(గోవా పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం, 2024లోని వివాదాస్పద సెక్షన్ 39A స్థానికుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ చట్టం వరి పొలాలు, పండ్ల తోటలు, అడవులు గల విశాల భూభాగాలను కాంక్రీట్ వనాలుగా మారుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. స్థానిక సమాజాలపై దీని ప్రభావం పడుతుంది. నీరు, విద్యుత్ కొరత, మురుగునీటి శుద్ధి సమస్యలు తలెత్తుతాయి. స్నేహల్ ముథా దీనిపై కొన్ని పరిశీలనలు చేశారు. ది హిందూలో వచ్చిన ఆమె రిపోర్ట్ వసంత మేఘం పాఠకుల కోసం తెలుగులో ఇస్తున్నాం.)
రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవాలోని పాలెం గ్రామంలో, సాయంత్రం వేళ పసుపు రంగు వేసిన ఒక గుడి ముందు కొద్దిమంది గ్రామస్తులు గుమిగూడారు. వారు నలిగిపోయిన జోనింగ్ మ్యాపులను (భూమిని నిర్దిష్ట జోన్లుగా విభజించే పటాలు), టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (TCP) శాఖ పత్రాల నకళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.
గోవా వసంతకాల పండుగ అయిన షిగ్మో రాకకు ముందు పాలెం వీధులు రంగులతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు, “పాలెం సిరిడావో గ్రామాన్ని కాపాడండి; జోన్ మార్పు (39A) వద్దు” మరోవైపు కొంకణి భాషలో “అంచెం ఉడక్ అమ్కా జాయ్ (మా నీరు మాకే)” అనే నినాదాల బ్యానర్ లతో గ్రామం అలంకరించబడింది.
ఆ బృందంలోని వాసు కంకోలికర్ (42) మాట్లాడుతూ, “టీసీపీకి అనేక అభ్యంతరాలు, సూచనలు, విజ్ఞప్తులు చేసినా వారు మమ్మల్ని పట్టించుకోలేదు. మనం వారితో పోరాడకపోతే, మన పచ్చని పందిళ్ళు నెమ్మదిగా పసుపు రంగులోకి, ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతాయి. చివరికి వాళ్ళు వాటిని బూడిద రంగులోకి మార్చేసి అమ్మేస్తారు” అని అన్నారు. కంకోలికర్ పాలెం నివాసి, మాజీ సర్పంచ్.
ఫిబ్రవరి 21 నుండి 27 వరకు, ఈ చట్టానికి వ్యతిరేకంగా గతంలో పాలెం నుండి పనాజీలోని ఆజాద్ మైదాన్ వరకు నిరసన చేపట్టిన కనీసం 2,000 మందిలో ఆయన ఒకరు. గోవాలోని 40 శాసనసభ స్థానాలలో ఒకటైన సెయింట్ ఆండ్రే నియోజకవర్గంలో పాలెం ఉంది. రివల్యూషనరీ గోవాన్స్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీరేష్ బోర్కర్, ఇతరులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే పనాజీకి 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న డోనా పౌలాలోని టీసీపీ మంత్రి విశ్వజిత్ రాణే ఇంటి బయట కూడా నిరసన తెలిపారు. రాణే భారతీయ జనతా పార్టీకి చెందినవారు. ఈ పార్టీ గత 14 ఏళ్లుగా గోవాలో అధికారంలో ఉంది. ఈ విషయంపై వచ్చిన ప్రశ్నలకు రాణే స్పందించలేదు.
పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం 2024 కింద అమల్లోకి వచ్చిన గోవా సెక్షన్ 39Aకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు గత రెండేళ్లుగా చాలా జరుగుతున్నాయి. ఈ సెక్షన్ అడవులు, కొండలు, వ్యవసాయ భూములు వంటి పర్యావరణ సున్నిత ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చడానికి అనుమతిస్తుంది. దీనివల్ల పచ్చని ప్రదేశాలను రియల్ ఎస్టేట్ విస్తరణకు తెరిచినట్లవుతుందలని, పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజల జీవనోపాధికి ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి హాని కలుగుతుందని, రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తుందని గోవా వాసులు భావిస్తున్నారు. గోవా (2011 జనాభా లెక్కల ప్రకారం) రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న 320 నివాస గ్రామాల సమాహారం. ఉన్న ఒకే ఒక నగరం రాజధాని ‘పనాజీ’.
‘పర్రా’కు చెందిన న్యాయవాది, పర్యావరణ కార్యకర్త నార్మా అల్వారెస్ ప్రకారం “సెక్షన్ 39Aతో ఉన్న సమస్య ఏమిటంటే, అది ప్రణాళిక (ప్లానింగ్) అనే భావననే నాశనం చేస్తుంది. ప్రతి స్థిరాస్తి యజమాని తమ స్థలానికి ప్రణాళికకర్తగా మారి, తాము ఏమి నిర్మించాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవచ్చు”. ప్రాంతీయ ప్రణాళిక (2011) గోవా పర్యావరణాన్ని పరిరక్షించడానికి రూపొందించబడింది, ఇందులో 83 శాతం భూమిని పర్యావరణ సున్నిత ప్రాంతంగా వర్గీకరించారు. ప్రాంతీయ ప్రణాళిక 17-18 రకాల పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించగా, సెక్షన్ 39A కేవలం ఏడింటిని మాత్రమే గుర్తిస్తుంది. ఉదాహరణకు, ప్రాంతీయ ప్రణాళిక ప్రకారం ESZ-2గా పరిగణించబడే పండ్ల తోటల ప్రాంతాలకు కేవలం పరిమిత అభివృద్ధికి మాత్రమే అనుమతి ఉంది. కానీ సెక్షన్ 39A కింద వాటిని పూర్తిగా మార్చవచ్చు. ప్రాంతీయ ప్రణాళికలోని ESZ-1 ప్రాంతాలలోనైతే ఎలాంటి ‘అభివృద్ధి’ కార్యక్రమాన్నయినా పూర్తిగా నిషేధిస్తాయి.
2018లో, గోవా అసెంబ్లీ TCP చట్టానికి ఒక సవరణను ఆమోదించింది. ప్రాంతీయ ప్రణాళికలో జోన్‌ను మార్చే అధికారాన్ని ప్రధాన పట్టణ ప్రణాళికాధికారికి కల్పించే సెక్షన్ 16Bని అందులో చేర్చింది. తీవ్ర విమర్శల కారణంగా దీనిని 2024లో రద్దు చేశారు. ఈలోగా, 2023 మార్చిలో సెక్షన్ 17(2)ని ప్రవేశపెట్టారు. ప్రాంతీయ ప్రణాళికలోని ఏవైనా “అనుకోని పొరపాట్లను” “సరిదిద్దడానికి” TCP విభాగాన్ని సంప్రదించడం ద్వారా, ప్రైవేట్ యజమానులు తాము కొనుగోలు చేసిన భూమిని మార్చుకోవడానికి ఇది అనుమతించింది. యజమానులు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఈ పని చేయవచ్చు. బాంబే హైకోర్టు గోవా బెంచ్ 2025 ఏప్రిల్‌లో ఈ సవరణను కొట్టివేసింది.
“భూ కబ్జా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ, 2024 ఫిబ్రవరిలో సెక్షన్ 39A పుట్టుకొచ్చింది,” అని న్యూరా గ్రామానికి చెందిన ఆర్కిటెక్ట్, ప్రాంతీయ ప్రణాళికాధికారి తాహిర్ నోరోన్హా అన్నారు. ఆయన గోవా ప్రభుత్వ గెజిట్ నుండి సమాచారాన్ని సేకరించి, గోవా వ్యాప్తంగా 68 లక్షల చదరపు మీటర్ల భూమిని నివాస ప్రాంతాలుగా మార్చేందుకు టీసీపీ విభాగానికి దరఖాస్తులు సమర్పించబడ్డాయని కనుగొన్నారు. ఇందులో 13.6 శాతం భూమి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని ఆయన అంటున్నారు.
భూమి దిగ్బంధంలో:
ఫిబ్రవరి 27న సమ్మె ముగిసింది. సెయింట్ ఆండ్రే నియోజకవర్గానికి సంబంధించి టీసీపీ చట్టం కింద భూ మార్పిడి ప్రతిపాదనలను నిలిపివేస్తానని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తమకు చెప్పారని, నిరసనకారులపై దాఖలైన మూడు ఎఫ్ఐఆర్లను కూడా రద్దు చేస్తామన్నారని వారు అంటున్నారు. అయితే “ఎఫ్ఐఆర్లు ఇంకా రద్దు కాలేదు,” అని పనాజీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించబడిన నిరసనకారుడు మనోజ్ పరాబ్ అంటున్నారు.
ఫిబ్రవరి 21, 26 మధ్య దాఖలైన ఈ ఎఫ్ఐఆర్లలో, “చట్టవిరుద్ధమైన సమావేశం”, టీసీపీ కార్యాలయం నుండి పత్రాలు గల్లంతవ్వడం వంటి కారణాలతో పరాబ్, బోర్కర్, కంకోలికర్ తో పాటు గుర్తుతెలియని 1,500 మందిని చేర్చారు. “గుర్తించబడితే, కొందరు తమ ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది లేదా ఇంటికి చాలా దూరంగా బదిలీ కావచ్చు,” అని పాలెం గుడి ముందు గుంపులో నిలబడి ఉన్న ఒక యువకుడు అన్నాడు. తన పేరు బైటపెట్టొద్దని చెప్పిన అతని వయసు 20 ల చివర్లో ఉంటుంది.
39A నిబంధనను రద్దు చేయించి, స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ ‘పర్సన్ ఆఫ్ గోవా ఆరిజిన్ (POGO) బిల్లు’ను సాధించడానికే తమ పోరాటమని బోర్కర్ అన్నారు. వ్యవసాయ, అటవీ భూముల అమ్మకాలపై ఆంక్షలు విధించే చట్టాలు, అలాగే మెగా ప్రాజెక్టుల పరిధిని, వాటికి సంబంధించిన అనుమతులను నిర్వచించే గోవా పంచాయతీ రాజ్ చట్టం కూడా మాకు కావాలి” అన్నారాయన.
పాలెం నివాసి తుషార్ గవాస్ (28) చెరువును, దానికి ఆవల ఉన్న కొండలను చూపిస్తూ, తన ఫోన్లో పత్రాలను స్క్రోల్ చేస్తూ, 84,137 చదరపు మీటర్ల భూమిని నివాస భూములుగా మార్చడానికి TCP కార్యాలయంలో దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. “ఇప్పటివరకు, పాలెంలో 39A కింద 5,000 చదరపు మీటర్ల భూమికి ఆమోదం ఇస్తూ మార్చేశారు. మొత్తం ప్రాంతీయ ప్రణాళిక మ్యాపులు పచ్చదనానికి బదులుగా నివాస ప్రాంతాలను సూచించే నారింజ రంగులోకి మారిపోతాయి,” అని గవాస్ అన్నారు.
దీని అర్థం ఏమిటంటే, వ్యక్తులు లేదా కంపెనీలు భూమిని కొనుగోలు చేసి, నివాస గృహాలు లేదా వాణిజ్య సముదాయాల నిర్మాణానికి వీలుగా మార్పిడి చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక్క పెర్నెమ్ ప్రాంతంలోనే 10.2 లక్షల చదరపు మీటర్ల భూమిని తాత్కాలికంగా నివాస ప్రాంతంగా మార్చారని తెలిసింది. జోన్ మార్పిడుల వల్ల దక్షిణ గోవా కంటే ఉత్తర గోవా జిల్లానే ఇప్పటివరకు ఎక్కువగా ప్రభావితమైందని నోరోన్హా డేటా చూపిస్తుంది.
“గ్రామస్థుల అనుమతి లేకుండానే ఎవరైనా బడా వ్యక్తులు తరలి రావడానికి 39A ప్రాథమికంగా అనుమతిస్తుంది. ప్రజలు కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ ప్రాజెక్టుల గురించి తమ గ్రామసభలలో చర్చించాలని. ఒక బిల్డర్ మా గ్రామానికి ఒక ప్రాజెక్టును తీసుకురావాలనుకుంటే, ఆ బిల్డర్ మంత్రివర్గ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవడం కాదు, గ్రామసభకు రావాలి,” అని నోరోన్హా అన్నారు. 39A కోసం ఎక్కువగా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలే దరఖాస్తు చేస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు.
జోన్ మార్పులు 1988లో ప్రారంభమయ్యాయని, అప్పటి నుండి 2006 వరకు, ప్రభుత్వం సుమారుగా 1.4 కోట్ల చదరపు మీటర్ల కొత్త నివాస భూమిని కలిపేసిందని ఆయన అన్నారు. 2006లో, ఒక కొత్త ప్రాంతీయ ప్రణాళిక అమలులోకి వచ్చింది. “ఈ ప్రణాళికలో అనేక గ్రామాలను నివాస భూములుగా మార్చడాన్ని గ్రామస్థులు గమనించారు, ఇది అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘గోవా బచావో అభియాన్’కు దారితీసింది,” అని నోరోన్హా చెప్పారు. ప్రజల నిరసనల తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేశారు.
గోవా భూ చట్టాలలో ఒక సంక్లిష్టత ఏమిటంటే, 1933లో రూపొందించబడిన పోర్చుగీస్ కాలం నాటి పత్రమైన ‘కోడ్ ఆఫ్ కమ్యూనిడేడ్స్’. ఇది లీజుకు ఇవ్వగల సామూహిక యాజమాన్యంలోని భూములకు సంబంధించినది. 1961లో వలస పాలన నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలను పరిపాలించే చట్టాలకు సమాంతరంగా ఇక్కడ ఈ కోడ్ నడిచింది.
“ప్రస్తుత కాలంలోని అనేక నిర్ణయాలు ఈ అసలైన ‘కమ్యూనిడేడ్’ ప్రణాళికలను విస్మరించి, అటువంటి భూములకు నిర్దిష్టమైన ఉపయోగం లేనట్లుగా పరిగణిస్తున్నాయి. దశాబ్దానికి పైగా అమలులో ఉన్న ప్రాంతీయ ప్రణాళిక నుండే ఈ గందరగోళం పుడుతోంది. కొత్త భూ-వినియోగానికి అనుగుణంగా స్పష్టమైన మార్పు చేయని ఫలితంగా 39A వంటి తాత్కాలిక యంత్రాంగాలు శాశ్వత పరిష్కారాలుగా మారాయి,” అని ఆర్కిటెక్ట్-పర్యావరణవేత్త అయిన ఎల్సా ఫెర్నాండెజ్ అంటున్నారు.
అందమైన దృశ్యం (view) కోసం:
ఎల్లా గ్రామంలోని ఒక కొండ శిఖరంపై నిలబడి, గ్లెన్ కాబ్రాల్ మాండోవి నది వైపు చూస్తున్నారు. ఆయన వెనుక ‘అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్’ ప్రార్థనా మందిరం ఉంది. నోటిఫై చేయబడిన పండ్ల తోటల భూమిని చూపిస్తూ ఆయన ఇలా అన్నారు, “పర్యావరణాన్ని నాశనం చేసి అందమైన దృశ్యాలను కొనుగోలు చేస్తున్నారు. వేగవంతమవుతున్న ఈ నిర్మాణాల వల్ల గోవాలో ఇక చూడటానికంటూ ఏమీ మిగలదని వాళ్ళు గ్రహిస్తున్నారా?”
ఎల్లా ప్రాంతం ఉన్న పాత గోవా, రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఏడు కొండలపై విస్తరించి ఉంది. గోవా గెజిట్ ప్రకారం, ఈ ప్రాంతంలో జోన్ మార్పు కోసం కనీసం 2.6 లక్షల చదరపు మీటర్ల భూమిని ప్రతిపాదించారు. ఎల్లాలో, భూ మార్పిడి కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 1.6 లక్షల చదరపు మీటర్ల వరకు ఉన్నాయి. ఈ భూమిలోని కొన్ని భాగాలు కారంబోలిమ్ సరస్సు చిత్తడి నేల ప్రభావ మండలంలో, 16వ శతాబ్దపు ప్రార్థనా మందిరమైన ‘అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్’ బఫర్ జోన్లో ఉన్నాయి. కొండపై ఆస్తిని కొనుగోలు చేసిన ఢిల్లీకి చెందిన ఒక సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ గురించి గ్రామస్తులు టిసిపికి అభ్యంతరం తెలిపారు. ఆ కంపెనీ భూ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుంది.
“అడవి దున్నలు అరుదుగా కనిపించేవి; మేము గోవాలో చిరుతలను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వాటిని సులభంగా గుర్తించగలుగుతున్నాము… వాటి ఇళ్లను ఆక్రమణ చేస్తున్నారనడానికి ఇవి సంకేతాలు,” అని కాబ్రాల్ అన్నారు. ఇప్పుడు అరుదైన పక్షులను చూడటం కూడా చాలా అరుదుగా మారిందని ఆయన తెలిపారు. ఆ కొండ కింద నుండి ఒక రైల్వే సొరంగం వెళుతుంది.
గోవాను గోవాలా ఉండనివ్వండి:
గోవా గెజిట్ ప్రకారం, ఎల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రేజ్ తాలూకాలోని కాండోలింలో, 29,764 చదరపు మీటర్ల తోట భూమి, పచ్చని సహజ ప్రకృతి, శ్మశానవాటిక ప్రాంతాన్ని ఒక వ్యక్తి నివాస ప్రాంతంగా మార్చడానికి దరఖాస్తులు వచ్చాయి. కాండోలిం కేంద్రంగా పనిచేస్తున్న కలంగుట్ నియోజకవర్గ ఫోరం (CCF) ఈ మార్పును వ్యతిరేకించింది. CCF సభ్యురాలు ఆగ్నెలో బారెటో సంతకాల సేకరణ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
“ఈ ప్రాంతంలోని కొంత భాగం లైట్‌హౌస్ కు, ఫోర్ట్ అగ్వాడకు సమీపంలో ఉంది, దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. అలాగే పీఠభూమిని విపత్తు నిర్వహణ ప్రాంతంగా గుర్తించారు. ఈ ఉల్లంఘనలు స్థానిక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఆ వాలు ప్రాంతంలో కనీసం 50 చెట్లను నరికివేస్తున్నారు,” అని TCP విభాగం వారి కాండోలిం మ్యాప్‌ను చూస్తూ, బారెటో అన్నారు.
బార్డెజ్ తాలూకాలోని అర్పొరా గ్రామం, తిసవాడి తాలూకాలోని చింబెల్ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. “ఈ అడవులను ఎందుకు రక్షించాలంటే, ఈ కొండ, దాని అడవులు ప్రజలకు పర్యావరణ సేవలను అందిస్తాయి. అవి కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, నేలను నిలబెడుతూ, జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. మీరు ప్రజలందరికీ సంబంధించిన కొండను ప్రైవేటీకరించి, దానికి ఒక గేటు పెట్టి, ఒక సెక్యూరిటీ గార్డును నియమించలేరు… కొండలను స్థిరీకరించకపోతే, భూసారం కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతం వరదలకు గురయ్యే ప్రమాదం ఉంది,” అని కొండ దిగువన నడుస్తున్న అర్పొరా నివాసి సుసాన్ కోషి, కొండ ఎక్కడానికి ఉన్న ప్రజా మార్గం అని స్థానికులు చెబుతున్న చోట ఏర్పాటు చేసిన ఒక గేటును చూపిస్తూ అన్నారు.
అర్పొరా నుండి చింబేల్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ సమీప ప్రాంతంలోని రైతులకు నీటి వనరుగా ఉన్న సరస్సు దగ్గర నిర్మించ తలపెట్టిన 17 అంతస్తుల భవనం, ప్రశాసన్ స్తంభం, తొమ్మిది అంతస్తుల యూనిటీ మాల్ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ జనవరిలో గ్రామస్థులు 45 రోజుల పాటు సమ్మె చేశారు. “ఆ ప్రాజెక్టును నిలిపివేశారు. కానీ ఈ ప్రాజెక్టులు నిజంగా అవసరమా? ఈ గ్రామానికి వాటిని భరించే సామర్థ్యం ఉందా?” అని గ్రామ పర్యావరణ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి పంచాయతీ నుండే ఎంపికైన జీవవైవిధ్య నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ గోవింద్ శిరోద్కర్ ప్రశ్నించారు.
ఉమ్మడి భూములలో, పర్యావరణ సున్నిత ప్రాంతాలలో వాణిజ్య ప్రయోజనాలు అంటే గోవా వాసులకు పెద్ద సమస్య. “సెక్షన్ 39A వల్ల భూమితో గానీ, అక్కడి ప్రజలతో గానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వస్తారు. వారు ప్రతి బంగ్లాకు స్విమ్మింగ్ పూల్స్ కావాలని కోరుకుంటారు. బయటి వ్యక్తులు గోవాను ఢిల్లీ గానో, హర్యానా గానో లేదా వారు వచ్చిన ఇతర ప్రాంతాల్లాగానో మార్చాలనుకుంటే, గ్రామం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది,” అని అల్వారెస్ అన్నారు.




