ఏడుపు ఆపుకోవడమే కాదు, వొక్కోసారి నవ్వాపుకోవడం కూడా కష్టమే!

అయితే మనం దేనికి నవ్వుతున్నామో మన చుట్టుపక్కల వాళ్ళకి బోధపడనప్పుడు నవ్వుతున్న మనం యేడవక తప్పదు!

నవ్వుగురించి చెప్పబోయి నా యేడుపు గురించి యెందుకు గాని, కథలోకి వస్తే, నేనున్నాను. నా పక్కన మా యోగా బ్యాచంతా వున్నారు.

“శివ శివ అననేలరా…” పాట స్టీరియోలో వస్తోంది. ఆ పాట కూడా నవ్వుతూనే మొదలైంది. జానకిగారి గొంతు కదా, ఖంగుమంటూ తాడు లేకుండానే కట్టిపడేసింది నన్ను.

“శివ శివ అననేలరా… కౌగిలిలోనే కైలాసమందగా. కౌగిలిలో-నే కైలాస మీయగ, శివ శివ అననేల-రా…” పాట పాదరసం కదా, యెక్కడికైనా జారుతుంది, నా గుండెలోకిన్నూ. అందులోనూ చదువుకున్న రోజుల్లో విన్నపాటేనేమో, వదలకుండా పట్టుకుంది.

పల్లవి రిపీట్ అవుతుంటే నే ఆహ్లాదంగా వింటూవున్నాను. మా యోగా బ్యాచంతా నన్నే చూస్తున్నారు. ఆ చూపుల్లో నన్ను తప్పుపట్టడం వుంది. వాళ్ళంతా నిష్టగా చేతులు జోడించి నమస్కరిస్తూవున్నారు. కళ్ళు మూసి ధ్యానిస్తూనే మధ్యమధ్యలో కళ్ళు తెరచి నన్నే చూస్తున్నారు.

మా చర్యలతో సంబంధం లేకుండా పాట సాగుతోంది.

“కొందరికేమో జన్మకో శివరాత్రి. ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి…” పంక్తుల పునరుచ్చరణ జరుగుతోంది. నేను అక్షరాలా భావాలవెంట వున్నాను. మా బ్యాచు మనోభావాల వెంట వున్నారు.

“భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా, ముక్తి…” అర్థం మిస్సవుతామేమో అన్నట్టు చరణం పునః చరణంగా వస్తోంది. “భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి. మనబోటి రక్తులకు సనిద నిదప గా మా పా మనబోటి రక్తులకు సగమా గమద మనిద మదప మనబోటి రక్తులకు… ఘడియ ఘడియకూ ముక్తీ…” తమకపు నవ్వు కలిపిన గొంతుకు యెవ్వరూ నవ్వడం లేదు, నేను తప్ప.

‘శివ శివ’ అని నేను చెవులు మూసుకోలేదు, అలా చేస్తే నన్ను చితక బాదేవారు. కాని పాటలో “శివ శివ…” అని రావుగోపాలరావుగారి గొంతు నా వొంతు వినిపించింది.

పాట పల్లవిస్తోంది. “శివ శివ అననేలరా… కౌగిలిలోనే కైలాసమందగా. కౌగిలిలో-నే కైలాస మీయగ, శివ శివ అననేల-రా…” వేటూరిగారు అర్థమయ్యేలానే రాశారు. బాపూగారి ‘భక్తకన్నప్ప’లో జయమాలినిగారూ లీలగా గుర్తొచ్చారు.

ఇవన్నీ తెలియక్కర్లేదు. కాని పాట వింటున్నారు, యెవరూ చెవిటివాళ్ళు కాదు కదా?

“టక్కరి మరుని ఉక్కడగించెను, నాటి ముక్కంటి చూపు. కాలిన మదనుని మేలుకొలిపెను, నేటి నీ కొంటె చూపు…” చరణం చర్విత చరణంగా సాగుతోంది.

నా కళ్ళముందు జరుగుతున్నదానికీ నే వింటున్నదానికీ పొత్తూ పొందికా లేనట్టుంది. అందుకేనేమో నాకు నవ్వు తన్నుకుంటూ వస్తోంది.

పాట సాగిపోతూ వుంది, రెచ్చగొడుతూన్నట్టు.

“సగము మేనిలో మగువను నిలిపిన… సగము మేనిలో మగువను నిలిపిన… చంద్రధరుడు ఆ హరుడు తనువు తనువె ఈ తరణి కొసంగిన రసిక వరుడు. ఈ హరుడు… శివ శివ అననేలరా… రా రా”

“దేవుడి ముందు యేమిటా నవ్వు? ఆ? ఇంత వయసు వచ్చింది, పిచ్చిగాని లేసిందా?” కాలరు పట్టుకోలేదు కానీ కున్నంతగా అడిగారొకరు.

కక్కొస్తే ఆగనట్టే కవ్వించే నవ్వు నన్ను ఆగనివ్వడం లేదు. అరచేత్తో నోరు మూసుకుంటూనే విఫలమయ్యాను.

“నీకు యెందుకంత నవ్వొస్తోంది? తలకాయ చెడిందా?” అని వొకరు, “యెప్పుడూ సైలెంటుగా వుండే మీకేమయింది?” అని వొకరు, “కనీసం మనం యెక్కడున్నామో చూసుకోవాలి కదా?” అని మరొకరు.

ఔను, యెక్కడున్నాను? చూసుకున్నాను. శివుని విగ్రహం ముందు. వినాయక చవితికి వినాయకుడి విగ్రహమూ దసరా నవరాత్రులకి దుర్గాదేవి విగ్రహమూ పెట్టినట్టే, మా కాలనీలో శివరాత్రికి శివుడి విగ్రహం పెట్టేరు. ఫెస్టివల్ల సీజను, కాలనీల మధ్యే కాదు, అపార్ట్మెంట్స్ మధ్యా ఆ పోటీ నడుస్తోంది. స్టీరియోలు పెట్టి ఇయ్యన్టీ డాక్టరుకు మంచి బిజినెస్ యిచ్చేలా వున్నారు. మా కాలనీలో రోజంతా యిదేపాట. అరగదీసేస్తున్నాడు.

“నువ్వు యెందుకు నవ్వుతున్నావ్… ఆ?” అందరిదీ వొకటే మాట.

“పాట విని” అన్నాను.

“దేవుని పాటది. భక్తుంటే వినాలి. లేకుంటే నోర్మూసుకు వుండాలి. నవ్వుతారా?” పెద్దాయన మర్యాదగానే నిలదీస్తూ వార్నింగుగా చూశాడు.

‘నేనే సైలెంటుగా లేనూ?!’ అన్నట్టు శివుడి విగ్రహం నన్నే చూస్తున్నట్టుంది?!

Leave a Reply