్సరాల ఆయువైనా సరిపోదు
ఇప్పుడు మట్టిలోకి తలవాల్చేసిన వాళ్ళంతా
సమాధుల్ని సంగీత వాద్యాలుగా మలచినవాళ్ళు
విక్టర్ జారా గిటార్ తీగెల్ని చుట్టుకుని ఇక్కడే పడుకున్నాడు
పాణిగ్రాహి జముకును కూడా ఇక్కడే భద్రపరిచారు
చేగువేరా, రోజాలగ్జెంబర్గ్, మిడ్కో, హిడ్మా,
కడసారి చూసుకోనివ్వని బస్వరాజూ,
నేల డప్పులోంచి వెర్రి మోతై మోగుతున్నప్పుడు
మట్టిలో ఉండే అండర్గ్రౌండ్ ఆలాపన
ఈ ప్రేమమయ ప్రపంచాల్ని ఉర్రూతలూగిస్తుంది
ప్రజాయుద్ధంలో మరణించినవాళ్ళంతా
అలుపు తీర్చుకుంటున్న రేలపాటల సవ్వళ్ళు
కుల వివక్షల్లోంచి
బతుకు వ్యత్యాసాల్లోంచి రగిలిన నిస్సహాయతే
మట్టిలో ప్రవహించే లావా నది
మట్టి కడుపు, నివురుగప్పిన నిప్పు
మనుషుల్ని చంపినంత సులువు కాదు
పునర్జన్మించే విత్తనాల్ని
మట్టుబెట్టడం
ఎదురుతిరగడంలో
చావు పుటక మాత్రమే కాకుండా
ఇంకోటేదో ఉంటుంది
Related
మొదలు, చివర బాగుంది.
ఇంతకీ ఇందులో కవిత్వం ఎక్కడుంది! – ఓ రీడర్