జ.పాఠశాల స్థాయి నుంచే తెలుగు మీద మమకారం పెంచుకున్నాను.1992 ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా రెండో అన్న హుస్సేన్ భావకవిత్వం రాసేవాడు. మా వాడి కవిత్వం రహస్యంగా చదివేవాడిని. సాహిత్యం అంటే ఏమో తెలుసుకోవాలనిపించింది. మా తెలుగు లెక్చరర్ ను అడిగితే బైపీసీ వాడికి తెలుగు సాహిత్యం తో ఏం పని అన్నారు. నీకు అభిలాష ఉంటే పుస్తకాలు బయట అద్దెకు దొరుకుతాయి అవి చదువు అన్నారు. ఇక అదే సందర్భంలో ఆదోనిలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. మొదట ఫిక్షన్, కొమ్మనాపల్లి గణపతిరావు, మధుబాబు, యద్దనపూడి సులోచనారాణి, అబ్బూరి ఛాయాదేవి పుస్తకాలు చదివేవాడిని. ఆ క్రమంలోనే అనుకోకుండా చలం నవలలు చదవడం ఆరంభించాను. అది నా వయసుకు మించిన సాహిత్యం. ఆ సాహిత్యం మొత్తం అద్దెకు తెచ్చుకుని చదివేశాను.

జ. విపరీతమైన నవలలు చదివినా కూడా కవిత్వం అంటేనే ఇష్టం. నేను కథలు రాసినా కూడా కథా సంపుటాలు చదవడం పెద్దగా ఆసక్తి ఉండదు. అసలు పుస్తకం కొనాలి అని అనుకుంటే కవిత్వమే కొంటాను. ముందుగా కవిత్వం,  చరిత్ర, మార్క్సిజం, మనోవిజ్ఞాన శాస్త్రము ఇలా ప్రాధాన్యతనిస్తాను. అయితే పుస్తకం హస్తభూషణం కాకూడదు మస్తకమయం కావాలన్నదే నా అభిలాష. పుస్తకం నా చేతికి వచ్చిందంటే అది చాలా త్వరగా చదివేస్తాను. అలా అన్ని పుస్తకాలని కాదు నచ్చినవి ముందుగా చదివేస్తాను. అయితే భద్రపరిచే విధానం నేను పుస్తకాల కోసమే సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను. ఆ ఫ్లాట్ నాకు మినీ లైబ్రరీ. అక్కడే చదవడం రాయడం. నేను చెప్పిన మొదటి పద్ధతిలోనే ర్యాక్ లో అమర్చుకొని ఉంటాను. 99% నేను ఆ పుస్తకం నాకు ఇవ్వండి అనే స్థితి తెచ్చుకోను.. అన్ని పుస్తకాలు నా దగ్గర ఉండాలి అని అనుకుంటాను..తప్పదు..ఆ పుస్తకం లభించదు అనుకున్నప్పుడు మాత్రమే కవి మిత్రులను అడుగుతాను.

జ. స్పానిష్ కవి పాబ్లో నెరుడా కవిత్వాన్ని విపరీతంగా ఇష్టపడతాను. అవి తెలుగులో పెద్దగా లేవు. ఒకటి రెండు పుస్తకాల మినహా ఎక్కువగా రాలేదు. ఆ బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. కార్ల్ మార్క్స్ ప్రేమలేఖలు చాలాసార్లు నాకు నేనుగా  నాకున్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసుకొని చదివా. ఈ క్రమంలో అంతర్జాతీయ కవిత్వం సేకరించుకోవడంలో వెనకబడ్డానని అనిపిస్తుంది. వారి తెలుగు అనువాదాలు పెద్దగా లభించడం లేదు. తెలుగు సాహిత్యంలో ఆ లోపం ఉంది.

జ.ఈ శతాబ్దపు దళిత కథలు ఆక్స్ఫర్డ్ వాళ్లు వేశారు. ఆంగ్ల కాపీ వచ్చింది. అది మిత్రుడికిచ్చి పోగొట్టుకున్నాను. ఆ మిత్రుడు నాకు ఆ పుస్తకం నాకెప్పుడు ఇచ్చావు అన్నాడు.. ఈ క్రమంలోనే సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఇంటర్ప్రిటిషన్ ఆఫ్ డ్రీమ్స్, చార్లెస్ డార్విన్ ది ఆర్జిన్స్ ఆఫ్ స్పైసిస్ పుస్తకాలు మిత్రులు చదువుతామంటే ఇచ్చి వాళ్లు తిరిగి చేయకపోతే పోగొట్టుకున్నాను. ఈ మధ్యకాలంలోనే ఒక మిత్రుడు ఎస్.ఎల్. బైరప్ప పర్వతీసుకుని ఇవ్వలేదు. అసలు నాకు ఇచ్చినట్లు గుర్తులేదు అన్నాడు. ఇక అంతే పుస్తకాలు మిత్రులకు ఇవ్వడం మానేశాను. నా దగ్గర ఉన్న కూడా పుస్తకాలు ఇవ్వను. ముఖ్యంగా పరిశోధక విద్యార్థులకు అస్సలు ఇవ్వను. వాళ్ల పరిశోధన కోసం చాలా పుస్తకాలు ఇస్తే వెనక్కి ఇవ్వకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. జిరాక్స్ తీసుకుని తెచ్చి ఇస్తామంటారు. పుస్తకం తీసుకొని వెళ్ళాక అందుబాటులోకి రారు. పోగొట్టుకున్న పుస్తకాలన్నీ తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకడం లేదు.

జ.అలెక్స్ హేలి రాసిన ఏడు తరాలు, మహాకవి శ్రీశ్రీ మరో ప్రస్థానం, చలం సాహిత్యం, మనో వైజ్ఞానిక కోణంలో తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన అసమర్థుని జీవయాత్ర, చివరికి మిగిలేది వర్తమాన కవుల్లో ఎక్కువగా ఇష్టపడే కవిత్వం కె.శివారెడ్డి, అఫ్సర్, లోసారి సుధాకర్ ల కవిత్వం.. తెలంగాణ ప్రాంతం నుంచి దర్భశయనం శ్రీనివాసాచార్య, నందిని సిద్ధారెడ్డి వీరి కవిత్వం కూడా బాగా ఇష్టం. ఇక రాయలసీమ ప్రాంతం నుండి నాగప్ప గారి సుందరరాజు కవిత్వం, జి. వెంకటకృష్ణ గారి  కవిత్వం బాగా ఇష్టపడతాను. నేను ప్రాణప్రదంగా భావించే కవిత్వం చెరబండ రాజు కవిత్వమంతా.. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక భారతం. ఈ ఇద్దరు భిన్న ధ్రువాలే. ఇద్దరికి అసలు పొంతనే ఉండదు. అనేక వైరుధ్యాలు ఉంటాయి. కానీ ఆ ఇద్దరు కవిత్వం చాలా ఇష్టం. అది కూడా పాబ్లో నేరుడా కవిత్వం తర్వాతనే. ఇష్టపడేది కూడా  శిల్పం కోసమే.  ఒకరకంగా చెప్పాలంటే శేషేంద్ర కవిత్వం చదివాక నేను అసలు కవిత్వమే రాయకూడదు అనుకున్నాను.. రాస్తే శేషేంద్ర లా రాయాలనిపించేది. శేషేంద్ర కవిత్వ శిల్పం అంటే చాలా ఇష్టం. ఒక కవి మిత్రుడు నాతో ఒక బాధాకరమైన మాట అన్నారు.. ఏంటంటే కవిత్వానికి శిల్పం అవసరం లేదు శిల్పము ఉంటే మ్యూజియంలో పెట్టుకో వస్తువే ప్రధానమన్నారు.. ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నార నిపించింది. శేషేంద్రను ఇష్టపడుతున్నాను అంటేనే ఆశ్చర్యపోతారు.. ఈ వైఖరి కరెక్ట్ కాదు కవుల వ్యక్తిగత జీవితంతో మనకు పని లేదు. రాసిన రాతలే ముఖ్యం.

జ.నేను పుస్తకాలు చదివేది రాత్రిపూటనే.. ప్రతిరోజు రాత్రి 12 ఒక్కోరోజు రెండు వరకు చదువుతాను. చదవకపోతే నిద్ర పట్టదు. ఏదో వెలితి ఆవరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చదవడం వ్యసనం అయింది. చాలాసార్లు రాత్రంతా చదివి ఉదయం స్కూల్ కి వెళ్లకుండా పగలు నిద్రపోవడానికి సెలవు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. లేచిన వెంటనే తెల్లవారుజామున పుస్తకం చదివే అలవాటు అసలు లేదు. లేచిన వెంటనే చదివేది దినపత్రికలే. అయితే నేను చాలా స్లో రీడర్ ని స్పీడ్ గా చదవను. అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళను. చదువుతున్న పుస్తకాన్ని ఆ పుస్తకంలో ముఖ్యమైన అంశాలన్నీ కూడా అండర్లైన్ చేసుకుని అలవాటు ఉంది. ఆ ముఖ్యమైన వాక్యాలను నోట్స్ రాసుకుంటాను. విమర్శ రాసే సందర్భంలో అవన్నీ పనికొస్తాయి.

జ.సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుందనలో సందేహం లేదు. సాహిత్య రంగంలో ఉన్న వాళ్లు సమాజం పట్ల ఎక్కువగా ఆలోచించే ధోరణి అలవాటు అవుతుంది. ఒక దశలో సమాజమే ముఖ్యం అనుకునే స్థితికి చేరుకుంటారు. సామాజిక మార్పు దిశగానే ఆలోచిస్తారు. చదువుకునే రోజుల్లో చాలా బాధ్యతరాహిత్యంగా తిరిగిన నేను పుస్తకం వల్ల చాలా మారాను. ఒక పూట తిండి లేకుండా అయినా ఉండొచ్చేమో గాని పుస్తకం లేకుండా ఉండలేని స్థితికి వచ్చాను. పాఠశాల టీచర్ గా ఒక పీరియడ్ ఖాళీ ఉందంటే పుస్తకం తీసుకుని చదువుతుంటా.. మన చదువు విజ్ఞానం, రాతలు సామాజిక ప్రయోజనం కోసమే. ఇలా ఆలోచించగలిగితేనే సమాజంలో మార్పు సాధ్యం అని బలంగా నమ్ముతాను. ఈ దిశగానే నా ప్రయత్నం.. ప్రయాణం.

Leave a Reply