2026 ఫిబ్రవరి 20

ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్‌గఢ్‌లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే… మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్‌పాత్‌లతో కూడిన రహదారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటికి ఆవల దశాబ్దాలుగా ఒక పోరాటం సాగుతోంది, కానీ అది ప్రధాన స్రవంతిలో ఎక్కడా కనిపించదు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (ఎస్‌ఎఐఎల్) నడుపుతున్న భారీ రూర్కెలా స్టీల్ ప్లాంట్  కారణంగా రూర్కెలాను ఒడిశా ఉక్కు నగరం” (ఇస్పాత్ నగర్) గా పిలుస్తారు.

భారతదేశ పారిశ్రామిక “అభివృద్ధి”కి, అపారమైన ఖనిజ నిక్షేపాలకు రూర్కెలా ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా, అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను రూపొందించే ప్రధాన కేంద్రంగా కూడా దీనికి పేరుంది; ఇక్కడ ఆదివాసీ విప్లవ వీరుడు బిర్సా ముండా పేరు మీద బిర్సా ముండా హాకీ స్టేడియం అనే భారీ స్టేడియం కూడా ఉంది.

1950వ దశకంలో, ఎస్‌ఎఐఎల్ సంస్థ ప్లాంట్‌ను ప్రారంభించడానికి రూర్కెలాకు వచ్చినప్పుడు, అక్కడ ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉండేవి. నేటి విలాసవంతమైన హోటళ్లకు ఆవల… కష్టపడి పనిచేసే రైతాంగం ఉండేవారు; పురాతన సంప్రదాయాలు, పచ్చని కొండలు, అడవులు ఉండేవి.

“ఈ అభివృద్ధిని వారు ఎవరి కోసం చేస్తున్నారో” అని 49 ఏళ్ల ఆదివాసీ రైతు సోమ్రా ఎక్కా ఆశ్చర్యపోయారు.

గాలి వేగంగా వీస్తున్న ఒక రోజున, స్టీల్ ప్లాంట్‌కు కొంచెం దూరంలో ఒక పెనుమార్పుకు సిద్ధంగా ఉంది—చాలా మంది అది ఇప్పటికే మొదలైంది అని నమ్ముతారు.

రూర్కెలా పరిధిలోని బొండముండా ప్రాంతంలోకి ప్రవేశించగానే, మనకు విశాలమైన సాగుభూములు కనిపిస్తాయి; వాటికి దగ్గరలోనే బర్కానీ గ్రామం ఉంది. కేవలం కొన్ని నెలల క్రితం వరకు ఈ గ్రామం ఒక బలమైన ప్రతిఘటన ఉద్యమానికి వేదికగా నిలిచింది.

బర్కా గ్రామ ప్రవేశంలో నిరసన పోస్టరు

గ్రామంలోకి ప్రవేశించే ముందే, ఆ విశాలమైన పొలాల మధ్య మనకు ఒక ఒంటరి సమాధి కనిపిస్తుంది—అది ఒక అమరవీరుడి స్మారకం. నల్లటి మార్బుల్ రాయితో అలంకరించబడిన ఆ సమాధిపై ఏతో ఎక్కా అనే పేరు రాసి ఉంది. రాబోయే తరాలకు అతను ఆ గ్రామ వీరుడిగా గుర్తుండిపోతాడు.

ఏతో ఎక్కా స్మారకం       

                                                 సోమ్రా ఎక్కా- ఏతో ఎక్కా సోదరుడు

ఏతో ఎక్కా ‘ఒరాన్’ తెగకు చెందిన 43 ఏళ్ల రైతు. 2025 ఏప్రిల్‌లో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో అతన్ని హత్య చేసారు. అతని మరణం ఒక విషాదంలో మునిగిపోయిన కుటుంబాన్ని, ఈనాటికీ కొనసాగుతున్న అన్యాయాన్ని మనకు గుర్తుచేస్తుంది.

నివాసాల తరలింపు మధ్య రైల్వే విస్తరణ

రూర్కెలా, దాని చుట్టూ ఉన్న సుందర్‌గఢ్ జిల్లాలో ప్రధానంగా ‘ఒరాన్’, ‘కిసాన్’, ‘ఖరియా’, ‘ముండా’, ‘హో’ వంటి ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి. నిరంతర మైనింగ్, అంతులేని అక్రమ విస్తరణల కారణంగా ఈ తెగల జనాభా తగ్గిపోతోందని పలువురు నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితుల మధ్య—బొండముండా మార్గంలో రద్దీని తగ్గించడానికి, కోయిడా మైనింగ్ ప్రాంతాల నుండి ముడి సరుకును రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కి సులభంగా తరలించడానికి—’బర్కానీ’ మీదుగా రెండవ డబుల్ ట్రాక్ లైన్‌ను అభివృద్ధి చేస్తోందని మీడియా, ఇతర వ్యక్తిగత సమాచారం ద్వారా గ్రామస్తులకు తెలిసింది.

రైలు ప్రాజెక్టు స్థలం

ఒడిశాలోని సుందర్‌గఢ్, తదితర ప్రాంతాలలో గనుల తవ్వకం, విస్తరణ, పరిహారం, పునరావాసం తదితర సమస్యలపై పోరాడుతున్న ‘ఐదవ షెడ్యూల్ గ్రామాల’ సమాహారం ఫిఫ్త్ షెడ్యూల్ యూనియన్. ఈ యూనియన్ షెడ్యూల్డ్ ప్రాంతాలు- షెడ్యూల్డ్ తెగల పరిపాలన, నియంత్రణకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కలిగి ఉన్న భారత రాజ్యాంగంలోని ‘ఐదవ షెడ్యూల్’ను ఆధారంగా చేసుకుని పోరాటం సాగిస్తోంది. 1954లో ఎస్‌ఎఐఎల్ ఒక ఉక్కు కర్మాగార స్థాపనను ప్రతిపాదించినప్పుడు, ఆ ప్రాజెక్టు కోసం ఎన్నో ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని ఈ యూనియన్ సభ్యుడు, ఆదివాసీ సామాజిక కార్యకర్త అయిన సునీల్ కుమార్ జోజో  చెప్పారు.

ఆ సమయంలో, ఒడిశా ప్రభుత్వం రూర్కేలా స్టీల్ ప్లాంట్ కోసం 33 గ్రామాల వ్యాప్తంగా సుమారు 15,000 ఎకరాల భూమిని సేకరించింది. 1959లో 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

“ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. రూర్కెలా అనేది ఆదివాసీ గ్రామాల సమాహారం తప్ప మరేమీ కాదు, కానీ ఆ చరిత్ర తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్టీల్ ప్లాంట్‌ను జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారంతో నిర్మించారు,” అని ఆయన చెప్పారు.

ఎస్‌ఎఐఎల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, రూర్కేలా స్టీల్ ప్లాంట్‌ని జర్మనీ సహకారంతో 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్థాపించారు. ఆ తరువాత, దీని సామర్థ్యం 2 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 1.9 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్, 1.67 మిలియన్ టన్నుల అమ్మదగిన ఉక్కు స్థాయికి పెంచారు.

“భారీ ఆధునీకరణ, విస్తరణను అమలు చేసిన తర్వాత, రూర్కెలా స్టీల్ ప్లాంట్ తన సామర్థ్యాన్ని 4.5 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 4.2 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌కు పెంచుకుంది” అని వెబ్‌సైట్ పేర్కొంది.

నివేదికల ప్రకారం, దశాబ్ద కాలంగా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రాజెక్టు తన కార్యకలాపాలను ఆశించిన స్థాయిలో విస్తరించలేదు కాబట్టి ఉపయోగించని అదనపు భూములను తమకు తిరిగి ఇచ్చేయాలని నిర్వాసిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

స్టీలు ప్లాంటు కోసం ఉపయోగించని అదనపు భూమిలో కొంత ప్రాంతం

స్టీల్ ప్లాంట్, బయటి నుండి వచ్చే ఉద్యోగులు నివసించే ‘టౌన్‌షిప్’ కోసం భూమిని సేకరించినప్పటికీ, చాలా భూమి మిగిలిపోయిందని జోజో తెలిపారు. “ఈ టౌన్‌షిప్‌లో దుకాణాలు, మాల్స్ మొదలుకొని అన్ని సౌకర్యాలు ఉంటాయి. వారు 33 గ్రామాలను ఖాళీ చేయించి, మొత్తం 33,000 ఎకరాల భూమిని సేకరించారు,” అని ఆయన చెప్పారు.

2008లో, నిర్వాసితులకు ఈ మిగులు భూమిని తిరిగి ఇవ్వాలని కోరుతూ ఒడిశా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో ఇలా ఉంది:

“…రూర్కెలా స్టీల్ ప్లాంట్ సేకరించిన భూమిని పూర్తిగా వినియోగించుకోలేదు. దాదాపు 4,000 ఎకరాల ఉపయోగించని భూమిని వివిధ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. నిర్వాసితులందరికీ సరైన పునరావాస సౌకర్యాలు కల్పించకపోవడంతో, వారిలో కొందరు ఆ భూముల్లోనే నివాసం ఉంటున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని అసలు యజమానులకు తిరిగి ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా వివిధ ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ప్రైవేట్ వ్యక్తుల గృహ నిర్మాణ అవసరాలకు కేటాయించింది. అసలు భూ యజమానులను ‘ఆక్రమణదారులు’గా పరిగణిస్తూ, O.P.L.E చట్టం నిబంధనల ప్రకారం వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తోంది.”

భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే ఈ భూమి, “అసలు మొదటి నుండి ప్రభుత్వం లేదా కంపెనీది కాదు” అని జోజో వివరించారు. 1950ల నుండి పదేపదే నిరాశ్రయులవుతున్న ఆదివాసీ సముదాయాల పోరాటానికి, ఈ కొత్త రైల్వే ప్రాజెక్టు మరొక చావు దెబ్బ.

తెలుగు: పద్మ కొండిపర్తి https://maktoobmedia.com/india/months-after-tribal-man-killed-for-protesting-rail-expansion-in-odishas-rourkela-threat-of-displacement-still-looms

Leave a Reply