ఓ కామ్రేడ్
ఎలా చనిపోతాడో అడుగొద్దు
భూమి నుండి
చెట్టును వేరు చేసినట్టు
ఇంటి నుండి గుంజుకుపోయి
గాలీ, వెలుతురూ చొరబడని చోట
అండాసెల్లో బందీచేస్తారు
క్రమంగా రాజ్యం
చెట్టులోని జీవాన్నంతా
పీల్చి పిప్పిజేస్తుంది
వాళ్లు
చెట్టును చంపగలరేమో గాని
ఆయన కలం నుండి
చక్రాలకుర్చీ లోని చక్రాలనుండి
పుట్టుకొచ్చే
వేలాది వేర్లనెలా తెంపగలరు
ఓ కామ్రేడ్ మృతి పట్ల
సంతాపం వద్దు.
ఓచెట్టు తన ఆకుల్ని
బూరలు చేసి
విజయ గానాలు వినిపిస్తూనే ఉంటుంది
యుద్ధమాగదు
సాయికి మరణం లేదు
**




