2026 మార్చి 5

 (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.)

మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు… వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి.

68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న ‘లంజీబెర్నా’ అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక ఆదివాసీ మహిళ. ఒక మిషనరీ స్కూల్‌లో టీచర్‌గా రిటైర్ అయిన కుల్లు, తన మనవలు మనవరాళ్లకు ఒక గొప్ప వారసత్వాన్ని అందిస్తూ ప్రశాంతంగా జీవించాలని అనుకున్నది. కానీ ఇప్పుడు, ఆ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఆమె మండుటెండలో పోరాడుతోంది.

“మేము ఆదివాసీలం. మా ఉనికి అంతా ఈ భూమిలోనే ఉంది. మేము మొక్కలను పెంచుతాం, జంతువులకు మేత వేస్తాం; ఈ పర్యావరణాన్ని సజీవంగా ఉంచుతాం. కానీ ఇప్పుడు, కార్పొరేట్ సంస్థల దురాశ వల్ల అదే పర్యావరణం కుప్పకూలిపోతోంది,” అని లంజీబెర్నాలోని తన సాధారణ ఇటుకల ఇంట్లో కూర్చుని కుల్లు చెప్పారు.

ప్రస్తుతం లంజీబెర్నా గ్రామం దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్‘ (DCBL) అనే కార్పొరేట్ దిగ్గజానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు కేంద్ర బిందువుగా ఉన్నది.

ఫిబ్రవరి 25న, నాలుగు ప్లాటూన్ల ఒడిశా పోలీసులు, కంపెనీ తరపున వచ్చిన కొందరు వ్యక్తులు జెసిబిలతో లంజీబెర్నాలోకి వచ్చి, స్థానికులు నిరసనలు తెలుపుతున్నప్పటికీ, అప్పటికే పాడు చేసిన పొలాలను వారు తవ్వడం ప్రారంభించారు.

ఇలాంటి ఘటనే 2025 డిసెంబర్ 13న కూడా జరిగింది. అర్ధరాత్రి వేళ, భారీ పోలీసు బందోబస్తు మధ్య తమ వ్యవసాయ భూమిని ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సిమెంట్ కంపెనీ తన మైనింగ్ ప్రాజెక్టు విస్తరణ కోసం 28 ఎకరాల సాగు భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుందని స్థానికులు ‘మక్తూబ్’తో చెప్పారు.

పోలీసుల బలప్రయోగం

ఫిబ్రవరి 25న జరిగిన సంఘటనకు ముందే మా ప్రతినిధి ఈ గ్రామానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే, జెసిబిలు వ్యవసాయ భూమిని ధ్వంసం చేసి, ట్రక్కుల రాకపోకల కోసం ఒక రోడ్డుని నిర్మించాయి. ఈ సంఘటన 2025 డిసెంబర్ 13న జరిగింది.

డిసెంబర్‌లో తన 3 ఎకరాల భూమిని కోల్పోయిన కుల్లు, మా ప్రతినిధిని ఆ ప్రాంతమంతా తిప్పి చూపించి, “మైనింగ్ కోసం వేసే ఈ రోడ్డు కోసం వారు నా భూమిని నాశనం చేశారు. ఈ కంపెనీ మా భూమి నుండి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను, మేము పడాల్సిన కష్టాలు పడ్డాం, ఇక చాలు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రిటైర్డ్ టీచర్ అయిన 68 సంవత్సరాల కుల్లు, తన 20వ ఏట వివాహమై లంజీబెర్నాకు వచ్చారు. అప్పటి నుండి ఆమె ఆ భూమిని సాగు చేస్తూనే ఉన్నారు. “నా మామగారు, అత్తగారు.. ఆ తర్వాత నా భర్త, నేను.. మేమంతా ఈ భూమిని కన్నబిడ్డలా సాకుతూ వచ్చాము,” అని ఆమె అన్నారు.

ఈ పరిస్థితి ఆమెను ఎంతటి మానసిక వేదనకు గురిచేసిందంటే, ప్రారంభ రోజుల్లో ఆమె అన్నం తినడం కూడా మానేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. “ఇప్పుడు నాకు ఏదీ సంతోషాన్ని ఇవ్వడం లేదు. డిసెంబర్ నుండి నేను మాంసాహారం తినడం మానేశాను,” అని ఆమె చెప్పారు.

2025 డిసెంబర్ 16న జరిగిన సంఘటన నుండి ప్రజలు ఇంకా తేరుకోకముందే, ఫిబ్రవరి 25న జరిగిన పరిణామాలు వారిని మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ, ఆ రోజున కూడా తవ్వకాలు కొనసాగాయి.

ప్రజలందరూ అక్కడ గుమిగూడారు. కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌ని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతాన్ని నిరసన వేదికగా మార్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

లంజీబెర్నా నివాసి అయిన నీరంజన్ కెర్కెట్టా అనే యువకుడు “అక్రమ విస్తరణను అడ్డుకుంటున్న పురుషులను, మహిళలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని అందరినీ బలవంతంగా వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు,” అని తెలిపాడు.

కుల్లు కూడా వారిలో ఒకరు. తన భూమి ధ్వంసం కావడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె, అధికారులను నిలదీశారు. “ఒక బలహీనమైన వృద్ధురాలిని అయిన నేను వారి మధ్యలో నిలబడి.. ఇది ఎందుకు చేస్తున్నారు? మా భూములను అక్రమంగా ఎలా కూల్చివేస్తారు? అని ప్రశ్నించాను. కానీ వారు నన్ను పక్కకు తోసివేశారు,” అని ఆమె ఆవేదన చెందారు.

ఫిబ్రవరి 27న, సహనం నశించిన గ్రామస్థులు ఆ ప్రాంతానికి దూసుకెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు. కెర్కెట్టా తీసిన వీడియోలలో.. ప్రజలు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడం, పోలీసు అధికారుల వెంట పడటం కనిపిస్తుంది. అయితే, నిరసనకారులపై పోలీసులు మరింత బలప్రయోగానికి దిగారు.

“ప్రపంచానికి నిజం తెలియకూడదని వారు ప్రత్యేకంగా వీడియోలు తీస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు,” అని కెర్కెట్టా అన్నారు.

గ్రామస్థులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా తెలుసుకున్న మా ప్రతినిధి వివరణ కోసం ‘మక్తూబ్’ సుందర్‌గఢ్ జిల్లా కలెక్టర్ను, డిఎం సుభంకర్ మహాపాత్రను సంప్రదిస్తే ఎటువంటి స్పందన రాలేదు.

పట్టించుకోని చట్టపర అంశాలు

లాంజీ బెర్న లో గనులతవ్వకం

లంజీబెర్నా ప్రజలకు, దాల్మియా సిమెంట్ (గతంలో ఒసిఎల్ ఇండియా లిమిటెడ్) కు మధ్య ఉన్న ప్రతిష్టంభన చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. ‘ఒరాన్’, ‘కిసాన్’, ‘ఖరియా’ తెగలకు చెందిన ఈ సామాజిక వర్గం, ఆ ప్రాంతంలో జరుగుతున్న గని తవ్వకాలకు, వాటి విస్తరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది.

దాల్మియా గ్రూప్ సంస్థ అయిన ఒసిఎల్ ఇండియా, 1951 నుండి రాజ్‌గంగ్‌పూర్ బ్లాక్‌లోని లంజీబెర్నా మైనింగ్ నుండి సున్నపురాయి, డోలమైట్‌లను సేకరిస్తూ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాలక్రమేణా ఇది తన సిమెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని, మైనింగ్ ప్రాంతాన్ని విస్తరిస్తూ వచ్చింది.

2017లో, ప్లాంట్ సామర్థ్యాన్ని 4.2 MTPA నుండి 9.5 MTPAకి పెంచాలని, మైనింగ్ ప్రాంతాన్ని మరింత విస్తరించాలని సంస్థ ప్రతిపాదించింది. ఈ విస్తరణ కోసం, కుత్రా, రాజ్‌గంగ్‌పూర్ బ్లాక్‌ల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీలలో విస్తరించి ఉన్న ఏడు రెవెన్యూ గ్రామాల నుండి 990.67 ఎకరాల ప్రైవేట్ వ్యవసాయ భూమిని సేకరించాలని ఒడిశా ప్రభుత్వం (ఫిబ్రవరి 2020; ఫిబ్రవరి 2021లో) నోటీసులు జారీ చేసింది.

కుకుడా గ్రామ నివాసి, స్థానిక కార్యకర్త, ఈ కేసులో పిటిషనర్ అయిన 46 ఏళ్ల బిబోల్ టొప్పో పెసా చట్టం-1996 ఉనికిలో ఉన్నప్పటికీ, ఐదవ షెడ్యూల్ కిందకు వచ్చే ఒడిశాలో అది అమలు కావడం లేదని చెప్పారు.

భారతదేశంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలకు స్వయంపాలనను విస్తరించడానికి పెసాచట్టం-1996ను రూపొందించారు. ఇది భూమి, అడవులు, చిన్న తరహా ఖనిజాలు, స్థానిక వనరులు, వివాద పరిష్కారాలపై గ్రామసభలకు గణనీయమైన అధికారాలను ఇస్తుంది.

అయితే, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి 10 రాష్ట్రాలలో ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నప్పటికీ, కేవలం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే అధికారికంగా పెసా చట్ట నిబంధనలను ప్రకటించాయి. దీనివల్ల జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో చట్టపరమైన అస్పష్టత నెలకొంది.

“కేంద్రం పట్టించుకోలేదు, పెసా చట్టాన్ని చేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చేయలేదు. అక్కడ ఇప్పటికీ నిబంధనల అమలులో పొంతన లేదు. దీని అర్థం ఏమిటంటే.. పెసా చట్టం అమలు కాకపోతే, ఐదవ షెడ్యూల్ అమలు కానట్లే,” అని ఆయన అన్నారు.

కుకుడాలో 406.74 ఎకరాలు, లంజీబెర్నాలో 27.51 ఎకరాలు, బిహబంద్ గ్రామాలలో 39.01 ఎకరాల భూసేకరణ కోసం 2020 జనవరి 26న గ్రామసభలు నిర్వహించాలని 2020 జనవరి 6న, సుందర్‌గఢ్ జిల్లా సబ్-కలెక్టర్ కుకుడా, కతంగ్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు లేఖల ద్వారా ఆదేశించారు. అలాగే జనవరి 10న అలంద, కేషర్మల్, ఝగర్‌పూర్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు కూడా లేఖలు పంపారు.

2020 జనవరి 26న ఐదు పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయని, అన్ని గ్రామసభలు మైనింగ్ విస్తరణను ముక్తకంఠంతో తిరస్కరించాయి లేదా వ్యతిరేకించాయని టొప్పో తెలిపారు. అయితే, గ్రామసభలు వ్యతిరేకించినప్పటికీ, ప్రజలు దీనిని ఆమోదించినట్లుగా కోర్టుకు తెలియచేసారని టొప్పో నొక్కి చెప్పారు.

ప్రజల సమ్మతి ఉన్నది అంటూ కోర్టులో ఇచ్చిన రాతపూర్వక పిటిషన్

మరణించిన వ్యక్తుల సంతకాలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. అనేక నకిలీ సంతకాలు కూడా కనబడ్డాయని లంజీబెర్నా నివాసి, కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన ఫ్లోరియన్ డంగ్ డంగ్ చెప్పారు.

“తాము ఎటువంటి ఫారమ్‌లపై సంతకం చేయలేదని లేదా ఎక్కడా సమ్మతి తెలపలేదని గ్రామస్తులు మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కంపెనీలు ఇంతటి దిగజారుడు స్థాయికి చేరుకున్నాయి,” అని ఆయన అన్నారు. పెళ్లి చేసుకొని వేరే గ్రామాలకు వెళ్ళిన మహిళలతో కూడా మాయమాటలు చెప్పి సంతకాలు చేయించి, వాటిని ప్రజల ఆమోద ముద్రగా కోర్టులో సమర్పించారు.

భూసేకరణకు గ్రామసభ సమ్మతి తప్పనిసరని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం పాటించలేదు.

భూసేకరణలో పారదర్శకత, సరైన పరిహారం , పునరావాస చట్టం (LARR), 2013 లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా.. 2021లో ఒడిశా ప్రభుత్వం గ్రామసభ సమ్మతి పొందకముందే ప్రాథమిక నోటిఫికేషన్లను విడుదల చేసి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది.

2024 సెప్టెంబర్ 6నాడు లంజీబెర్నా మైనింగ్ విస్తరణను అడ్డుకోవాలని 12 మంది గ్రామస్తులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఒడిశా హైకోర్టు కొట్టివేసింది. అయితే, 2017 నుండి 2022 వరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూ యాజమాన్య నిర్వహణపై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ CAG -) నిర్వహించిన పనితీరు ఆడిట్ నివేదికలో.. “రాష్ట్రవ్యాప్తంగా జరిగిన  భూసేకరణలో విధానపరమైన లోపాలు ఉన్నాయని, ప్రక్రియ దుర్వినియోగం జరిగిందని ” వేలెత్తి చూపింది.

కాగ్ నివేదిక ప్రకారం—కలహండి, కోరాపుట్, మయూర్ భంజ్, సుందర్‌గఢ్ జిల్లాల్లో చట్టపరమైన రక్షణలు ఉన్నప్పటికీ.. “గ్రామసభ సమావేశాలు నిర్వహించకుండా, గ్రామసభ అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ, అవసరమైన కోరం (సభ్యుల సంఖ్య) లేకుండానే సమ్మతి పొందుతూ, ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత గ్రామసభ సమావేశాలు నిర్వహిస్తూ” భూసేకరణ ప్రక్రియను కొనసాగించారు.

తమ నివాస గృహాలకు ‘పట్టా’ ఉన్నప్పటికీ, సాగు భూమికి మాత్రం పట్టా లేదని కుల్లు వివరించారు. “మేము దశాబ్దాలుగా ఈ భూమిని సాగు చేస్తున్నాము, కానీ వారు చాలా తెలివిగా మాకు వ్యవసాయ భూమికి పట్టా ఇవ్వలేదు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిని కాపాడుకోవడానికి పోరాటం

లంజీబెర్నా ప్రాంతంలో ప్రతిపాదించిన సున్నపురాయి మైనింగ్ విస్తరణ ప్రభావం నేరుగా ఐదు గ్రామ పంచాయతీలపై పడుతోంది. అవి — కతంగ్, కుకుడా, అలంద, కేస్రమల్, ఝగర్‌పూర్.

ఫిబ్రవరి 25 నాటి ఘటనకు కొన్ని రోజుల ముందు, మా ప్రతినిధి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ భూమిలో పాతుకుపోయిన శతాబ్దాల చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడానికి తాము దేనికైనా సిద్ధమని వారు ‘మక్తూబ్’తో చెప్పారు. తమ భూమిలో ఎటువంటి మైనింగ్ జరగకూడదని వారు ముక్తకంఠంతో తిరస్కరించారు; వారిలో తీవ్రమైన ఆగ్రహం, అసంతృప్తి కనిపిస్తున్నాయి.

మరోవైపు, లంజీబెర్నాలో దశాబ్దాలుగా మైనింగ్ జరుగుతున్నప్పటికీ, దాల్మియా కంపెనీ వాగ్దానం చేసినట్లుగా స్థానిక ప్రజలకు ఎటువంటి ఉపాధి కల్పించలేదని కెర్కెట్టా వివరించారు. “నిజానికి, వారు ఇక్కడ పని చేయడానికి ఒడిశా బయట నుండి వ్యక్తులను తీసుకువచ్చారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న కుటుంబ స్మశానవాటికలో నిలబడి, కుల్లు చనిపోయిన తన భర్త సమాధి వైపు చూస్తూ “ఆయన చాలా మంచి మనిషి” అని మెల్లగా అన్నది.

పోలీసులు ధ్వంసం చేసిన తన పొలం లో మేరీ జేమ కుల్లు

Mary Jema Kullu on her agricultural land that was demolished by Dalmia in presence of police officials on 13 December 2025. Photo taken on February 21. Photo credit: Nikita Jain

తమ పూర్వీకుల స్మశానవాటిక వెనుక ఒక భారీ మైనింగ్ వ్యర్థాల కుప్ప కనపడుతోంది. “ఇది మా పూర్వీకుల స్మశానమని, ఇక్కడ మైనింగ్ చేయవద్దని మేము వారికి చెప్పాము, కానీ వారు వినలేదు. చివరికి ఈ స్మశానవాటికను కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు, కానీ మేమంతా అడ్డుకున్నాము,” అని కుల్లు వివరించారు.

తన కుటుంబ సభ్యులందరినీ అక్కడే సమాధి చేసామని చెప్పింది. పక్కపక్కనే ఉండి, కొత్తగా రంగులు వేసి ఉన్న రెండు సమాధులను చూపిస్తూ… “అవి నా అత్తగారు, మామగారి సమాధులు” అని అన్నది.

గ్రామమంతటా నిరంతరం వినిపించే బ్లాస్టింగ్ , మైనింగ్ శబ్దాల మధ్య… శబ్ద, వాయు, జల కాలుష్యంతో గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను మా ప్రతినిధి స్వయంగా గమనించారు.

మైనింగ్ వల్ల వచ్చే తెల్లటి దుమ్ముతో గ్రామమంతా నిండిపోయింది.

“ముఖ్యంగా రాత్రిపూట బట్టలు ఆరవేయడం పెద్ద తప్పిదం, ఎందుకంటే మరుసటి రోజు అవి పూర్తిగా దుమ్ముతో నిండిపోతాయి” అని కుల్లు అన్నది.

2025 డిసెంబర్ 16న, భూమి విస్తరణ కోసం 300కు పైగా చెట్లను నరికివేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

“మేము దీనిని వ్యతిరేకిస్తున్నాము. వారు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు” అని ఖచ్చితంగా చెప్పింది.

ఈ కంపెనీ ఏ స్థాయికైనా తెగించగలదని ఇటీవలి పరిణామాలు గ్రామస్థులకు అర్థమయ్యేలా చేశాయి.

“ఇది వినడానికి నాటకీయంగా అనిపించవచ్చు, కానీ నా చివరి శ్వాస వరకు ఈ దుష్ట కంపెనీపై పోరాడుతూనే ఉంటాను” అని అన్నది.

కొన్ని రోజుల క్రితం, జెసిబిల వల్ల విధ్వంసానికి గురై ఎడారిలా మారిన తన పొలాన్ని మా ప్రతినిధికి చూపిస్తూ, అక్కడ గతంలో ఉన్న జీవకళను ఆమె గుర్తు చేసుకున్నది. “ఇది పప్పు ధాన్యాలు పండే సమయం,” అంటూ విషాదంగా నవ్వింది. ఆ శిథిలాల మధ్య ఇంకా ఎక్కడైనా ప్రాణం ఉందేమోనని వెతుకుతూ… అక్కడ మిగిలి ఉన్న కొంచెం గడ్డి వైపు చూపిస్తూ “చూడండి! ఇది ఇంకా పెరుగుతోంది” అని అన్నది.

ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, కెమెరా క్లిక్ మన్నప్పుడల్లా చిరునవ్వుతోనే కనిపించింది. “నేను కెమెరా ముందు నా బాధని చూపించలేను, అలా ఉండటం నాకు ఇష్టం లేదు. మా పూర్వీకులు అమాయకులు, అందుకే ఈ కంపెనీలను అనుమతించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాకు ఇవి అస్సలు వద్దు. వారు ఇంకెక్కడైనా మైనింగ్ చేసుకోవచ్చు, కానీ మా దగ్గర మాత్రం ఇక చాలు” అని స్పష్టం చేసింది.

 ఆ శిథిలాల మధ్య అక్కడక్కడా పప్పు ధాన్యాల మొక్కలు కనిపిస్తున్నాయి. కొట్టేయకుండా మిగిలి ఉన్న కొన్ని చెట్లను చూపించి చిరునవ్వు చిందించింది.

ఆ భూమి మధ్యలో గడ్డితో కట్టిన ఒక చిన్న గుడిసెని చూపిస్తూ… “ఎన్ని బుల్డోజర్లు వచ్చినా, ఇది ఇంకా నా భూమి అని వారికి చూపించడానికి నేను దీనిని కట్టాను” అని నవ్వుతూ అన్నది.

గ్రామస్థులు మళ్ళీ ఆ భూమిని సాగులోకి తీసుకురావాలని అనుకున్నారు, కానీ ఫిబ్రవరి 25న ఆ ఆశలన్నీ భూమితో పాటు ధ్వంసమయ్యాయి.

మా ప్రతినిధి ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నది. “నన్ను కిందకు తోసేశారు.  కొట్టబోయారు. కానీ నేను మధ్యలోనే నిలబడ్డాను. నేను నా భూమిని వదులుకోలేదు, ఎప్పటికీ వదులుకోను,” అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది. ఒకవైపు దాల్మియా కంపెనీ సాగు భూమిలో మైనింగ్ పనులు ప్రారంభిస్తుంటే, మరోవైపు ఈ వ్యవహారంపైన  సుప్రీంకోర్టు మార్చి 9న విచారణ జరపనుంది.

లాంజిబెర్నిలో కొనసాగుతున్న గని తవ్వకాలు

తెలుగు: పద్మ కొండిపర్తి

https://maktoobmedia.com/india/in-odishas-lanjiberna-village-dalmia-forces-mining-expansion-even-as-villagers-protest

Leave a Reply